కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

2వ అధ్యాయం

బైబిలు​—⁠దేవుడు ఇచ్చిన పుస్తకం

బైబిలు​—⁠దేవుడు ఇచ్చిన పుస్తకం

1, 2. బైబిలు దేవుడు ఇచ్చిన ప్రత్యేకమైన బహుమతి అని మనం ఎందుకు చెప్పవచ్చు?

 మీ స్నేహితుడు మీకు ఒక బహుమతి ఇస్తే మీకెలా అనిపిస్తుంది? దాన్ని వెంటనే తెరిచి చూడాలనిపిస్తుంది, మీ స్నేహితుడు మీ గురించి ఆలోచించాడు అనే విషయాన్ని బట్టి కూడా మీకు సంతోషమేస్తుంది. దాన్ని ఇచ్చినందుకు మీరు థాంక్స్‌ చెప్తారు.

2 బైబిలు దేవుడు ఇచ్చిన బహుమతి. వేరే ఎక్కడా మనకు దొరకని సమాచారం బైబిల్లో ఉంది. ఉదాహరణకు, దేవుడు పరలోకాన్ని, భూమిని, మొదటి స్త్రీని, పురుషున్ని సృష్టించాడు అని అందులో ఉంది. మనకు సమస్యలు వచ్చినప్పుడు సహాయం చేసే సూత్రాలు అందులో ఉన్నాయి. భూమిని అందంగా మార్చాలనే తన ఉద్దేశాన్ని దేవుడు ఎలా నెరవేరుస్తాడో బైబిలు నుండి మనం నేర్చుకోవచ్చు. బైబిలు చాలా ప్రత్యేకమైన బహుమతి.

 3. బైబిలు స్టడీ చేస్తుంటే మీరు ఏమి తెలుసుకుంటారు?

3 మీరు బైబిల్ని అధ్యయనం లేదా స్టడీ చేస్తుండగా, దేవుడు మీకు స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నాడని మీకు తెలుస్తుంది. దేవుని గురించి మీరు ఎంత ఎక్కువ నేర్చుకుంటే ఆయనకు అంత దగ్గరౌతూ ఉంటారు.

 4. బైబిలు గురించి మీకు ఏ విషయం నచ్చింది?

4 బైబిల్ని దాదాపు 2,600 భాషల్లోకి అనువదించారు. ఎన్నో కోట్ల కాపీలు ప్రింట్‌ చేశారు. లోకంలో 90 శాతం కన్నా ఎక్కువమంది బైబిల్ని వాళ్ల సొంత భాషలో చదవగలుగుతున్నారు. ప్రతీవారం పది లక్షల కంటే ఎక్కువమంది బైబిళ్లను తీసుకుంటున్నారు. నిజంగా బైబిలు లాంటి పుస్తకం ఇంకేదీ లేదని చెప్పవచ్చు.

 5. బైబిల్ని “దేవుడు ప్రేరేపించాడు” అని మనం ఎలా చెప్పగలం?

5 బైబిల్ని “దేవుడు ప్రేరేపించాడు.” (2 తిమోతి 3:16 చదవండి.) కానీ కొంతమంది ఇలా అనుకోవచ్చు, ‘బైబిల్ని మనుషులు రాశారు కదా, మరి దేవుని నుండి వచ్చిందని ఎలా చెప్తాం?’ బైబిలు ఇలా జవాబిస్తుంది: “మనుషులు పవిత్రశక్తితో ప్రేరేపించబడి, దేవుని నుండి వచ్చిన విషయాలు మాట్లాడారు.” (2 పేతురు 1:21) ఒక ఉదాహరణ చూద్దాం, ఒక యజమాని తన దగ్గర పని చేసే ఉద్యోగితో ఒక ఉత్తరం రాయించాడు. ఆ ఉత్తరం ఎవరిది? యజమానిదేగాని ఉద్యోగిది కాదు. అదే విధంగా, బైబిలు దేవునిదేగాని దాన్ని రాయించడానికి ఆయన ఉపయోగించుకున్న మనుషులది కాదు. దేవుడు తన ఆలోచనలు రాసేలా వాళ్లను నడిపించాడు. బైబిలు నిజంగా “దేవుని వాక్యమే.”—1 థెస్సలొనీకయులు 2:13; అదనపు సమాచారంలో 2వ పాయింట్‌ చూడండి.

పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం ఎన్నో భాషల్లో అందుబాటులో ఉంది

బైబిలు ఖచ్చితమైనది

6, 7. బైబిల్లో ఉన్న విషయాలు ఒకదానితో ఒకటి కలుస్తాయని మనం ఎలా చెప్పగలం?

6 బైబిల్ని రాయడానికి 1,600 కంటే ఎక్కువ సంవత్సరాలు పట్టింది. దాన్ని రాసినవాళ్లు వేర్వేరు కాలాల్లో జీవించారు. వాళ్లలో కొంతమంది బాగా చదువుకున్నవాళ్లు, ఇంకొంతమంది పెద్దగా చదువుకోలేదు. ఉదాహరణకు ఒకతను డాక్టరు. మిగతావాళ్లు రైతులు, చేపలు పట్టేవాళ్లు, కాపరులు, ప్రవక్తలు, న్యాయాధిపతులు, రాజులు. వేర్వేరు వాళ్లు రాసినా బైబిల్లో భాగాలన్నీ ఒకదానితో ఒకటి కలుస్తాయి. అంటే బైబిలు ఒక అధ్యాయంలో ఒకటి చెప్పి, ఇంకో అధ్యాయంలో వాటికి వేరుగా ఉండే విషయాలు చెప్పదు. a

7 బైబిలు మొదటి అధ్యాయాల్లో లోకంలో సమస్యలు ఎలా మొదలయ్యాయో ఉంది. చివరి అధ్యాయాల్లో భూమిని దేవుడు పరదైసుగా మార్చి ఆ సమస్యలను ఎలా పరిష్కరిస్తాడో ఉంది. బైబిలు మనుషుల వేల సంవత్సరాల చరిత్ర గురించి చెప్తూ దేవుని ఉద్దేశం ఎల్లప్పుడూ నెరవేరుతుందని చూపిస్తుంది.

 8. సైన్స్‌కు సంబంధించి బైబిలు ఎప్పుడూ వాస్తవాలనే చెప్పిందనడానికి కొన్ని ఉదాహరణలు ఇవ్వండి.

8 సైన్స్‌ నేర్పించడానికి లేదా స్కూల్లో నేర్పించే పుస్తకంగా వాడడానికి బైబిల్ని రాయలేదు. కానీ సైన్స్‌కు సంబంధించిన విషయాల్లో బైబిలు ఎప్పుడూ వాస్తవాలను వివరించింది. దేవుడు ఇచ్చిన పుస్తకం అలానే ఉండాలని మనం అనుకుంటాం కదా? ఉదాహరణకు, లేవీయకాండం అనే పుస్తకంలో దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన నియమాల్లో జబ్బులు అంటుకోకుండా ఉండాలంటే ఏం చేయాలో ఉంది. సూక్ష్మజీవులు, వైరస్‌లు వల్ల జబ్బులు వస్తాయని ఎవ్వరికీ తెలియక ముందే, చాలాకాలం క్రితమే బైబిల్లో ఆ నియమాలు రాశారు. భూమి ఏ ఆధారం లేకుండా వేలాడదీయబడిందని కూడా బైబిలు స్పష్టంగా చెప్తుంది. (యోబు 26:7) భూమి బల్లపరుపుగా ఉందని ఎక్కువమంది నమ్మిన కాలంలో భూమి గోళంగా అంటే గుండ్రంగా ఉందని బైబిలు చెప్పింది.—యెషయా 40:22.

 9. బైబిలు రాసినవాళ్లు చూపించిన నిజాయితీని చూసి మనం ఏం చెప్పవచ్చు?

9 చరిత్రలో జరిగిన విషయాల గురించి చెప్పినప్పుడు బైబిలు ఎప్పుడూ ఖచ్చితంగా ఉంది. కానీ చాలా చరిత్ర పుస్తకాలు పూర్తి ఖచ్చితంగా ఉండవు ఎందుకంటే వాటిని రాసినవాళ్లు నిజాయితీగా లేరు. ఉదాహరణకు, వాళ్ల దేశాలు యుద్ధంలో ఓడిపోయినప్పుడు వాళ్లు ఆ విషయాన్ని ప్రతిసారి రాసేవాళ్లు కాదు. బైబిల్ని రాసినవాళ్లు మాత్రం ఇశ్రాయేలు దేశం ఓడిపోయినప్పుడు నిజాయితీగా దాని గురించి రాశారు. వాళ్ల సొంత తప్పుల గురించి కూడా వాళ్లు రాశారు. ఉదాహరణకు, సంఖ్యాకాండం అనే పుస్తకంలో మోషే తాను పెద్ద తప్పు చేశానని దేవుడు అందుకు అతన్ని శిక్షించాడని చెప్పాడు. (సంఖ్యాకాండం 20:2-12) బైబిలు రాసినవాళ్లు చూపించిన నిజాయితీని చూసి బైబిలు దేవుని నుండి వచ్చిందని చెప్పవచ్చు. దీన్నిబట్టి మనం బైబిల్ని నమ్మవచ్చని తెలుస్తుంది.

ఎన్నో మంచి సలహాలున్న పుస్తకం

10. బైబిల్లో ఉన్న సలహాలు ఇప్పుడు కూడా మనకు ఎందుకు సహాయం చేయగలవు?

10 బైబిలు లేఖనాల్ని “దేవుడు ప్రేరేపించాడు. అవి బోధించడానికి, గద్దించడానికి, సరిదిద్దడానికి . . . ప్రయోజనకరంగా ఉంటాయి.” (2 తిమోతి 3:16) బైబిల్లో ఉన్న సలహాలు మనకు ఇప్పుడు కూడా సహాయం చేయగలవు. మనం ఎలా చేయబడ్డామో యెహోవాకు తెలుసు, కాబట్టి మనం ఎలా ఆలోచిస్తాం, ఎలా భావిస్తాం అనేవి ఆయన అర్థం చేసుకోగలడు. మన గురించి మనకంటే బాగా ఆయనకు తెలుసు, మనం సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనకు ఏది మంచిదో, ఏది చెడ్డదో ఆయనకు తెలుసు.

11, 12. (ఎ) మత్తయి 5 నుండి 7 అధ్యాయాల్లో యేసు ఏయే మంచి సలహాలు ఇచ్చాడు? (బి) బైబిలు నుండి మనం ఇంకా ఏమి నేర్చుకోవచ్చు?

11 మత్తయి 5 నుండి 7 అధ్యాయాల్లో యేసు ఇచ్చిన మంచి సలహాలను మనం చదువుతాం. సంతోషంగా ఎలా ఉండాలో, ఇతరులతో ఎలా కలిసిమెలిసి ఉండాలో, ప్రార్థన ఎలా చేయాలో, డబ్బుకు ఏ స్థానం ఇవ్వాలో అక్కడ చదువుతాం. ఆయన ఈ సలహాలను 2,000 సంవత్సరాల క్రితమే ఇచ్చాడు అయినా అవి ఇప్పటికీ చాలా శక్తివంతమైన, సహాయకరమైన మాటలు.

12 కుటుంబం సంతోషంగా ఉండడానికి, మనకున్న ఉద్యోగాన్ని చక్కగా చేయడానికి, ఇతరులతో శాంతిగా మెలగడానికి సహాయం చేసే సూత్రాలను యెహోవా బైబిలు ద్వారా మనకు నేర్పిస్తాడు. బైబిలు సూత్రాలు మనకు ఎప్పుడూ సహాయం చేస్తాయి. మనం ఎవ్వరమైనా, ఎక్కడ జీవించినా, ఎలాంటి సమస్యలతో ఉన్నా అవి మనకు సహాయం చేస్తాయి.యెషయా 48:17 చదవండి; అదనపు సమాచారంలో 3వ పాయింట్‌ చూడండి.

బైబిలు ప్రవచనాలను మీరు నమ్మవచ్చు

బైబిల్లో పుస్తకాన్ని రాసిన యెషయా, బబులోను నాశనం అవుతుందని ముందే చెప్పాడు

13. బబులోను పట్టణానికి ఏం జరుగుతుందని యెషయా చెప్పాడు?

13 చాలా బైబిలు ప్రవచనాలు ఇప్పటికే నెరవేరాయి. ఉదాహరణకు, యెషయా బబులోను నాశనమౌతుందని ప్రవచించాడు. (యెషయా 13:19) ఆ పట్టణం ఖచ్చితంగా ఎలా నాశనమౌతుందో ఆయన వివరంగా చెప్పాడు. ఆ పట్టణానికి పెద్ద గేట్లు ఉన్నాయి, దాని చుట్టూ ఒక నది ఉంది. కానీ యెషయా ఆ నది ఎండిపోతుందని, గేట్లు తెరిచే ఉంటాయని ముందే చెప్పాడు. శత్రు సైన్యం యుద్ధం చేయకుండానే ఆ పట్టణాన్ని ఆక్రమిస్తుందని, కోరెషు అనే పేరున్న అతను బబులోనును ఓడిస్తాడని కూడా యెషయా ప్రవచించాడు.—యెషయా 44:27–45:2 చదవండి; అదనపు సమాచారంలో 4వ పాయింట్‌ చూడండి.

14, 15. యెషయా ప్రవచనం ఎలా నిజమైంది?

14 ఆ ప్రవచనం రాసిన రెండు వందల సంవత్సరాల తర్వాత ఒక సైన్యం బబులోనుపై దాడి చేయడానికి వచ్చింది. ఆ సైన్యాన్ని ఎవరు నడిపిస్తున్నారు? ప్రవచనం చెప్పినట్టే పర్షియా రాజైన కోరెషు సైన్యాన్ని నడిపిస్తున్నాడు. అయితే యెషయా ప్రవచనం చెప్పినట్లే కోరెషు సైన్యం బబులోనును ఆక్రమించుకుంటుందా?

15 దాడి జరిగిన రాత్రి బబులోనీయులు విందు చేసుకుంటున్నారు. పెద్దపెద్ద గోడల వల్ల, గోడల చుట్టూ ఉన్న నది వల్ల వాళ్లకు ఏమి కాదని అనుకున్నారు. కానీ కోరెషు అతని సైన్యం, నది నీళ్లను తగ్గించడానికి పట్టణం బయట ఒక కాలువను తవ్వారు. పర్షియా సైనికులు నడిచి వెళ్లడానికి వీలుగా నీళ్లు తగ్గిపోయాయి. కానీ ఆ సైన్యం బబులోను గోడల్ని ఎలా దాటి వెళ్తుంది? ప్రవచనంలో ఉన్నట్టే పట్టణ గేట్లు తెరిచి వదిలేశారు, కాబట్టి సైనికులు యుద్ధం చేయకుండానే ఆ పట్టణాన్ని ఆక్రమించుకున్నారు.

16. (ఎ) బబులోను భవిష్యత్తు గురించి యెషయా ఏమని ప్రవచించాడు? (బి) యెషయా ప్రవచనం నిజమైందని మనకు ఎలా తెలుసు?

16 బబులోనులో చివరికి ఎవ్వరూ నివసించరని యెషయా ప్రవచించాడు. ఆయన ఇలా రాశాడు: “దానిలో ఎప్పటికీ ప్రజలు నివసించరు, తరతరాలపాటు ఎప్పటికీ అది నివాస స్థలంగా ఉండదు.” (యెషయా 13:20) నిజంగా అలానే జరిగిందా? ఇరాక్‌లో బాగ్దాద్‌కు దక్షిణాన దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో అప్పటి బబులోను ఉంది. అక్కడ ఇప్పుడంతా పాడైపోయిన స్థితిలో ఉంది. ఈ రోజు వరకు అక్కడ ఎవ్వరూ ఉండడం లేదు. యెహోవా బబులోనును “సమూలనాశనం అనే చీపురుతో” ఊడ్చేశాడు.—యెషయా 14:22, 23. b

పాడుబడిపోయిన బబులోను

17. దేవుడు చేసిన వాగ్దానాలన్నిటిని మనం ఎందుకు నమ్మవచ్చు?

17 ఎన్నో బైబిలు ప్రవచనాలు ఇప్పటికే నిజం అయ్యాయనేది వాస్తవం. దీన్నిబట్టి భవిష్యత్తు గురించి బైబిలు చెప్పేవాటిని కూడా మనం నమ్మవచ్చని అర్థమౌతుంది. భూమిని పరదైసు చేయాలనే తన వాగ్దానాన్ని యెహోవా తప్పకుండా నెరవేరుస్తాడని మనం పూర్తిగా నమ్మవచ్చు. (సంఖ్యాకాండం 23:19 చదవండి.) అవును, ‘అబద్ధమాడలేని దేవుడు ఎంతోకాలం క్రితమే వాగ్దానం చేసిన’ ‘శాశ్వత జీవితం’ అనే నిరీక్షణ మనకుంది.—తీతు 1:2. c

బైబిలు మీ జీవితాన్ని మార్చగలదు

18. పౌలు “దేవుని వాక్యం” గురించి ఏం చెప్పాడు?

18 బైబిలు లాంటి పుస్తకం ఇంకొకటి లేదని మనం నేర్చుకున్నాం. అందులో విషయాలు ఒకదానితో ఒకటి కలుస్తాయి. బైబిలు సైన్స్‌కు సంబంధించిన విషయాలు లేదా చరిత్రకు సంబంధించిన విషయాలు చెప్పినప్పుడు అన్నీ నిజాలే చెప్పింది. మనకు కావాల్సిన మంచి సలహాలు, ఇప్పటికే నెరవేరిన ఎన్నో ప్రవచనాలు కూడా అందులో ఉన్నాయి. బైబిలు ద్వారా ఇంకా ఎంతో ఉపయోగం ఉంది. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “దేవుని వాక్యం సజీవమైనది, చాలా శక్తివంతమైనది.” అంటే ఏంటి?—హెబ్రీయులు 4:12 చదవండి.

19, 20. (ఎ) మీరు ఎలాంటి వాళ్లో తెలుసుకోవడానికి బైబిలు మీకు ఎలా సహాయం చేస్తుంది? (బి) బైబిలు అనే బహుమతికి మీరు కృతజ్ఞులై ఉన్నారని ఎలా చూపించవచ్చు?

19 బైబిలు మీ జీవితాన్ని మార్చగలదు. మీరు నిజంగా ఎలాంటి వాళ్లో తెలుసుకోవడానికి బైబిలు మీకు సహాయం చేయగలదు. మీ లోతైన ఆలోచనలను, భావాలను అర్థం చేసుకోవడానికి మీకు సహాయం చేయగలదు. ఉదాహరణకు, మనం దేవున్ని ప్రేమిస్తున్నామని అనుకోవచ్చు. కానీ బైబిలు చెప్పేదాన్ని పాటించినప్పుడే మనం నిజంగా ప్రేమిస్తున్నామని రుజువు అవుతుంది.

20 బైబిలు నిజంగా దేవుడు ఇచ్చిన పుస్తకం. దాన్ని మీరు చదవాలని, అధ్యయనం చేయాలని, ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ బహుమతికి కృతజ్ఞులై, దాన్ని అధ్యయనం చేస్తూ ఉండండి. అప్పుడు మనుషుల గురించిన దేవున్ని ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకుంటారు. తర్వాత అధ్యాయంలో ఆ ఉద్దేశం గురించి మనం ఇంకా నేర్చుకుంటాం.

a బైబిల్లో విషయాలు ఒకదానితో ఒకటి సంబంధం లేనట్లు ఉంటాయని కొంతమంది అంటారు. కానీ అది నిజం కాదు. యెహోవాసాక్షులు ప్రచురించిన  ర్వమానవాళి కొరకైన గ్రంథం అనే బ్రోషురులో 16, 17 పేజీలు చూడండి.

b మీకు బైబిల్లో ఉన్న ప్రవచనాల గురించి ఇంకా తెలుసుకోవాలనుంటే యెహోవాసాక్షులు ప్రచురించిన సర్వమానవాళి కొరకైన గ్రంథం అనే బ్రోషురులో 27-29 పేజీలు చదవండి.

c బబులోను నాశనం బైబిల్లో ఉన్న ప్రవచనాల్లో ఒకటి మాత్రమే. యేసుక్రీస్తు గురించిన ప్రవచనాల కోసం మీరు అదనపు సమాచారంలో 5వ పాయింట్‌ చూడవచ్చు.