14వ అధ్యాయం
మీ కుటుంబం సంతోషంగా ఉండవచ్చు
1, 2. కుటుంబాలు ఎలా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు?
మొట్టమొదటి వివాహాన్ని యెహోవా దేవుడు చేశాడు. ఆయన మొదటి స్త్రీని తయారుచేసి “ఆమెను అతని దగ్గరికి తీసుకొచ్చాడు” అని బైబిలు చెప్తుంది. ఆదాము ఆమెను చూసి చాలా సంతోషించి “ఇది నిజంగా నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం” అని అన్నాడు. (ఆదికాండం 2:22, 23) దీన్నిబట్టి పెళ్లి చేసుకున్నవాళ్లు సంతోషంగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడని మనకు తెలుస్తుంది.
2 విచారకరంగా చాలామంది కుటుంబ జీవితంలో ఎప్పుడూ సంతోషాన్ని అనుభవించలేదు. కానీ, కుటుంబ జీవితంలో విజయం సాధించడానికి, అందరూ ఆనందంగా కలిసి ఉండడానికి కుటుంబంలో ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే ఎన్నో సలహాలు బైబిల్లో ఉన్నాయి.—లూకా 11:28.
భర్తలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు?
3, 4. (ఎ) భర్త భార్యను ఎలా చూడాలి? (బి) భార్యాభర్తలు ఒకరినొకరు క్షమించుకోవడం ఎందుకు ముఖ్యం?
3 మంచి భర్త తన భార్యను ప్రేమతో, గౌరవంతో చూసుకోవాలని బైబిలు చెప్తుంది. దయచేసి ఎఫెసీయులు 5:25-29 చదవండి. భర్త ఎప్పుడూ తన భార్యతో ప్రేమగా ఉంటాడు. ఆయన ఆమెను సంరక్షిస్తాడు, ఆమె అవసరాలు చూసుకుంటాడు, ఆమెకు హాని కలిగించేది ఏదీ చేయడు.
4 కానీ భార్య తప్పులు చేస్తే భర్త ఏమి చేయాలి? “భర్తలారా, మీ భార్యల్ని ప్రేమిస్తూ ఉండండి, వాళ్ల మీద విపరీతమైన కోపం చూపించకండి” అని భర్తలకు బైబిలు చెప్తుంది. (కొలొస్సయులు 3:19) భర్తలారా, మీరు కూడా తప్పులు చేస్తారని గుర్తు పెట్టుకోండి. పైగా దేవుడు మిమ్మల్ని క్షమించాలని మీరు కోరుకుంటే మీరు మీ భార్యను క్షమించాలి. (మత్తయి 6: 12, 14, 15) భార్యాభర్తలు ఒకరినొకరు క్షమించుకోవడానికి సిద్ధంగా ఉంటే వాళ్ల వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది.
5. భర్త భార్యను ఎందుకు గౌరవించాలి?
5 భర్త భార్యను గౌరవించాలని యెహోవా కోరుకుంటున్నాడు. భార్య అవసరాల గురించి భర్త జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. భర్త భార్యను సరిగ్గా చూసుకోకపోతే, యెహోవా అతని ప్రార్థనలను వినకపోవచ్చు. (1 పేతురు 3:7) యెహోవాను ప్రేమించేవాళ్లే ఆయనకు విలువైనవాళ్లు అవుతారు, ఆయన మగవాళ్లను ఆడవాళ్ల కన్నా ఎక్కువగా చూడడు.
6. భార్య, భర్త “ఒకే శరీరంగా” ఉండడం అంటే ఏంటి?
6 భార్య, భర్త “ఇక ఇద్దరుగా కాదుగానీ ఒకే శరీరంగా ఉంటారు” అని యేసు చెప్పాడు. (మత్తయి 19:6) వాళ్లు ఒకరికొకరు నమ్మకంగా ఉంటారు, ఒకరికొకరు ఎప్పుడూ నమ్మకద్రోహం చేసుకోరు. (సామెతలు 5:15-21; హెబ్రీయులు 13:4) భార్యాభర్తలు ఒకరి లైంగిక అవసరాలను ఒకరు నిస్వార్థంగా పట్టించుకోవాలి. (1 కొరింథీయులు 7:3-5) “ఏ మనిషీ తన శరీరాన్ని ద్వేషించుకోడు కానీ దాన్ని పోషించి, సంరక్షించుకుంటాడు” అనే విషయాన్ని భర్త గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆయన తన భార్యను ప్రేమించి, ఆమెకు విలువివ్వాలి. భార్య అన్నిటికన్నా ముఖ్యంగా, భర్త తనతో దయగా, ప్రేమగా ఉండాలని కోరుకుంటుంది.—ఎఫెసీయులు 5:29.
భార్యలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు?
7. కుటుంబానికి కుటుంబ పెద్ద ఎందుకు అవసరం?
7 కుటుంబమంతా కలిసి పనిచేసేలా నడిపించడానికి ప్రతి కుటుంబానికి ఒక పెద్ద లేదా శిరస్సు ఉండాలి. 1 కొరింథీయులు 11:3 లో బైబిలు ఇలా చెప్తుంది: “ప్రతీ పురుషునికి శిరస్సు క్రీస్తు; స్త్రీకి శిరస్సు పురుషుడు; క్రీస్తుకు శిరస్సు దేవుడు.”
8. భార్య తన భర్తకు ప్రగాఢ గౌరవం ఎలా చూపించవచ్చు?
8 భర్తలందరూ తప్పులు చేస్తారు. కానీ భార్య తన భర్త నిర్ణయాలకు మద్దతు ఇచ్చి, ఇష్టపూర్వకంగా సహకరిస్తే కుటుంబం మొత్తం ప్రయోజనం పొందుతుంది. (1 పేతురు 3:1-6) భార్యకు “తన భర్త మీద ప్రగాఢ గౌరవం ఉండాలి” అని బైబిలు చెప్తుంది. (ఎఫెసీయులు 5:33) కానీ భార్య మత నమ్మకాలను భర్త ఒప్పుకోకపోతే అప్పుడు ఏమి చేయాలి? అప్పుడు కూడా భార్య తన భర్త మీద ఎంతో గౌరవంతో ఉండాలి. బైబిలు ఇలా చెప్తుంది “భార్యలారా, మీరు మీ భర్తలకు లోబడివుండండి. అప్పుడు, భర్త ఒకవేళ వాక్యానికి లోబడని వ్యక్తయితే, అతను భార్య మంచి ప్రవర్తనను చూసి వాక్యం లేకుండానే విశ్వాసంలోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు చూపించే ప్రగాఢ గౌరవాన్ని, మీ పవిత్ర ప్రవర్తనను అతను కళ్లారా చూస్తాడు.” (1 పేతురు 3:1, 2) భార్య మంచి ప్రవర్తనను బట్టి భర్త ఆమె మత విశ్వాసాలను అర్థం చేసుకుని, గౌరవించగలడు.
9. (ఎ) భార్యకు తన భర్త అభిప్రాయం నచ్చకపోతే ఏమి చేయాలి? (బి) తీతు 2:4, 5 లో భార్యలకు ఉన్న సలహా ఏంటి?
9 భార్యకు తన భర్త అభిప్రాయం నచ్చకపోతే ఏమి చేయాలి? ఆమె తన అభిప్రాయాలను గౌరవంగా చెప్పాలి. ఉదాహరణకు ఒకసారి శారా అబ్రాహాముకు నచ్చని విషయాన్ని చెప్పింది. కానీ యెహోవా ఆయనతో “ఆమె మాట విను” అని చెప్పాడు. (ఆదికాండం 21:9-12) ఒక క్రైస్తవ భర్త తీసుకున్న నిర్ణయం బైబిలుకు వ్యతిరేకంగా ఉండే అవకాశం చాలా తక్కువ. కాబట్టి భార్య తన భర్త నిర్ణయానికి మద్దతు ఇవ్వాలి. (అపొస్తలుల కార్యాలు 5:29; ఎఫెసీయులు 5:24) ఒక మంచి భార్య కుటుంబాన్ని బాగా చూసుకుంటుంది. (తీతు 2:4, 5 చదవండి.) భర్త కోసం, పిల్లల కోసం భార్య ఎంత కష్టపడుతుందో చూసినప్పుడు వాళ్లు ఆమెను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తారు, గౌరవిస్తారు.—సామెతలు 31:10, 28.
10. బైబిలు వేరైపోవడం, విడాకులు గురించి ఏమి చెప్తుంది?
10 కొన్నిసార్లు భార్యాభర్తలు తొందరపడి, వేరైపోవాలని లేదా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. కానీ “భార్య తన భర్త నుండి విడిపోకూడదు,” “భర్త తన భార్యను వదిలేయకూడదు” అని బైబిలు చెప్తుంది. (1 కొరింథీయులు 7:10, 11) కొన్ని విపరీతమైన పరిస్థితుల్లోనే భార్యాభర్తలు వేరుగా ఉండవచ్చు, కానీ ఆ నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. మరి విడాకులు సంగతి ఏంటి? భార్యాభర్తలు విడాకులు తీసుకోవడానికి బైబిలు ఒకే ఒక్క సరైన కారణం చెప్తుంది. భర్తగానీ భార్యగానీ వేరేవాళ్లతో శారీరక సంబంధం పెట్టుకుంటే మాత్రమే వాళ్లు విడాకులు తీసుకోవచ్చు.—మత్తయి 19:9.
తల్లిదండ్రులు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు?
11. పిల్లలకు అన్నిటికన్నా ముఖ్యంగా ఏమి అవసరం?
11 తల్లిదండ్రులారా, మీ పిల్లలతో వీలైనంత ఎక్కువ సమయం గడపాలి. మీ పిల్లలకు మీరు అవసరం, అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్లకు యెహోవా గురించి నేర్పించడానికి మీరు ఎంతో అవసరం.—ద్వితీయోపదేశకాండం 6:4-9.
12. తల్లిదండ్రులు పిల్లల్ని కాపాడుకోవడానికి ఏమి చేయాలి?
12 సాతాను లోకం అంతకంతకు దుర్మార్గంగా తయారౌతుంది. మన పిల్లలకు హాని చేయాలని, లైంగిక దాడి చేయాలని అనుకునేవాళ్లు కొంతమంది ఉంటారు. ఈ విషయం గురించి మాట్లాడడం కొంతమంది తల్లిదండ్రులకు కష్టంగా ఉండవచ్చు. కానీ తల్లిదండ్రులు అలాంటి వాళ్ల గురించి పిల్లలకు జాగ్రత్తలు చెప్పాలి, వాళ్లకు ఎలా దూరంగా ఉండాలో నేర్పించాలి. తల్లిదండ్రులారా మీరు మీ పిల్లలను కాపాడుకోవాలి. a—1 పేతురు 5:8.
13. తల్లిదండ్రులు పిల్లలకు ఎలా నేర్పించాలి?
13 పిల్లలు ఎలా ప్రవర్తించాలో నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. మీరు మీ పిల్లలకు ఎలా నేర్పించవచ్చు? మీ పిల్లలకు శిక్షణ అవసరం, కానీ వాళ్లను సరిదిద్దేటప్పుడు మరీ కఠినంగా లేదా క్రూరంగా ఎప్పుడూ ఉండకూడదు. (యిర్మీయా 30:11) కాబట్టి మీరు కోపంగా ఉన్నప్పుడు మీ పిల్లలకు క్రమశిక్షణ ఇవ్వకండి. “కత్తిపోట్ల లాంటి” మాటలతో మీ పిల్లలను బాధపెట్టాలని మీరు కోరుకోరు కదా. (సామెతలు 12:18) మీ పిల్లలు ఎందుకు లోబడి ఉండాలో అర్థం చేసుకునేలా వాళ్లకు నేర్పించండి.—ఎఫెసీయులు 6:4; హెబ్రీయులు 12:9-11; అదనపు సమాచారంలో 30వ పాయింట్ చూడండి.
పిల్లలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు?
14, 15. పిల్లలు ఎందుకు అమ్మానాన్నలకు లోబడాలి?
14 యేసు ఎప్పుడూ తన తండ్రికి లోబడ్డాడు. సులువుగా లేని సమయంలో కూడా లోబడ్డాడు. (లూకా 22:42; యోహాను 8:28, 29) పిల్లలు కూడా వాళ్ల అమ్మానాన్నలకు లోబడాలని యెహోవా కోరుకుంటున్నాడు.—ఎఫెసీయులు 6:1-3.
15 పిల్లలూ, మీ అమ్మానాన్నల మాట వినడం మీకు కష్టంగా అనిపించినప్పటికీ మీరు లోబడి ఉంటే, యెహోవా అలాగే, మీ అమ్మానాన్నలు మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తారని గుర్తుపెట్టుకోండి. b—సామెతలు 1:8; 6:20; 23:22-25.
16. (ఎ) చెడ్డ పనులు చేసేలా పిల్లల్ని బలవంతపెట్టడానికి సాతాను ఎలా ప్రయత్నిస్తాడు? (బి) యెహోవా మీద ప్రేమ ఉన్నవాళ్లను ఫ్రెండ్స్‌గా చేసుకోవడం ఎందుకు ముఖ్యం?
16 మీతో తప్పులు చేయించడానికి సాతాను మీ స్నేహితుల్ని లేదా మిగతా పిల్లల్ని ఉపయోగించుకోగలడు. అందరూ కలిసి బలవంతపెడితే తప్పు చేయకుండా ఉండడం చాలా కష్టమని సాతానుకి తెలుసు. ఉదాహరణకు, యాకోబు కూతురైన దీనాకు యెహోవాను ప్రేమించని స్నేహితులు ఉన్నారు. దానివల్ల ఆమెకు, ఆమె కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది. (ఆదికాండం 34:1, 2) మీ ఫ్రెండ్స్‌కి యెహోవా మీద ప్రేమ లేకపోతే, వాళ్లు మిమ్మల్ని యెహోవాకు ఇష్టంలేని పని చేసేలా బలవంతపెట్టవచ్చు. దానివల్ల మీకు, మీ కుటుంబానికి, దేవునికి చాలా బాధ కలుగుతుంది. (సామెతలు 17:21, 25) అందుకే యెహోవా మీద ప్రేమ ఉన్నవాళ్లను ఫ్రెండ్స్‌గా చేసుకోవడం చాలా ముఖ్యం.—1 కొరింథీయులు 15:33.
మీ కుటుంబం సంతోషంగా ఉండవచ్చు
17. కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఏ బాధ్యత ఉంది?
17 కుటుంబంలో ఉన్నవాళ్లందరూ దేవుని నియమాలను పాటిస్తే చాలా సమస్యల్ని, కష్టాల్ని తప్పించుకోవచ్చు. కాబట్టి మీరు భర్త అయితే మీ భార్యని ప్రేమించండి, ఆమెను ప్రేమగా చూసుకోండి. మీరు భార్య అయితే, మీ భర్తకు గౌరవం చూపించండి, లోబడి ఉండండి. సామెతలు 31:10-31 లో ఉన్న భార్య ఆదర్శాన్ని పాటించండి. మీరు తల్లిదండ్రులైతే, దేవున్ని ప్రేమించమని మీ పిల్లలకు నేర్పించండి. (సామెతలు 22:6) మీరు తండ్రి అయితే మీ కుటుంబాన్ని “చక్కగా” నడిపించండి. (1 తిమోతి 3:4, 5; 5:8) పిల్లలూ, మీ అమ్మానాన్నల మాట వినండి. (కొలొస్సయులు 3:20) కుటుంబంలో ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారని గుర్తు పెట్టుకోవాలి, కాబట్టి వినయంగా ఒకరిని ఒకరు క్షమించమని అడగండి. అవును, కుటుంబంలో ప్రతి ఒక్కరికీ యెహోవా ఇచ్చే సలహాలు బైబిల్లో ఉన్నాయి.
a మీ పిల్లల్ని ఎలా కాపాడుకోవచ్చు అనే విషయం గురించి ఎక్కువ సమాచారం తెలుసుకోవడానికి యెహోవాసాక్షులు ప్రచురించిన గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి అనే పుస్తకంలో 32వ అధ్యాయం చూడవచ్చు.
b తల్లిదండ్రులు దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఏమైనా చేయమని చెప్తే పిల్లలు తల్లిదండ్రులకు లోబడాల్సిన అవసరం లేదు.—అపొస్తలుల కార్యాలు 5:29.