కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గాఢంగా ప్రేమింపబడే భార్య

గాఢంగా ప్రేమింపబడే భార్య

అధ్యాయము 5

గాఢంగా ప్రేమింపబడే భార్య

1-4. స్త్రీలు అప్పుడప్పుడు వారి భర్తల ప్రేమను గూర్చి ఏమని ఫిర్యాదు చేస్తుంటారు?

ఒక స్త్రీ మరొక స్త్రీతో ఇట్లు ఫిర్యాదు చేసింది, ‘నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు కానీ ఆయనెప్పుడూ చెప్పడు. నేనే ఆయన నోటినుండి పలికించేదాన్ని గానీ ఆయనే దాన్ని వ్యక్తపరిస్తే అదెంత బాగుంటుందో.’

2 ఆ స్త్రీ ఇలా సమాధానమిచ్చింది, ‘నాకు తెలుసు, ఈ మగవారంతా అంతే నేనొకసారి నన్ను ప్రేమిస్తున్నావా అని నా భర్త నడిగితే అప్పుడాయన “నేను నిన్ను పెళ్ళి చేసుకున్నాను గదా? నేను నిన్ను పోషిస్తున్నాను, నీతో కాపురం చేస్తున్నాను; నేను నిన్ను ప్రేమించకపోతే ఇదంతా చేస్తానా?” అని అన్నాడు.’

3 ఆమె కొంచెమాగి, మరల ఇలా చెప్పసాగింది: ‘అయినా నిన్న సాయంకాలం ఒక మంచి సంఘటన జరిగింది. పగటిపూట ఆయన చదువుకొనే గదిని శుభ్రం చేసేటప్పుడు, ఆయన సొరుగులలో ఒకదానిలో ఒక ఫోటోను చూశాను. నేను మా కుటుంబ పాత ఫోటో ఆల్బమ్‌ నుండి తీసి ఆయనకు చూపిన ఫోటో అది. నాకు ఏడు సంవత్సరాలున్నపుడు నేను స్నానము చేసే దుస్తులతో దిగిన ఫోటో. ఆయన దానిని ఆల్బమ్‌ నుండి తీసి తన డెస్క్‌ సొరుగులో పెట్టుకున్నాడు.’

4 దీనిని జ్ఞాపకము చేసికొని ఆమె చిరునవ్వు నవ్వి, తన స్నేహితురాలివైపు చూచింది. ‘ఆయన పనినుండి యింటికి వచ్చినతోడనే నేను ఆయనతో దానిని గూర్చి మాట్లాడాను. ఆయన ఆ ఫోటోను తన చేతికి తీసికొని, నవ్వి, ఇలా అన్నాడు, “ఈ చిన్నపిల్ల అంటే నాకెంతో ఇష్టం.” తర్వాత దాన్ని క్రిందపెట్టి తన రెండు చేతులతో ఆప్యాయంగా నా ముఖాన్ని పట్టుకొని ఇలా అన్నాడు, “ఆ చిన్నదే యీ స్త్రీగా మారినపుడు ఈమెను కూడ ఇష్టపడుతున్నాను.” ఇంకా ఆయన నన్ను ఎంతో మురిపెంగా ముద్దాడాడు. దానితో నాకు ఆనంద బాష్పాలు రాలాయి.’

5. భర్త ప్రియంగా ప్రేమించు భార్యగా ఆమె ఎలా నడుచుకోవాలి?

5 తన భర్తకు ఎంతో ప్రియంగా వున్నదని ఎరిగిన భార్య తాను అచ్చట ఉత్సాహంగా, భద్రంగా వున్నదని భావిస్తుంది. భర్తలు తమ భార్యల ఎడల అట్టి ప్రేమను కల్గియుండాలని బైబిలు వారికి సలహా యిస్తుంది: “పురుషులుకూడ తమ సొంతశరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. . . . వారిద్దరును ఏక శరీరమగుదురు.” (ఎఫెసీయులు 5:28, 29, 31) మనం ముందే చర్చించినట్లు, భార్య తన భర్త ఎడల సన్మానం కల్గియుండాలి, అయితే అట్టి సన్మానాన్ని పొందు రీతిగా భర్త మెలగాలి. నీ భర్త నిన్ను ప్రేమించి, అనురాగం చూపాలని సలహా యివ్వబడినట్లే ఇది నీ విషయంలో కూడ వాస్తవమే: హృదయపూర్వకంగా అలా చేయడానికి ఆయనను ప్రోత్సహించే రీతిలో నీవు ప్రవర్తించాలి.

నీవు మద్దతు నిస్తున్నావా?

6, 7. (ఎ) ఆదికాండము 2:18 నందు స్త్రీ ఎటువంటి పాత్ర వహించడానికి ఆమెను తాను సృజించానని యెహోవా తెలిపాడు? (బి) భార్య తన భర్తకు నిజంగా సహాయకారిగా వుండడానికి, ఆమె చేయవలసిందేమిటి?

6 భార్య ప్రియంగా ప్రేమింపబడాలంటే ఆమె తన భర్త అధికారానికి లోబడియుండుట కంటె అధికంగా చేయవలసిన అవసరముంది. తనకు విధేయత చూపే గుర్రం లేక కుక్క ఒకటి ఆయనకుండవచ్చు. ఆదాముకు ఏదెను తోటలో జంతువులు తోడుగా వుండేవి, అవి ఆయనకు లోబడియుండేవి. కానీ తన జాతిలో ఆయన ఒంటరివాడే. ఆయనకు చేదోడువాదోడుగా వుండి, ఆయనతోపాటు పనిలో సహాయకారిగా ఉండే ఒక తెలివిగల మానవజత ఆయనకు అవసరమైయుండెను: “దేవుడైన యెహోవా—నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదుననుకొనెను.”—ఆదికాండము 2:18.

7 భర్తకు కావలసినది తనను ప్రేమించి గౌరవించేది మాత్రమేగాక తనకు నిజంగా సహాయకారిగా వుండి, తాను చేసే నిర్ణయాలను బలపరచు భార్యే. ఇరువురు కలిసి చర్చించిన అనంతరం ఇట్టి నిర్ణయాలు తీసికొనుట అంత కష్టమేమి కాదు. అయితే నిన్ను సంప్రదించకపోతే, లేదా నీవు అందుకు అంగీకరించకపోతే నిర్ణయాలు తీసికొనుట అంత సులభమేమీ కాదు. అట్టి సందర్భంలో నీ భర్తకు నీవు నమ్మకంగా మద్దతునియ్యగలవా—తన నిర్ణయాన్ని అమలుపరచేలా అది అన్యాయమైనది కానపుడు, లేఖనాలకు విరుద్ధంగా లేనపుడు నీవు అతన్ని బలపరుస్తావా? లేక మొండిపట్టుతో ఒప్పుకొనక, ఆ పనిలో అతడు విజయం సాధించకుంటే ‘నేను నీతో చెప్పలేదా?’ అని అనటానికి సిద్ధపడతావా? ఆయన పథకము ఫలించునట్లు నీ కష్టాన్ని తాను గమనిస్తే, నీవు సందేహిస్తూన్ననూ, నీ మట్టుకు నీవు ఆయనకు నమ్మకంతో మద్దతు నిస్తే అంతకన్నా నిన్ను అధికంగా ప్రేమించునని తలంచవా?

8. భర్త సరియైన యాజమాన్యం వహించడానికి భార్య ఎలా అతనిని ప్రోత్సహించగలదు?

8 అన్నిటికంటె ముఖ్యంగా, అతని శిరస్సత్వాన్ని పడద్రోయడానికి ప్రయత్నించకు! నీవు అట్టి ప్రయత్నంలో ఫలిస్తే ఇక ఆయనంటే నీకిష్టముండదు; అతడు నిన్ను ఇష్టపడడు లేదా తానంటే తనకే ఇష్టముండదు. తాను యాజమాన్యము వహించవలసిన పద్ధతిలో దాన్ని ఆయన నిర్వహించకపోవచ్చును. అలా నిర్వహించడానికి నీవతనిని ప్రోత్సహించగలవా? నాయకత్వం వహించుటలో తాను చేసే ఏ ప్రయత్నాన్నైనా నీవు అభినందిస్తున్నావా? అతడు కొంతైనా ప్రయత్నం చేసినపుడు అతనికి సహకరించి, ప్రోత్సహిస్తావా? లేక ఆయన పొరపాటు చేస్తున్నాడని అతని కార్యం సఫలం కాదని అంటావా? ఒక్కొక్కసారి భర్త సరిగ్గా నాయకత్వం వహించనిచో ఆ నింద భార్య కూడ భరించవలసి వుంటుంది—ఉదాహరణకు, ఆమె అతని ఆలోచనలను అవమాన పరచినపుడు లేదా అతని ప్రయత్నాలను వ్యతిరేకించినపుడు, పథకం పూర్తిగా ఫలించకపోగా, ‘అది పనిచేయదని నేను చెప్పలేదా’ అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చినపుడు, ఆమె అట్టి నిందను భరించవలసి వస్తుంది. ఇది చివరకు అతన్ని అనిశ్చితగల, స్థిరత్వములేని భర్తగా తయారుచేస్తుంది. దానికి బదులు నీ యథార్థత, మద్దతు, అతని యందు ప్రగాఢ విశ్వాసాన్ని, దృఢ నమ్మకాలను నీవు కల్గివుంటే అవి అతనిని బలపరచి, అతని విజయానికి దోహదపడతాయి.

“గుణవతియైన భార్య”

9. గుణవతియైన భార్యను గూర్చి సామెతలు 31:10 ఏమని తెల్పుతుంది?

9 అతిప్రియంగా ప్రేమింపబడు భార్యగా వుండటానికి నీవు కూడ ఇంటి బాధ్యతలను అతిజాగ్రత్తగా నిర్వహించవలసిన అవసరముంది. అట్టి స్త్రీని గూర్చి బైబిలిలా తెల్పుతుంది: “అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది.” (సామెతలు 31:10) అయితే నీవట్టి భార్యవేనా? నీవు అలా ఉండదలచుకున్నావా?

10, 11. తాను సామెతలు 31:15నందలి వర్ణనకు సరిపడుదాననేయని భార్య ఎలా కనబరచుకోగలదు?

10 “గుణవతియైన భార్య” యొక్క కార్యాలను గూర్చి చర్చిస్తూ బైబిలు పుస్తకమగు సామెతలు ఇలా అంటుంది: “ఆమె చీకటితోనే లేచి, తన యింటివారికి భోజనము సిద్ధపరచును.” (సామెతలు 31:15) అనేకమంది యౌవనస్త్రీలు ఏమీ వంటావార్పు తెలియకుండగనే వివాహజీవితంలోనికి ప్రవేశిస్తారు. ఎందుకనగా వంట చేయటానికి వారి తల్లులు వారికేమీ నేర్పలేదు; అయితే వారిప్పుడు నేర్చుకొనవచ్చును. తెలివైన స్త్రీ వంట బాగుగా చేయడానికి నేర్చుకుంటుంది! వంట ఒక కళ. భోజనం మంచి రుచికరంగా తయారు చేసినపుడు, అది కడుపును నింపుటయేగాక, హృదయాభినందనను కూడ కల్గిస్తుంది.

11 భోజనం తయారు చేయడానికి నేర్చుకొనవలసినదెంతో వుంది. పోషకపదార్థాలను గూర్చి తెలిసికొనుట ఎంతైనా అవసరం, అప్పుడు నీ కుటుంబ ఆరోగ్యాన్ని నీవు కాపాడగలవు. కానీ మంచి బలమైన ఆహారాన్ని మాత్రమే అందిస్తే నీ భర్తమెప్పును నీవు పొందగలవనే నమ్మకమేమి లేదు సుమా. ఇస్సాకు భార్యయైన రిబ్కాకు తనభర్త ఇష్టపడే రీతిలో “రుచిగల” భోజనాన్ని తయారు చేయడమెలాగో తెలుసునని బైబిలు తెల్పుతున్నది. (ఆదికాండము 27:14) అనేకమంది భార్యలు ఆమె చూపిన మాదిరినుండి ప్రయోజనం పొందగలరు.

12. సామెతలు 31:14నకు అనుగుణంగా స్త్రీ చేసేపనులలో ఏవి కూడ ఇమిడియుండగలవు?

12 ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో స్త్రీలు ప్రతి రోజు ఉదయాన్నే బజారుకు వెళ్ళి ఆ రోజుకు కావలసిన వస్తువులన్నిటిని కొనితెచ్చుకుంటారు. కొన్ని స్థలాల్లో వారానికొకేసారి కొని, వాటిని చెడిపోకుండా రిఫ్రిజిరేటర్‌లో దాచుకుంటారు. ఎలాగైననూ సరే, తన భార్య కుటుంబ ఆర్థికస్థితిని గౌరవిస్తూ డబ్బును జాగ్రత్తగా ఖర్చుపెడుతూ వుంటే భర్త ఆమెను అభినందించుటకంటె మరేం చేయగలడు. మంచి ఆహారవస్తువులను, దుస్తులను ఎలా గుర్తించవలెనో ఆమె నేర్చుకుంటే, వాటి విలువ తెలిసికుంటే, తాను మొదట చూచినదానినే ఆమె కొనదు. కానీ, సామెతలు 31:14 తెల్పినట్లు: “వర్తకపు ఓడలు దూరమునుండి ఆహారము తెచ్చునట్లు ఆమె దూరమునుండి ఆహారము తెచ్చుకొనును.”

13. సామెతలు 31:27 ప్రకారం గుణవతియైన భార్య తన ఇంటిని గూర్చి ఏమి చేయాలని అపేక్షించబడుతుంది?

13 తన పనిని గూర్చి మెలకువతో కూడిన అట్టి శ్రద్ధ, తన ఇంటి పరిస్థితిలో కూడ ప్రతిబింబించాలి. గుణవతియైన భార్యనెలా గుర్తించగలమో వివరిస్తూ, సామెతలు 31:27 ఇలా తెల్పుతుంది: “ఆమె తన ఇంటివారి నడతలను బాగుగా కనిపెట్టును, పనిచేయకుండ ఆమె భోజనము చేయదు.” ఆలస్యంగా నిద్రపోవడానికి అలవాటుపడడం, ఇరుగుపొరుగువారితో వ్యర్థమైనమాటలను గంటల తరబడి మాట్లాడడం—ఆమెకు తగవు. కొన్నిసార్లు అనారోగ్యం లేక అనుకోని పరిస్థితుల మూలంగా తన ఇంటిపనిలో ఆమె వెనుకబడిననూ, తన ఇల్లు ఎంతో శుభ్రంగా చక్కగా తీర్చిదిద్దినట్లుంటుంది. భర్త స్నేహితులెవరైనా ఇంటికివస్తే యింటి పరిస్థితిని చూచి అతడే దాన్ని అసహ్యించుకొనకుండ ధీమాగా వుండగలదు.

14, 15. స్త్రీ దుస్తులు, నగల విషయంలో బైబిలు హెచ్చరిక ఏమిటి?

14 చాలమంది స్త్రీలకు, వారు శుభ్రంగా కనబడాలని చెప్పనక్కర్లేదు, కానీ కొంతమందికి దీనిని జ్ఞాపకం చేయవలసివస్తుంది. ఆమె తనను గూర్చి అంతగా పట్టించుకొననట్లే కనబడుతుందని ఆమెను గూర్చి జాలిపడుట అంత సులభమేమికాదు. స్త్రీలు “అణుకువయు, స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రములు” ధరించుకొనవలెనని బైబిలు సిఫారసు చేస్తుంది. అయితే తలవెంట్రుకలను విపరీతంగా సింగారించుకొనుట, నగలు ధరించుట, ఇతరులామెను ఆకర్షించేలా విలువైన దుస్తులు ధరించే విషయంలో కూడ అది హెచ్చరిస్తుంది.—1 తిమోతి 2:9.

15 ఆ దుస్తులకన్న, వాటిని ధరించుకొనే వారి స్వభావం ఎంతో మిన్నయైంది. అపొస్తలుడైన పేతురు క్రైస్తవ భార్యలతో “సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణము . . . దేవుని దృష్టికి మిగుల విలువగలది” అని తెల్పుతున్నాడు. (1 పేతురు 3:4) సామెతలు, గుణవతియైన భార్య లక్షణములను గుణిస్తూ, ఆమె “దీనులకు తన చెయ్యి చాపును,” మరియు “కృపగల ఉపదేశము ఆమె బోధించును” అని కూడ తెల్పుతుంది. (సామెతలు 31:20, 26) “అందము మోసకరము,” అంటూ అది ఇంకను ఇలా వర్ణిస్తుంది, “సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును.”—సామెతలు 31:30.

16. అభినందించే భర్త అట్టి భార్యను గూర్చి ఏమనుకుంటాడు?

16 అవును, సృష్టికర్త ఉద్దేశాన్ని పంచుకొనే ఏ భర్తయైనా సరే, అట్టి స్త్రీని బహుగా ప్రేమిస్తాడు. అతడు, సామెతల రచయిత వ్యక్తపరచినట్లే తనభార్యను గూర్చి భావిస్తాడు: “చాలమంది కుమార్తెలు పతివ్రతాధర్మము ననుసరించి యున్నారు గాని, వారందరిని నీవు మించినదానవు.” (సామెతలు 31:28, 29) ఆమె ప్రోద్బలం లేకుండగనే, ఆమెను గూర్చి తానలా భావిస్తున్నాడని తన భార్యకు తెలియడానికి సిద్ధపడతాడు.

దాంపత్య జీవితం ఎడల నీకున్న దృష్టిని బట్టి తేడాకనబడుతుంది

17, 18. దాంపత్య జీవితం ఎడల భార్యకున్న అభిప్రాయం, భర్త ఆమెను గూర్చి తలంచే విషయంపై ఎట్టి ప్రభావం కల్గియుండగలదు?

17 దాంపత్య జీవితంలో తృప్తిలేనందువల్లనే అనేక వివాహాలు సమస్యలకు గురౌతున్నాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో భర్త తన భార్య శారీరక భావోద్రేక ప్రవృత్తుల అవసరతలను గ్రహించలేకపోవుటవలన, శ్రద్ధలేకపోవుటవలన యిది సంభవిస్తుంది, మరికొన్ని సందర్భాల్లో భార్య తన భర్త భౌతిక, భావోద్రేకాలలో పాలుపొందనందువలన ఇలా జరుగుతుంది. భార్యాభర్తల సమ్మతి చొప్పున, ఇరువురి ఇష్టానుసారంగా, ఉత్సాహపూరితంగా చేసే దాంపత్యజీవితమే, ఒకరి ఎడల మరొకరు వ్యక్తపరచు ప్రేమకు గుర్తుగా వుండవలసిన క్రియ.

18 భర్త శ్రద్ధను చూపనందువలన బహుశ భార్య నిరుత్సాహంగా వుండవచ్చు, కానీ భార్య నిర్లక్ష్యత కూడ భర్తకు బాధ కల్గిస్తుంది. మరి ఆమె చూపే అయిష్టతవల్ల అతను తన కామాభిలాషను చంపుకోవచ్చు లేదా మరొక స్త్రీవైపు మరలవచ్చును. ఒకవేళ భార్య, నిర్లక్ష్య స్వభావంతో ఊరక లొంగిపోతే, తన భార్య తనను లెక్కచేయడంలేదు అనేదానికిది నిదర్శనమని భర్త దానికి త్రిప్పి చెప్పవచ్చునేమో. లైంగిక సంబంధం భావోద్రేకాల మూలంగా కల్గుతుంది. మరి భార్య ఇందుకు సమ్మతించకపోతే లైంగిక సంబంధాన్ని గూర్చి తన దృష్టిని మరల ఒకసారి ఆమె పునర్విమర్శించుకోవలసిన అవసరమున్నది.

19. (ఎ) తన జంటతో లైంగిక సంబంధాన్ని కొంతకాలం వరకు తిరస్కరించుట తప్పని బైబిలెలా తెల్పుతుంది? (బి) దంపతుల లైంగిక విషయాల్లో ఇతరులను సంప్రదించవలసిన అగత్యత ఎందుకు లేదు?

19 ‘భార్యాభర్తలిరువురు వారివారి ధర్మమును జరిగింపకుండ వుండ కూడదని,’ బైబిలు హెచ్చరిస్తుంది. శిక్షించుటకు లేదా అయిష్టతను వ్యక్తపరచుటకు భార్య వారాలతరబడి లేక నెలలతరబడి తన భర్త దగ్గరికి రాకుండా దూరంగా వుంటూ, లైంగిక అనుభూతిని ఒక ఉపకరణంగా వాడుటను బైబిలు అనుమతించదు. ఆయన ఆమె ఎడల ‘తన ధర్మమును జరిగించినట్లే’ ఆమె అతని ఎడల ‘తన ధర్మమును జరిగించవలెను.’ (1 కొరింథీయులు 7:3-5) నైతిక విలువలను పాడుచేసే అస్వాభావికమైన క్రియకు లోబడవలెనని దీని భావంకాదు, మరియు తన భార్యను ప్రేమించి, సన్మానించే భర్త ఆమె ఆలాగు చేయాలని కోరడు. “ప్రేమ . . . అమర్యాదగా నడువదు.” (1 కొరింథీయులు 13:4, 5) దంపతుల లైంగిక బంధం విషయంలో తప్పొప్పులను గూర్చి ఇతరులను అడుగవలసిన అగత్యత ఏమీలేదు. బైబిలులో 1 కొరింథీయులు 6:9-11నందు యెహోవాదేవుని ఆరాధికులకు నిషేధింపబడిన అలవాట్లను గూర్చి విపులంగా వ్రాయబడింది: వ్యభిచారం, జారత్వం, పురుషసంయోగం. (లేవీయకాండము 18:1-23 కూడ పోల్చండి.) వీటికి దూరంగానున్న కొందరు వ్యక్తులైతే, ఇప్పుడు “క్రొత్త నైతికత్వమును”—నిజానికి అవినీతిని—అనుసరిస్తు నిషేధింపబడిన ఆ లైంగిక క్రియలకే పాల్పడుతున్నారు, ఇతర పూర్వాచారపరాయణులు నిషేధింపబడిన వాటికి యింకా కొన్నింటిని జతచేస్తున్నారు. బైబిలు మాత్రం సమదృష్టిని చూపిస్తుంది. ప్రేమ, మర్యాద, మంచిగా మాట్లాడుట, గ్రహించుటమున్నగు ఇతర క్రియలన్నీ ఉంటే, లైంగిక బంధమనేది ఒక సమస్యగా మారుట అరుదు.

20. స్త్రీ తన దాంపత్య జీవితాన్ని బేరసారాలకు ఉపయోగిస్తే కలిగే ఫలితమేమి?

20 బాగా ప్రేమించబడే భార్య తన దాంపత్యజీవితాన్ని బేరసారాలకు వుపయోగించదు. నిశ్చయంగా అందరు ఆ విధంగా లైంగిక సంబంధాన్ని అమ్ముకొనరుగానీ అలాచేసేవారు కొందరున్నారు. మోసంతో వారు వారి భర్తలనుండి కొన్ని సంపాదించడానికి లైంగిక ప్రవృత్తిని అమ్ముకుంటారు. ఇందువల్ల కలిగే ఫలితమేమిటి? నీవు వస్త్రములు అమ్మేవాని యెడల ప్రేమ చూపిస్తావా? భర్తనుండి ఏదో రాబట్టాలని తన దాంపత్య జీవితాన్ని బేరసారాలకు వుపయోగించే భార్యను, భర్త ప్రేమానుభూతితో చూడడు. అలాచేసే స్త్రీ ధనార్జన చేయవచ్చునుగానీ భావోద్రేక ఆత్మీయ ఆస్తిని పోగొట్టుకుంటుంది.

ఏడ్చేవారు, విసిగించేవారు

21-23. సమ్సోను విషయంలో ఉదహరించబడినరీతిగా, స్త్రీ తన ఏడ్పుతో గయ్యాళితనంతో ఆనందాన్ని ఎలా నాశనం చేస్తుంది?

21 సమ్సోను ఎంతో బలాఢ్యుడు అయినను ఏడుస్తూ లేక విసిగిస్తూ వారి వుద్దేశములను సఫలము చేసికొనవలెననే స్త్రీల పోరుకు తట్టుకో లేకపోయాడు. తనకు కాబోయే భార్య ఒకసారి ఏడ్పు మొదలుపెట్టి అతన్ని శోధించింది. న్యాయాధిపతులు 14:16, 17 నందు వ్రాయబడినట్లు ఆమె “యేడ్చుచు—నీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు. నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాని నాకు తెలుపవైతివి అనగా, అతడు—నేను నా తలిదండ్రులకైనను దాని తెలుపలేదు, నీకు తెలుపుదునా? అనెను.” సమ్సోను హేతువాదం అచ్చటపని చేయలేదు. భావోద్రేకాలు పెరిగిపోతున్నపుడు అది అంతగా పనిచేయదు. “ఆమె వారి విందు దినములు ఏడింటను అతనియొద్ద ఏడ్చుచువచ్చెను. ఏడవదినమున ఆమె అతని తొందరపెట్టినందున అతడు ఆమెకు దాని తెలియజేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపెను.”

22 నీ ఇష్టప్రకారం చేయడానికి నిన్ను అనుమతించనందువల్ల నీ భర్త నిన్ను ప్రేమించుటలేదని నీవనుకోవద్దు. సమ్సోనుకు కాబోయే భార్య తన్ను అతడు ప్రేమించుటలేదని నిందించిందికానీ, వాస్తవానికి ఆమే అతన్ని ప్రేమించలేదు. అతడు భరించలేనంత భారాన్ని ఆమె అతనిపై మోపింది. అతడు విప్పుడు కథను ఆమెతో చెప్పగా, వెంటనే ఆమె అతన్ని మోసగించి అతని రహస్యాన్ని అతని శత్రువులకు చేరవేయడానికి పరుగిడింది. చివరకామె మరొకరి భార్య అయింది.

23 పిదప సమ్సోను దెలీలా అను మరొక స్త్రీని మోహించాడు. ఆమె సుందరియై యుండవచ్చునేమోగానీ, అతడు ప్రియంగా ప్రేమించగల స్త్రీయని తాను రుజువు చేసుకున్నదా? స్వప్రయోజనం కొరకు వుపయోగించుకొనడానికే సమ్సోను నుండి సమాచారాన్ని సేకరించే దృష్టితో దెలీలా, విసిగించడాన్ని ఒక ఉపకరణంగా వాడింది. ఆ వృత్తాంతం ఇలా తెల్పుతుంది: “ఆమె అనుదినమును మాటలచేత అతని బాధించి తొందరపెట్టుచున్నందున అతడు ప్రాణమువిసికి చావగోరెను.” తుదకు కల్గిన ఫలితమెంతో విచారకరంగా వుండెను.—న్యాయాధిపతులు 16:16.

24-27. (ఎ) విసిగించే భార్యవల్లకల్గే ప్రభావమెలాంటిదని సామెతల పుస్తకం తెల్పుతుంది? (బి) ఈ హెచ్చరిక విషయంలో అదెందుకు ప్రత్యేకంగా స్త్రీలను గూర్చియే తెల్పుతుంది? (సి) భర్త, తన భార్య నిమిత్తం మంచివాటిని చేయడానికి ముఖ్యంగా అతన్ని పురికొల్పేదేమిటి?

24 ఏడ్చుట, విసిగించుట తెలివైన పనులుకావు. అలాంటివి వివాహాన్ని పాడుచేస్తాయి. అట్టివి భర్తను వేరుచేస్తాయి. అలాంటి అలవాట్లు తగవని బైబిలు హెచ్చరిస్తుంది. ఇచ్చట ఇవ్వబడిన లేఖనాలు ది న్యూ ఇంగ్లీషు బైబిలు నుండి తీయబడినవి: “దేనినో ఒకదాన్ని మాటిమాటికి ఎత్తువాడు స్నేహాన్ని చెడగొడతాడు.” “గయ్యాళియైన భార్య ఎడతెగక కారుచున్న నీటివంటిది.” “గయ్యాళి, దుష్టతలంపుగల భార్యతో కాపురం చేసేబదులు, ఎడారిలో జీవించుటమేలు,” “గయ్యాళియైన భార్య—వర్షంరోజున ఎడతెరిపి లేకుండపడే చినుకులవంటిది. ఆమెను అదుపులోపెట్టుట, గాలిని అదుపులో పెట్టినట్లే వుంటుంది! ఒకడు తన వ్రేళ్ళతో నూనెను పట్టుకున్నట్లే వుంటుంది!”—సామెతలు 17:9; 19:13; 21:19; 27:15, 16.

25 లేఖనాలు స్త్రీలను గూర్చే ఎందుకు ప్రత్యేకంగా యీ హెచ్చరికనిస్తున్నవి? బహుశ, స్త్రీలు సహజంగా సున్నితమైన మనస్సుగలవారు మరియు వారేదో కలత చెందినపుడు విశేషంగా వారి భావాలను వెళ్లగ్రక్కుతారు గనుగనే వారిని గూర్చి యీ హెచ్చరిక ఇవ్వబడియుండవచ్చు. అంతేగాక, అలా చేయడమే వారికున్న ఆయుధమని వారనుకోవచ్చు. ఇంటి యజమానిగా భర్త తన అధికారాన్ని చెలాయించవచ్చు కాబట్టి భార్యకూడ భర్తను యీ ఉద్రేకాల ఒత్తిడికి గురిచేయాలని తలంచవచ్చు. భార్యవైన నీవు అలాంటి కుయుక్తులు పన్నవద్దు, మరియు నీవలా తప్పని సరిగా చేయాలని భావించేలా, నీ భర్త నిన్ను అనుమతించ కూడదు.

26 నిజమే, నీవు అంతబాగుగాలేని సమయాలు నీకుండవచ్చు, మరి నీవు వద్దనుకున్నను కంటతడిపెట్టవలసిన పరిస్థితి నీకు రావచ్చునేమో. అయితే నీ పన్నాగాలు ఫలించాలని ఎంతో ఆవేశపూరిత పరిస్థితులను సృష్టించడానికి, దీనికి ఎంతో వ్యత్యాసముంది.

27 నిజంగా తమ భార్యలను ప్రేమిస్తే చాలమంది భర్తలు, వ్యక్తిగత ఇష్టాయిష్టాలు ఇమిడియున్నపుడు కూడ తమకంటె వారి భార్యలకోరికలనే నెరవేర్చడానికి ఇష్టపడతారు. నీభర్తను సంతోషపెట్టు. అప్పుడు అతడు నిన్ను సంతోషపెట్టే అవకాశాలకొరకు ఎదురు చూస్తాడు.

“మౌనముగా నుండుటకు మాటలాడుటకు” సమయముకలదు

28-35. (ఎ) భర్త, భార్యతో మాట్లాడడానికి కష్టమనిపించే కొన్ని సంభాషణ అలవాట్లను వివరించండి. (బి) భార్యాభర్తల మధ్య సంభాషణను మెరుగుపరచడానికేమి చేయవచ్చు?

28 ‘నా భర్త ఎప్పుడూ నాతో మాట్లాడడు’ అని అనేకమంది భార్యలు ఫిర్యాదు చేస్తారు. తప్పు అతనిదే కావచ్చును. అయినను అనేకసార్లు భర్త తన భార్యతో మాట్లాడాలనే ఇష్టపడతాడు గాని ఆమె మాత్రం అంత సుముఖంగా వుండదు. ఎలా? స్త్రీలందరూ ఒకేవిధంగా వుండరు. అయితే ఇచ్చటున్న వర్ణనలకు సరిపడతావేమో నిన్నునీవే ప్రశ్నించుకో:

29 మొదటిదేమంటే, స్త్రీకి పొరుగింటి ఆవిడతో మాట్లాడటానికి ఏమీ కష్టముండదు. కానీ ఆమె మాట్లాడే ధోరణి ఎటువంటిది? ఎదుటి స్త్రీ ఊపిరి పీల్చుకొనుటకు ఆగిన వెంటనే ఈమె మాట్లాడటం ఆరంభిస్తుంది. ఆమె రెండు ప్రశ్నలైనా వేస్తుంది లేకపోతే మరో అంశాన్నైనా తీసికుని మాట్లాడుతుంది. వెంటనే ఈ ఊపిరి తీసుకున్న స్త్రీ చొరబడి తాను కొంత మాట్లాడుతుంది. ఆ సంభాషణ అందరికొరకు అన్నట్లే, యీ యిద్దరిలో ఎవ్వరూ సంభాషణ ఆపడానికి ఇష్టపడరు.

30 ఇప్పుడు భర్త ఇంటికివస్తాడు, ఏదో చెప్పదలచుకుంటాడు. తాను గుమ్మం దగ్గరకు వచ్చిన వెంటనే అతడిలా ప్రారంభిస్తాడు ‘అసలు పని దగ్గర ఏమి జరిగిందో నీవు ఊహించి వుండవు . . .’ ఇక అంతకంటె ముందుకు పోలేడు. మధ్యలో ఆమెవచ్చి, ‘మీకోటు మీద ఆ మచ్చ ఏమిటండీ? మీరెక్కడ నడుస్తున్నారో కొంచెం చూచినడవండీ, నేనిప్పుడే ఇల్లంతా తుడిచాను.’ ఇకఅంతే, అతడు ఒక్క పొల్లయినా మాట్లాడలేడు, తన కథ అయిపోయింది.

31 లేక, వారిద్దరు స్నేహితులతో మాట్లాడుతుండవచ్చు, అతడొక అనుభవాన్ని తెల్పుతూ, కొన్ని వివరణలను వదలివేయవచ్చు లేదా అన్నిటిని సరిగ్గా చెప్పలేకపోవచ్చు. ఇంతలో భార్య కలుగజేసికొని మొదట ఆయన తప్పులుదిద్ది అటుతర్వాత ఇక తాను కథ చెప్పడానికి ఉపక్రమిస్తుంది. వెంటనే అతడు పెద్దగా నిట్టూర్చి, ‘ఎందుకే ఇదంతా, పోనీ నీవే అంతా చెప్పరాదూ?’ అని అంటాడు, ఇదీవరస.

32 మరొక స్త్రీ ఎటువంటిదంటే, తన భర్త మాట్లాడటానికి అతన్నే ప్రోత్సహిస్తుంది. ఏదో అమాయకంగానే కనబడటానికి ప్రయత్నిస్తుంది గానీ లోపలమాత్రం కొండంత ఆశతో అతన్నిట్లడుగుతుంది, ‘ఎక్కడున్నారు మీరు?’ ‘మీతో యింకెవరున్నారు?’ ‘ఏమైంది?’ ఆమె దైనందిన జీవితంలో జరిగేవాటిని అడగటం లేదు గానీ గుట్టుగావున్న వాటిని తాను తెలుసుకోవాలనే కుతూహలంతో వాటిని గూర్చి అడుగుతుంది. కొద్దికొద్దిగా సమాచారాన్ని సేకరించి మధ్యమధ్యన ఆమె తన మనస్సులో వున్నవాటిని చేర్చి దాన్ని పెద్దదిగా చేస్తుంది. తన భర్తకు తెలియనిది, ఆయన ప్రమేయంలేని వార్తకూడ బహుశ అందులో వుండవచ్చు. మిగిలినవి తనభార్యతో ఆయన చర్చించదగిన విషయాలే అయివుండవచ్చు. గానీ అవి రహస్యంగా చెప్పబడ్డాయి. మరి ఇప్పుడామె యీ సంగతులను ఇతరులతో చెబితే, నమ్మకం దెబ్బతింటుంది. “పరునిగుట్టు బయటపెట్టకుము” అని సామెతలు 25:9 హెచ్చరిస్తుంది. కానీ ఆమె వారిగుట్టు బయటపెడితే అది సమస్యలకు దారి తీస్తుంది. ఇక ముందు ఆమెతో మాట్లాడటానికి అతడు చొరవ తీసుకొంటాడా?

33 మూడవరకమైన స్త్రీ ఎవరంటే, తానంత అధికంగా మాట్లాడే వ్యక్తికాదు. ఇంటిలో అవసరమైన పనెలా చేయాలో ఆమెకు తెలుసు, అయితే ఏవో కొద్దిమాటలలో అదీ ఎప్పుడో ఒకసారి మాత్రమే మాట్లాడుతుంది గాని అంతకంటె ఎక్కువమాట్లాడదు. ఎవరైనా ఆమెతో మాట్లాడదలచుకుంటే వారే మాట్లాడవలసివస్తుంది. బహుశ పిరికితనమేమో, లేదా తన చిన్నతనంలో పెద్ద చదువులు చదువుకొనే అవకాశం లభించలేదేమో. కారణమేదైనా, ఆమెతో మాట్లాడాలనే ప్రయత్నం మాత్రం నిష్ప్రయోజనమే.

34 అయితే మార్పులు చేసికొనవచ్చు. మాట్లాడే నైపుణ్యాన్ని పొందవచ్చు. ఒక స్త్రీ తన ఇంటిపనియేగాక ఉపయోగకరమైన వాటిని అనగా చదువుకోవడం, ఇతరులకు దయతో సహాయం చేయడం వంటి వాటిని కూడ చేస్తే తన భర్తతో పంచుకొనదగిన ప్రోత్సాహకరమైన విషయాలను ఆమె కల్గియుండగలదు. అంతేగాక, విజయవంతమైన సంభాషణ జరగాలంటే, ఇద్దరు వ్యక్తులు కావాలి. దానికి సభ్యత కూడ అవసరం—అతడు చెప్పే విషయాన్ని ముగించడానికి అనుమతించడం, అతని ధోరణిలోనే అతడు చెప్పడానికనుమతించడం మరియు గుట్టును దాచుట మున్నగు వాటిని ఎరిగి యుండాలి. ప్రసంగి 3:7 లో చెప్పినట్లు “మౌనముగా నుండుటకు మాటలాడుటకు” సమయము కలదు.

35 కావున, నీ భర్త ఎప్పుడో ఒకసారి మాట్లాడతాడనే ఫిర్యాదుచేసే బదులు, అతడు మాట్లాడటానికి సంతోషించే రీతిగా నీవెందుకు ఆ పరిస్థితిని మార్చకూడదు? అతడు చేసే పనులయందాసక్తిని కనబరచు. అతడు మాట్లాడుతుండగా శ్రద్ధగా ఆలకించు. నీవిచ్చే సమాధానంలో అతని ఎడల నీకున్న ప్రేమానురాగాలను ప్రగాఢ గౌరవాన్ని ప్రతిబింబించనిమ్ము. నీవు మాట్లాడేవి సరియైనవిగాను, ప్రోత్సాహకరమైనవిగాను వుండేటట్లు చూడు. అప్పుడు ఆ సంభాషణ మీ యిద్దరికి సంతోషకరంగా వున్నట్లు సత్వరమే నీవు గమనించగలవు.

“వాక్యము లేకుండనే” రాబట్టుట

36-38. అవిశ్వాసియైన భర్తను విశ్వాసంలోనికి ఒప్పించే కొన్ని మార్గాలేవి?

36 అప్పుడప్పుడు, మాటలకంటె క్రియలే బాగుగా పనిచేస్తాయి, ప్రత్యేకంగా ఇది దేవుని వాక్యమునందు విశ్వసించని భర్తల విషయంలో వాస్తవం. వారిని గూర్చి అపొస్తలుడైన పేతురు ఇలా అన్నాడు: “వారు భయముతో కూడిన మీ పవిత్రప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును.” (1 పేతురు 3:1, 2) అవిశ్వాసులైన అనేకమంది భర్తలలో ఒకడు, తన భార్య తనకు ఎల్లప్పుడు “ప్రకటిస్తుందని,” దానినతడు తిరస్కరించేవాడని ఫిర్యాదు చేశాడు. మరికొందరైతే, వారి భార్యల నడవడిలో దేవుని వాక్య సత్యం తెచ్చిన మార్పులను గమనించి, వారును విశ్వాసులయ్యారు. ప్రజలు తరచూ ప్రసంగాన్ని వినేదానికంటే దాన్ని అనుసరించే వ్యక్తులను గమనించుటవల్ల ఆకర్షితులౌతున్నారు.

37 నీవు నీ అవిశ్వాసియైన భర్తతో మాట్లాడేటప్పుడు లేఖనాలు తెల్పేరీతిగా “మీ సంభాషణ . . . ఎల్లప్పుడు . . . కృపాసహితముగాను,” మంచి రుచిగలదిగాను లేక “ఉప్పువేసినట్టు” వుండనీయండి. మాట్లాడడానికి సమయముంది. “సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్లవంటిది,” అని బైబిలు తెల్పుతుంది. అతడు ఏదో ఒకదానిని బట్టి నిరుత్సాహపడియున్నాడా? బహుశ ఉద్యోగస్థలంలో ఏవో పొరపాట్లు జరిగియుండవచ్చు. ఇప్పుడు కొన్ని ఓదార్పుకరమైన మాటల వలన అతడు ఉపశమనం పొందవచ్చునేమో. “ఇంపైన మాటలు . . . ప్రాణమునకు మధురమైనవి, యొముకలకు ఆరోగ్యకరమైనవి.” (కొలొస్సయులు 4:6; సామెతలు 25:11; 16:24) లేదా ‘నాకు అర్థమైందండీ, నేను మీ పక్షమేగదా, నాకు చేతనైనంత మట్టుకు మీకు సహాయపడతా,’ అనే భావమిచ్చేలా పరిస్థితినిబట్టి ఆప్యాయంగా అతని చుట్టూ చేయివేయండి.

38 అతడు నీతోటి విశ్వాసికాకపోయినా సరే, నీవింకా అతనికి లోబడియుండాలని దేవుని వాక్యం తెల్పుతుంది. నీ సత్ప్రవర్తన వలన అతడురాబట్ట బడవచ్చునేమో, అప్పుడతడు నీ విశ్వాసంలో పాలి భాగస్థుడౌతాడు. ఆ దినమెంత ఆనందంగా వుంటుందో! ఆ సమయమే కలిసివస్తే మునుపటికంటె ఇప్పుడే ఎక్కువ నిన్ను ప్రేమించడానికి ఇంకాబలమైన కారణాలున్నాయని అతడు గ్రహిస్తాడు. నీవెరిగియున్నది సత్యమని నీవు స్థిరంగా నమ్ముటతోపాటు, అతడు “వాస్తవమైనజీవమును” గట్టిగా చేపట్టడానికి నీ భక్తి అతనికి సహాయపడవచ్చును.—1 కొరింథీయులు 7:13-16; 1 తిమోతి 6:19.

39, 40. తీతు 2:4, 5నందు పేర్కొనబడిన ఏ లక్షణాలు, భార్యను భర్తదృష్టికే గాక, యెహోవా దృష్టికి కూడ అతి ప్రియమైన దానిగా చేస్తాయి?

39 భర్తలు విశ్వాసులైనను లేక అవిశ్వాసులైనను, క్రైస్తవ భార్యలు మాత్రం “దేవునివాక్యము దూషింపబడకుండునట్లు, . . . తమ భర్తలకు లోబడియుండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధిగలవారును పవిత్రులును ఇంట ఉండి పనిచేసికొనువారును మంచివారునై యుండవలెనని . . . భర్తలను, శిశువులను ప్రేమించు వారును, స్వస్థబుద్ధిగలవారును, పవిత్రులును, తమ భర్తలకు లోబడియుండవలెనని,” లేఖనములు వారిని ప్రోత్సహిస్తున్నవి.—తీతు 2:4, 5.

40 భార్యవైన నీవు నీ శక్తికొలది దీనిని చేస్తే, నీ వెంతో ప్రియంగా ప్రేమింపబడతావు, నీ భర్తమాత్రమే కాదు యెహోవా దేవుడు కూడ నిన్ను అమితంగా ప్రేమిస్తాడు.

[అధ్యయన ప్రశ్నలు]

[57వ పేజీలోని చిత్రం]

“గుణవతియైన భార్య . . . ముత్యముకంటె అమూల్యమైనది.”—సామెతలు 31:10.

[64వ పేజీలోని చిత్రం]

సమ్సోను జీవితంలో ప్రవేశించిన స్త్రీలు