కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెషయా యెహోవా “ఆశ్చర్యమైన కార్యమును” ప్రవచిస్తాడు

యెషయా యెహోవా “ఆశ్చర్యమైన కార్యమును” ప్రవచిస్తాడు

ఇరవై-రెండవ అధ్యాయం

యెషయా యెహోవా “ఆశ్చర్యమైన కార్యమును” ప్రవచిస్తాడు

యెషయా 28:1–29:24

1, 2. యూదా ఇశ్రాయేలులు ఎందుకు సురక్షితంగా ఉన్నట్లు భావిస్తాయి?

 ఇశ్రాయేలు యూదాలు కొంతకాలంపాటు సురక్షితంగా ఉన్నట్లు భావిస్తాయి. ప్రమాదకరమైన ప్రపంచంలో భద్రతను కనుగొనడానికి వాటి నాయకులు ఎంతో కష్టపడి తమకన్నా పెద్దవైన, మరింత శక్తిమంతమైన రాజ్యాలతో రాజకీయ సంధి చేసుకున్నారు. ఇశ్రాయేలు రాజధాని అయిన షోమ్రోను పొరుగునున్న సిరియా వైపు తిరిగితే, యూదా రాజధాని అయిన యెరూషలేము కనికరంలేని అష్షూరుపై ఆశలు పెట్టుకుంది.

2 క్రొత్త రాజకీయ సంధిపై నమ్మకాన్ని పెట్టుకోవడమే గాక, ఉత్తర రాజ్యంలోని కొందరు, తాము ఆరాధనలో బంగారు దూడలను ఉపయోగించడం కొనసాగిస్తున్నప్పటికీ యెహోవాయే తమను కాపాడాలని ఎదురు చూడవచ్చు. యూదా కూడా అలాగే తాను యెహోవా కాపుదలపై ఆధారపడవచ్చునని నమ్ముతోంది. ఎంతైనా, యెహోవా ఆలయం వారి రాజధాని నగరమైన యెరూషలేములో ఉందికదా? అయితే రెండు రాజ్యాలకు ఎదురు చూడని సంఘటనలు జరుగబోతున్నాయి. యెహోవా, దారితప్పిన తన ప్రజలకు నిజంగా ఆశ్చర్యమైనవిగా అనిపించే పరిణామాల గురించి ప్రవచించేలా యెషయాను ప్రేరేపిస్తాడు. ఆయన మాటలు నేడు ప్రతి ఒక్కరికి ప్రాముఖ్యమైన పాఠాలను కలిగివున్నాయి.

‘త్రాగుబోతులగు ఎఫ్రాయిమీయులు’

3, 4. ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు దేని గురించి గర్విస్తుంది?

3 యెషయా తన ప్రవచనాన్ని ఈ విభ్రాంతికరమైన మాటలతో ప్రారంభిస్తున్నాడు: “త్రాగుబోతులగు ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటమునకు శ్రమ, వాడిపోవుచున్న పుష్పమువంటి వారి సుందర భూషణమునకు శ్రమ. ద్రాక్షారసమువలన కూలిపోయినవారి ఫలవంతమైన లోయ తలమీదనున్న కిరీటమునకు శ్రమ. ఆలకించుడి, బలపరాక్రమములు గలవాడొకడు ప్రభువుకు ఉన్నాడు. ప్రచండమైన వడగండ్లు . . . కొట్టివేయునట్లు ఆయన తన బలముచేత పడద్రోయువాడు. త్రాగుబోతులగు ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటము కాళ్లతో త్రొక్కబడును.”​—యెషయా 28:1-3.

4 ఉత్తరానగల పది గోత్రాల్లో ప్రముఖమైనది ఎఫ్రాయీము, మొత్తం ఇశ్రాయేలు రాజ్యమంతటికీ ప్రాతినిధ్యం వహిస్తుంది. దాని రాజధానియైన షోమ్రోను, “ఫలవంతమైన లోయ తల” వద్ద సుందరమైన, ఉన్నతమైన స్థానంలో ఉంది. ఎఫ్రాయిము నాయకులు, యెరూషలేములోని దావీదు రాజరికం నుండి స్వతంత్రంగా ఉండడమనే తమ “అతిశయ కిరీటము”ను బట్టి గర్విస్తారు. కానీ వారు ‘త్రాగుబోతులు,’ యూదాకు వ్యతిరేకంగా సిరియాతో తాము చేసుకున్న సంధిని బట్టి వారు ఆధ్యాత్మిక మత్తులో ఉన్నారు. వారు విలువైనదిగా ఎంచే ప్రతిదీ దాడిచేసేవారి కాళ్ల క్రింద త్రొక్కబడనై ఉంది.​—⁠యెషయా 29:9 పోల్చండి.

5. ఇశ్రాయేలు ఎలాంటి అపాయకరమైన స్థితిలో ఉంది, కానీ యెషయా ఏ నిరీక్షణను ఇస్తున్నాడు?

5 ఎఫ్రాయిము తానున్న అపాయకరమైన స్థితిని గుర్తించదు. యెషయా ఇలా కొనసాగిస్తున్నాడు: “ఫలవంతమైన లోయ తలమీదనున్న వాడిపోవు పుష్పమువంటిదాని సుందరభూషణము వసంతకాలము రాకమునుపు పండిన మొదటి అంజూరపు పండువలె అగును దాని కనుగొనువాడు దాని చూడగానే అది వాని చేతిలో పడిన వెంటనే అది మ్రింగివేయబడును.” (యెషయా 28:4) ఎఫ్రాయిము, ఒక్కసారి నోట్లో వేసుకొని మ్రింగివేయగల తీపి పదార్థంలా అష్షూరు చేతిలో పడుతుంది. దానికిక ఏ నిరీక్షణా లేదా? మామూలుగా యెషయా తీర్పు ప్రవచనాల్లో నిరీక్షణ సమ్మిళితమై ఉంటుంది. ఆ రాజ్యం కూలిపోయినప్పటికీ, నమ్మకమైన వ్యక్తులు యెహోవా సహాయంతో మనుగడ సాగించగలుగుతారు. “ఆ దినమున సైన్యములకధిపతియగు యెహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా నుండును సౌందర్యముగల మకుటముగా నుండును. ఆయన న్యాయపీఠముమీద కూర్చుండువారికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను, గుమ్మమునొద్ద యుద్ధమును పారగొట్టువారికి పరాక్రమము పుట్టించువాడుగాను ఉండును.”​—యెషయా 28:5, 6.

“సొక్కి సోలుదురు”

6. ఇశ్రాయేలు ఎప్పుడు నాశనాన్ని ఎదుర్కొంటుంది, కానీ యూదా ఎందుకు సంతోషించకూడదు?

6 అష్షూరీయులు దేశమును నాశనం చేసి, ఉత్తర రాజ్యం స్వతంత్ర రాజ్యంగా ఇక మనుగడ సాగించలేకపోయినప్పుడు, సా.శ.పూ. 740 లో షోమ్రోనుకు లెక్కచూసే దినం వస్తుంది. మరి యూదా విషయమేమిటి? దాని దేశాన్ని అష్షూరు స్వాధీనం చేసుకుంటుంది, తర్వాత బబులోను దాని రాజధాని నగరాన్ని నాశనం చేస్తుంది. కానీ యెషయా జీవిత కాలంలో, యూదా ఆలయము, యాజకత్వము అమలులో ఉంటాయి, దాని ప్రవక్తలు ప్రవచించడం కొనసాగిస్తారు. ఉత్తరం వైపున్న తన పొరుగు రాజ్యంపైకి రానున్న నాశనాన్ని బట్టి యూదా సంతోషించాలా? ఎంతమాత్రం సంతోషించకూడదు! యూదా, దాని నాయకులు చూపించిన అవిధేయతను, విశ్వాసలేమిని బట్టి యెహోవా వారిని కూడా లెక్క అప్పజెప్పమని అడుగుతాడు.

7. యూదా నాయకులు ఏ భావంలో త్రాగి ఉన్నారు, దాని ఫలితమేమిటి?

7 తన సందేశాన్ని యూదా వైపు మళ్ళిస్తూ, యెషయా ఇలా కొనసాగిస్తున్నాడు: “అయితే వీరును ద్రాక్షారసమువలన సొక్కి సోలుదురు మద్యమువలన తత్తరపడుదురు. యాజకులేమి ప్రవక్తలేమి అందరును మద్యమువలన సొక్కి సోలుదురు, ద్రాక్షారసము వారిని మ్రింగివేయుచున్నది మద్యమువలన తత్తరపడుచున్నారు దర్శనము కలుగునప్పుడు సోలుదురు తీర్పుతీర్చుకాలమున తత్తరపడుదురు. వారి భోజనపు బల్లలన్నియు వాంతితోను కల్మషములతోను నిండియున్నవి అవి లేనిచోటు లేదు.” (యెషయా 28:​7, 8) ఎంత అసహ్యకరమోగదా! దేవుని ఆలయంలో అక్షరార్థమైన త్రాగుబోతుతనమే తప్పు. కానీ ఈ యాజకులు, ప్రవక్తలు ఆధ్యాత్మికంగా మత్తులై ఉన్నారు, వారి మనస్సులు మానవులతో చేసుకున్న సంధిపై విపరీతమైన నమ్మకంతో మబ్బు కమ్మినట్లు ఉన్నాయి. బహుశా ఒకవేళ యెహోవా కాపుదల తగినంతగా లభించకపోతే తమకు మద్దతునిచ్చే మరో పథకం ఉందని నమ్ముతూ, తమ విధానం మాత్రమే ఆచరణాత్మకమైనదని ఆలోచించేలా వారు తమను తాము మోసం చేసుకున్నారు. ఆధ్యాత్మికంగా మత్తులై ఉన్న స్థితిలో, ఈ మత నాయకులు, దేవుని వాగ్దానాలపై బొత్తిగా విశ్వాసం లేకుండా, తిరుగుబాటుచేసే, అపరిశుభ్రమైన వ్యక్తీకరణలను బయటికి వెళ్లగ్రక్కుతారు.

8. యెషయా సందేశానికి ప్రతిస్పందన ఎలా ఉంటుంది?

8 యూదా నాయకులు యెహోవా హెచ్చరికకు ఎలా ప్రతిస్పందిస్తారు? యెషయా తమతో పసివారితో మాట్లాడినట్లు మాట్లాడుతున్నాడని నిందిస్తూ వారు ఆయనను ఇలా అపహాస్యం చేస్తారు: “వాడు ఎవరికి విద్య నేర్పును? ఎవరికి వర్తమానము తెలియజేయును? తల్లి పాలు విడిచినవారికా? చన్ను విడిచినవారికా? ఆజ్ఞవెంబడి ఆజ్ఞ, ఆజ్ఞవెంబడి ఆజ్ఞ, సూత్రమువెంబడి సూత్రము, సూత్రమువెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నా[డు].” (యిషయా 28:​9, 10) యెషయా మాటలు వారికి పదే పదే చెప్పబడేవిగా, వింతగా అనిపిస్తాయి! ‘యెహోవా ఇలా ఆజ్ఞాపించాడు! యెహోవా ఇలా ఆజ్ఞాపించాడు! ఇది యెహోవా ప్రమాణం! ఇది యెహోవా ప్రమాణం!’ అని చెబుతూ, ఆయన చెప్పిందే చెబుతూ ఉంటాడు. a కానీ యెహోవా చర్య ద్వారా యూదా నివాసులతో త్వరలోనే ‘మాటలాడతాడు.’ ఆయన వారిపైకి బబులోను సైన్యాన్ని​—⁠నిజంగా వేరే భాష మాట్లాడే విదేశీయులను పంపిస్తాడు. ఆ సైన్యాలు యెహోవా యొక్క “ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ”ను నెరవేరుస్తారు, యూదా కూలిపోతుంది.​—⁠యెషయా 28:​11-13 చదవండి.

నేటి ఆధ్యాత్మిక త్రాగుబోతులు

9, 10. యెషయా మాటలు తర్వాతి తరాలవారికి ఎప్పుడు, ఎలా భావాన్ని కలిగివున్నాయి?

9 యెషయా ప్రవచనాలు ప్రాచీన ఇశ్రాయేలు యూదాలపైనే నెరవేరాయా? ఎంతమాత్రం కాదు! యేసు, పౌలు ఇద్దరూ కూడా ఆయన మాటలను ఎత్తి చెప్పి, తమ కాలంనాటి జనానికి వాటిని అన్వయించారు. (యెషయా 29:10, 13; మత్తయి 15:​7-9; రోమీయులు 11:8) నేడు కూడా, యెషయా కాలం నాటి పరిస్థితే తలెత్తింది.

10 ఈసారి, రాజకీయాల్లో విశ్వాసం ఉంచినది క్రైస్తవమత సామ్రాజ్యానికి చెందిన మతనాయకులు. వారు ఇశ్రాయేలు యూదాలలోని త్రాగుబోతుల్లా, రాజకీయ విషయాల్లో జోక్యం చేసుకుంటూ, ఈ లోకంలోని పేరుకు గొప్పవారనే వారు తమను సంప్రదిస్తున్నందుకు ఆనందిస్తూ, తూలుతూ తొట్రుపడుతూ నడుస్తున్నారు. వారు స్వచ్ఛమైన బైబిలు సత్యాన్ని మాట్లాడే బదులు, అపవిత్రమైన విషయాలను గురించి మాట్లాడతారు. వారి ఆధ్యాత్మిక దృష్టి మందగించింది, వారు మానవజాతికి నిరపాయకరమైన మార్గనిర్దేశకులు కాదు.​—⁠మత్తయి 15:14.

11. క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకులు దేవుని రాజ్య సువార్తకు ఎలా ప్రతిస్పందిస్తారు?

11 యెహోవాసాక్షులు ఏకైక నిజమైన నిరీక్షణ వైపు అంటే దేవుని రాజ్యం వైపు క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకుల అవధానాన్ని మళ్ళించినప్పుడు వారెలా ప్రతిస్పందిస్తారు? వారికది అర్థం కాదు. వారికి, సాక్షులు పసిపిల్లల్లా అర్థం పర్థం లేకుండా ఒకే విషయాన్ని పదేపదే చెబుతున్నట్లుగా ఉంటుంది. మతనాయకులు ఈ సందేశకులను చిన్నచూపు చూసి, వారిని అపహసిస్తారు. యేసు కాలం నాటి యూదుల్లా, వారికి దేవుని రాజ్యం అవసరం లేదు, తమ మందలు దాన్ని గురించి వినడం కూడా వారికి ఇష్టం లేదు. (మత్తయి 23:​13) కాబట్టి, యెహోవా ఎల్లకాలం కేవలం నిరపాయకరమైన తన సందేశకుల ద్వారా మాత్రమే మాట్లాడడని వారికి హెచ్చరిక చేయబడుతోంది. దేవుని రాజ్యానికి విధేయులు కాని వారు “విరుగబడి చిక్కుబడి పట్టబడు” కాలం అంటే పూర్తిగా నాశనమయ్యే కాలం వస్తుంది.

“మరణముతో నిబంధన”

12. “మరణముతో నిబంధన” చేసుకున్నానని యూదా భావిస్తున్నది ఏమిటి?

12 యెషయా తన ప్రకటనను ఇలా కొనసాగిస్తున్నాడు: “మేము మరణముతో నిబంధన చేసికొంటిమి పాతాళముతో ఏకమైతిమి ఉపద్రవము ప్రవాహమువలె వడిగా దాటునప్పుడు అది మాయొద్దకు రాదు అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసికొంటిమి మాయక్రింద దాగియున్నాము అని మీరు చెప్పుకొనుచున్నారే.” (యిషయా 28:​14, 15) తమ రాజకీయ సంధి అపజయం నుండి తమను కాపాడుతుందని యూదా నాయకులు గొప్పలు చెప్పుకుంటారు. తమను విడిచి పెట్టమని తాము “మరణముతో నిబంధన” చేసుకున్నామని వారు భావిస్తారు. కాని వారి నిరర్థకమైన ఆశ్రయం వారిని కాపాడలేదు. వారి సంధి ఒక అబద్ధం, అసత్యం. అలాగే నేడు, క్రైస్తవమత సామ్రాజ్యానికి ప్రపంచ నాయకులతో ఉన్న సన్నిహిత సంబంధం, యెహోవా దాన్ని లెక్క అప్పజెప్పమని అడిగే సమయం వచ్చినప్పుడు దాన్ని కాపాడదు. నిజానికి, అదే దాని నాశనానికి నడిపిస్తుంది.​—⁠ప్రకటన 17:16, 17.

13. “పరిశోధింపబడిన రాయి” ఎవరు, క్రైస్తవమత సామ్రాజ్యం ఆయనను ఎలా నిరాకరించింది?

13 మరి ఈ మత నాయకులు ఎవరివైపు చూడాలి? యెషయా ఇప్పుడు యెహోవా వాగ్దానాన్ని ఇలా వ్రాస్తున్నాడు: “సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి. బహు స్థిరమైన పునాదియైన మూలరాయియై యున్నది విశ్వసించువాడు కలవరపడడు. నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపుగుండుగాను పెట్టెదను; వడగండ్లు మీ మాయాశరణ్యమును కొట్టివేయును, దాగియున్నచోటు నీళ్లచేత కొట్టుకొనిపోవును.” (యెషయా 28:​16, 17) యెషయా ఈ మాటలు మాట్లాడి ఎంతో కాలం గడవక ముందే, నమ్మకమైన హిజ్కియా రాజు సీయోనులో సింహాసనాసీనునిగా చేయబడతాడు, పొరుగునున్న మిత్ర రాజ్యాల ద్వారా కాదుగానీ యెహోవా జోక్యం చేసుకోవడం ద్వారానే ఆయన రాజ్యం రక్షించబడుతుంది. అయితే, ఈ ప్రేరేపిత మాటలు హిజ్కియా నందు నెరవేరలేదు. అపొస్తలుడైన పేతురు యెషయా మాటలను ఎత్తి చెబుతూ, హిజ్కియా వంశీయుడైన యేసు క్రీస్తుయే “పరిశోధింపబడిన రాయి” అని, ఆయనపై విశ్వాసం ఉంచేవారెవరూ భయపడవలసిన అవసరం లేదని చూపించాడు. (1 పేతురు 2:6) క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకులు తమను తాము క్రైస్తవులమని చెప్పుకుంటూ, యేసు చేయడానికి నిరాకరించినదాన్ని చేయడం ఎంత విచారకరం! రాజైన యేసు క్రీస్తు ఆధ్వర్యంలోని యెహోవా రాజ్యం కొరకు వేచివుండే బదులు, వారు ఈ లోకంలో పేరుప్రతిష్ఠలను, అధికారాన్ని పొందడానికి కృషి చేశారు.​—⁠మత్తయి 4:8-10.

14. యూదా ‘మరణముతో చేసుకున్న నిబంధన’ ఎప్పుడు కొట్టివేయబడుతుంది?

14 దేశంపైకి బబులోను సైన్యాల ‘ప్రవాహమువంటి ఉపద్రవము’ వచ్చినప్పుడు, యెహోవా యూదా యొక్క రాజకీయ ఆశ్రయం ఒక అబద్ధమని బయలుపరుస్తాడు. “మరణముతో మీరు చేసికొనిన నిబంధన కొట్టివేయబడును” అని యెహోవా చెబుతున్నాడు. “ప్రవాహమువలె ఉపద్రవము మీ మీదుగా దాటునప్పుడు మీరు దానిచేత త్రొక్కబడిన వారగుదురు. వచ్చునప్పుడెల్లను . . .  ఇట్టి ప్రకటన గ్రహించుటవలన మహా భయము పుట్టును.” (యెషయా 28:​18, 19) అవును, యెహోవా సేవ చేస్తున్నామని చెప్పుకుంటూ, దేశాలతో తాము చేసుకున్న సంధిపై తమ నమ్మకం పెట్టుకునే వారికి జరిగే దాని నుండి ఒక శక్తివంతమైన పాఠం నేర్చుకోవలసి ఉంది.

15. యూదా కాపుదల లోపాన్ని యెషయా ఎలా ఉదహరిస్తున్నాడు?

15 యూదా యొక్క ఈ నాయకులు ఇప్పుడు ఉండే స్థితిని పరిశీలించండి. “పండుకొనుటకు మంచము పొడుగు చాలదు, కప్పుకొనుటకు దుప్పటి వెడల్పు చాలదు.” (యెషయా 28:​20) అదెలా ఉందంటే, వారు విశ్రాంతి కోసం పడుకోవాలని అనుకుంటారు గానీ, వ్యర్థమే. వారి కాళ్లు చలిలో మంచము వెలుపలే ఉండిపోతాయి లేదా వెచ్చగా ఉండేలా కప్పుకునేందుకు దుప్పటి వెడల్పయినా సరిపోదు. యెషయా కాలంలో అసౌఖర్యమైన పరిస్థితి అలా ఉంది. ఆశ్రయం గురించి క్రైస్తవమత సామ్రాజ్యం చెబుతున్న అబద్ధంపై తమ నమ్మకాన్ని పెట్టుకునేవారి పరిస్థితి నేడు అలాగే ఉంటుంది. క్రైస్తవమత సామ్రజ్యంలోని కొందరు మతనాయకులు రాజకీయాల్లో పాల్గొనడం ద్వారా జాతి ప్రక్షాళణ, జాతి నిర్మూలన వంటి దారుణమైన కృత్యాల్లో భాగం కలిగివుండడం ఎంత హేయకరమో కదా!

యెహోవా “ఆశ్చర్యమైన కార్యము”

16. యెహోవా “ఆశ్చర్యమైన కార్యము” ఏది, ఈ పని ఎందుకు అపూర్వమైనది?

16 తుది ఫలితం, యూదా మత నాయకులు ఆశిస్తున్న దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. యూదాలోని ఆధ్యాత్మిక త్రాగుబోతులకు యెహోవా ఆశ్చర్యకరమైనదొకటి చేస్తాడు. “నిజముగా తన కార్యమును తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు అపూర్వమైన తన కార్యము నొనరించుటకు ఆయన పెరాజీము అను కొండమీద లేచినట్లు యెహోవా లేచును, గిబియోనులోయలో ఆయన రేగినట్లు రేగును.” (యెషయా 28:​21) దావీదు రాజు కాలంలో, యెహోవా తన ప్రజలకు పెరాజీము కొండ వద్ద, గిబియోను లోయ వద్ద ఫిలిష్తీయులపై గమనార్హమైన విజయాలను అనుగ్రహించాడు. (1 దినవృత్తాంతములు 14:​10-16) యెహోషువ కాలంలో, ఇశ్రాయేలీయులు అమ్మోరీయులపై విజయం సాధించడం ముగిసేవరకూ ఆయన గిబియోనుపై సూర్యుడు నిలిచి ఉండేలా చేశాడు. (యెహోషువ 10:​8-14) అది అత్యంత అపూర్వమైనది! ఇప్పుడు మళ్లీ యెహోవా పోరాడుతాడు, కానీ ఈసారీ ఆయన ప్రజలమని చెప్పుకుంటున్న వారికి వ్యతిరేకంగా పోరాడుతాడు. అంతకంటే ఆశ్చర్యకరమైనది లేక అపూర్వమైనది ఏదైనా ఉండగలదా? యెరూషలేము యెహోవా ఆరాధనకు కేంద్రమనే వాస్తవాన్ని, యెహోవా అభిషిక్త రాజు నగరమనే వాస్తవాన్ని పరిగణలోకి తీసుకుంటే, ఏదీ అంత ఆశ్చర్యకరమైనదిగా అనిపించదు. ఇప్పటివరకు, యెరూషలేములోని దావీదు రాజగృహం ఎన్నడూ పడద్రోయబడలేదు. అయినప్పటికీ, యెహోవా తప్పకుండా తన “ఆశ్చర్యమైన కార్యమును” నెరవేరుస్తాడు.​—⁠హబక్కూకు 1:5-7 పోల్చండి.

17. యెషయా ప్రవచన నెరవేర్పుపై పరిహాసం ఏ ప్రభావాన్ని చూపుతుంది?

17 కాబట్టి, యెషయా ఇలా హెచ్చరిస్తున్నాడు: “మీ బంధకములు మరి బిగింపబడకుండునట్లు పరిహాసకులై యుండకుడి. భూమియందంతట నాశనము ఖండితముగా నియమింపబడెను. ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవావలన నేను దాని సమాచారము వింటిని.” (యెషయా 28:​22) నాయకులు పరిహాసం చేసినప్పటికీ, యెషయా సందేశం నిజమే. ఇది ఆయన, ఆ నాయకులు నిబంధన సంబంధాన్ని కలిగివున్న యెహోవా నుండి విన్నాడు. అలాగే నేడు, క్రైస్తవమత సామ్రాజ్యంలోని మతనాయకులు యెహోవా ‘ఆశ్చర్యమైన కార్యమును’ విన్నప్పుడు పరిహాసం చేస్తారు. వారు యెహోవాసాక్షులకు వ్యతిరేకంగా బిగ్గరగా, కోపంగా మాట్లాడతారు. కానీ యెహోవా సాక్షులు ప్రకటించే సందేశం మాత్రం సత్యం. ఆ నాయకులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకొనే పుస్తకమైన బైబిలులో దాన్ని కనుగొనవచ్చు.

18. క్రమశిక్షణను ఇచ్చేటప్పుడు యెహోవా చూపించే సమతుల్యతను యెషయా సోదాహరణంగా ఎలా వివరించాడు?

18 ఆ నాయకులను అనుసరించని యథార్థవంతులైన వ్యక్తుల విషయానికి వస్తే, యెహోవా వారిని సరిదిద్దుతాడు, వారిపై తన అనుగ్రహాన్ని కుమ్మరిస్తాడు. (యెషయా 28:23బి-29 చదవండి.) జీలకర్ర వంటి ఎంతో సున్నితమైన ధాన్యం నూర్చడానికి ఒక రైతు సున్నితమైన పద్ధతులను ఉపయోగించినట్లు, యెహోవా ఒక్కో వ్యక్తిని బట్టి, వారి పరిస్థితులను బట్టి వారికి క్రమశిక్షణను ఇస్తాడు. ఆయన ఎన్నడూ నిర్హేతుకంగా లేక అణగద్రొక్కే విధంగా వ్యవహరించడు గానీ తప్పు చేస్తున్నవారిని సరిచేసేందుకు దోహదపడాలనే ఉద్దేశంతోనే చర్య తీసుకుంటాడు. అవును, యెహోవా విజ్ఞాపనకు వ్యక్తులు ప్రతిస్పందిస్తే, నిరీక్షణ ఉంటుంది. అలాగే నేడు, ఒక వ్యవస్థగా క్రైస్తవమత సామ్రాజ్యపు ముందుగతి నిర్ణయించబడినప్పటికీ, యెహోవా రాజ్యానికి విధేయుడయ్యే ఏ వ్యక్తి అయినా రానున్న ప్రతికూలమైన తీర్పును తప్పించుకోవచ్చు.

యెరూషలేముకు శ్రమ!

19. యెరూషలేము ఏ విధంగా ‘అగ్నిగుండము’ వలె అవుతుంది, అది ఎప్పుడు, ఎలా జరుగుతుంది?

19 అయితే యెహోవా ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? “అరీయేలుకు శ్రమ, దావీదు దండు దిగిన అరీయేలు పట్టణమునకు శ్రమ! సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి పండుగలను క్రమముగా జరుగనీయుడి. నేను అరీయేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును.” (యెషయా 29:​1, 2) “అరీయేలు” అంటే బహుశా ‘దేవుని అగ్నిగుండము’ అని భావం కావచ్చు, ఇక్కడ అది యెరూషలేమును సూచిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అక్కడే ఆలయమూ, బలి అర్పించే బలిపీఠము ఉన్నాయి. యూదులు అక్కడ పండుగలు జరుపుకోవడం, బలులు అర్పించడమనే కార్యక్రమాలను చేస్తారు, కానీ యెహోవా వారి ఆరాధనను బట్టి ఆనందించడు. (హోషేయ 6:6) బదులుగా, ఆ నగరమే మరో భావంలో, ‘అగ్నిగుండము’ అవుతుందని ఆయన ప్రకటిస్తాడు. ఒక బలిపీఠములా, దానిపై రక్తము ప్రవహిస్తుంది, అది అగ్నికి ఆహుతి అవుతుంది. ఇది ఎలా జరుగుతుందో కూడా యెహోవా వర్ణిస్తున్నాడు: “నేను నీతో యుద్ధముచేయుచు నీచుట్టు శిబిరము వేయుదును నీకెదురుగా కోట కట్టి ముట్టడి దిబ్బ వేయుదును. అప్పుడు నీవు అణపబడి నేలనుండి పలుకుచుందువు నీ మాటలు నేలనుండి యొకడు గుసగుసలాడు నట్లుండును.” (యెషయా 29:​3, 4) ఇది యూదా యెరూషలేములకు సా.శ.పూ. 607 లో, బబులోను సైన్యం నగరాన్ని ముట్టడించి, దాన్ని నాశనం చేసి ఆలయాన్ని కాల్చివేసినప్పుడు నెరవేరింది. యెరూషలేము, అది ఏ నేలపై నిర్మించబడిందో అంత అధమ స్థితికి తీసుకురాబడుతుంది.

20. దేవుని శత్రువులకు ఆఖరుకు ఎలాంటి గతి పడుతుంది?

20 ఆ విపత్కరమైన కాలం రాకముందే, యూదాలో అప్పుడప్పుడూ, యెహోవా ధర్మశాస్త్రానికి విధేయత చూపే రాజు ఉంటాడు. అప్పుడేమి జరుగుతుంది? యెహోవా తన ప్రజల కోసం పోరాడుతాడు. శత్రువులు పెద్ద సంఖ్యలో దేశంపైకి వచ్చినప్పటికీ, వారు “రేణువుల” వలె, “పొట్టు” వలె అవుతారు. యెహోవా తన నియమిత కాలంలో వారిని “ఉరుముతోను భూకంపముతోను మహా శబ్దముతోను సుడిగాలి తుపానులతోను దహించు అగ్నిజ్వాలలతోను” చెదరగొడతాడు.​—⁠యెషయా 29:5, 6.

21. యెషయా 29:7, 8 వచనాల్లోని ఉపమానాన్ని వివరించండి.

21 శత్రుభావం గల సైన్యాలు యెరూషలేమును కూలదోసి కొల్లసొమ్మును దోచుకుపోవాలని ఆకాంక్షించవచ్చు. కానీ వారు అర్థాంతరంగా మేలుకోవలసి ఉంటుంది! ఆకలిగొన్న వ్యక్తి విందారగిస్తున్నట్లు కల గని, మేల్కొని తిరిగి ఎప్పటిలానే ఆకలితో ఉన్నట్లు, యూదా శత్రువులు తాము ఎంతగానో ఆకాంక్షిస్తున్న విందును ఆనందించలేక పోతారు. (యెషయా 29:7, 8 చదవండి.) నమ్మకమైన హిజ్కియా రాజు కాలంలో, సన్హెరీబు నాయకత్వం క్రింద వచ్చే అష్షూరు సైన్యం యెరూషలేముకు ముప్పు తీసుకువచ్చినప్పుడు దానికి ఏమి జరుగుతుందో పరిశీలించండి. (యెషయా 36, 37 అధ్యాయాలు) ఒక్క రాత్రిలో, ఒక్క మానవ హస్తం కూడా ఎత్తబడకుండానే, భయం గొలిపే అష్షూరు యుద్ధ యంత్రం వెనక్కి త్రిప్పబడుతుంది​—⁠పరాక్రమవంతులైన దాని యోధుల్లో 1,85,000 మంది మరణిస్తారు! సమీప భవిష్యత్తులో యెహోవా ప్రజలకు వ్యతిరేకంగా గోగు మాగోగు తన యుద్ధ యంత్రాన్ని ఎక్కుపెట్టినప్పుడు, విజయం సాధించడాన్ని గురించిన కలలు మళ్లీ కల్లలవుతాయి.​—⁠యెహెజ్కేలు 38:​10-12; 39:​6, 7.

22. యూదా ఆధ్యాత్మిక త్రాగుబోతుతనం దాన్నెలా ప్రభావితం చేస్తుంది?

22 యెషయా తన ప్రవచనంలోని ఈ భాగాన్ని ప్రవచిస్తున్నప్పుడు, యూదా నాయకులకు హిజ్కియాకు ఉన్నటువంటి విశ్వాసం ఉండదు. వారు దైవభక్తిలేని రాజ్యాలతో సంధి చేసుకోవడం ద్వారా ఆధ్యాత్మిక మత్తులో పడిపోయారు. “జనులారా, తేరి చూడుడి విస్మయమొందుడి; మీ కండ్లను చెడగొట్టుకొనుడి గ్రుడ్డివారగుడి ద్రాక్షారసము లేకయే వారు మత్తులైయున్నారు మద్యపానము చేయకయే తూలుచున్నారు.” (యెషయా 29:9) ఆధ్యాత్మికంగా మత్తులై, ఈ నాయకులు యెహోవా నిజ ప్రవక్తకు ఇవ్వబడిన ఈ దర్శనం యొక్క ప్రాముఖ్యతను గ్రహించలేక పోతున్నారు. యెషయా ఇలా చెబుతున్నాడు: “యెహోవా మీమీద గాఢనిద్రాత్మను కుమ్మరించియున్నాడు; మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టియున్నాడు, మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుకు వేసి యున్నాడు. దీనినంతటినిగూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యములవలె ఉన్నది, ఒకడు—⁠నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలిసినవానికి వానిని అప్పగించును; అతడు​—⁠అది నావలన కాదు అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. మరియు​—⁠నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలియనివానికి దానిని అప్పగించును అతడు​—⁠అక్షరములు నాకు తెలియవనును.”​—యెషయా 29:10-12.

23. యెహోవా యూదాను జవాబు ఎందుకు అడుగుతాడు, ఆయన అదెలా చేస్తాడు?

23 యూదా మత నాయకులు తాము ఆధ్యాత్మికంగా వివేకవంతులమని చెప్పుకుంటారు, కానీ వారు యెహోవాను విడిచిపెట్టారు. వారు తమ అవిశ్వాస, అనైతిక కార్యకలాపాలను సమర్థించుకోవడానికి, తప్పొప్పుల గురించి తమ స్వంత వక్రతలంపులను బోధిస్తూ, ప్రజలు దేవుని కోపానికి గురయ్యేలా వారిని తప్పుదారి పట్టిస్తున్నారు. యెహోవా తన “ఆశ్చర్యకార్యము” ద్వారా, తన “ఆశ్చర్యమైన కార్యము” ద్వారా వారిని తమ వేషధారణ విషయమై జవాబు చెప్పమంటాడు. ఆయనిలా చెబుతాడు: “ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొనియున్నారు వారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధులనుబట్టి వారు నేర్చుకొనినవి. కాగా నేను మరల ఈ జనులయెడల ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగింతును; వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును.” (యెషయా 29:​13, 14) యూదా సంపూర్ణ మతభ్రష్ట విధానాన్ని బబులోను ప్రపంచ శక్తి నిర్మూలించేలా యెహోవా విషయాలను నడిపించినప్పుడు, దాని స్వంత జ్ఞానము, బుద్ధి అంతరించిపోతాయి. మొదటి శతాబ్దంలో స్వంతంగా తాము జ్ఞానులమని చెప్పుకొన్న యూదా నాయకులు రాజ్యాన్ని తప్పుదోవ పట్టించినప్పుడు, అదే జరిగింది. మన కాలంలో క్రైస్తవమత సామ్రాజ్యానికి అటువంటిదే జరుగుతుంది.​—⁠మత్తయి 15:​7-9; రోమీయులు 11:8.

24. యూదావారు తమకు దైవ భయం లేదని ఎలా చూపిస్తారు?

24 అయితే, ఇప్పుడు, గొప్పలు చెప్పుకునే యూదా నాయకులు, సత్యారాధన నుండి వైదొలగినందుకు తమపైకి వచ్చే శిక్షను తప్పించుకొనే యుక్తి తమకుందని నమ్ముతున్నారు. అది నిజమేనా? యెషయా వారి ముసుగును తొలగించి, వారికి దేవునియందు నిజమైన భయంలేదనీ కాబట్టి వారిది నిజమైన జ్ఞానము కాదనీ బయలుపరుస్తాడు: “తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండ లోలోపల వాటిని మరుగుచేయ జూచువారికి శ్రమ. మమ్ము నెవరు చూచెదరు? మా పని యెవరికి తెలియును? అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించువారికి శ్రమ. అయ్యో, మీరెంత మూర్ఖులు? కుమ్మరికిని మంటికిని భేదములేదని యెంచదగునా? చేయబడిన వస్తువు దాని చేసినవారిగూర్చి​—⁠ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించినవానిగూర్చి​—⁠ఇతనికి బుద్ధిలేదనవచ్చునా?” (యెషయా 29:​15, 16; కీర్తన 111:10 పోల్చండి.) తామెంత మరుగుచేసుకుంటున్నామని వారు అనుకున్నా, వారు చేసేదంతా దేవుని కళ్లకు “మరుగులేక తేటగా ఉన్నది.”​—⁠హెబ్రీయులు 4:13.

‘చెవిటివారు విందురు’

25. “చెవిటివారు” ఏ భావంలో వింటారు?

25 అయితే, విశ్వాసం ఉంచే వ్యక్తులకు రక్షణ లభిస్తుంది. (యెషయా 29:17-24 చదవండి; లూకా 7:​22 పోల్చండి.) “చెవిటివారు” “గ్రంథవాక్యములు” అంటే దేవుని వాక్యంలోని సందేశాన్ని “విందురు.” అవును, ఇది భౌతిక చెవిటితనాన్ని స్వస్థపరచడం కాదు. ఇది ఆధ్యాత్మిక స్వస్థత. యెషయా మరొకసారి, మెస్సీయ రాజ్యం స్థాపించబడడం వైపుకు, మెస్సీయ పరిపాలన ద్వారా భూమిపై సత్యారాధన పునఃస్థాపించబడడం వైపుకు దృష్టి మరలుస్తాడు. ఇది మన కాలంలో జరిగింది, లక్షలాదిమంది యథార్థవంతులు యెహోవా తమను సరిదిద్దడానికి అనుమతిస్తున్నారు, ఆయనను స్తుతించడాన్ని నేర్చుకొంటున్నారు. ఎంత అద్భుతమైన నెరవేర్పు! చివరికి, ప్రతి ఒక్కరూ, సకల ప్రాణులు, యెహోవాను స్తుతిస్తూ, ఆయన పరిశుద్ధనామాన్ని మహిమపరిచే దినం వస్తుంది.​—⁠కీర్తన 150:6.

26. నేడు “చెవిటివారు” ఏ ఆధ్యాత్మిక జ్ఞాపికలను వింటున్నారు?

26 నేడు దేవుని వాక్యాన్ని వినే అలాంటి “చెవిటివారు” ఏమి నేర్చుకొంటున్నారు? వారు నేర్చుకొంటున్నది ఏమిటంటే, క్రైస్తవులందరూ ప్రాముఖ్యంగా సంఘం ఎవరిని మాదిరులుగా పరిగణిస్తుందో అలాంటివారు, ‘మద్యము వలన సొక్కిసోలడాన్ని’ ఎంతో జాగ్రత్తతో నివారించాలి. (యెషయా 28:7) అంతేగాక, అన్ని విషయాల గురించి ఆధ్యాత్మిక దృక్కోణాన్ని కలిగివుండడానికి మనకు సహాయం చేసే దేవుని జ్ఞాపికలను వినడానికి మనం ఎన్నడూ అలసిపోకూడదు. క్రైస్తవులు సరిగానే ప్రభుత్వ అధికారాలకు లోబడి ఉండి, కొన్ని సేవల కోసం వాటిపై ఆధారపడినప్పటికీ, రక్షణ మాత్రం లోకం నుండి రాదు గానీ యెహోవా దేవుని నుండే వస్తుంది. దానితోపాటు, మతభ్రష్ట యెరూషలేము మీదికి వచ్చిన తీర్పులా, ఈ తరంపైకి రానున్న దేవుని తీర్పు కూడా తప్పించుకోలేనిదని మనం ఎన్నడూ మరచి పోకూడదు. యెహోవా సహాయంతో, వ్యతిరేకత ఉన్నప్పటికీ మనం ఆయన హెచ్చరికను ప్రకటించడంలో యెషయా వలె కొనసాగవచ్చు.​—⁠యెషయా 28:14, 22; మత్తయి 24:34; రోమీయులు 13:1-4.

27. యెషయా ప్రవచనం నుండి క్రైస్తవులు ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?

27 పెద్దలు, తల్లిదండ్రులు యెహోవా క్రమశిక్షణ ఇచ్చే విధానం నుండి నేర్చుకుని, తప్పిదస్థులను కేవలం శిక్షించడమే కాకుండా, వారు తిరిగి దేవుని అనుగ్రహాన్ని పొందగలిగేలా సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. (యెషయా 28:26-29; యిర్మీయా 30:​11 పోల్చండి.) మనుష్యులను ప్రీతిపరచేందుకు ఏదో నామకార్థ క్రైస్తవునిగా ఉండకుండా హృదయపూర్వకంగా యెహోవా సేవ చేయడం ఎంత ప్రాముఖ్యమో యౌవనస్థులతో సహా మనకందరికీ గుర్తుచేయబడుతుంది. (యెషయా 29:​13) విశ్వాసంలేని యూదా నివాసుల్లా కాకుండా, మనకు యెహోవా అంటే ఆరోగ్యదాయకమైన భయం ఉందనీ, ఆయనంటే ప్రగాఢమైన గౌరవం ఉందనీ మనం చూపించాలి. (యెషయా 29:​16) అంతేగాక, మనం యెహోవాచే సరిదిద్దబడడానికి, ఆయన నుండి నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నామని చూపించవలసిన అవసరం ఉంది.​—⁠యెషయా 29:24.

28. యెహోవా సేవకులు ఆయన రక్షణ కార్యాలను ఎలా దృష్టిస్తారు?

28 యెహోవాపై, విషయాలను ఆయన నడిపించే విధానంపై విశ్వాసం, నమ్మకం కలిగి ఉండడం ఎంత ప్రాముఖ్యమో కదా! (కీర్తన 146:3 పోల్చండి.) మనం ప్రకటించే హెచ్చరిక సందేశం అత్యధికులకు పిల్లతనంగా అనిపించవచ్చు. దేవుని సేవ చేస్తున్నానని చెప్పుకుంటున్న క్రైస్తవమత సామ్రాజ్యమనే సంస్థ భవిష్యత్తులో నాశనం చేయబడుతుందన్న ఆలోచన ఆశ్చర్యకరమైనది, అపూర్వమైనది. కానీ యెహోవా తన “ఆశ్చరమైన కార్యమును” సాధిస్తాడు. దాని గురించి సందేహించవలసిన అవసరం ఎంతమాత్రం లేదు. కాబట్టి, ఈ విధానపు చివరి దినాల్లో, దేవుని సేవకులు ఆయన రాజ్యంపైన, ఆయన నియమించిన రాజు యేసు క్రీస్తుపైన పూర్తి నమ్మకాన్ని ఉంచుతారు. యెహోవా ‘అపూర్వమైన కార్యముతో’ పాటు చేసే రక్షణ కార్యాలు, విధేయులైన మానవులకందరికీ నిత్య ఆశీర్వాదాలను తీసుకువస్తాయని వాళ్ళకు తెలుసు.

[అధస్సూచి]

a ఆదిమ హీబ్రూ భాషలో, యెషయా 28:10 వల్లె వేసే ఒక పద్యం వంటిది, చిన్న పిల్లల పద్యంలాంటిది. కాబట్టి, యెషయా సందేశం మత నాయకులకు పునరుచ్ఛరించబడినట్లుగా, పిల్లతనంగా అనిపించింది.

[అధ్యయన ప్రశ్నలు]

[289 వ పేజీలోని చిత్రాలు]

క్రైస్తవమత సామ్రాజ్యం దేవునిపై కంటే ఎక్కువగా, మానవ పరిపాలకులతో చేసుకునే ఒప్పందాలపై ఆధారపడింది

[290 వ పేజీలోని చిత్రం]

బబులోను యెరూషలేమును నాశనం చేయడానికి అనుమతించినప్పుడు యెహోవా తన “ఆశ్చర్యమైన కార్యమును” జరిగిస్తాడు

[298 వ పేజీలోని చిత్రం]

ఒకప్పుడు ఆధ్యాత్మికంగా చెవిటివారిగా ఉన్నవారు దేవుని వాక్యమును ‘వినగలరు’