యోహాను మహిమనొందిన యేసును చూచుట
అధ్యాయం 5
యోహాను మహిమనొందిన యేసును చూచుట
దర్శనము 1—ప్రకటన 1:10–3:22
అంశం: యేసు భూమ్మీదనున్న ఆత్మీయ ఇశ్రాయేలును తనిఖీచేసి మంచి ప్రోత్సాహాన్నివ్వడం
నెరవేర్పు కాలం: ప్రభువు దినములోని యీ భాగం 1914 లో ప్రారంభమై అభిషక్తులలో ఆఖరి వ్యక్తి మరణించి, పునరుత్థానమయ్యే వరకు కొనసాగుతుంది
1. మొదటి దర్శనం ఎలా అందించబడింది, దాని అసలైన వర్తింపు కాలాన్నిగూర్చి యోహాను ఎలా సూచిస్తున్నాడు?
ప్రకటన గ్రంథంలోని మొదటి దర్శనం 1వ అధ్యాయం 10 వచనంతో ప్రారంభమౌతుంది. ఈ దర్శనం, ప్రకటనలోని యితర దర్శనాలవలె, ఏదో అసాధారణమైనదాన్ని యోహాను వింటున్నట్లుగా లేక చూస్తున్నట్లుగా పరిచయం చేయబడింది. (ప్రకటన 1:10, 12; 4:1; 6:1) ఈ మొదటి దర్శనం మొదటి శతాబ్దపు దృక్పథంలో యోహానుకు సమకాలికంగా నున్న ఏడు సంఘాలనుద్దేశించి యివ్వబడింది. అయితే, యోహాను దాని నిజమైన అన్వయింపు కాలాన్ని గూర్చి తెలుపుతూ, యిలా అంటున్నాడు: “ప్రభువు దినమందు ఆత్మ వశుడనైతిని.” (ప్రకటన 1:10ఎ) ఈ దినం ఎప్పుడు? ఈ 20వ శతాబ్దంలో జరుగుతున్న సంఘటనలకు దీనితో సంబంధముందా? ఉంటే, యిది మన జీవితాలపై—మనం తప్పించుకునే విషయంపై సహితం ప్రభావం చూపుతుందని యీ ప్రవచనానికి మనం ఎక్కువ అవధానమివ్వాలి.—1 థెస్సలొనీకయులు 5:20, 21.
ప్రభువు దినమందు
2. ప్రభువు దినము ఎప్పుడు ఆరంభమౌతుంది, ఎప్పుడంతమౌతుంది?
2 ప్రకటన ఏ కాలంలో నెరవేరుతుందని దీనర్థం? అసలు ప్రభువు దినమంటే ఏమిటి? అపొస్తలుడైన పౌలు దీనిని తీర్పుకాలమని, దేవుని వాగ్దానాలు నెరవేరే కాలమని తెల్పుతున్నాడు. (1 కొరింథీయులు 1:8; 2 కొరింథీయులు 1:14; ఫిలిప్పీయులు 1:6, 10; 2:16) ఆ “దినము” రాకడతో యెహోవా దివ్యసంకల్పాలు క్రమేపి, విజయవంతంగా, వాటి ముగింపుకు చేరుకుంటాయి. యేసును పరలోకరాజుగా చేయడంతో ఆ “దినము” ప్రారంభమౌతుంది. యేసు సాతాను లోకానికి తీర్పుతీర్చిన తర్వాత కూడ, ప్రభువు దినము కొనసాగుతుంది, పరదైసు పునరుద్ధరింపబడి, మానవులు పరిపూర్ణ స్థితికి తేబడి, యేసు చివరకు “తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించు,” వరకు అది కొనసాగుతుంది.—1 కొరింథీయులు 15:24-26; ప్రకటన 6:1, 2.
3. (ఎ) ప్రభువు దినము ఎప్పుడు ఆరంభమౌతుందో తెలుసుకోవడానికి దానియేలు ప్రవచనమెలా మనకు సహాయపడుతుంది? (బి) భూమ్మీద జరిగే ఏ సంఘటనలు 1914 లో ప్రభువు దినము ఆరంభమైందని ధృవీకరిస్తున్నాయి?
3 బైబిల్లోని యితర ప్రవచనాల నెరవేర్పు ప్రభువు దినమెప్పుడు ప్రారంభమౌతుందో తెలుసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. ఉదాహరణకు, దావీదు రాజు వంశపాలన నాశనం చేయబడునని; “ఏడు కాలములు” గడిచిన తర్వాత “సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైన అధికారియైయుండి, తానెవనికి దానిననుగ్రహింప నిశ్చయించుకొనునో వానికి అనుగ్రహించునని,” తెలుసుకుంటారని దానియేలు వివరించాడు. (దానియేలు 4:23, 24, 31, 32) బైబిలు సాక్ష్యాధారం ప్రకారం సా.శ.పూ. 607 అక్టోబరులో యూదా రాజ్యం నాశనం కావడంతో ఆ ప్రవచనంలోని అధికభాగం నెరవేరడ మారంభించింది. ఆ 3 1/2 కాలములు 1,260 దినములకు సమానమని ప్రకటన 12:6, 14 తెలుపుతుంది; కాబట్టి, ఏడుకాలములు (పై సంఖ్యకు రెండింతలు) తప్పక 2,520 దినములు కావాలి. “సంవత్సర మొకటింటికి ఒక దినము” చొప్పున మనం లెక్కిస్తే, యీ “ఏడు కాలములు” 2,520 సంవత్సరాలౌతాయి. (యెహెజ్కేలు 4:6) అందువల్ల, క్రీస్తుయేసు 1914వ సంవత్సరం ద్వితీయార్థంలో తన పరలోక పరిపాలనను ప్రారంభించాడు. ఆ సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం రేగడం “వేదనలకు ప్రారంభము,” అవింకా మానవుల్ని బాధిస్తూనే ఉన్నాయి. ఆ 1914వ సంవత్సరంనుండి, యేసు ప్రత్యక్షతా “దినము” ఆ సంవత్సరంలోనే ప్రారంభమైందని రక్తపాతంతో నిండిన లోకంలోని సంఘటనలు రూఢిచేస్తున్నాయి.—మత్తయి 24:3-14. *
4. (ఎ) ప్రకటనలోని మాటలే మొదటి దర్శనం నెరవేరిన కాలాన్నిగూర్చి ఏమి తెల్పుతున్నాయి? (బి) మొదటి దర్శనపు నెరవేర్పు ఎప్పుడు అంతమౌతుంది?
4 కావున, ఈ మొదటి దర్శనం, అందులోని భావం ప్రభువు దినము అంటే 1914వ సంవత్సరం నుండి నెరవేరుతుంది. ప్రకటనలో మరోచోట ప్రభువైన యేసు ప్రముఖమైన పాత్రవహించి, అమలుచేయబోయే దేవుని నీతియుక్తమైన, నిజమైన తీర్పులను గూర్చి వర్ణిస్తున్న వాస్తవాన్నిబట్టి, యీ కాలం రుజువౌతుంది. (ప్రకటన 11:18; 16:15; 17:1; 19:2, 11) మొదటి దర్శన నెరవేర్పు 1914వ సంవత్సరం నుండి నెరవేరుట కారంభిస్తే, మరి అదెప్పుడు ముగుస్తుంది? అందులోని వర్తమానములు తెలియజేస్తున్న ప్రకారం భూమి మీదున్న దేవుని అభిషక్త సంఘమే అక్కడ ఒక సంస్థగా పిలువబడింది. గనుక, ఆ అభిషక్త సంఘంలోని సభ్యులలో ఆఖరివ్యక్తి చనిపోయి పరలోకానికి ఎత్తబడినప్పుడు ఆ మొదటి దర్శనం ముగుస్తుంది. అయినను, ప్రభువు దినము భూలోకంలోని వేరేగొర్రెలను దీవిస్తూ యేసుక్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనాంతం వరకు కొనసాగుతునే వుంటుంది.—యోహాను 10:16; ప్రకటన 20:4, 5.
5. (ఎ) ఒక స్వరం యోహానుతో ఏం చెయ్యమని చెబుతుంది? (బి) “ఏడు సంఘాలు”న్న స్థలమెందుకు ఓ గ్రంథపు చుట్టను వారికి పంపడానికి అనుకూలంగా వుండెను?
5 ఈ మొదటి దర్శనంలో, యోహాను తాను చూచేదానికన్నా ముందు విన్నదాన్నిగూర్చి యిలా అన్నాడు: “బూర ధ్వనివంటి గొప్ప స్వరము—నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియ, లవొదికయ అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని.” (ప్రకటన 1:10బి, 11) బూరవంటి అధికార, ఆజ్ఞాపూర్వకమైన స్వరం యోహానుతో “ఏడు సంఘములకు” వ్రాయాలని చెబుతుంది. ఆయన వర్తమానముల పరంపరను అందుకొని, తాను వినిన, చూచిన వాటిని గూర్చి ప్రచురించవలసి యుండెను. గమనించండి, ఇచ్చట తెల్పబడిన సంఘాలు యోహాను కాలంలో ఉన్నవే. అవన్నీ, ఆసియా మైనరులోనే, పత్మాసు సమీపానగల సముద్రం ఆవలివైపుననే ఉన్నాయి. ఆ ప్రాంతంలో రోమీయులు నిర్మించిన శ్రేష్ఠమైన రోడ్లద్వారా ఒక్కోదానికి సులభంగా వెళ్లవచ్చు. వాటిని అందించేవ్యక్తి ఒక సంఘం నుండి మరోదానికి వెళ్లడానికి కష్టపడాల్సిన పనేలేదు. ఈ ఏడు సంఘాలు ప్రస్తుత కాలమందలి యెహోవాసాక్షుల సర్క్యూట్‌లో ఓ భాగాన్ని సూచిస్తాయి.
6. (ఎ) “ఉన్నవాటిని,” అంటే అర్థమేమిటి? (బి) ఈనాడు అభిషక్త క్రైస్తవసంఘంలో ఉన్న పరిస్థితులు ఆనాడు యోహాను కాలంలోవలెనే ఉన్నాయనుటకు మనమెందుకు నిశ్చయత కల్గివుండగలము?
6 ప్రకటనలోని అనేక ప్రవచనాలు యోహాను కాలం తర్వాతనే నెరవేరవలసి ఉన్నాయి. అవి “వీటి వెంట కలుగబోవు వాటిని” తెలియజేశాయి. అయితే, ఏడు సంఘాలకివ్వబడిన సలహా “ఉన్నవాటిని,” అంటే ఆ కాలంలో ఏడు సంఘాల్లో వాస్తవంగా ఉన్న పరిస్థితిని గూర్చిందే. ఆ వర్తమానములు, ఆ ఏడు సంఘాల్లో ఉన్న నమ్మకమైన నియమిత పెద్దలకును, ఆ కాలంలో యితర సంఘాల్లోని అభిషక్త క్రైస్తవులకును ఎంతో విలువైన సహాయకములుగా ఉండేవి. * ఆ దర్శనపు ముఖ్యవర్తింపు ప్రభువు దినము కొరకే గనుక యేసు చెప్పేవి మన కాలంలో అభిషక్త క్రైస్తవసంఘంలో అటువంటి పరిస్థితులుంటాయని తెల్పుతుంది.—ప్రకటన 1:10, 19.
7. ఈ మొదటి దర్శనంలో యోహాను ఏం చూస్తాడు, మరి అది మనకెందు కీనాడు ప్రాముఖ్యమై, పులకరింప చేసేదైవున్నది?
7 ఈ మొదటి దర్శనంలో యోహాను యేసుక్రీస్తును పరలోక మహిమతో చూశాడు. పరలోకంచే ఆజ్ఞాపించబడిన యీ ప్రభువు గొప్ప దినమును గూర్చి తెల్పేదానికన్నా ప్రవచనాల గ్రంథానికి మించినదేముంది? మరి ఆ యుక్తకాలంలో జీవిస్తున్న మనకు ఆయనిచ్చిన ప్రతీ ఆజ్ఞను లక్ష్యపెట్టుటకన్నా మనకు ముఖ్యమైన దేముంది? అంతేగాక, సాతాను తెచ్చిన సమస్త శోధనను, హింసల్ని సహించి, 1,900 సంవత్సరాల క్రితం ఆయన “మడిమె” కరచినపుడు మరణబాధ ననుభవించి, యిప్పుడు పరలోకమందు జీవిస్తున్న మెస్సీయ సంతానం, దేవుని గొప్ప సంకల్పాన్ని విజయవంతమైన ముగింపుకు తెస్తుందని యెహోవా సర్వాధిపత్యానికి మద్దతునిచ్చేవారు అభయం పొందడమెంత పులకరింపుగా ఉందోగదా!.—ఆదికాండము 3:15.
8. యేసు దేనికి కార్యోన్ముఖుడై ఉన్నాడు?
ప్రకటన 7:4, 9; అపొస్తలుల కార్యములు 17:31.
8 యేసు సింహాసనాసీనుడైన రాజుగా యిప్పుడు కార్యోన్ముఖుడగుట స్పష్టమే. ఈ పాత దుష్టవిధానం మీదను, దాని పాపిష్టి దేవుడైన సాతానుమీదికిని యెహోవా అంతిమ తీర్పులను విధించుటకు ఆయన యెహోవా తరపున ప్రధానాధిపతిగా నియమించబడ్డాడు. తన అభిషక్త సంఘాన్ని, వారి సహవాసులైన గొప్పసమూహాన్ని, యీలోకాన్ని కూడా తీర్పుతీర్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు.—9. (ఎ) సువర్ణ దీపస్తంభాల మధ్యనున్న మహిమనొందిన యేసుక్రీస్తును యోహాను ఎలా వర్ణిస్తున్నాడు? (బి) దేవాలయాన్ని పోలిన సన్నివేశము, యేసు ధరించిన దుస్తులు ఏమి సూచిస్తున్నాయి? (సి) ఆయన బంగారు దట్టీ దేన్ని సూచిస్తుంది?
9 యోహాను గొప్పస్వరం వస్తున్న దిశకు తిరిగి, యిదిగో యిది చూస్తాడు: “ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని. తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను . . . చూచితిని.” (ప్రకటన 1:12) తర్వాత, యోహాను యీ ఏడు దీపస్తంభాలు దేనిని సూచిస్తాయో తెలుసుకుంటాడు. అయితే దీపస్తంభాల మధ్యనున్న వ్యక్తి ఆయన దృష్టిలోపడతాడు. అక్కడ “ఆ దీప స్తంభములమధ్యను మనుష్యకుమారుని పోలినయొకనిని . . . ఆయన తన పాదములమట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారుదట్టి కట్టుకొనియుండెను.” (ప్రకటన 1:13) ఇక్కడ “మనుష్యకుమారుడు”, యేసు తానే ఒక ప్రకాశమానమైన, తేజోవంతమైన వ్యక్తిగా ఆశ్చర్యచకితుడై చూస్తున్న యోహానుకు తన్నుతాను కనబరచుకుంటున్నాడు. ఆయన ఆ వెలుగుతున్న సువర్ణ దీపస్తంభాలమధ్య దేదీప్యమానంగా కనబడుతున్నాడు. దేవాలయాన్ని పోలిన యీ దృశ్యం, యోహానుకు యేసు న్యాయాధికారాలతో, యెహోవా యొక్క గొప్ప ప్రధాన యాజకుని స్థానంలో ప్రత్యక్షమైన అనుభూతిని కల్గిస్తుంది. (హెబ్రీయులు 4:14; 7:21-25) ఆయన పొడవాటి, ఆకర్షణీయమైన వస్త్రం తన యాజక స్థానానికి తగినట్లున్నది. పూర్వపు యూదా ప్రధాన యాజకుల వలె, ఆయన ఓ దట్టీని—తన హృదయాన్ని కప్పివేసేలా రొమ్ము పైభాగాన ఒక బంగారు దట్టీని ధరించుకున్నాడు. ఇది, తాను యెహోవానుండి పొందిన దైవాజ్ఞను హృదయపూర్వకంగా శిరసావహిస్తాడని సూచిస్తుంది.—నిర్గమకాండము 28:8, 30; హెబ్రీయులు 8:1, 2.
10. (ఎ) యేసుకున్న హిమము వంటి ధవళవర్ణ వెండ్రుకలు, అగ్నిజ్వాలవంటి నేత్రాలు దేన్ని సూచిస్తున్నాయి? (బి) అపరంజివంటి యేసు పాదాల ప్రాముఖ్యతేమిటి?
10 యోహాను వర్ణన యింకను కొనసాగుతోంది: “ఆయన తలయు తలవెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను, ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను.” (ప్రకటన 1:14) హిమమంత ధవళంగానున్న ఆయన వెంట్రుకలు, తన దీర్ఘాయుష్షునుబట్టి ఆయనకున్న జ్ఞానాన్ని సూచిస్తున్నాయి. (సామెతలు 16:31 పోల్చండి.) మరి అగ్నిజ్వాలవంటి ఆయన నేత్రాలు, తాను గమనిస్తూ, పరీక్షిస్తూ, లేదా ఉగ్రతను వ్యక్తం చేస్తున్నప్పుడు ఆయన తీక్షణంగా, చురుగ్గా ఉన్నాడని సూచిస్తున్నాయి. యేసు పాదాలు సహితం యోహాను దృష్టినాకర్షించాయి: “ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై యుండెను; ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను.” (ప్రకటన 1:15) దర్శనంలో, యేసు పాదాలు అపరంజివలె, ధగధగ మెరుస్తుండెను—యెహోవా దేవుని సముఖాన శ్రేష్ఠమైన స్థానంకల్గి, ఆసక్తితో నడిచే వ్యక్తికి తగినట్లున్నవి. అంతేగాక, బైబిల్లో దేవునికి సంబంధించినవి స్వర్ణంతోను, మానవునికి సంబంధించినవి అపరంజితోను పోల్చబడ్డాయి. * కావున అపరంజివలె ధగధగ మెరుస్తున్న యేసు పాదాలు ఆయన భూమ్మీద సువార్త ప్రకటిస్తుండగా ఆయన పాదాలెంత “సుందరముగా” ఉండెనో మనకు గుర్తుచేస్తున్నాయి.—యెషయా 52:7; రోమీయులు 10:15.
11. (ఎ) మెరుస్తున్న యేసు పాదాలు మనకు దేన్ని గుర్తు చేస్తాయి? (బి) యేసు స్వరం “విస్తార జలప్రవాహముల” ధ్వనివలె ఉండెననే వాస్తవం ఏం తెల్పుతుంది?
11 నిజానికి, పరిపూర్ణ మానవునిగా, యేసు మానవులకు, దేవదూతలకు స్పష్టంగా కనబడే వెలుగును కల్గియుండెను. (యోహాను 1:14) ఆయన మహిమగల పాదాలు, తాను ప్రధాన యాజకుడైవున్న యెహోవా సంస్థలోని పరిశుద్ధ స్థలంలో నడుస్తున్నాడని జ్ఞాపకం చేస్తున్నాయి. (నిర్గమకాండము 3:5 పోల్చండి.) ఇంకా, ఆయన కంఠస్వరం ఓ పెద్ద ఉరకలువేస్తున్న జలపాతంలా ప్రతిధ్వనిస్తుంది. “నీతిననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చే” వ్యక్తిగా, అధికారికంగా దేవుని వాక్యమని పిలువబడే యీయనకిది తగియున్నందున యిది ఆకర్షణీయంగా, ఆశ్చర్యకరంగా ఉంది.—అపొస్తలుల కార్యములు 17:31; యోహాను 1:1.
12. “రెండంచులుగల, వాడియైన ఖడ్గము” యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
12“ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొని యుండెను; ఆయన నోటినుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను; ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను. నేనాయనను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదములయొద్ద పడితిని.” (ప్రకటన 1:16, 17ఎ) యేసు అటుతర్వాత తానే స్వయంగా, ఆ ఏడు నక్షత్రాల భావాన్ని తెలియజేస్తాడు. అయితే ఆయన నోటనుండి ఏమి బయలుదేరుతుందో గమనించండి: “రెండంచులుగల వాడియైన ఖడ్గము.” ఇదెంత యుక్తమైన వర్ణనోగదా! ఎందుకంటే, యెహోవా తన శత్రువులకు అంతిమ తీర్పుతీర్చడానికి యేసునే నియమించుకున్నాడు. ఆయన నోటనుండి వెలువడే వాక్కులు దుర్మార్గులను నాశనం చేస్తాయి.—ప్రకటన 19:13, 15.
13. (ఎ) యేసు దేదీప్యమానంగా, వెలుగుతున్న ముఖం దేనిని మనకు జ్ఞాపకం చేస్తుంది? (బి) యేసును గూర్చి యోహానిచ్చే వర్ణననుండి మనమే సారాంశాన్ని పొందుతాము?
13 యేసు ముఖం ధవళవర్ణంతో ప్రకాశించడం యెహోవా సీనాయి పర్వతం మీద మోషేతో మాట్లాడినప్పుడు ఆయన ముఖం ప్రకాశించిన విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. (నిర్గమకాండము 34:29, 30) యేసు 1,900 సంవత్సరాల క్రితం తన ముగ్గురు అపొస్తలుల ఎదుట రూపాంతరం పొందినప్పుడు, “ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను.” (మత్తయి 17:2) ఇప్పుడు, ప్రభువు దినములో యేసు దర్శన రూపంలోను ఆయన ముఖం అలాగే యెహోవా సముఖమందలి వ్యక్తినిపోలి కాంతులు విరజిమ్ముతూ వుంది. (2 కొరింథీయులు 3:18) నిజానికి, యోహాను దర్శనం అందించిన సారాంశమేమంటే, మహిమ యొక్క తేజస్సు. హిమము వంటి ధవళవర్ణ వెండ్రుకల నుండి, అగ్నిజ్వాలవంటి నేత్రాలు, ప్రకాశిస్తున్న ముఖం, మెరిసే పాదాల వరకు “సమీపింపరాని తేజస్సులో” నున్న వ్యక్తి యొక్క అపూర్వ దర్శనమే. (1 తిమో. 6:16) ఈ కనులవిందులో వాస్తవికత ప్రస్ఫుటమై యున్నది! మరి అత్యంత విస్మయమొందిన యోహాను ప్రతిస్పందన ఏమిటి? ఆ అపొస్తలుడే యిలా చెబుతున్నాడు: “నేనాయనను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదములయొద్ద పడితిని.”—ప్రకటన 1:17.
14. మహిమనొందిన యేసును గూర్చి యోహాను చూచిన దర్శనాన్ని చదువు నప్పుడు అది మనపై ఎటువంటి ప్రభావం చూపుతుంది?
14 ఈనాడు, యోహాను దర్శనాన్ని గూర్చిన చక్కని, వివరణాత్మకమైన వర్ణన దేవుని ప్రజలను హృదయపూర్వక అభినందనతో నింపుతుంది. ఇప్పటికే మనం ప్రభువు దినములో 70 సంవత్సరాలు దాటిపోయాం, ఈ కాలంలో ఆ దర్శనం నెరవేరుతూనే వస్తూంది. యేసు రాజ్యపరిపాలన మనకు సజీవమైన, ప్రస్తుత వాస్తవమేగాని భవిష్యత్ నిరీక్షణేమీకాదు. గనుక, ఆ రాజ్యపౌరులుగా మనం, యీ మొదటి దర్శనంలో యోహాను వర్ణించే విషయాన్ని గూర్చి యింకా ఆశ్చర్యంతో ఎదురుచూస్తూ, మహిమ నొందిన యేసుక్రీస్తు మాటలను విధేయతతో వినడం భావ్యము.
[అధస్సూచీలు]
^ పేరా 3 ఇంకా వివరాల కొరకు, యీ పుస్తక ప్రచారకులు అందించిన “లెట్ యువర్ కింగ్‌డమ్ కమ్,” అనే పుస్తకంలో 128-39, 186-9, పేజీలు చూడండి.
^ పేరా 6 మొదటి శతాబ్దంలో ఒక అపొస్తలుడు నుండి సంఘానికి ఓ పత్రికవస్తే ఆ సలహానుండి అందరు ప్రయోజనం పొందేలా దాన్ని యితర సంఘాలన్నింటికి పంచిపెట్టే అలవాటుండేది.—కొలొస్సయులు 4:16 పోల్చండి.
^ పేరా 10 సొలొమోను నిర్మించిన దేవాలయం అంతర్భాగ అలంకరణంతా బంగారంతో అలంకరించబడింది లేక మెరుగులు దిద్దబడింది, ఆవరణాలంకరణ మాత్రం అపరంజితో చేయబడింది.—1 రాజులు 6:19-23, 28-35; 7:15, 16, 27, 30, 38-50; 8:64.
[అధ్యయన ప్రశ్నలు]
[23వ పేజీలోని చిత్రం]
పురావస్తుశాస్త్ర శిథిలాలు, ఆ ఏడు సంఘాలున్న పట్టణాలున్నట్లు తెలిపే బైబిలు చరిత్రను రుజువు చేస్తున్నాయి. ఈ 20వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలను పురికొల్పే యేసు ప్రోత్సాహకరమైన సమాచారాన్ని మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఇక్కడే పొందారు
పెర్గము
స్ముర్న
తుయతైర
సార్దీస్
ఎఫెసు
ఫిలదెల్ఫియ
లవొదికయ