పశ్చాత్తాప ప్రార్థన
ఇరవై ఐదవ అధ్యాయం
పశ్చాత్తాప ప్రార్థన
1, 2. (ఎ) దైవిక శిక్ష యొక్క సంకల్పమేమిటి? (బి) యెహోవా ఇచ్చిన శిక్షను పొందిన తర్వాత యూదులు ఏ ఎంపికను ఎదుర్కొంటారు?
యెరూషలేము, దాని ఆలయము సా.శ.పూ. 607 లో నాశనం చేయబడడమన్నది యెహోవా విధించిన శిక్ష, ఆయన వారిని ఎంతమాత్రం ఆమోదించడం లేదని అది వెల్లడి చేస్తోంది. అవిధేయులైన యూదా జనము ఆ తీవ్రమైన దండనకు పాత్రులే. అయినప్పటికీ, యూదులు సమూలంగా నాశనం చేయబడాలని యెహోవా సంకల్పించలేదు. “ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు; అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును” అని చెప్పినప్పుడు అపొస్తలుడైన పౌలు యెహోవా శిక్షించడానికి గల సంకల్పాన్ని పరోక్షంగా సూచించాడు.—హెబ్రీయులు 12:11.
2 ఈ కఠినమైన అనుభవానికి యూదులు ఎలా ప్రతిస్పందిస్తారు? వారు యెహోవా ఇచ్చే శిక్షను ద్వేషిస్తారా? (కీర్తన 50:16, 17) లేదా వారు దాన్ని అభ్యాసముగా స్వీకరిస్తారా? వారు పశ్చాత్తాపపడి స్వస్థత పొందుతారా? (యెషయా 57:18; యెహెజ్కేలు 18:23) యూదా మునుపటి నివాసుల్లో కనీసం కొందరైనా ఆ శిక్షకు చక్కగా ప్రతిస్పందిస్తారని యెషయా ప్రవచనం సూచిస్తోంది. అరవై మూడవ అధ్యాయం చివరి వచనాలు మొదలుకొని 64 వ అధ్యాయం అంతటిలోనూ, యూదా జనము హృదయపూర్వకంగా విజ్ఞాపన చేస్తూ యెహోవాను సమీపించే పశ్చాత్తప్తులైన ప్రజలుగా వర్ణించబడుతోంది. భవిష్యత్తులో చెరలో ఉండబోయే తన తోటి దేశస్థుల పక్షాన యెషయా ప్రవక్త పశ్చాత్తాప ప్రార్థన చేస్తున్నాడు. అలా చేయడంలో, ఆయన రానున్న సంఘటనలు తన కళ్ళెదుటే జరుగుతున్నట్లుగా మాట్లాడుతున్నాడు.
కనికరం గల తండ్రి
3. (ఎ) యెషయా ప్రవచనార్థక ప్రార్థన యెహోవాను ఎలా స్తుతిస్తోంది? (బి) యెషయా ప్రవచనార్థక ప్రార్థన, బబులోనులో ఉన్న పశ్చాత్తప్తులైన యూదుల తలంపులను వర్ణిస్తాయని దానియేలు ప్రార్థన ఎలా చూపిస్తోంది? (362 వ పేజీలోని బాక్సు చూడండి.)
3 యెషయా యెహోవాకు ఇలా ప్రార్థిస్తున్నాడు: “పరమునుండి చూడుము మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాసస్థలమునుండి దృష్టించుము.” యెహోవా, ఆయన అదృశ్య ఆత్మ ప్రాణులు నివసించే ఆత్మ మండలమైన పరము గురించి ప్రవక్త ఇక్కడ మాట్లాడుతున్నాడు. చెరలో ఉన్న యూదుల తలంపులను వ్యక్తపరుస్తూ, యెషయా ఇలా కొనసాగిస్తున్నాడు: “నీ ఆసక్తి యేది? నీ శౌర్యకార్యములేవి? నాయెడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణగి పోయెనే.” (యెషయా 63:15) యెహోవా తన శక్తిని ప్రదర్శించకుండా, తన ప్రజలపట్ల తనకున్న లోతైన భావాలను అంటే “జాలి”ని, “వాత్సల్యత”ను నిగ్రహించుకున్నాడు. అయినప్పటికీ యూదా జనముకు యెహోవాయే “తండ్రి.” అబ్రాహాము, ఇశ్రాయేలు (యాకోబు) వారి సహజ పితరులు, కానీ వారు తిరిగి జీవానికి తీసుకురాబడితే, వారు భ్రష్టులైన తమ సంతానాన్ని తిరస్కరించడానికి ఇష్టపడుతుండవచ్చు. యెహోవాకు ఎంతో కనికరం ఉంది. (కీర్తన 27:10) యెషయా కృతజ్ఞతాపూర్వకంగా ఇలా అంటున్నాడు: “యెహోవా, నీవే మా తండ్రివి. అనాదికాలమునుండి మా విమోచకుడని నీకు పేరే గదా.”—యెషయా 63: 16బి.
4, 5. (ఎ) యెహోవా యూదులు తన మార్గములను తప్పి తిరిగేలా చేశాడన్నది ఏ భావంలో? (బి) యెహోవా ఎలాంటి ఆరాధనను కోరుకుంటున్నాడు?
4 హృదయపూర్వకమైన పదాలతో యెషయా ఇంకా ఇలా అంటున్నాడు: “యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మును ఎందుకు తొలగజేసితివి? నీ భయము విడుచునట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరచితివి? నీ దాసుల నిమిత్తము నీ స్వాస్థ్యగోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము.” (యెషయా 63:17) అవును, యెహోవా మళ్ళీ తన శ్రద్ధను తన సేవకులవైపుకు మళ్ళించాలని యెషయా ప్రార్థిస్తున్నాడు. అయితే, యెహోవా యూదులు తన మార్గములను తప్పి తిరిగేలా చేశాడన్నది ఏ భావంలో? వారు యెహోవాకు భయపడకుండా చేసే వారి హృదయ కాఠిన్యానికి ఆయనే బాధ్యుడా? కాదు గానీ ఆయన దాన్ని అనుమతించాడు, యూదులు తమ నిరాశలో, యెహోవా తమకు అలాంటి స్వేచ్ఛను ఇచ్చినందుకు విలపిస్తున్నారు. (నిర్గమకాండము 4:21; నెహెమ్యా 9:16) తప్పు చేయకుండా తమను ఆపేందుకు యెహోవా జోక్యం చేసుకుంటే ఎంత బాగుండేదని అనుకుంటున్నారు.
5 అయితే, దేవుడు మానవులతో ఆ విధంగా వ్యవహరించడు. మనం స్వేచ్ఛా చిత్తంగల జీవులము, మనం యెహోవాకు విధేయత చూపించాలా వద్దా అనేది మనకు మనమే నిర్ణయించుకునేందుకు ఆయన అనుమతిస్తాడు. (ద్వితీయోపదేశకాండము 30:15-19) నిజమైన ప్రేమచే పురికొల్పబడిన హృదయాల నుండి, మనసుల నుండి ఉద్భవించే ఆరాధనను యెహోవా కోరుకుంటాడు. కాబట్టి, యూదులు తమ స్వేచ్ఛా చిత్తాన్ని ఉపయోగించుకోవడం అన్నది, వారు ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే అవకాశాన్ని ఇచ్చినప్పటికీ, ఆయన దాన్ని అనుమతించాడు. ఆ విధంగా ఆయన వారి హృదయాలను కఠినపరిచాడు.—2 దినవృత్తాంతములు 36:14-21.
6, 7. (ఎ) యూదులు యెహోవా మార్గాలను విడిచిపెట్టడం వల్ల ఏమి జరిగింది? (బి) ఏ వ్యర్థమైన ఆశ వ్యక్తపరచబడింది, కానీ ఎలా ఆశించే హక్కు యూదులకు లేదు?
6 దాని ఫలితమేమిటి? యెషయా ప్రవచనార్థకంగా ఇలా చెబుతున్నాడు: “నీ పరిశుద్ధజనులు స్వల్పకాలమే దేశమును అనుభవించిరి. మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును త్రొక్కియున్నారు. నీ పరిపాలన నెన్నడును ఎరుగనివారివలెనైతిమి, నీ పేరెన్నడును పెట్టబడనివారివలెనైతిమి.” (యెషయా 63:18, 19) యెహోవా పరిశుద్ధాలయము స్వల్పకాలం మాత్రమే ఆయన ప్రజల అధీనంలో ఉంది. తర్వాత యెహోవా అది నాశనం చేయబడడానికీ, ఆయన జనము బంధీలుగా కొనిపోబడడానికీ అనుమతించాడు. అది జరిగినప్పుడు, ఆయనకూ అబ్రాహాము సంతానానికీ మధ్యన ఏ నిబంధన లేనట్లు, ఆయన నామము వారికి పెట్టబడనట్లు ఉండింది. యూదులు ఇప్పుడు బబులోనులో బంధీలుగా ఉండి నిరాశతో ఇలా ఏడుస్తున్నారు: “గగనము చీల్చుకొని నీవు దిగివచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక, నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చురీతిగాను అగ్ని నీళ్లను పొంగజేయురీతిగాను నీవు దిగివచ్చెదవు గాక!” (యిషయా 64:1, 2) వాస్తవంగా యెహోవాకు రక్షించే శక్తి ఉంది. ఆయన ఖచ్చితంగా, గగనము వంటి ప్రభుత్వ విధానాలను చీల్చివేస్తూ, పర్వతముల వంటి సామ్రాజ్యాలను పగులగొడుతూ దిగివచ్చి తన ప్రజల కోసం పోరాడగలిగేవాడే. యెహోవా తన ప్రజల పట్ల తనకున్న జ్వలిస్తున్న అత్యాసక్తిని చూపిస్తూ తన నామమును తెలియజేయగలిగేవాడే.
7 యెహోవా గతంలో అలాంటివి చేశాడు. యెషయా ఇలా గుర్తు తెచ్చుకుంటున్నాడు: “జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురు గాక, నీవు దిగివచ్చెదవు గాక. నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక.” (యెషయా 64: 3) అలాంటి గొప్ప కార్యములు యెహోవా శక్తిని, దైవత్వాన్ని ప్రదర్శించాయి. అయితే, యెషయా కాలం నాటి అపనమ్మకస్థులైన యూదులకు, యెహోవా తమ ప్రయోజనార్థం అలా చర్య తీసుకోవాలని ఆశించే హక్కు ఎంతమాత్రం లేదు.
యెహోవా మాత్రమే రక్షించగలడు
8. (ఎ) యెహోవా, అన్యజనుల అబద్ధ దేవుళ్ళ నుండి ఎలా భిన్నంగా ఉన్నాడు? (బి) యెహోవా తన ప్రజలను రక్షించడానికి చర్య తీసుకోగలిగినప్పటికీ, ఆయన ఎందుకు చర్య తీసుకోడు? (సి) పౌలు యెషయా 64:4 ను ఎలా ఎత్తివ్రాసి, అన్వయించాడు? (366 వ పేజీలోని బాక్సు చూడండి.)
8 అబద్ధ దేవుళ్ళు తమ ఆరాధకుల కోసం శక్తివంతమైన ఏ రక్షణ కార్యములూ చేయరు. యెషయా ఇలా వ్రాస్తున్నాడు: “తనకొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలముచేయు మరి ఏ దేవునిని ఎవడు నేకాలమున చూచియుండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసియుండలేదు. నీ మార్గములనుబట్టి నిన్ను జ్ఞాపకము చేసికొనుచు సంతోషముగా నీతి ననుసరించువారిని నీవు దర్శించుచున్నావు.” (యెషయా 64:4, 5ఎ) ‘తనను వెదకువారికి ఫలము దయచేయువాడు’ యెహోవా మాత్రమే. (హెబ్రీయులు 11: 6) నీతిని అనుసరించేవారిని, ఆయనను జ్ఞాపకము చేసుకుంటూ ఉండేవారిని కాపాడడానికి ఆయన చర్య తీసుకుంటాడు. (యెషయా 30:18) యూదులు అలా చేశారా? లేదు. యెషయా యెహోవాతో ఇలా అంటున్నాడు: “చిత్తగించుము! నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి, బహుకాలమునుండి పాపములలో పడియున్నాము, రక్షణ మాకు కలుగునా?” (యిషయా 64: 5బి) దేవుని ప్రజలు ఎప్పటి నుండో విడువక పాపము చేస్తున్నారనే పేరు వారికి ఉంది గనుక, యెహోవా తన ఆగ్రహాన్ని నిగ్రహించుకుని, వారి రక్షణ కోసం చర్య తీసుకోవడానికి ఆయనకు ఏ ఆధారమూ లేదు.
9. పశ్చాత్తాపపడుతున్న యూదులు దేని కోసం ఆశించవచ్చు, దాని నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
9 యూదులు గడిచిపోయిన గతాన్ని మార్చలేరు, కానీ వారు పశ్చాత్తాపపడి స్వచ్ఛారాధన వైపుకు మరలితే, వారు క్షమాపణ కోసం భవిష్యద్ ఆశీర్వాదముల కోసం నిరీక్షించవచ్చు. యెహోవా పశ్చాత్తాపపడే వారిని బబులోను చెర నుండి విడుదల చేయడం ద్వారా తన నియమిత సమయంలో వారికి ప్రతిఫలం ఇస్తాడు. అయినప్పటికీ, వారు ఓపిక పట్టవలసిన అవసరం ఉంది. వారు పశ్చాత్తాపపడినప్పటికీ, యెహోవా తన కాలపట్టికను మార్చుకోడు. అయితే వారు అప్రమత్తంగా ఉండి యెహోవా చిత్తానికి అనుగుణంగా ప్రవర్తిస్తే, చివరికి విడుదల చేయబడతారన్న హామీ వారికి ఇవ్వబడుతుంది. అలాగే, క్రైస్తవులు నేడు యెహోవా కోసం ఓపికతో ఎదురు చూస్తారు. (2 పేతురు 3:11, 12) “మనము మేలుచేయుట యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంటకోతుము” అని చెప్పిన అపొస్తలుడైన పౌలు మాటలను మనం గంభీరంగా తీసుకుంటాము.—గలతీయులు 6: 9.
10. యెషయా ప్రార్థనలో ఏ అసమర్థత సూటిగా అంగీకరించడం జరిగింది?
10 యెషయా చేసిన ప్రవచనార్థక ప్రార్థన లాంఛనప్రాయంగా పాపాన్ని ఒప్పుకోవడం కన్నా ఎక్కువే. అది, తమను తాము కాపాడుకోవడంలో ఆ జనము తమ అసమర్థతను నిష్కపటంగా గుర్తించడాన్ని వ్యక్తం చేస్తుంది. ప్రవక్త ఇలా చెబుతున్నాడు: “మేమందరము అపవిత్రులవంటివారమైతిమి, మా నీతిక్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను; మేమందరము ఆకువలె వాడిపోతిమి, గాలివాన కొట్టుకొనిపోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొనిపోయెను.” (యెషయా 64: 6) చెర ముగింపు సమయానికల్లా, పశ్చాత్తాపపడుతున్న యూదులు ఇతర మతాలను అనుసరించడాన్ని మానుకొని ఉండవచ్చు. వారు నీతి క్రియలతో యెహోవా వైపుకు తిరిగి ఉండవచ్చు. కానీ వారు ఇంకా అపరిపూర్ణులే. వారి మంచి కార్యములు మెచ్చుకొనదగినవే అయినప్పటికీ, పాపాలకు ప్రాయశ్చిత్తం చేసే విషయానికి వస్తే అవి మురికి గుడ్డలను మించినవేమీ కాదు. యెహోవా క్షమాపణకు మనం పాత్రులము కాకపోయినప్పటికీ, అది ఆయన మనకు దయతో ఇస్తున్న బహుమానం. అది మనం స్వయంగా సంపాదించుకోగలిగేది కాదు.—రోమీయులు 3:23, 24.
11. (ఎ) బంధీలుగా ఉన్న చాలామంది యూదుల్లో ఎలాంటి అనారోగ్యకరమైన ఆధ్యాత్మిక స్థితి ఉంది, దానికి కారణం ఏమైవుండవచ్చు? (బి) చెరలో ఉన్న సమయంలో విశ్వాసం విషయంలో చక్కని మాదిరులుగా ఎవరున్నారు?
11 యెషయా భవిష్యత్తులోకి చూసినప్పుడు, ఆయనకు ఏమి కనిపిస్తుంది? ప్రవక్త ఇలా ప్రార్థిస్తున్నాడు: “నీ నామమునుబట్టి మొఱ్ఱపెట్టువాడొకడును లేకపోయెను, నిన్ను ఆధారము చేసికొనుటకై తన్నుతాను ప్రోత్సాహపరచుకొనువాడొకడును లేడు; నీవు మాకు ముఖము చాటు చేసికొంటివి, మా దోషములచేత నీవు మమ్మును కరిగించియున్నావు.” (యెషయా 64: 7) జనాంగపు ఆధ్యాత్మిక పరిస్థితి చాలా ఘోరంగా దిగజారిపోయి ఉంది. ప్రజలు యెహోవా నామమున ప్రార్థించడం లేదు. వారు విగ్రహారాధన వంటి గంభీరమైన పాపం చేయకపోయినప్పటికీ, వారు తమ ఆరాధన విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారని మాత్రం స్పష్టమవుతోంది, అంతేగాక యెహోవాను “ఆధారము చేసికొనుటకై తన్నుతాను ప్రోత్సాహపరచుకొనువాడొకడును లేడు.” స్పష్టంగా వారికి సృష్టికర్తతో ఆరోగ్యదాయకమైన సంబంధం లేదు. బహుశా కొందరు ప్రార్థనలో యెహోవాను సంబోధించడానికి తాము అయోగ్యులమని భావిస్తుండవచ్చు. ఇతరులు ఆయనను పరిగణలోకి తీసుకోకుండా తమ దినచర్యలో కొనసాగుతుండవచ్చు. అయితే బంధీలుగా తీసుకువెళ్లబడిన వారిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా, యెహెజ్కేలు వంటి వ్యక్తులు ఉన్నారు, వీరు విశ్వాసం విషయంలో చక్కని మాదిరులు. (హెబ్రీయులు 11:33, 34) డెబ్బై సంవత్సరాల చెర కాలం ముగింపుకు వస్తుండగా, హగ్గయి, జెకర్యా, జెరుబ్బాబెలు, ప్రధాన యాజకుడైన యెహోషువ వంటి వ్యక్తులు యెహోవా నామమున ప్రార్థించడంలో చక్కని నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉంటారు. అయినప్పటికీ యెషయా ప్రవచనార్థక ప్రార్థన, బంధీలుగా ఉన్నవారిలో అత్యధికుల స్థితిని వర్ణిస్తున్నట్లుగా ఉంది.
‘బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుట శ్రేష్ఠము’
12. పశ్చాత్తాపపడుతున్న యూదులు తమ ప్రవర్తనను మార్చుకోవడానికి కలిగివున్న సుముఖతను యెషయా ఎలా వ్యక్తపరిచాడు?
12 పశ్చాత్తాపపడుతున్న యూదులు మారడానికి సుముఖంగా ఉన్నారు. వారికి ప్రాతినిధ్యం వహిస్తూ, యెషయా యెహోవాకు ఇలా ప్రార్థిస్తున్నాడు: “యెహోవా, నీవే మాకు తండ్రివి. మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు; మేమందరము నీ చేతిపనియై యున్నాము.” (యిషయా 64: 8) ఈ మాటలు తండ్రిగా, లేదా జీవదాతగా యెహోవాకున్న అధికారాన్ని మరోసారి అంగీకరిస్తున్నాయి. (యోబు 10: 9) ఎలా కావాలంటే అలా మలచుకోగలిగే జిగటమంటితో పశ్చాత్తాపపడే యూదులు పోల్చబడ్డారు. యెహోవా ఇచ్చే శిక్షకు ప్రతిస్పందించే వారు దేవుని ప్రమాణాలకు అనుగుణంగా ఆలంకారికంగా రూపించబడగలుగుతారు. కానీ కుమ్మరివాడైన యెహోవా క్షమిస్తే మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి, యెషయా యూదులు తన ప్రజలేనని గుర్తు చేసుకోమని యెహోవాకు రెండుసార్లు విన్నపం చేస్తాడు: “యెహోవా, అత్యధికముగా కోపపడకుము, మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసికొనకుము. చిత్తగించుము, చూడుము, దయచేయుము, మేమందరము నీ ప్రజలమే గదా.”—యెషయా 64: 9.
13. దేవుని ప్రజలు చెరలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు దేశపు పరిస్థితి ఎలా ఉంది?
13 యూదులు అన్యదేశపు చెరలో ఉన్న కాలంలో, బానిసత్వం కన్నా ఎక్కువే సహిస్తారు. యెరూషలేము యొక్క, దాని ఆలయము యొక్క పాడైన స్థితి వారిపైకి, వారి దేవునిపైకి అపకీర్తిని తెస్తుంది. యెషయా చేసిన పశ్చాత్తాప ప్రార్థన, ఈ అపకీర్తిని తీసుకువచ్చే కొన్ని విషయాలను వివరంగా తెలియజేస్తుంది: “నీ పరిశుద్ధ పట్టణములు బీటిభూములాయెను. సీయోను బీడాయెను, యెరూషలేము పాడాయెను. మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయెను; మాకు మనోహరములైనవన్నియు నాశనమైపోయెను.”—యెషయా 64:10, 11.
14. (ఎ) ఇప్పుడు ఉన్న పరిస్థితిని గురించి యెహోవా ఎలా హెచ్చరించాడు? (బి) యెహోవా తన ఆలయాన్ని బట్టి, అక్కడ అర్పించబడుతున్న బలులను బట్టి ఆనందించినప్పటికీ, ఏది మరింత ప్రాముఖ్యమైనది?
14 నిజమే, యూదుల యొక్క పితరుల దేశంలో వ్యవహారాలు ఎలా ఉన్నాయన్నది యెహోవాకు బాగా తెలుసు. తన ఆజ్ఞలను అనుసరించక ఇతర దేవుళ్ళను సేవిస్తే, తాను ‘భూమిపై ఉండకుండా వారిని నిర్మూలిస్తాననీ,’ శృంగారమైన మందిరము ‘శిథిలాల కుప్పగా మారుతుందనీ’ ఆయన యెరూషలేము నాశనం చేయబడడానికి దాదాపు 420 సంవత్సరాలకు ముందుగానే తన ప్రజలను హెచ్చరించాడు. (1 రాజులు 9:6-9, NW) నిజమే, యెహోవా తాను తన ప్రజలకు ఇచ్చిన దేశాన్ని బట్టి, ఆయన గౌరవార్థం నిర్మించబడిన మహిమాన్వితమైన ఆలయాన్ని బట్టి, ఆయనకు అర్పించబడిన బలులను బట్టి ఆనందాన్ని పొందాడు. కానీ వస్తుదాయక విషయాలకన్నా, చివరికి బలుల కన్నా యథార్థత, విధేయత ఎంతో ప్రాముఖ్యమైనవి. సమూయేలు ప్రవక్త సరిగానే సౌలు రాజుకు ఇలా చెప్పాడు: “తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహనబలులను బలులను అర్పించుటవలన ఆయన సంతోషించునా? ఆలోచించుము! బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము.”—1 సమూయేలు 15:22.
15. (ఎ) యెషయా యెహోవాను ప్రవచనార్థకంగా ఏమని వేడుకుంటున్నాడు, దానికి సమాధానం ఎలా ఇవ్వబడింది? (బి) ఇశ్రాయేలును ఒక జనముగా యెహోవా చివరికి తిరస్కరించేలా ఏ సంఘటనలు నడిపాయి?
15 ఏదేమైనప్పటికీ, ఇశ్రాయేలు దేవుడు పశ్చాత్తాపపడుతున్న తన ప్రజలపైకి వచ్చిన విపత్తును చూసి వారిపై జాలిపడకుండా ఉండగలడా? యెషయా తన ప్రవచనార్థక ప్రార్థనను ముగించేది అటువంటి ప్రశ్నతోనే. బంధీలుగా ఉన్న యూదుల పక్షాన ఆయనిలా విజ్ఞప్తి చేస్తున్నాడు: “యెహోవా, వీటిని చూచి ఊరకుందువా? మౌనముగానుందువా? అత్యధికముగా మమ్మును శ్రమపెట్టుదువా?” (యెషయా 64:12) చివరికి పరిస్థితి ఎలా మారుతుందంటే, యెహోవా నిజంగానే తన ప్రజలను క్షమిస్తాడు, వారు తమ స్వదేశంలో స్వచ్ఛారాధనను పునఃప్రారంభించగలిగేలా ఆయన వారిని సా.శ.పూ. 537 లో తిరిగి అక్కడికి తీసుకువస్తాడు. (యోవేలు 2:13) అయితే, శతాబ్దాల తర్వాత, యెరూషలేము దాని ఆలయము మరోసారి నాశనం చేయబడ్డాయి, దేవుని నిబంధన జనము చివరికి ఆయనచే తిరస్కరించబడింది. ఎందుకు? ఎందుకంటే యెహోవా ప్రజలు ఆయన ఆజ్ఞల నుండి వైదొలగిపోయి, మెస్సీయను నిరాకరించారు. (యోహాను 1:11; 3:19, 20) అలా జరిగినప్పుడు, యెహోవా ఇశ్రాయేలు స్థానంలోకి ఒక క్రొత్త జనమును, “దేవుని ఇశ్రాయేలు” అని పిలువబడే ఆధ్యాత్మిక జనమును తీసుకున్నాడు.—గలతీయులు 6:16; 1 పేతురు 2: 9.
యెహోవా ‘ప్రార్థన ఆలకించువాడు’
16. యెహోవా క్షమ గురించి బైబిలు ఏమని బోధిస్తోంది?
16 ఇశ్రాయేలుకు సంభవించినదాని నుండి ప్రాముఖ్యమైన పాఠాలను నేర్చుకోవచ్చు. యెహోవా ‘దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడు’ అని మనం చూస్తాము. (కీర్తన 86: 5) అపరిపూర్ణులముగా, మనం రక్షణ పొందడానికి ఆయన కనికరంపై, క్షమపై ఆధారపడతాము. మనం చేసే ఏ కార్యములూ మనం ఈ ఆశీర్వాదములను సంపాదించుకునేందుకు మనకు సహాయం చేయలేవు. అయితే, యెహోవా ఎవరికి పడితే వాళ్ళకు క్షమాభిక్ష పెట్టడు. తమ పాపాలను బట్టి పశ్చాత్తాపపడి, మనసు మార్చుకునే వారు మాత్రమే దైవిక క్షమను పొందగలుగుతారు.—అపొస్తలుల కార్యములు 3:20.
17, 18. (ఎ) యెహోవా మన తలంపుల్లోనూ, భావాల్లోనూ నిజంగా ఆసక్తి కలిగి ఉన్నాడని మనకెలా తెలుసు? (బి) పాపులైన మానవుల పట్ల యెహోవా ఎందుకు సహనాన్ని చూపిస్తాడు?
17 మనం ప్రార్థనలో మన తలంపులను, భావాలను వ్యక్తపరచినప్పుడు వాటిని వినడానికి యెహోవా అత్యంత ఆసక్తి కలిగి ఉన్నాడని కూడా మనం తెలుసుకుంటాము. ఆయన ‘ప్రార్థన ఆలకించువాడు.’ (కీర్తన 65:2, 3) “ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి” అని అపొస్తలుడైన పేతురు మనకు హామీ ఇస్తున్నాడు. (1 పేతురు 3:12) అంతేగాక, పశ్చాత్తాప ప్రార్థనలో పాపాలను వినయంగా ఒప్పుకోవడం కూడా ఇమిడి ఉందని మనం తెలుసుకుంటాము. (సామెతలు 28:13) అయితే, దేవుని కనికరం సులభంగా లభించేదన్నట్లు తేలికగా తీసుకోవచ్చని దీని భావం కాదు. “మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసికొనవద్దని” బైబిలు క్రైస్తవులను హెచ్చరిస్తోంది.—2 కొరింథీయులు 6: 1.
18 చివరిగా, పాపులైన తన ప్రజల పట్ల దేవుడు సహనం చూపించడానికి గల ఉద్దేశాన్ని మనం తెలుసుకుంటాము. యెహోవా “యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు,” సహనం చూపిస్తున్నాడని అపొస్తలుడైన పేతురు వివరించాడు. (2 పేతురు 3: 9) ఏదేమైనప్పటికీ, దేవుని సహనాన్ని విడువక దుర్వినియోగం చేసేవారు చివరికి దండించబడతారు. దాని గురించి మనమిలా చదువుతాము: ‘[యెహోవా] ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును: సత్ క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును; అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును.’—రోమీయులు 2:6-8.
19. యెహోవా మారని ఏ లక్షణాలను ఎల్లప్పుడు ప్రదర్శిస్తాడు?
19 దేవుడు ప్రాచీన ఇశ్రాయేలుతో అలాగే వ్యవహరించాడు. యెహోవా మారడు గనుక ఆయనతో నేడు మన సంబంధం కూడా అదే సూత్రాలపై ఆధారపడివుంటుంది. ఇవ్వవలసిన దండనను ఇస్తూ కూడా ఆయన ఎల్లప్పుడూ ‘కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవాగా, వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించువాడిగా’ ఉంటాడు.—నిర్గమకాండము 34: 6, 7.
[అధ్యయన ప్రశ్నలు]
[362 వ పేజీలోని బాక్సు/చిత్రాలు]
దానియేలు చేసిన పశ్చాత్తాప ప్రార్థన
యూదులు చెరలో ఉన్న 70 సంవత్సరాల కాలమంతటిలోనూ దానియేలు ప్రవక్త బబులోనులో నివసించాడు. ఆయన, ఇశ్రాయేలీయుల తాత్కాలిక ప్రవాసం ముగింపుకు చేరుకుంటోందన్న విషయాన్ని చెరలో ఉన్న 68 వ సంవత్సరంలో యిర్మీయా ప్రవచనం నుండి గ్రహించాడు. (యిర్మీయా 25:11; 29:10; దానియేలు 9:1, 2) దానియేలు యెహోవాకు ప్రార్థించాడు, మొత్తం యూదా జనము తరపున ఆయన పశ్చాత్తాప ప్రార్థన చేశాడు. ‘అంతట నేను గోనెపట్ట కట్టుకొని, ధూళి తలపైన వేసికొని ఉపవాసముండి, ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని యెదుట నా మనస్సును నిబ్బరము చేసికొంటిని. నేను నా దేవుడైన యెహోవా యెదుట ప్రార్థనచేసి యొప్పుకొంటిని’ అని దానియేలు తెలియజేస్తున్నాడు.—దానియేలు 9:3, 4.
యెషయా గ్రంథం 63, 64 అధ్యాయాలలో కనుగొనబడే ప్రవచనార్థక ప్రార్థనను, యెషయా వ్రాసిన దాదాపు రెండు వందల సంవత్సరాల తర్వాత దానియేలు ఈ ప్రార్థనను చేశాడు. చెరలో ఉన్న కష్టతరమైన సంవత్సరాల్లో యథార్థవంతులైన చాలా మంది యూదులు యెహోవాకు ప్రార్థన చేశారన్నదానిలో సందేహం లేదు. అయితే, చాలామంది నమ్మకమైన యూదుల భావాలను సూచిస్తున్నట్లు స్పష్టమవుతున్న దానియేలు చేసిన ప్రార్థనను బైబిలు నొక్కి చెబుతోంది. కాబట్టి, యెషయా ప్రవచనార్థక ప్రార్థనలోని భావాలు వాస్తవానికి, బబులోనులో ఉన్న నమ్మకమైన యూదుల భావాలేనని ఆయన ప్రార్థన చూపిస్తోంది.
దానియేలు ప్రార్థనకు, యెషయా ప్రార్థనకు ఉన్న కొన్ని సారూప్యతలను గమనించండి.
యెషయా 64:10, 11 దానియేలు 9:16-18
[366 వ పేజీలోని బాక్సు]
“కంటికి కనబడలేదు”
అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన తన పత్రికలో, “ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది” అని వ్రాసినప్పుడు, ఆయన యెషయా గ్రంథంలో నుండి ఎత్తి వ్రాశాడు. (1 కొరింథీయులు 2:9) a పౌలు చేసిన వ్యాఖ్యానంగానీ, యెషయా మాటలుగానీ పరలోక స్వాస్థ్యములో లేదా భవిష్యద్ భూపరదైసులో యెహోవా తన ప్రజల కోసం సిద్ధం చేసినవాటిని సూచించడం లేదు. పౌలు యెషయా మాటలను, మొదటి శతాబ్దంలో క్రైస్తవులు అప్పటికే అనుభవిస్తున్న, దేవుని లోతైన విషయాలను అర్థం చేసుకోవడం, యెహోవా నుండి ఆధ్యాత్మిక వెలుగును పొందడం వంటి ఆశీర్వాదాలకు అన్వయిస్తున్నాడు.
లోతైన ఆధ్యాత్మిక విషయాలను అవి బయలుపరచబడడానికి యెహోవా నియమిత సమయం వచ్చినప్పుడు మాత్రమే మనం అర్థం చేసుకోగలుగుతాము, అయితే అప్పుడు కూడా, మనం ఆధ్యాత్మిక ప్రజలమై ఉండి, యెహోవాతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నవారమైతేనే అది సాధ్యమవుతుంది. పౌలు మాటలు ఆధ్యాత్మికత అంతగా లేనివారికి లేదా అసలే లేనివారికి అన్వయిస్తాయి. ఆధ్యాత్మిక సత్యాలు వారి కంటికి కనబడవు లేదా వారు గ్రహించలేరు, అలాంటి విషయాలు వారి చెవులకు వినబడవు లేదా వారు అర్థం చేసుకోలేరు. తనను ప్రేమించేవారి కోసం దేవుడు సిద్ధం చేసిన వాటిని గురించిన జ్ఞానము, అలాంటి వ్యక్తుల హృదయాల్లోకి ప్రవేశించను కూడా ప్రవేశించదు. కానీ పౌలు వలే, దేవునికి సమర్పించుకున్న వారికి దేవుడు ఈ విషయాలను తన ఆత్మ ద్వారా వెల్లడి చేశాడు.—1 కొరింథీయులు 2:1-16.
[అధస్సూచి]
a హీబ్రూ లేఖనాల్లో ఉన్నదున్నట్లుగా పౌలు వ్రాయలేదు. ఆయన యెషయా 52:15; 64: 4; మరియు 65: 17 వచనాల్లోని తలంపులను కలిపి వ్యక్తం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
[367 వ పేజీలోని చిత్రం]
యెరూషలేము, దాని ఆలయము దేవుని ప్రజల ఆధీనంలో ‘స్వల్పకాలము’ మాత్రమే ఉన్నాయి