ఒకటవ అధ్యాయం
దేవుని గురించిన సత్యం ఏమిటి?
-
దేవునికి నిజంగా మీపట్ల శ్రద్ధ ఉందా?
-
దేవుడు ఎలా ఉంటాడు? ఆయనకు ఒక పేరుందా?
-
దేవునికి సన్నిహితమవడం సాధ్యమేనా?
1, 2. తరచూ ప్రశ్నలు అడగడం ఎందుకు మంచిది?
పిల్లలు అడిగే ప్రశ్నల తీరును మీరెప్పుడైనా గమనించారా? చాలామంది పిల్లలు మాటలు నేర్చుకోవడమే ఆలస్యం ప్రశ్నలు అడగడం మొదలెడతారు. వాళ్లు కుతూహలంతో, కళ్లు విప్పార్చి మీవైపు చూస్తూ, ఆకాశం నీలి రంగులో ఎందుకు ఉంది? నక్షత్రాలు ఎందుకు మెరుస్తాయి? పక్షులకు పాటలు ఎవరు నేర్పించారు? వంటి ప్రశ్నలు అడుగుతారు. వాటికి జవాబివ్వాలని మీరు ఎంతో ప్రయత్నించి ఉండవచ్చు, అయితే ప్రతీ ప్రశ్నకు జవాబివ్వడం సులభం కాదు. మీరెంత చక్కగా జవాబిచ్చినా, పిల్లలు వెంటనే ‘ఎందుకు?’ అని మరో ప్రశ్న వేస్తారు.
2 ప్రశ్నలు కేవలం పిల్లలు మాత్రమే అడగరు. మనం కూడా పెరిగి పెద్దవారమవుతున్నా ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం. సరైన మార్గం తెలుసుకోవడానికి, మనం తప్పించుకోవలసిన ప్రమాదాల గురించి తెలుసుకోవడానికి లేదా కుతూహలం తీర్చుకోవడానికి ప్రశ్నలు అడుగుతాం. కానీ నేడు చాలామంది అసలు ప్రశ్నలు అడగడమే మానేసినట్లు, ప్రాముఖ్యమైన ప్రశ్నలు కూడా అడగడం మానేసినట్లు అనిపిస్తోంది. వారు ఒకవేళ ప్రశ్నలు అడిగినా, వాటి జవాబుల కోసం అన్వేషించడానికి ఆసక్తి చూపించడం లేదు.
3. అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకునే ప్రయత్నాన్ని చాలామంది ఎందుకు విరమించుకుంటారు?
3 ఈ పుస్తకం కవరు మీదున్న ప్రశ్న గురించి, ముందుమాటలో లేవదీయబడిన ప్రశ్నల గురించి లేదా ఈ అధ్యాయం ఆరంభంలో వేయబడిన ప్రశ్నల గురించి ఆలోచించండి. అవి మీరు అడగగల అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్నల్లో కొన్ని మాత్రమే. అయితే చాలామంది వాటికి జవాబులు తెలుసుకోవాలని ప్రయత్నించడమే మానేశారు. ఎందుకు? బైబిల్లో వాటికి జవాబులు ఉన్నాయా? బైబిలు ఇచ్చే జవాబులను అర్థం చేసుకోవడం చాలా కష్టమని కొందరు అనుకుంటారు. ప్రశ్నలు అడగడం అవమానానికి, తలవంపుకు దారితీస్తుందని కొందరు కలతపడతారు. అలాంటి ప్రశ్నలను మత నాయకులకు, బోధకులకు వదిలివేయడం మంచిదనే నిర్ణయానికి మరికొందరు వస్తారు. మరి మీరు ఏమంటారు?
4, 5. జీవితంలో మనం అడిగే అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్నల్లో కొన్ని ఏమిటి, వాటికి మనం జవాబులు ఎందుకు వెదకాలి?
4 జీవితానికి సంబంధించిన ప్రాముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు పొందాలనే ఆసక్తి మీకు ఉండవచ్చు. కొన్నిసార్లు మీరు ఈ విధంగా ఆలోచించి ఉంటారనడంలో సందేహం లేదు: ‘జీవిత సంకల్పం ఏమిటి? జీవితమంటే ఇదేనా? దేవుడు వాస్తవానికి ఎలా ఉంటాడు?’ ఇలాంటి ప్రశ్నలు అడగడం సహేతుకమే, అంతేకాక వాటికి సంతృప్తికరమైన, నమ్మదగిన జవాబులు దొరికే వరకు ప్రయత్నం మానకుండా ఉండడం కూడా ప్రాముఖ్యం. ప్రసిద్ధిగాంచిన బోధకుడైన యేసుక్రీస్తు ఇలా చెప్పాడు: “అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును.”—మత్తయి 7:7, 8.
5 ప్రాముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు ‘వెదుకుతూనే’ ఉంటే, ఆ అన్వేషణ ఎంతో ఫలదాయకంగా ఉంటుందని మీరే గ్రహిస్తారు. (సామెతలు 2:1-5) ఇతరులు మీకేమి చెప్పినా, బైబిల్లో ఆ ప్రశ్నలకు సరైన జవాబులు ఉన్నాయి, మీరు వాటిని కనుగొనవచ్చు. ఆ జవాబులు అర్థం చేసుకోవడానికి ఏ మాత్రం కష్టంగా ఉండవు. అంతకంటే ముఖ్యంగా అవి నిరీక్షణను, ఆనందాన్ని ఇస్తాయి. మీరు ఈ కాలంలో కూడా సంతృప్తికరమైన జీవితం అనుభవించేందుకు అవి మీకు సహాయం చేయగలవు. మొదటగా, మనం అనేకమందిని కలవరపెట్టే ప్రశ్నను పరిశీలిద్దాం.
దేవునికి మనపట్ల శ్రద్ధ, జాలి లేవా?
6. మానవుల సమస్యల గురించి దేవునికి పట్టింపే లేదు అని చాలామంది ఎందుకు అనుకుంటారు?
6 చాలామంది ఆ ప్రశ్నకు జవాబు అవును అనే అనుకుంటారు. ‘దేవునికి మనపట్ల శ్రద్ధ ఉంటే, లోకం ఎంతో వేరుగా ఉండేది కాదా?’ అని వారు తర్కిస్తారు. మన చుట్టూ ఉన్న లోకం యుద్ధం, ద్వేషం, దుఃఖంతో నిండివుంది. మనం వ్యాధిగ్రస్థులం అవుతాం, బాధ అనుభవిస్తాం, ప్రియమైనవారిని మరణంలో పోగొట్టుకుంటాం. అందుకే చాలామంది ‘దేవునికి మన గురించి, మన సమస్యల గురించి పట్టింపు ఉంటే, అలాంటివి జరగకుండా ఆపడా?’ అని ప్రశ్నిస్తారు.
7. (ఎ) దేవుడు జాలి లేనివాడు అని చాలామంది తలంచడానికి మతనాయకులు ఎలా కారణమవుతున్నారు? (బి) మనం అనుభవించే బాధల గురించి బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
7 ఘోరమైన విషయం ఏమిటంటే, దేవుడు జాలి లేనివాడని ప్రజలు తలంచడానికి కొన్నిసార్లు మత నాయకులే కారణం. అదెలా? విషాద సంఘటన జరిగినప్పుడు, దేవుని చిత్తం అలావుంది అని వారు అంటారు. అలాంటి బోధకులు, జరుగుతున్న దుర్ఘటనలకు దేవుణ్ణి బాధ్యునిగా చేస్తారు. మరి దేవుడే వాటికి బాధ్యుడా? బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? యాకోబు 1:13 ఇలా జవాబిస్తోంది: “దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు—నేను దేవునిచేత శోధింపబడుచున్నానని అనకూడదు.” కాబట్టి లోకంలో మీరు చూస్తున్న దుష్టత్వానికి దేవుడు బాధ్యుడు కానేకాదు. (యోబు 34:10-12 చదవండి.) ఆయన చెడు సంగతులు జరగడానికి అనుమతిస్తున్నాడన్నది నిజమే. అయితే ఏదైనా జరిగేందుకు అనుమతించడానికీ, అది జరిగేలా చేయడానికీ చాలా తేడా ఉంది.
8, 9. (ఎ) దుష్టత్వాన్ని అనుమతించడానికి, అది జరిగేలా చేయడానికి మధ్య ఉన్న తేడాను ఎలా ఉదాహరిస్తారు? (బి) మానవులను బాధ్యతారహిత మార్గంలో వెళ్లేందుకు అనుమతించాలని దేవుడు తీసుకున్న నిర్ణయాన్ని మనం తప్పుపట్టడం ఎందుకు సమంజసం కాదు?
8 ఉదాహరణకు, ఎదిగిన కుమారుడు ఉన్న ప్రేమగల, జ్ఞానియైన తండ్రి గురించి ఆలోచించండి. కుమారుడు తల్లిదండ్రులకు ఎదురు తిరిగి ఇల్లు వదిలి వెళ్లిపోవడానికే నిర్ణయించుకుంటే, తండ్రి అతనిని అడ్డుకోడు. కుమారుడు చెడు జీవనమార్గం అవలంబించి కష్టాల్లో చిక్కుకుంటే, అతని సమస్యలకు తండ్రి కారకుడా? ఎంతమాత్రం కాదు. (లూకా 15:11-13) అదేవిధంగా, మానవులు చెడు మార్గంలో వెళ్లడానికి నిర్ణయించుకున్నప్పుడు దేవుడు వారిని అడ్డుకోలేదు. కాబట్టి తత్ఫలితంగా కలిగిన సమస్యలకు ఆయన కారకుడు కాదు. కాబట్టి మానవాళి కష్టాలకు దేవుణ్ణి నిందించడం సమంజసం కాదు.
9 మానవులు చెడు మార్గంలో వెళ్లేందుకు అనుమతించడానికి దేవునికి సరైన కారణాలే ఉన్నాయి. మన జ్ఞానవంతమైన, శక్తిమంతమైన సృష్టికర్తగా ఆయన ఆ కారణాలను మనకు వివరించాల్సిన అవసరం లేదు. అయినా దేవుడు ప్రేమతో మనకు ఆ కారణాలు వివరించాడు. ఆ కారణాల గురించి మీరు 11వ అధ్యాయంలో మరింత ఎక్కువగా తెలుసుకుంటారు. అయితే మనం ఎదుర్కొనే సమస్యలకు దేవుడు బాధ్యుడు కాడనే నమ్మకంతో ఉండండి. బదులుగా, ఆయన మన సమస్యలకు ఏకైక పరిష్కార నిరీక్షణను అనుగ్రహించాడు.—యెషయా 33:2.
10. దేవుడు దుష్టత్వపు ప్రభావాలన్నింటినీ తొలగిస్తాడని మనం ఎందుకు నమ్మవచ్చు?
10 పైగా, దేవుడు పరిశుద్ధుడు. (యెషయా 6:3) ఆయనలో స్వచ్ఛత, శుద్ధత ఉన్నాయని దానర్థం. ఆయనలో చెడు ఏ మాత్రం లేదు. కాబట్టి మనం ఆయనను పూర్తిగా నమ్మవచ్చు. మానవులు కొన్నిసార్లు చెడ్డవారిగా మారతారు కాబట్టి, వారి గురించి మనమలా చెప్పలేం. అత్యంత నిజాయితీపరుడు అధికారంలో ఉన్నా, చెడు ప్రజలవల్ల కలిగిన నష్టాన్ని అతను పూరించలేడు. కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. దుష్టత్వం మానవులపై చూపించిన ప్రభావాలన్నింటినీ ఆయన తొలగించగలడు, తొలగిస్తాడు కూడా. దేవుడు చర్య తీసుకునేటప్పుడు, కీడును శాశ్వతంగా నిర్మూలించే విధంగా చర్య తీసుకుంటాడు.—కీర్తన 37:9-11 చదవండి.
మనం ఎదుర్కొనే అన్యాయాల గురించి దేవుడు ఎలా భావిస్తున్నాడు?
11. (ఎ) అన్యాయాన్ని గురించి దేవుడు ఎలా భావిస్తున్నాడు? (బి) మీ బాధల గురించి దేవుడు ఎలా భావిస్తున్నాడు?
11 అటు లోకంలోను ఇటు మీ జీవితంలోను జరుగుతున్న వాటి గురించి దేవుడు ఎలా భావిస్తున్నాడు? మొట్టమొదట, దేవుడు “న్యాయమును ప్రేమించువాడు” అని బైబిలు బోధిస్తోంది. (కీర్తన 37:28) కాబట్టి తప్పొప్పుల విషయంలో ఆయనకు ఖచ్చితమైన ప్రమాణాలు ఉన్నాయి. ఆయన ఎలాంటి అన్యాయాన్నైనా ద్వేషిస్తాడు. పూర్వం ప్రపంచంలో చెడుతనం ఎక్కువైనప్పుడు దేవుడు “తన హృదయములో నొచ్చుకొనెను” అని బైబిలు చెబుతోంది. (ఆదికాండము 6:5, 6) దేవుడు మారలేదు. (మలాకీ 3:6) కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న బాధలను చూసి ఆయన ఇప్పటికీ నొచ్చుకుంటాడు. ప్రజలు బాధలనుభవించడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు” అని బైబిలు చెబుతోంది.—1 పేతురు 5:7 చదవండి.
12, 13. (ఎ) ప్రేమించడం వంటి చక్కని లక్షణాలు మనలో ఎందుకున్నాయి, మనం ఈ లోకాన్ని దృష్టించే విధానాన్ని ప్రేమ ఎలా ప్రభావితం చేస్తుంది? (బి) ప్రపంచ సమస్యల గురించి దేవుడు తప్పకుండా ఏదో ఒకటి చేస్తాడని మీరెందుకు నమ్మకంతో ఉండవచ్చు?
12 మనం బాధలు అనుభవించడం దేవునికి ఇష్టం లేదని మనం ఎలా నమ్మవచ్చు? దీనికి మరో రుజువు ఉంది. మానవుడు దేవుని స్వరూపంలో చేయబడ్డాడని బైబిలు బోధిస్తోంది. (ఆదికాండము 1:26) ఆ కారణంగా, దేవునికి మంచి లక్షణాలు ఉన్నట్లే మనకుకూడా మంచి లక్షణాలు ఉన్నాయి. ఉదాహరణకు, అమాయకులు బాధపడుతుంటే మీకు బాధ అనిపించదా? మీరే అలాంటి అన్యాయాల గురించి పట్టించుకుంటున్నారంటే, దేవుడు వాటిని ఇంకా ఎక్కువగా పట్టించుకుంటాడనే నమ్మకంతో ఉండండి.
13 మానవులకున్న ఉత్తమ లక్షణాల్లో ఒకటి, ఇతరులను ప్రేమించే సామర్థ్యం. అది కూడా దేవుణ్ణి ప్రతిబింబిస్తుంది. “దేవుడు ప్రేమాస్వరూపి” అని బైబిలు బోధిస్తోంది. (1 యోహాను 4:8) దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టే మనమూ ప్రేమిస్తున్నాం. ప్రపంచంలో మీరు చూస్తున్న బాధనూ అన్యాయాన్నీ అంతం చేయడానికి ప్రేమ మిమ్మల్ని పురికొల్పుతుందా? వాటిని అంతం చేసే శక్తే మీకుంటే, మీరు చేయరా? తప్పకుండా చేస్తారు. అలాగే దేవుడు కూడా బాధనూ అన్యాయాన్నీ అంతం చేస్తాడని మీరు అంతే నమ్మకంతో ఉండవచ్చు. ఈ పుస్తకపు ముందుమాటలో పేర్కొనబడిన వాగ్దానాలు కేవలం కలలు, వ్యర్థ నిరీక్షణలు కావు. దేవుని వాగ్దానాలు తప్పక నెరవేరతాయి. అయితే అలాంటి వాగ్దానాలను విశ్వసించడానికి, వాటిని చేసిన దేవుని గురించి మీరు మరింత ఎక్కువ తెలుసుకోవాలి.
తానెవరో మీరు తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు
14. దేవుని పేరు ఏమిటి, మనం దానిని ఎందుకు ఉపయోగించాలి?
14 ఎవరైనా మీ గురించి తెలుసుకోవాలని మీరు కోరుకుంటే మీరేమి చేస్తారు? ఆ వ్యక్తికి మీ పేరు చెప్పరా? మరి దేవునికి ఒక పేరు ఉందా? చాలా మతాలు ఆ పేరు “దేవుడు” లేదా “ప్రభువు” అనే జవాబు చెబుతాయి, కానీ అవి పేర్లు కావు. అవి “రాజు,” “అధ్యక్షుడు” వంటి పదాల్లాగే ఒక వ్యక్తి స్థానాన్ని తెలియజేసే పదాలు మాత్రమే. దేవుని స్థానాన్ని తెలియజేయడానికి అలాంటి అనేక పదాలు ఉపయోగించబడ్డాయని బైబిలు బోధిస్తోంది. “దేవుడు,” “ప్రభువు” అనేవి వాటిలో రెండు మాత్రమే. అయితే, దేవునికి వ్యక్తిగతంగా యెహోవా అనే పేరు ఉందని కూడా బైబిలు బోధిస్తోంది. కీర్తన 83:18 ఇలా చెబుతోంది: “యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవు.” ఒకవేళ మీ బైబిలు అనువాదంలో ఆ పేరు లేకపోతే, దానికి కారణమేమిటో తెలుసుకోవడానికి మీరు ఈ పుస్తకంలోని అనుబంధంలో 195-197 పేజీల్లోని సమాచారాన్ని పరిశీలించవచ్చు. ప్రాచీన బైబిలు చేతివ్రాత ప్రతుల్లో దేవుని పేరు వేలసార్లు కనబడుతుంది. కాబట్టి, మీరు ఆ పేరు తెలుసుకొని దానిని ఉపయోగించాలని యెహోవా కోరుతున్నాడు. చెప్పాలంటే, ఆయన తనను తాను మీకు పరిచయం చేసుకోవడానికి బైబిలును ఉపయోగిస్తున్నాడు.
15. యెహోవా అనే పేరుకు అర్థం ఏమిటి?
15 దేవుడే స్వయంగా తనకోసం పరిపూర్ణ భావంగల పేరును ఎన్నుకున్నాడు. యెహోవా అనే ఆయన పేరుకు దేవుడు తాను చేసే ఏ వాగ్దానాన్నైనా నెరవేర్చగలడనీ, ఆయన మనసులో ఉన్న ఏ సంకల్పాన్నైనా సాధించగలడనీ అర్థం. a దేవుని పేరు నిజంగా సాటిలేనిది. అది ఆయనకు మాత్రమే చెందినది. అనేక రీతుల్లో యెహోవా అసమానుడు. అదెలా?
16, 17. (ఎ) “సర్వాధికారి,” (బి) “యుగములకు రాజా,” (సి) “సృష్టికర్త” అనే పదాలనుండి యెహోవా గురించి మనం ఏమి తెలుసుకోవచ్చు?
16 యెహోవా గురించి మాట్లాడుతూ, ‘నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవు’ అని కీర్తన 83:18 చెప్పడాన్ని మనం చూశాం. అదేవిధంగా, యెహోవా మాత్రమే “సర్వాధికారి” లేదా సర్వశక్తిమంతుడు అని కూడా సూచించబడింది. ప్రకటన 15:3 ఇలా చెబుతోంది: “ప్రభువా, [“యెహోవా,” NW] దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి.” “సర్వాధికారి” అనే మాట యెహోవాయే సర్వశక్తిమంతుడని మనకు బోధిస్తోంది. ఆయన శక్తి సాటిలేనిది; ఆయనే సర్వోన్నతుడు. “యుగములకు రాజా” అనే పదం యెహోవా మహోన్నతుడని మనకు గుర్తుచేస్తోంది. ఆయన మాత్రమే సర్వకాలాల్లో ఉనికిలో ఉన్నాడు. కీర్తన 90:2 ఇలా చెబుతోంది: “యుగయుగములు [లేదా, నిత్యమూ] నీవే దేవుడవు.” ఆ తలంపు మనలో భక్తిపూర్వక భయాన్ని కలిగించడం లేదా?
17 యెహోవా మరో విషయంలో కూడా అసమానుడు, ఆయన మాత్రమే సృష్టికర్త. ప్రకటన 4:10-11 లో మనం ఇలా చదువుతాం: “ప్రభువా, [“యెహోవా,” NW] మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు.” మీరు ఊహించగల ప్రతీదీ అంటే పరలోకంలోని అదృశ్య ఆత్మ ప్రాణులనుండి ఆకాశంలో కనబడే నక్షత్రాలవరకు, చెట్లకు కాసే ఫలాలనుండి మహాసముద్రాల్లోను నదుల్లోను ఈదే చేపలవరకు, సమస్తం యెహోవా సృష్టించాడు కాబట్టే అవి ఉనికిలో ఉన్నాయి.
మీరు యెహోవాకు సన్నిహితంగా ఉండగలరా?
18. తామెన్నటికీ దేవునికి సన్నిహితం కాలేమని కొందరు ఎందుకు భావిస్తారు, కానీ బైబిలు ఏమి బోధిస్తోంది?
18 భక్తిపూర్వక భయం కలిగించే యెహోవా లక్షణాల గురించి చదవడం, కొందరిలో కాస్త భయాన్ని కలిగించవచ్చు. దేవుడు చేరుకోలేనంత ఉన్నతుడని, అందువల్ల ఆయనకు సన్నిహితం కావడం అసాధ్యమని లేదా అంత ఉన్నతస్థానంలోవున్న దేవునికి తాము లెక్కలోకి రామని వారు భయపడవచ్చు. అయితే ఇలా తలంచడం సరైనదేనా? బైబిలు దానికి పూర్తిగా భిన్నమైన అభిప్రాయాన్ని బోధిస్తోంది. అది యెహోవా గురించి ఇలా చెబుతోంది: “ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.” (అపొస్తలుల కార్యములు 17:26-27) “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును” అని కూడా బైబిలు మనకు ఉద్బోధిస్తోంది.—యాకోబు 4:8.
19. (ఎ) మనం దేవునికి సన్నిహితమవడాన్ని ఎలా ఆరంభించవచ్చు, దానివల్ల ఏ ప్రయోజనం కలుగుతుంది? (బి) దేవుని ఏ లక్షణాలు మీకు అత్యంత ఆకర్షణీయంగా అనిపిస్తాయి?
19 అయితే మీరు దేవునికి ఎలా సన్నిహితం కావచ్చు? మొదటిగా, మీరిప్పుడు చేస్తున్నదాన్ని, అంటే దేవుని గురించి నేర్చుకోవడాన్ని కొనసాగించండి. యేసు ఇలా చెప్పాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహాను 17:3) అవును, యెహోవా గురించి, యేసు గురించి తెలుసుకోవడం ‘నిత్యజీవానికి’ నడిపిస్తుందని బైబిలు బోధిస్తోంది. ముందే ప్రస్తావించినట్లుగా “దేవుడు ప్రేమాస్వరూపి.” (1 యోహాను 4:16) యెహోవాకు వేరే అనేకమైన, చక్కని, ఆకర్షణీయమైన లక్షణాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, “యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడు” అని బైబిలు చెబుతోంది. (నిర్గమకాండము 34:6; 1 యోహాను 4:8) ఆయన “దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడు.” (కీర్తన 86:5) ఆయన నమ్మదగినవాడు. (1 కొరింథీయులు 1:9) మీరు బైబిలును ఇంకా ఎక్కువ చదువుతుండగా, తనకు ఈ లక్షణాలతోపాటు ఇంకా అనేక ఆకర్షణీయమైన గుణాలు ఉన్నాయని యెహోవా ఎలా చూపించాడో మీరు తెలుసుకుంటారు.
20-22. (ఎ) దేవుణ్ణి మనం చూడలేము కాబట్టి, అది మనం ఆయనకు సన్నిహితమవడానికి ఆటంకంగా ఉంటుందా? వివరించండి. (బి) కొందరు మంచి ఉద్దేశాలతోనే మీరేమి చేయాలని తొందరపెడతారు, అయితే మీరేమి చేయాలి?
20 నిజమే, దేవుడు అదృశ్యమైన ఆత్మ కాబట్టి మీరు ఆయనను చూడలేరు. (యోహాను 1:18; 4:24; 1 తిమోతి 1:17) అయితే మీరు బైబిలులోనుండి ఆయన గురించి నేర్చుకోవడం ద్వారా, ఆయనను ఒక వ్యక్తిగా తెలుసుకోగలుగుతారు. కీర్తనకర్త చెప్పినట్లుగా మీరు ‘యెహోవా ప్రసన్నతను’ చూస్తారు. (కీర్తన 27:4; రోమీయులు 1:20) యెహోవా గురించి మీరెంత ఎక్కువగా తెలుసుకుంటే, ఆయన మీకు అంత ఎక్కువగా వాస్తవమైనవాడిగా ఉంటాడు, అంతేగాక ఆయనను ప్రేమించడానికి, ఆయనకు సన్నిహితమవడానికి మీకు మరింత బలమైన కారణం ఉంటుంది.
21 యెహోవాను మన తండ్రిగా భావించమని బైబిలు ఎందుకు బోధిస్తోందో మీరు క్రమేణా అర్థం చేసుకుంటారు. (మత్తయి 6:9, 10) ఆయన మన జీవానికి మూలాధారమే కాక, ఒక ప్రేమగల తండ్రి తన పిల్లల మేలు కోరినట్లే, మనం శ్రేష్ఠమైన జీవితం అనుభవించాలని ఆయన కోరుకుంటున్నాడు. (కీర్తన 36:9) మానవులు యెహోవాకు స్నేహితులు కావచ్చని కూడా బైబిలు బోధిస్తోంది. (యాకోబు 2:23) ఒకసారి ఆలోచించండి, మీరు విశ్వ సృష్టికర్తకే స్నేహితులు కావచ్చు!
22 మీరు బైబిలునుండి మరింత ఎక్కువ తెలుసుకుంటుండగా, అలాంటి అధ్యయనం ఆపుజేయమని కొందరు మంచి ఉద్దేశాలతోనే మిమ్మల్ని తొందరపెట్టవచ్చు. మీరు మీ నమ్మకాలను మార్చుకుంటారని వారు కలత చెందవచ్చు. అయితే సర్వశ్రేష్ఠమైన స్నేహాన్ని ఏర్పరచుకోకుండా మిమ్మల్ని ఆపడానికి మీరు ఎవరినీ అనుమతించకండి.
23, 24. (ఎ) మీరు తెలుసుకుంటున్న విషయాల గురించి ఎందుకు ప్రశ్నలు అడుగుతూ ఉండాలి? (బి) తర్వాతి అధ్యాయపు అంశం ఏమిటి?
23 నిజమే, మొదట్లో మీకు కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు. అయితే ఇతరుల సహాయం కోరడానికి కొంచెం వినయం అవసరం, అంతేగాని కలవరపడి వెనుదీయకండి. చిన్నపిల్లలు చూపించేటట్లు వినయం చూపించడం మెచ్చుకోదగిన విషయమని యేసు చెప్పాడు. (మత్తయి 18:2-4) మరి పిల్లలు చాలా ప్రశ్నలు అడుగుతారని మనకు తెలుసు. మీరు జవాబులు తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపించిన కొందరిని బైబిలు మెచ్చుకుంటోంది. తాము తెలుసుకుంటున్నది సత్యమా కాదా అని కనుక్కోవడానికి వారు లేఖనాలను జాగ్రత్తగా పరిశోధించారు.—అపొస్తలుల కార్యములు 17:11 చదవండి.
24 యెహోవా గురించి తెలుసుకోవడానికి అత్యుత్తమ మార్గం బైబిలును పరిశీలించడమే. అది ఇతర పుస్తకాలకు భిన్నమైనది. ఏ విధంగా? ఆ విషయాన్ని తర్వాతి అధ్యాయం పరిశీలిస్తుంది.
a దేవుని పేరుకు ఉన్న అర్థం గురించీ దాని ఉచ్ఛారణ గురించీ మరింత సమాచారం అనుబంధంలోని 195-197 పేజీల్లో ఉంది.