బైబిలు సందేశ సారాంశం
ఆదాము, హవ్వలు పరదైసులో నిత్యం జీవించాలనే ఉద్దేశంతోనే యెహోవా వాళ్లను సృష్టించాడు. సాతాను దేవుని పేరుమీద నిందలు మోపి, ఆయన పరిపాలనా హక్కును ప్రశ్నించాడు. ఆదాము, హవ్వలు కూడా ఆ తిరుగుబాటులో సాతానుతో చేతులు కలిపి వాళ్ల సంతానానికి పాపమరణాలు ప్రాప్తించడానికి కారకులయ్యారు
యెహోవా ఆ తిరుగుబాటుదారులకు శిక్ష విధించి, సాతానును నాశనం చేసే ఒక విమోచకుడు లేదా సంతానం వస్తాడని వాగ్దానం చేశాడు. ఏదెనులో జరిగిన తిరుగుబాటు, పాపంవల్ల వచ్చిన చెడు ఫలితాలన్నిటినీ ఆ విమోచకుడు తీసేస్తాడు
సంతానం అంటే నిత్యం పరిపాలించబోయే మెస్సీయ అబ్రాహాము, దావీదు వంశంలో పుడతాడని యెహోవా వాగ్దానం చేశాడు
ప్రవక్తల ద్వారా యెహోవా ఈ విషయాలన్నిటినీ ముందే తెలియజేశాడు: మెస్సీయ పాపమరణాలను తీసేస్తాడు. సహపరిపాలకులతో కలిసి దేవుని రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఆ రాజ్యం యుద్ధాల్ని, అనారోగ్యాన్ని, మరణాన్ని తీసేస్తుంది
యెహోవా తన కుమారుడిని భూమ్మీదికి పంపించి, ఆయనే మెస్సీయ అని స్పష్టం చేశాడు. యేసు దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు, తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. తర్వాత యెహోవా ఆయనను పరలోకానికి పునరుత్థానం చేశాడు
యెహోవా తన కుమారుడిని పరలోకంలో రాజుగా నియమించాడు. దాంతో ఈ లోకవిధానానికి అంత్యదినాలు మొదలయ్యాయి. భూవ్యాప్తంగా తన అనుచరులు చేసే రాజ్య ప్రకటనాపనిని యేసు నిర్దేశిస్తున్నాడు
భూమ్మీద రాజ్య పరిపాలన మొదలుపెట్టమని యెహోవా తన కుమారున్ని నిర్దేశిస్తాడు. ఆ రాజ్యం దుష్ట ప్రభుత్వాలన్నిటినీ సమూలంగా నాశనం చేసి, భూమిని పరదైసులా మారుస్తుంది. యేసు పాలనలో మనుషులంతా పరిపూర్ణులౌతారు. యెహోవాకు మాత్రమే పరిపాలించే హక్కు ఉందని నిరూపించబడుతుంది, ఆయన పేరుమీద వేయబడిన నిందలు తీసివేయబడతాయి