కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘వధింపబడినవారి ఆత్మలు’ దీవించబడినవి

‘వధింపబడినవారి ఆత్మలు’ దీవించబడినవి

అధ్యాయం 17

‘వధింపబడినవారి ఆత్మలు’ దీవించబడినవి

1. మనమే కాలంలో జీవిస్తున్నాం, మరి దీనికి రుజువేమిటి?

దేవుని రాజ్యం ఏలుతోంది! తెల్లని గుఱ్ఱపురౌతు తన విజయాన్ని ముగించనై యున్నాడు! ఎరుపు, నలుపు, పాండుర వర్ణంగల గుఱ్ఱాలు భూమియంతట స్వారీ చేస్తున్నాయి! నిస్సందేహంగా, తన రాజ్య ప్రత్యక్షతను గూర్చి యేసు తానే యిచ్చిన ప్రవచనాలు నెరవేరుతున్నాయి. (మత్తయి, 24, 25 అధ్యాయాలు; మార్కు, 13వ అధ్యాయం; లూకా 21వ అధ్యాయం) అవును, మనమీ విధానాంతపు అంత్యదినాల్లో జీవిస్తున్నాం. (2 తిమోతి 3:1-5) ఆ కారణంచేత గొఱ్ఱెపిల్లయైన యేసుక్రీస్తు ఆ గ్రంథంలోని ఐదవ ముద్రను విప్పుతుండగా మనం మంచి అవధానాన్ని నిల్పుదాం. మనమింకా బయల్పడబోయే దేనిలో భాగం వహిస్తాము?

2. (ఎ) ఐదవ ముద్ర విప్పబడినప్పుడు యోహాను ఏం చూశాడు? (బి) పరలోకంలో సాదృశ్యమైన బలిపీఠాన్ని చూడడానికి మనమెందుకు ఆశ్చర్యపడనవసరంలేదు?

2 యోహాను ఒక ఉత్తేజకరమైన దృశ్యాన్ని వర్ణిస్తున్నాడు: “ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని.” (ప్రకటన 6:9) అదేమిటి? పరలోకంలోనే ఒక బలిపీఠమా? అవును! యోహాను ప్రప్రథమంగా బలిపీఠాన్నిగూర్చి తెల్పుతున్నాడు. అయినా, ఇదివరకే ఆయన యెహోవా తన సింహాసనం మీద కూర్చోవడం, చుట్టూన్న కెరూబులు, గాజునుపోలిన సముద్రం, దీపములు, మరియు 24 పెద్దలు ధూపము వేయుట—ఇవన్నీ ఇశ్రాయేలీయులలో ఉన్న యెహోవా మందిరాన్ని, భూలోక గుడారాన్ని పోలివున్నట్లు వర్ణించాడు. (నిర్గమకాండము 25:17, 18; 40:24-27, 30-32; 1 దినవృత్తాంతములు 23:4) గనుక, పరలోకంలో కూడ ఒక సాదృశ్యమైన బలిపీఠాన్ని చూడడం మనల్ని ఆశ్చర్యపర్చవలెనా?—నిర్గమకాండము 40:29.

3. (ఎ) ప్రాచీన యూదుల గుడారంలో ఆత్మలెలా “బలిపీఠము అడుగున” అర్పించబడ్డాయి? (బి) యోహాను ఎందుకు పరలోకంలో సాదృశ్యమైన బలిపీఠం క్రింద వధింపబడిన సాక్షుల ఆత్మలను చూశాడు?

3 ఈ బలిపీఠం క్రింద “దేవుని వాక్యము నిమిత్తమును, తాము యిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలు”న్నాయి. అంటే దీనర్థమేమిటి? అన్యులైన గ్రీకులు నమ్మినట్లు ఇవి శరీరాన్ని విడిచిన ఆత్మలైవుండవు. (ఆదికాండము 2:7; యెహెజ్కేలు 18:4) ఆత్మ లేక ప్రాణం అనేది రక్తంద్వారా సూచించ బడుతుందని, ప్రాచీన యూదా మందిరాలలో యాజకులు జంతువులను బలియిచ్చినప్పుడు, వారు “బలిపీఠము చుట్టు దాని రక్తమును ప్రోక్షించే”వారు, లేదా “దహన బలిపీఠము అడుగున” దాన్ని పోసేవారని యోహానుకు తెలుసు. (లేవీయకాండము 3:2, 8, 13; 4:7; 17:6, 11, 12) కాబట్టి, జంతు ఆత్మ బలిపీఠంతో ముడిపెట్టబడివుంది. గానీ, ప్రత్యేకంగా యిటువంటి దేవుని సేవకుల ఆత్మలే లేక రక్తమే ఎందుకు పరలోకమందున్న సాదృశ్యమగు బలిపీఠం క్రింద కనబడుతున్నాయి? ఎందుకంటే వారి మరణం బలియర్పణతో కూడినదిగా పరిగణింప బడుతోంది.

4. ఆత్మాభిషేకం నొందిన క్రైస్తవుల మరణం ఎలా త్యాగపూరితమైనది?

4 నిజానికి, దేవుని ఆత్మీయ కుమారులుగా జన్మించిన వారంతా త్యాగపూరిత మరణమనుభవిస్తారు. యెహోవా రాజ్యంలో వారు నిర్వహించనైయున్న పాత్రదృష్ట్యా వారు భూలోకంలో నిత్యజీవ నిరీక్షణను త్యజించి, విడిచి పెట్టాలనే దేవుని చిత్తం. ఈ విధంగా, వారు యెహోవా సర్వాధిపత్యం నిమిత్తం త్యాగపూరిత మరణమనుభవిస్తారు. (ఫిలిప్పీయులు 3:8-11; అలాగే 2:17ను పోల్చండి.) యోహాను బలిపీఠం క్రింద చూచిన వారి విషయంలో యిది వాస్తవంగా పరమసత్యం. వారి కాలంలో యెహోవా వాక్యానికి, సర్వాధిపత్యానికి హత్తుకొనియుండుటలో చూపిన ఆసక్తితోకూడిన పరిచర్య నిమిత్తం హతసాక్షులైనవారు యీ ఆత్మీయాభిషక్తులే. వారు “దేవుని వాక్యము నిమిత్తమును తాము యిచ్చిన సాక్ష్యము [మార్టీరియన్‌] నిమిత్తమును వధింపబడిన ఆత్మలు.”

5. నమ్మకమైనవారి ఆత్మలు, మరణించిననూ, ప్రతిదండన కొరకు ఎలా బిగ్గరగా మొఱ్ఱపెడుతున్నవి?

5 ఆ దృశ్యమింకా యిలా కొనసాగుతూనే వుంది: “వారు—నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి.” (ప్రకటన 6:10) మృతులు ఏమియు ఎరుగరని బైబిలు చెబుతున్నందున వారి ఆత్మలు లేక రక్తమెలా ప్రతిదండనకొరకు కేకలువేస్తాయి? (ప్రసంగి 9:5) సరే, నీతిమంతుడైన హేబెలును కయీను చంపిన తర్వాత అతని రక్తం కేకలు వేయలేదా? (ఆదికాండము 4:10, 11; హెబ్రీయులు 12:24) అంటే హేబెలు రక్తం అక్షరార్థంగా మాటలు పలికిందనికాదు. హేబెలు నిర్దోషిగా హతుడయ్యాడు, గనుక అతన్ని హత్యచేసిన వ్యక్తిని శిక్షించాలని న్యాయం కోరింది. అలాగే, ఆ క్రైస్తవులు హతసాక్షులు, మరి వారికి న్యాయం జరిగితీరాలి. (లూకా 18:7, 8) ప్రతిదండన కొరకు వేసేకేకలు బిగ్గరగా ఉంటాయి, ఎందుకంటే అలా అనేకులు హతసాక్షులయ్యారు.—యిర్మీయా 15:15, 16 పోల్చండి.

6. సా.శ.పూ. 607 లో ఏ నిరపరాధుల రక్తానికి ప్రతిదండన చేయబడింది?

6 ఆ పరిస్థితిని సా.శ.పూ 716 లో రాజైన మనష్షే సింహాసనాసీనుడైనప్పుడు భ్రష్టమైన యూదా సామ్రాజ్య పరిస్థితితో పోల్చవచ్చు. బహుశ ప్రవక్తయైన యెషయాను ‘రంపంతో కోయించి’ అనేకమంది నిరపరాధుల రక్తాన్ని అతడు చిందించాడు. (హెబ్రీయులు 11:37; 2 రాజులు 21:16) మనష్షే ఆ పిదప పశ్చాత్తాపపడి, మారిననూ, ఆ రక్తాపరాధం పోలేదు. సా.శ. 607 లో బబులోనీయులు యూదా సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసినప్పుడు “మనష్షే చేసిన క్రియలన్నిటిని బట్టియు, అతడు నిరపరాధులను హతము చేయుటను బట్టియు, యూదావారు యెహోవా సముఖమునుండి పారదోలబడునట్లుగా ఆయన ఆజ్ఞవలన ఇది వారిమీదికి వచ్చెను. అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయెను.”—2 రాజులు 24:3, 4.

7. ‘పరిశుద్ధుల రక్తమును చిందించుటలో’ ప్రథమ నిందితుడెవరు?

7 బైబిలు కాలాల్లో మాదిరే, యీనాడును దేవుని ప్రజలను చంపినవారు చాలాకాలం క్రితం మరణించి వుండవచ్చు. అయితే వారి హత్యకు కారణమైన సంస్థ యిప్పటికీ చాలా చురుగ్గా పనిచేస్తుంది, రక్తాపరాధియై ఉంది. అదే సాతాను భూలోకసంస్థ, అతని భూలోక సంతానం. అందులో ముఖ్యమైనదే ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన మహాబబులోను. * అది “పరిశుద్ధుల రక్తముచేతను, యేసుయొక్క హతసాక్షుల రక్తముచేతను మత్తిల్లి”యున్నట్లు వర్ణించబడింది. అవును, “ప్రవక్తల యొక్కయు, పరిశుద్ధుల యొక్కయు, భూమిమీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెను.” (ప్రకటన 17:5, 6; 18:24; ఎఫెసీయులు 4:11; 1 కొరింథీయులు 12:28) ఎంతటి రక్తాపరాధ భారమోగదా! మహాబబులోను ఉన్నంతకాలం దానికి బలైనవారి రక్తం న్యాయంకొరకు ఘోషిస్తూనే వుంటుంది.—ప్రకటన 19:1, 2.

8. (ఎ) యోహాను జీవించిన కాలంలో ఎవరెవరు హతసాక్షులయ్యారు? (బి) రోమాసామ్రాజ్య చక్రవర్తులు ఎటువంటి హింసను పురికొల్పారు?

8 మొదటి శతాబ్దంలోనే, క్రూరుడైన సాతాను అతని భూలోక సంతానం వృద్ధిచెందుతున్న అభిషక్త సంఘంపై యుద్ధభేరి మ్రోగించి హతమార్చిన దాన్ని యోహాను స్వయంగా చూశాడు. మన ప్రభువు మ్రానున వ్రేలాడదీయబడడం మొదలుకొని స్తెఫను, తన స్వంత తమ్ముడైన యాకోబు, పేతురు మరియు పౌలు యితర సన్నిహిత సహవాసులును హతులు కావడం యోహాను చూశాడు. (యోహాను 19:26, 27; 21:15, 18, 19; అపొస్తలుల కార్యములు 7:59, 60; 8:2; 12:2; 2 తిమోతి 1:1; 4:6, 7) సా.శ. 64 లో రోమా చక్రవర్తి తాను నేరస్థుడనే వదంతి వ్యాపించుట విని దాన్ని త్రిప్పికొట్టడానికి క్రైస్తవులు పట్టణాన్ని తగులబెట్టారనే నిందమోపి వారిని బలిపశువులుగా చేశాడు. చరిత్రకారుడైన టాసిటస్‌ యిలా వివరిస్తున్నాడు: “కొందరు [క్రైస్తవులు] నీచమైన పద్ధతుల్లో చంపబడ్డారు, కొందరికి జంతుచర్మాలు తొడిగినందున కుక్కలచేత చీల్చబడ్డారు, కొందరు [వ్రేలాడదీయబడ్డారు], * కొందరు రాత్రివేళ దివిటీలుగా వెలగడానికి కాల్చబడ్డారు.” చక్రవర్తి డొమిటియన్‌ వల్ల కల్గిన హింస మూలంగానే (సా.శ. 81-96) యోహాను పత్మాసు ద్వీపానికి ఖైదీగా పంపబడడం జరిగింది. యేసు తెల్పినట్లు: “లోకులు నన్ను హింసించిన యెడల మిమ్మునుకూడ హింసింతురు.”—యోహాను 15:20; మత్తయి 10:22.

9. (ఎ) సా.శ. నాల్గవ శతాబ్దానికల్లా అత్యంత మోసకరమైన దేనికి సాతాను రూపకల్పనచేశాడు, మరి అది దేనిలో ఒక ముఖ్యభాగమై వుంది? (బి) మొదటి, రెండు ప్రపంచ యుద్ధాల్లో క్రైస్తవమత సామ్రాజ్య పాలకులలో కొందరు యెహోవా సాక్షులనెలా బాధించారు?

9 సామాన్య శకం నాల్గవ శతాబ్దానికల్లా, ఆదిసర్పమగు సాతాను, తన అత్యంత మోసకరమైనదాన్ని అంటే, “క్రైస్తవత్వం” అనే ముసుగు క్రింద దాగియున్న బబులోను మతవిధానాన్ని—మతభ్రష్టమైన క్రైస్తవమత సామ్రాజ్యాన్ని ప్రవేశపెట్టాడు. అది సర్పసంతానంలో ముఖ్యభాగమై, పరస్పర విరుద్ధతగల పలుశాఖలుగా చీలిపోయింది. భ్రష్టత్వానికి దిగజారిన ప్రాచీన యూదావలె, క్రైస్తవమత సామ్రాజ్యం మొదటి, రెండు ప్రపంచ యుద్ధాల్లో పాల్గొని గొప్ప రక్తాపరాధియైంది. క్రైస్తవమత సామ్రాజ్యంలోని కొందరు రాజకీయ పరిపాలకులు యీ యుద్ధాల నెపంతో అభిషక్త క్రైస్తవులను హతమార్చారు. హిట్లర్‌ యెహోవా సాక్షులను హింసించిన విషయాన్ని నివేదిస్తూ, కిర్చన్‌కాంప్‌ ఇన్‌ డచ్‌ల్యాండ్‌ (జర్మనీలో చర్చీల కొట్లాట) అనే పుస్తకంలో ఫ్రెడరిక్‌ జిఫెల్స్‌ పునఃసమీక్షలో యీలా అంటున్నాడు: “[సాక్షుల్లో] మూడు వంతులు ఉరితీయబడడంవల్ల గానీ, దాసులుగా సేవచేయడం వలనగానీ, యితర హింసాయుత క్రియల వలనగానీ, ఆకలికి అలమటించడం వలనగాని, రోగం వలనగానీ చంపబడ్డారు. ఈ వేదన సాటిలేనిది. జాతీయ సమసమాజ సిద్ధాంతంతో ఏకీభవించనందున, రాజీపడని విశ్వాసం కల్గియున్నందువల్ల వచ్చిన హింసే యిది.” నిజంగా, దాని మతాధికార వ్యవస్థతో సహా క్రైస్తవమత సామ్రాజ్యాన్ని గూర్చి యిలా చెప్పగలం: “నిర్దోషులైన దీనుల ప్రాణరక్తము నీ బట్ట చెంగులమీద కనబడుచున్నది.”— యిర్మీయా 2:34. *

10. పలుదేశాలలో గొప్ప సమూహానికి చెందిన యువకులు ఎటువంటి హింసల నెదుర్కొన్నారు?

10 అనేకదేశాల్లో 1935 నుండి గొప్పసమూహనికి చెందిన నమ్మకస్థులైన యువకులు హింస తీవ్రతకు బలయ్యారు. (ప్రకటన 7:9) ఐరోపాలో 2వ ప్రపంచ యుద్ధం ముగిసేటప్పుడు కూడ యెహోవాసాక్షుల్లో యువకులు ఉరితీయబడి చంపబడ్డారు. వారుచేసిన నేరం? “యుద్ధం చేయ నేర్చుకొనుటకు” తిరస్కరించడమే. (యెషయా 2:4) ఇటీవలెనే, తూర్పుదేశాల్లోను ఆఫ్రికాలోను అదే కారణం నిమిత్తం యువకులను చనిపోయేవరకు కొట్టారు, లేక కాల్పుల దళం వారిని కాల్చివేసింది, ఈ యౌవన హతసాక్షులు, యేసు అభిషక్త సహోదరులకు మద్దతునిచ్చిన యోగ్యులు, వాగ్దానం చేయబడిన క్రొత్తభూమిలో నిశ్చయంగా పునరుత్థానం పొందుతారు.— 2 పేతురు 3:13; మరియు కీర్తన 110:3; మత్తయి 25:34-40; లూకా 20:37, 38 పోల్చండి.

తెల్లని వస్త్రము

11. హతసాక్షులైన అభిషక్త క్రైస్తవులు ఏ భావంలో “తెల్లని వస్త్రము” ధరించుకుంటారు?

11 ప్రాచీన కాలాల్లోని యథార్థపరుల విశ్వాసాన్ని గూర్చి వ్రాసిన తర్వాత అపొస్తలుడైన పౌలు యిలా అంటున్నాడు: “వీరందరు తమ విశ్వాసముద్వారా సాక్ష్యము పొందిన వారైనను, మనము లేకుండ సంపూర్ణులు కాకుండు నిమిత్తము, దేవుడు మనకొరకు మరి శ్రేష్ఠమైన దానిని ముందుగా సిద్ధపరచెను గనుక వీరు వాగ్దానఫలము అనుభవింప లేదు.” (హెబ్రీయులు 11:39, 40) పౌలు యితర అభిషక్త క్రైస్తవులు నిరీక్షించే ఆ “శ్రేష్ఠమైనది” ఏమిటి? యోహాను యీ దర్శనంలో దాన్ని చూస్తున్నాడు: “తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియ్యబడెను; మరియు—వారివలెనే చంపబడబోవువారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను.” (ప్రకటన 6:11) వారి “తెల్లని వస్త్రము” అనేది వారు అమర్త్యతగల ఆత్మీయ ప్రాణులుగా పునరుత్థానులౌతారనే దానికి సంబంధం కల్గివుంది. వారు బలిపీఠం క్రింద వధింపబడిన ఆత్మలుగా యికవుండరు, గానీ దేవుని పరలోక సింహాసనం ఎదుట ఆరాధించే 24 పెద్దల్లో భాగం కావడానికి లేపబడుతున్నారు. వారు రాజ్యాధిక్యతలు పొందారనే దానికి సూచనగా అక్కడ వారికి స్వయంగా సింహాసనాలు యివ్వబడ్డాయి. మరియు వారు “తెల్లని వస్త్రములు ధరించుకున్నారు” అంటే ఆ పరలోక సభలో యెహోవా ఎదుట గౌరవనీయమైన స్థానాన్ని పొందే యోగ్యులుగాను, నీతిమంతులుగాను తీర్చబడ్డారని అర్థం. ఇది సార్దీస్‌లోని నమ్మకస్థులైన అభిషక్త క్రైస్తవులకు యేసు చేసిన వాగ్దాన నెరవేర్పు ప్రకారమున్నది: “జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును.”—ప్రకటన 3:5; 4:4; 1 పేతురు 1:4.

12. పునరుత్థానులగు అభిషక్తులు ఏ విధంగా “ఇంక కొంచెము కాలము విశ్రమించెదరు,” ఎప్పటివరకు?

12 యేసు 1914 లో రాజైన తర్వాత, సాతానును అతని దయ్యాలను పరలోకంనుండి పడద్రోసి పరిశుభ్రం చేయడంతో తన విజయోత్సవం ప్రారంభమైన అనంతరం 1918 లో యీ పరలోక పునరుత్థానం ఆరంభమైందని ఆధారమంతా రుజువుచేస్తుంది. అయినా, పునరుత్థానులైన ఆ అభిషక్తులు “సహదాసుల . . . లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము,” విశ్రమింపవలెనని చెప్పబడ్డారు. ఇంకను భూమ్మీద నున్న యోహాను తరగతికి చెందినవారు శ్రమల్లోను హింసల్లోను తమ యథార్థతను రుజువు చేసుకోవాలి, మరి వారిలో కొందరు చంపబడవచ్చు. అయిననూ చివరకు, మహాబబులోను దాని రాజకీయ విటులు చిందించిన నీతిమంతుల రక్తానికి తగిన ప్రతిదండన జరిగి తీరుతుంది. ఈ మధ్యలో పునరుత్థానులైన వారు నిశ్చయంగా పరలోక పనులలో నిమగ్నులై ఉంటారు. వారు పనిచేయకుండ చేతులు ముడుచుకుని హాయిగా కూర్చుంటారని కాదు, గానీ యెహోవా ఉగ్రతదినం కొరకు ఓపికతో వేచియుంటారని అర్థం. (యెషయా 34:8; రోమీయులు 12:19) వారు అబద్ధమత నాశనాన్నిగూర్చి ప్రకటించిన తర్వాత, ‘పిలువబడిన ఏర్పరచబడిన నమ్మకమైన వారిగా’ వారు యీ భూమ్మీదనున్న సాతాను యొక్క యితర దుష్ట సంతానానికి తీర్పు తీర్చడంలో ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించడంతో వారి విశ్రాంతి ముగుస్తుంది.—ప్రకటన 2:26, 27; 17:14; రోమీయులు 16:20.

‘మృతులైన వారు మొదట లేపబడుదురు’

13, 14. (ఎ) అపొస్తలుడైన పౌలు ప్రకారం, పరలోక పునరుత్థాన మెప్పుడు ప్రారంభమౌతుంది, ఎవరు పునరుత్థానులౌతారు? (బి) ప్రభువు దినము వరకు బ్రతికియున్న అభిషక్తులు ఎప్పుడు పరలోకానికి పునరుత్థానులయ్యారు?

13 ఐదవ ముద్రను విప్పినప్పుడు అనుగ్రహింపబడిన వివేచన పరలోక పునరుత్థానాన్ని గూర్చి తెల్పే యితర లేఖనాలతో పూర్తిగా ఏకీభవిస్తుంది. ఉదాహరణకు అపొస్తలుడైన పౌలు యిలా వ్రాశాడు: “మేము ప్రభువు మాటనుబట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైనవారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతోకూడ ఉందుము.”—1 థెస్సలొనీకయులు 4:15-17.

14 ఈ వచనాలెంత చక్కటి ప్రోత్సాహకరమైన కథను తెల్పుతున్నాయో గదా! యేసు ప్రత్యక్షత వరకు బ్రతికియుండే యేసు అభిషక్త సహోదరులు అంటే ఆయన ప్రత్యక్షత కాలంలో భూమ్మీద జీవించి యుండేవారు ఎట్టి పరిస్థితులలోను మరణించిన వారికంటె ముందే పరలోకానికి వెళ్లరు. అలాంటివారు, అంటే క్రీస్తుతో మరణంలో ఏకమైనవారు, మొదట లేస్తారు. యేసు దిగివస్తాడు అంటే, ఆయన వారిపై అవధానాన్ని నిలిపి వారిని ఆత్మీయ జీవానికి పునరుత్థానులను చేసి వారికి “తెల్లని వస్త్రము” యిస్తాడని అర్థం. ఆ పిదప, భూమ్మీద యింకను సజీవులైయున్న వారు తమ భూజీవితాన్ని చాలిస్తారు, వారిలో అనేకులు శత్రువుల చేతుల్లో ఘోరంగా మరణిస్తారు. అయితే వీరు ముందు చనిపోయిన వారివలె యింకను సమాధుల్లో వేచివుండరు. బదులుగా వారు తక్షణమే—రెప్పపాటున—యేసుతోను, క్రీస్తుశరీర సభ్యులైన తోటిసహచరులతోను ఉండడానికై పరలోకానికి ఎత్తబడతారు. (1 కొరింథీయులు 15:50-52; ప్రకటన 14:13 పోల్చండి.) ఆ విధంగా, అభిషక్త క్రైస్తవుల పునరుత్థానం, ప్రకటనలోని నలుగురు గుఱ్ఱపురౌతులు తమ స్వారిని ప్రారంభించిన వెంటనే మొదలౌతుంది.

15. (ఎ) ఐదవ ముద్రను విప్పడంవల్ల ఎటువంటి సువార్త లభించింది? (బి) తెల్లని గుఱ్ఱంపైనున్న విజయుడెలా తన స్వారిని పూర్తిచేస్తాడు?

15 గ్రంథపుచుట్టలోని యీ ఐదవ ముద్రను విప్పడం మూలంగా, మరణంవరకు నమ్మకంగా వుంటూ జయించిన యథార్థపరులైన అభిషక్తులను గూర్చి సువార్త అందించింది. అయితే సాతాను అతని సంతానాన్ని గూర్చి ఎటువంటి సువార్త నందించలేదు. తెల్లని గుఱ్ఱంమీదనున్న విజయుని స్వారి కొనసాగుతూనే వుంది, మరి ‘దుష్టునియందున్న లోకానికి’ తీర్పుజరిగే వరకు అలా సాగుతూనే వుంటుంది. (1 యోహాను 5:19) గొఱ్ఱెపిల్ల ఆరవ ముద్రను విప్పినప్పుడు యిది విశదమౌతుంది.

[అధస్సూచీలు]

^ పేరా 7 మహాబబులోను అంటే ఏమిటనే విషయం 33వ అధ్యాయంలో వివరంగా చర్చించబడింది.

^ పేరా 8 న్యూ వర్‌ల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ రెఫరెన్స్‌ బైబిల్‌, పేజి 1577, అపెండిక్స్‌ 5సి, “టార్చర్‌ స్టేక్‌”తో పోల్చండి.

^ పేరా 9 మతంపేరిట కల్గిన రక్తాపరాధాన్ని గూర్చి 36అధ్యాయంలో యింకా ఎక్కువ వివరణ యివ్వబడింది.

[అధ్యయన ప్రశ్నలు]

102వ పేజీలోని బాక్సు]

‘వధింపబడిన ఆత్మలు’

ఫ్రెంచ్‌ హ్యూజినాట్‌ తలిదండ్రులకు జన్మించిన 18వ శతాబ్దపు ఇంగ్లీష్‌ ప్రొటెస్టెంట్‌ అయిన జాన్‌ జోర్టిన్‌ వ్రాసినదాన్ని ఎత్తిచెబుతూ మెక్లింటక్‌ అండ్‌ స్ట్రాంగ్స్‌ సైక్లొపీడియా యిలా అంటోంది: “హింస ఎక్కడ ప్రారంభమౌతుందో అక్కడ క్రైస్తవత్వం అంతమౌతుంది . . . క్రైస్తవత్వం [రోమా] సామ్రాజ్య మతంగా స్థిరపడిన తర్వాత, దాని పరిచారకులకు ధనఘనతలు ప్రసాదించబడిన అనంతరం ఆ క్రూరమైన దుష్ట హింస మహాశక్తిని పొంది, సువార్త ప్రకటించే మతంపై తన దుష్టప్రభావాన్ని చూపింది.”

[చిత్రం]

“తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియ్యబడెను”