కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 50

యెహోవా యెహోషాపాతును కాపాడతాడు

యెహోవా యెహోషాపాతును కాపాడతాడు

యూదా రాజైన యెహోషాపాతు దేశంలో ఉన్న బయలు బలిపీఠాలను, విగ్రహాలను నాశనం చేశాడు. ప్రజలు యెహోవా నియమాలు తెలుసుకోవాలని ఆయన అనుకున్నాడు. కాబట్టి అందరికీ యెహోవా నియమాలు నేర్పించడానికి యూదాలో అన్నీ ప్రాంతాలకు అధిపతులను, లేవీయులను పంపించాడు.

దగ్గర్లో ఉన్న వేరే దేశాలవాళ్లు యూదాపై దాడి చేయడానికి భయపడ్డారు. ఎందుకంటే యెహోవా యూదావాళ్లతో ఉన్నాడని వాళ్లకు తెలుసు. వాళ్లు రాజైన యెహోషాపాతుకు బహుమానాలు కూడా పంపించారు. కానీ మోయాబీయులు, అమ్మోనీయులు, శేయీరు ప్రాంతంవాళ్లు యూదా మీద యుద్ధం చేయడానికి వచ్చారు. యెహోవా సహాయం అవసరమని యెహోషాపాతుకు తెలుసు. ఆయన పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరినీ యెరూషలేముకు పిలిపిస్తాడు. వాళ్లందరి ముందు ఆయన ఇలా ప్రార్థిస్తాడు: ‘యెహోవా, నువ్వు లేకపోతే మేము గెలవలేము. మేము ఏం చేయాలో ప్లీజ్‌ మాకు చెప్పు.’

ఆ ప్రార్థనకు యెహోవా ఇలా జవాబిస్తాడు: ‘భయపడకు. నేను మీకు సహాయం చేస్తాను. మీమీ స్థానాల్లో నిలబడే ఉండి, నేను మిమ్మల్ని ఎలా కాపాడతానో చూడండి.’ యెహోవా వాళ్లను ఎలా కాపాడాడు?

తర్వాత రోజు ఉదయం, యెహోషాపాతు కొంతమంది గాయకులను ఎన్నుకుని వాళ్లను సైన్యం ముందు నడవమని చెప్పాడు. వాళ్లు యెరూషలేము నుండి బయల్దేరి తెకోవ అనే చోట ఉన్న యుద్ధరంగానికి వెళ్లారు.

గాయకులు యెహోవాను ఆనందంగా గట్టిగా స్తుతిస్తుండగా యెహోవా తన ప్రజల కోసం పోరాడాడు. ఆయన అమ్మోనీయులు, మోయాబీయులు అయోమయంలో పడేలా చేశాడు. ఆ అయోమయంలో వాళ్లు ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం మొదలుపెట్టారు. ఒకళ్లు కూడా మిగల్లేదు. యెహోవా యూదా ప్రజలందరినీ, సైనికుల్ని, యాజకుల్ని కాపాడాడు. చుట్టుపక్కల దేశాలవాళ్లందరూ యెహోవా చేసినదాని గురించి విని, యెహోవా ఇంకా తన ప్రజలను కాపాడుతున్నాడని తెలుసుకున్నారు. యెహోవా తన ప్రజలను ఎలా కాపాడతాడు? చాలా విధాలుగా. ఈ విషయంలో ఆయనకు మనుషుల సహాయం అవసరం లేదు.

“ఈ యుద్ధంలో మీరు పోరాడాల్సిన అవసరం లేదు. మీరు మీ స్థానాల్లో స్థిరంగా నిలబడి, యెహోవా ఇచ్చే రక్షణను చూడండి.”—2 దినవృత్తాంతాలు 20:17