కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని తీర్పుదినము—దాని ఆనందదాయక ప్రతిఫలము!

దేవుని తీర్పుదినము—దాని ఆనందదాయక ప్రతిఫలము!

అధ్యాయం 41

దేవుని తీర్పుదినము—దాని ఆనందదాయక ప్రతిఫలము!

దర్శనము 15—ప్రకటన 20:11–21:8

అంశం: సాధారణ పునరుత్థానం, తీర్పుదినం మరియు నూతన ఆకాశము నూతన భూమియొక్క దీవెనలు

నెరవేర్పుకాలం: వెయ్యేండ్ల పరిపాలన

1. (ఎ) ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు మానవజాతి దేనిని కోల్పోయింది? (బి) దేవుని ఏ సంకల్పం మారలేదు, అది మనకెలా తెలుసు?

మానవులుగా, మనం నిత్యం జీవించడానికే సృజించబడ్డాము. ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞలకు విధేయులైవుంటే, వారు మరణించి వుండేవారుకాదు. (ఆదికాండము 1:28; 2:8, 16, 17; ప్రసంగి 3:10, 11) అయితే వారు పాపం చేసినప్పుడు, వారికి వారి సంతానానికి ఉన్న పరిపూర్ణతను, జీవాన్ని పోగొట్టుకున్నారు, మరణం క్రూరమైన శత్రువుగా మానవజాతిని ఏలింది. (రోమీయులు 5:12, 14; 1 కొరింథీయులు 15:26) అయినప్పటికీ, పరిపూర్ణమానవులు భూపరదైసులో నిరంతరం జీవించాలనే దేవుని సంకల్పం మారలేదు. మానవజాతియెడల ఆయనకున్న ప్రేమనుబట్టి ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసును భూమికి పంపాడు, ఆయన ఆదాము సంతానములోని “అనేకులకు” విమోచన క్రయధనముగా తన ప్రాణాన్నిచ్చాడు. (మత్తయి 20:28; యోహాను 3:16) యేసు తన న్యాయబద్ధమైన బలి విలువను, విశ్వసించే మానవులకు భూపరదైసులో పరిపూర్ణమైన జీవాన్నివ్వడానికి యిప్పుడుపయోగించగలడు. (1 పేతురు 3:18; 1 యోహాను 2:2) మానవజాతి “సంతోషించి ఉత్సహించ”డానికి ఎంతగొప్ప కారణమున్నదోగదా!—యెషయా 25:8, 9.

2. ప్రకటన 20:11 లో యోహాను ఏమి తెల్పుతున్నాడు, మరి “ధవళమైన మహా సింహాసనము” ఏమిటి?

2 సాతాను అగాధంలో బంధింపబడడంతో యేసు మహిమాన్విత వెయ్యేండ్ల పరిపాలన ప్రారంభమౌతుంది. ఇప్పుడిది దేవుడు “తాను నియమించిన మనుష్యునిచేత నీతిననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చుటకు” సంకల్పించిన ఒక “దినము.” (అపొస్తలుల కార్యములు 17:31; 2 పేతురు 3:8) యోహాను యిలా తెల్పుతున్నాడు: “మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువచోటు కనబడకపోయెను.” (ప్రకటన 20:11) ఈ “ధవళమైన మహా సింహాసనము” ఏమిటి? అది “న్యాయాధిపతియైన దేవుని” ధర్మాసనం తప్ప వేరేమైవుండజాలదు. (హెబ్రీయులు 12:23) ఇప్పుడాయన యేసు బలివిలువ మూలంగా ఎవరు ప్రయోజనం పొందగలరో మానవజాతికి తీర్పుతీరుస్తాడు.—మార్కు 10:45.

3. (ఎ) దేవుని సింహాసనం “మహా” (గొప్పది) మరియు “ధవళమైన” అని అనడం దేన్ని సూచిస్తుంది? (బి) తీర్పు దినమున ఎవరు, దేన్ని ఆధారం చేసికొని తీర్పుతీరుస్తారు?

3 దేవుని సింహానం “మహా” (గొప్పది) అంటే సర్వాధికారియగు ప్రభువుగా యెహోవా మహాత్మ్యమును నొక్కితెల్పుతుంది, మరియు “ధవళము” ఆయన మచ్చలేని నీతిని జ్ఞప్తికి తెస్తుంది. ఆయనే మానవజాతి అత్యున్నత న్యాయాధిపతి. (కీర్తన 19:7-11; యెషయా 33:22; 51:5, 8) అయితే ఆయన తీర్పుతీర్చే పనిని యేసుక్రీస్తు కప్పగించాడు: “తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడుగాని . . . తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు.” (యోహాను 5:22, 23) యేసుక్రీస్తుతోపాటు, “వెయ్యిసంవత్సరములు . . . విమర్శచేయుటకు అధికారము ఇయ్య”బడిన 1,44,000 మంది సహ న్యాయాధిపతులుంటారు. (ప్రకటన 20:4) అయిననూ, ఆ తీర్పుదినములో ప్రతివ్యక్తికి ఏమౌతుందనే విషయం యెహోవా నియమములే నిర్ణయిస్తాయి.

4. “భూమ్యాకాశములు పారిపోయెను” అంటే అర్థమేమిటి?

4 “భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను” అంటే ఏమిటి? ఆరవ ముద్ర విప్పినప్పుడు చుట్టవలె పారిపోయిన ఆ ఆకాశమే—అంటే “భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడిన” మానవ పరిపాలనాధికారాలే. (ప్రకటన 6:14; 2 పేతురు 3:7) భూమి యనేది యీ పరిపాలనక్రింద ఉండే సంస్థీకరించబడిన విధానం. (ప్రకటన 8:7) క్రూరమృగము యొక్క ముద్రను వేయించుకుని దాని ప్రతిమకు నమస్కరించే వారితోపాటు క్రూరమృగము, భూరాజులు వారి సైన్యాల నాశనము, భూమ్యాకాశములు పారిపోడాన్ని సూచిస్తున్నాయి. (ప్రకటన 19:19-21) సాతానుయొక్క భూమ్యాకాశములమీద తీర్పు జరపడంతో, మహాగొప్ప న్యాయాధిపతి మరో తీర్పుదినాన్నిగూర్చి ఆజ్ఞను జారిచేస్తాడు.

వెయ్యేండ్ల తీర్పుకాలం

5. పాత భూమి పాత ఆకాశములు గతించిన తర్వాత, తీర్పుకు మిగిలేదెవరు?

5 పాత ఆకాశం, పాత భూమి గతించిన తర్వాత తీర్పుకు ఎవరు మిగులుతారు? అభిషక్తులైన 1,44,000 మందిలోని శేషించబడినవారు మాత్రం కాదు ఎందుకంటే వారప్పటికే తీర్పుతీర్చబడి ముద్రించబడ్టారు. అర్మగిద్దోను తర్వాత యింకనూ బ్రదికియున్నవారు త్వరలోనే మరణించి పునరుత్థానం ద్వారా పరలోక వరాన్ని పొందాలి. (1 పేతురు 4:17; ప్రకటన 7:2-4) అయిననూ, యిప్పుడు మహాశ్రమలను తప్పించుకున్నవారు “సింహాసనము యెదుట” స్పష్టంగా కన్పిస్తున్నారు. వీరు యేసు చిందించిన రక్తమందు విశ్వాసాన్ని కనబర్చినందున అప్పటికే నీతిమంతులుగా పరిగణించబడ్టారు, గాని యేసు వారిని “జీవజలముల ఊటలయొద్దకు” నడిపిస్తున్నాడు గనుక తీర్పు కొనసాగుతునే ఉండాలి. పిదప, తిరిగి మానవ పరిపూర్ణతకు తేబడి ఆపై పరీక్షింపబడిన తర్వాత, వారు సంపూర్ణభావంలో నీతిమంతులని ప్రకటించబడతారు. (ప్రకటన 7:9, 10, 14, 17) ఆ మహాశ్రమలను తప్పించుకున్న పిల్లలు, వెయ్యేండ్లకాలంలో గొప్పసమూహానికి పిల్లలు పుడితే వారును అలాగే తీర్పుతీర్చబడాలి.—ఆదికాండము 1:28, 9:7; 1 కొరింథీయులు 7:14 పోల్చండి.

6. (ఎ) యోహాను ఏ సమూహాన్ని చూస్తున్నాడు, “గొప్పవారేమి కొద్దివారేమి” అనే మాటలు దేనిని సూచిస్తున్నాయి.? (బి) దేవుని జ్ఞాపకంలోనున్న లక్షలాదిమంది ఎలా నిశ్చయంగా లేపబడతారు?

6 అయినా, తప్పించుకునే గొప్పసమూహము కన్నా యింకా పెద్దగుంపునే యోహాను చూస్తున్నాడు. వారు కోట్లాదిమందిగా ఉన్నారు. “మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను.” (ప్రకటన 20:12ఎ) “గొప్పవారేమి కొద్దివారేమి” అనేవారిలో గత 6,000 సంవత్సరాలనుండి యీ భూమ్మీద బ్రదికి చనిపోయిన మానవుల్లో ప్రముఖులును అప్రముఖులును చేరియున్నారు. అపొస్తలుడైన యోహాను ప్రకటన తర్వాత వ్రాసిన సువార్తలో యేసు తండ్రినిగూర్చి యిలా అన్నాడు: “మరియు ఆయన [యేసు] మనుష్యకుమారుడు గనుక తీర్పుతీర్చుటకు (తండ్రి) అధికారము అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దమువిని . . . బయటికి వచ్చెదరు.” (యోహాను 5:27-29) పూర్వంనుండి ఉన్న సమాధులను తెరచి మృతులను లేపడం—ఎంత అత్యద్భుతమైన పని! నిజమే, దేవుని జ్ఞాపకంలోనున్న ఆ లక్షలాదిమంది క్రమేణ లేపబడతారు, వారితో పోల్చగా ఎంతో తక్కువ సంఖ్యలోనున్న గొప్పసమూహం, పునరుత్థానులయ్యేవారు తమ శరీర బలహీనతలు, స్వభావాలనుబట్టి మొదట్లో తమ పాతజీవిత విధానం ప్రకారం ప్రవర్తించడం మూలంగా ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే వాటిని పరిష్కరించే స్థితిలో ఉంటారు.

ఎవరు లేపబడి తీర్పుపొందెదరు?

7, 8. (ఎ) ఏ గ్రంథం విప్పబడింది, ఆ తర్వాతేమి జరుగుతుంది? (బి) ఎవరికి పునరుత్థానముండదు?

7 యోహాను యింకనూ యిలా చెబుతున్నాడు: “మరియు జీవగ్రంథమను వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పుపొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియలచొప్పున తీర్పుపొందెను.” (ప్రకటన 20:12బి, 13) నిజంగా మహాద్భుత దృశ్యం! ‘సముద్రం, మరణం, మృతులలోకం’ ప్రతిదీ దానిదాని పని నిర్వహిస్తుంది, అయితే యీ పదాలు ఒక్కోదానికి వేరుగా లేవనే విషయాన్ని గమనించండి. * యోనా, చేప కడుపులో సముద్రం మధ్యన ఉన్నప్పుడు, తాను షియోల్‌, లేక హేడీస్‌లో వున్నట్లు తననుగూర్చి చెప్పుకున్నాడు. (యోనా 2:2) ఒకవ్యక్తి ఆదామువల్ల కల్గిన మరణపాశమందుంటే అతడు హేడీస్‌లో కూడ ఉన్నాడు. ఈ ప్రవచనార్థక మాటలు ఎవ్వరూ అలక్ష్యం చేయబడరు అనే అభయాన్నిస్తున్నాయి.

8 నిజమే, పునరుత్థానం చేయబడని అసంఖ్యాకులుంటారు. వీరిలో యేసును అపొస్తలులను తిరస్కరించిన, పశ్చాత్తాపపడని శాస్త్రులు పరిసయ్యులు అంటే మతపరమైన “పాపపురుషుడు,” “భ్రష్టులైన” అభిషక్త క్రైస్తవులు ఉంటారు. (2 థెస్సలొనీకయులు 2:3; హెబ్రీయులు 6:4-6; మత్తయి 23:29-33) లోకాంతమున “అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచిన నిత్యాగ్నిలోనికి” అంటే “నిత్యశిక్షకు” పోతారని యేసు మేకలాంటి ప్రజలను గూర్చి చెప్పాడు. (మత్తయి 25:41, 46) వీరికి పునరుత్థానంలేదు!

9. కొందరు విశేషాధిక్యత పొందుతారని అపొస్తలుడైన పౌలు ఎలా తెలియజేస్తున్నాడు, మరియు వీరిలో ఎవరు చేరియున్నారు?

9 అయితే పునరుత్థానంలో ప్రత్యేకంగా అనుగ్రహం పొందే కొందరున్నారు. అపొస్తలుడైన పౌలు యిలా చెప్పినప్పుడు యీ విషయాన్ని వెల్లడించాడు: “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని . . . నేనుకూడ దేవునియందు నిరీక్షణయుంచి” యున్నాను. (అపొస్తలుల కార్యములు 24:15) భూలోక పునరుత్థానం విషయంలోనైతే, “నీతిమంతులు” అనే వారిలో దేవునితో స్నేహంచేసే విషయంలో నీతిమంతులుగా తీర్చబడిన ప్రాచీనకాల విశ్వాసులగు అబ్రాహాము, రాహాబు మరనేక యితరులును చేరియున్నారు. (యాకోబు 2:21, 23, 25) ఇదే గుంపులో యీ ఆధునిక కాలంలో యెహోవాకు నమ్మకంగావుండి చనిపోయిన నీతిమంతులగు వేరే గొఱ్ఱెలును ఉన్నారు. బహుశ, అటువంటి యథార్థపరులు యేసు వెయ్యేండ్ల పరిపాలనలో ముందుగనే పునరుత్థానులు కావచ్చు. (యోబు 14:13-15; 27:5; దానియేలు 12:13; హెబ్రీయులు 11:35, 39, 40) నిశ్చయంగా పునరుత్థానం పొందబోయే వీరిలో అనేకులకు పరదైసులో అద్భుతమైన పునరుద్ధరణా కార్యక్రమాన్ని పర్యవేక్షించే విశేషాధిక్యతలు అనుగ్రహించబడతాయి.—కీర్తన 45:16; యెషయా 32:1, 16-18; 61:5; 65:21-23 పోల్చండి.

10. పునరుత్థానమయ్యే వారిలో ఎవరు “అనీతిమంతులు”?

10 మరైతే అపొస్తలుల కార్యములు 24:15 లో చెప్పబడిన “అనీతిమంతులు” ఎవరైయున్నారు? వీరిలో చరిత్రయంతటిలోను మరణించిన మానవజాతిలోని గొప్ప సమూహమంతా, విశేషంగా “అజ్ఞానకాలంలో” జీవించిన వారంతా ఉంటారు. (అపొస్తలుల కార్యములు 17:30) ఎక్కడ జన్మించారు, ఎప్పుడు నివసించారు అనేదాన్నిబట్టి, యెహోవా చిత్తానికి విధేయత చూపడాన్ని నేర్చుకొనే అవకాశం వీరికి లేకపోయింది. అదియునుగాక, కొందరు రక్షణసువార్తను వినేవుంటారు గానీ ఆ సమయంలోనైనా, లేక సమర్పణ బాప్తిస్మానికి ఎదిగి, ఆయనమాట విని విధేయులయ్యేంత అవకాశం దొరికి వుండకపోవచ్చును. ఈ నిత్యజీవ అవకాశంనుండి ప్రయోజనం పొందాలనుకుంటే, పునరుత్థానంలో అలాంటివారు తమ ఆలోచనా సరళిలో, జీవితంలో మరికొన్ని సవరణలు చేసుకోవలసి ఉంటుంది.

జీవగ్రంథము

11. (ఎ) “జీవగ్రంథము” అంటే ఏమిటి, మరి యీ గ్రంథంలో ఎవరి పేర్లు లిఖించబడ్డాయి? (బి) ఎందుకు వెయ్యేండ్ల కాలంలోనే జీవగ్రంథం తెరువబడుతుంది?

11 యోహాను “జీవగ్రంథము”నుగూర్చి మాట్లాడుతున్నాడు. ఇది యెహోవానుండి జీవంపొందే వరుసలోనున్న వారి చరిత్ర. యేసుయొక్క అభిషక్త సహోదరులు, గొప్పసమూహము, మోషేవంటి నమ్మకస్థులైన మనుష్యుల పేర్లు యీ గ్రంథంలో లిఖించబడివున్నాయి. (నిర్గమకాండము 32:32, 33; దానియేలు 12:1; ప్రకటన 3:5) పునరుత్థానులైన “అనీతిమంతుల”లో ఎవరి పేర్లూ యింకను జీవగ్రంథంలో లిఖించబడలేదు. గనుక అప్పుడు అర్హులైనవారి పేర్లు లిఖించబడేలాగున జీవగ్రంథం వెయ్యేండ్ల కాలంలో తెరువబడుతుంది. జీవగ్రంథం లేక పుస్తకంలో పేర్లు వ్రాయబడని వారు “అగ్నిగుండంలో పడవేయబడుదురు.”—ప్రకటన 20:15; హెబ్రీయులు 3:19 పోల్చండి.

12. తెరువబడిన జీవగ్రంథంలో ఒకవ్యక్తి పేరు వ్రాయబడిందా లేదాయని నిర్ణయించేదేమిటి, మరి యెహోవా నియమిత న్యాయాధిపతి ఎలా మాదిరి చూపాడు?

12 మరి ఆ కాలంలో తెరువబడిన జీవగ్రంథంలో ఒక వ్యక్తిపేరు వ్రాయబడడాన్ని నిర్ణయించేదేమిటి? ముఖ్యవిషయమేమంటే ఆదాము హవ్వల కాలంలో ఉన్నదే: యెహోవాకు విధేయులైయుండడం. అపొస్తలుడైన యోహాను ప్రియమైన తనతోటి క్రైస్తవులకు యిలా వ్రాశాడు: “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును.” (1 యోహాను 2:4-7, 17) విధేయత విషయంలో యెహోవా నియమిత న్యాయాధిపతి మాదిరి చూపాడు: “ఆయన [యేసు], కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను . . . తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను.”—హెబ్రీయులు 5:8-10.

ఇతర గ్రంథాలను విప్పుట

13. పునరుత్థానం పొందబోయేవారు ఎలా తమ విధేయతను కనబరచాలి, వారే సూత్రాలను అనుసరించాలి?

13 పునరుత్థానులైన వీరు వారి విధేయతను ఎలా కనబరుస్తారు? యేసు తానే రెండు గొప్ప ఆజ్ఞలను సూచిస్తూ యిలా అన్నాడు: “ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు (యెహోవా NW) అద్వితీయ ప్రభువు (యెహోవా NW). నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును (యెహోవా NW) ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ. . . . నీవు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలె ననునది రెండవ ఆజ్ఞ.” (మార్కు 12:29-31) దొంగతనం, అబద్ధం, నరహత్య మరియు అవినీతి మున్నగు వాటిని విసర్జించడంలో వారు అనుసరించవలసిన యెహోవా యొక్క స్థిరమైన సూత్రాలు కూడ ఉన్నాయి.—1 తిమోతి 1:8-11; ప్రకటన 21:8.

14. ఏ ఇతర గ్రంథాలు విప్పబడ్డాయి, వాటిలో ఏముంది?

14 అయిననూ, వెయ్యేండ్ల పరిపాలనలో తెరువబడే యితర గ్రంథాలనుగూర్చి యోహాను యింతకు క్రితమే తెలియజేశాడు. (ప్రకటన 20:12) ఇవేమైవుంటాయి? కొన్నిసార్లు, యెహోవా ఆయా పరిస్థితులకు తగిన ప్రత్యేక సలహాలు యిచ్చాడు. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు విధేయులైతే వారికి జీవాన్నిచ్చే అనేక చట్టాలను మోషేకాలంలో ఆయన వారికిచ్చాడు. (ద్వితీయోపదేశకాండము 4:40; 32:45-47) మొదటి శతాబ్దంలో, క్రైస్తవ విధానం క్రింద యెహోవా సూత్రాలను అనుసరించేలాగున విశ్వాసులకు సహాయం చేసేందుకై క్రొత్త ఉపదేశాలు యివ్వబడ్డాయి. (మత్తయి 28:19, 20; యోహాను 13:34; 15:9, 10) ‘ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పుపొందిరి’ అని యోహాను యిప్పుడు చెబుతున్నాడు. గనుక, ఈ గ్రంథాలను విప్పడమంటే వెయ్యేండ్ల కాలంలో మానవజాతికి అవసరమైన యెహోవా అనుగ్రహించే వివరణాత్మక నియమావళి ప్రచురించబడుతుంది. వారి జీవితాలలో ఆ గ్రంథములలోని నియమాలను ఆజ్ఞలను వారు పాటిస్తే, విధేయులైన మానవులు వారి దినములను పొడిగించుకోగలరు, నిత్యజీవాన్ని పొందగలరు.

15. పునరుత్థానం జరిగే కాలంలో ఏ విద్యాబోధనా కార్యక్రమం నిర్వహించబడుతుంది, మరి పునరుత్థానం బహుశ ఎలా జరుగుతుంది?

15 ఎంత విస్తారమైన దైవపరిపాలన విద్యాబోధన అవసరమై ఉంటుందో! యెహోవాసాక్షులు 1993 లో ప్రపంచమంతా వివిధ ప్రాంతాల్లో సగటున 45,00,000 బైబిలు పఠనాలు నిర్వహించేవారు. అయితే పునరుత్థాన సమయంలో బైబిలు, నూతన గ్రంథాలపై ఆధారపడి నిశ్చయంగా లక్షలాది పఠనాలు నిర్వహించబడతాయి. దేవుని ప్రజలంతా బోధకులై శ్రమించి బోధించవలసి ఉంటుంది. పునరుత్థానులైన వారు, వారభివృద్ధి చెందేకొలది, యీ గొప్ప బోధనాకార్యక్రమంలో నిశ్చయంగా పాల్గొంటారు. బహుశ, పునరుత్థానం ఎలా జరుగుతుందంటే, బ్రతికియున్నవారు గతంలో తమ కుటుంబసభ్యులుగా, పరిచయస్థులుగా ఉన్నవారిని పునరుత్థాన సమయంలో ఆహ్వానించి, వారికి బోధించడంలో ఆనందిస్తే, అప్పుడు నేర్చుకున్న వీరు లేపబడేవారిని ఆహ్వానించి వారికి బోధించవచ్చు. (1 కొరింథీయులు 15:19-28, 58 పోల్చండి.) ఈనాడు సత్యాన్ని వ్యాపింపజేసే నలభైలక్షలకంటె అధికంగానున్న యెహోవాసాక్షులు, పునరుత్థాన సమయంలో వారెదురుచూసే ఆధిక్యతలకొరకు మంచి పునాదివేస్తున్నారు.—యెషయా 50:4; 54:13.

16. (ఎ) గ్రంథపు చుట్టలో లేక జీవగ్రంథంలో ఎవరి పేర్లు వ్రాయబడవు? (బి) “జీవ” పునరుత్థానం పొందే వారెవరు?

16 భూలోక పునరుత్థానమును గూర్చి యేసు, ‘మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును వస్తారని’ చెప్పాడు. ఇక్కడ “జీవం” మరియు “తీర్పు” అనేవి పరస్పర విరుద్ధంగా చూపబడ్డాయి, అంటే పునరుత్థానులైనవారు ప్రేరేపితలేఖనాలలో మరియు గ్రంథాలలో ఉన్నవాటి ప్రకారం బోధించబడిన తర్వాత ‘కీడుచేస్తే’ జీవానికి అనర్హులుగా తీర్చబడతారని చూపిస్తున్నాయి. వారి పేర్లు జీవగ్రంథంలో లేక గ్రంథపుచుట్టలో లిఖించబడవు. (యోహాను 5:29) గతంలో నమ్మకంగా ఉండి, వెయ్యేండ్లకాలంలో ఏదోకారణంచేత ఆ నమ్మకత్వాన్ని కోల్పోతే అటువంటివారికి యిదే గతిపడుతుంది. పేర్లు తుడిచివేయ బడగలవు. (నిర్గమకాండము 32:32, 33) అయితే గ్రంథాల్లో లిఖంచబడిన వాటిప్రకారం విధేయతతో అనుసరించేవారి పేర్లు, వ్రాతపూర్వక నివేదికయైన జీవగ్రంథంలో వ్రాయబడివుంటాయి, వారు జీవిస్తూనే ఉంటారు. వారి విషయంలో అది “జీవ” పునరుత్థానమౌతుంది.

మరణం, మృతులలోకముల (హేడీస్‌ NW) అంతం

17. (ఎ) ఏ అద్భుతమైన చర్యను యోహాను వర్ణిస్తున్నాడు? (బి) ఎప్పుడు మృతులలోకం (హేడీస్‌) ఖాళీ అవుతుంది? (సి) ఎప్పుడు ఆదామువల్ల సంక్రమించిన మరణం “అగ్నిగుండంలో పడవేయబడును”?

17 తర్వాత యోహాను నిజంగా అద్భుతకరమైన దాన్నిగూర్చి తెల్పుతున్నాడు: “మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.” (ప్రకటన 20:14, 15) వెయ్యేండ్ల తీర్పుకాలాంతానికి “మరణమును మృతులలోకమును” పూర్తిగా తీసివేయబడతాయి. దీనికి వెయ్యేండ్లు కావాలా? మృతులలోకం, (హేడీస్‌) అంటే సమస్త మానవజాతి మామూలు సమాధి, దేవుని జ్ఞాపకంలోనున్న ఆఖరివ్యక్తి లేపబడిన తర్వాత ఖాళీ అవుతుంది. అయితే మానవులెవరైనా వారసత్వపు పాపముతో మలినమై ఉన్నంత వరకు ఆదాము మూలంగా సంక్రమించిన మరణం యింకా వారికున్నట్లే. భూమిపై పునరుత్థానులైన వారందరూ, అర్మగిద్దోను తప్పించుకున్న గొప్పసమూహము కూడ, రోగం, వృద్ధాప్యం, యితర సంక్రమిత వైకల్యాలను సంపూర్తిగా తొలగించడంలో యేసు విమోచనా విలువను వర్తింపజేసేంతవరకు వారు ఆ గ్రంథాల్లో వ్రాయబడిన వాటికి విధేయులై ఉండాల్సిన అవసరముంది. అప్పుడు, ఆదామువల్ల వచ్చిన మరణం, మృతులలోకముతోపాటు “అగ్నిగుండములో పడవేయబడును.” అవి శాశ్వతంగా లేకుండపోతాయి!

18. (ఎ) రాజుగా యేసు పరిపాలనా విజయాన్ని అపొస్తలుడైన పౌలు ఎలా వర్ణిస్తున్నాడు? (బి) పరిపూర్ణ మానవకుటుంబంతో యేసు ఏమి చేస్తాడు? (సి) వెయ్యేండ్లానంతరం ఏ యితర సంఘటనలు జరుగుతాయి?

18 ఆవిధంగా, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన పత్రికలో వర్ణించబడిన కార్యక్రమము ముగింపుకొస్తుంది: “తన శత్రువులనందరిని తన పాదములక్రింద ఉంచువరకు ఆయన [యేసు] రాజ్యపరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు [ఆదామువల్ల వచ్చింది] మరణం.” తదుపరి ఏమౌతుంది? “సమస్తమును ఆయనకు లోబరచబడినప్పుడు . . . కుమారుడు తనకు సమస్తమును లోబరచిన దేవునికి తానే లోబడును.” మరో విధంగా చెప్పాలంటే, యేసు “తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును.” (1 కొరింథీయులు 15:24-28) అవును యేసు, తన విమోచనబలి విలువద్వారా ఆదాము మరణాన్ని జయించినవాడై, పరిపూర్ణమైన మానవ కుటుంబాన్ని తన తండ్రియైన దేవునికి అప్పగిస్తాడు. సరిగ్గా యీ సమయంలోనే, వెయ్యేండ్లాంతాన, సాతాను విడుదల చేయబడతాడు, జీవగ్రంథంలో ఎవరి పేర్లు శాశ్వతంగా వ్రాయబడతాయోనని నిర్ణయించడానికి అంతిమ పరీక్ష జరుగుతుంది. మీ పేరు వారితోపాటు ఉండేలాగున “పోరాడుడి.”—లూకా 13:24; ప్రకటన 20:5.

[అధస్సూచీలు]

^ పేరా 7 మహాశ్రమలలో యెహోవా తీర్పుమాదిరిగానే, సముద్రంనుండి లేపబడేవారిలో నోవహుకాలంలో భూమ్మీద నాశనం చేయబడిన ఆ దుష్టమానవులుండరు, ఎందుకంటే ఆ నాశనమే వారికి చివరితీర్పు.—మత్తయి 25:41, 46; 2 పేతురు 3:5-7.

[అధ్యయన ప్రశ్నలు]

[298వ పేజీలోని చిత్రం]

పునరుత్థానులైన “అనీతిమంతులు” వెయ్యేండ్ల కాలంలో తెరువబడిన గ్రంథములకు లోబడితే వారి పేర్లుకూడ జీవగ్రంథంలో వ్రాయబడవచ్చు