కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా ఆరాధనకు తిరిగిరండి

యెహోవా ఆరాధనకు తిరిగిరండి

ఏడవ అధ్యాయం

యెహోవా ఆరాధనకు తిరిగిరండి

యెషయా 46:​1-13

1. బబులోను యొక్క ఇద్దరు ప్రముఖ దేవుళ్ళ పేర్లేమిటి, వారి గురించి ఏమి ప్రవచించబడింది?

 ఇశ్రాయేలువారు బంధీలుగా బబులోనుకు తీసుకువెళ్ళబడినప్పుడు, వారి చుట్టూ అబద్ధ ఆరాధన వ్యాపించి ఉంటుంది. యెషయా కాలంలో, యెహోవా ప్రజలు ఇంకా తమ స్వదేశంలోనే ఉన్నారు, వారికి ఆలయము, యాజకత్వము కూడా ఉన్నాయి. అయినప్పటికీ దేవునికి సమర్పించుకున్న ఆ జనాంగంలోని అనేకులు విగ్రహారాధన చేస్తున్నారు. కాబట్టి వారు బబులోను అబద్ధ దేవుళ్ళంటే భక్తిపూర్వకమైన భయం ఏర్పరచుకోకుండా లేదా ఆ దేవుళ్ళను సేవించాలని శోధింపబడకుండా ఉండేందుకు వారిని ముందుగా సిద్ధం చేయడం ఎంతో ఆవశ్యకం. అందుకే, బబులోను యొక్క ఇద్దరు ప్రముఖ దేవుళ్ళ గురించి ప్రవచనార్థకంగా మాట్లాడుతూ, యెషయా ఇలా చెబుతున్నాడు: “బేలు కూలుచున్నది, నెబో క్రుంగుచున్నది; వాటి ప్రతిమలు జంతువులమీదను పశువులమీదను మోయబడుచున్నవి, మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగా నున్నవి.” (యెషయా 46: 1, 2) బేలు కల్దీయుల ప్రముఖ విగ్రహ దేవుడు. నెబో జ్ఞానపరిజ్ఞానముల దేవునిగా పూజించబడేవాడు. ఈ ఇద్దరు దేవుళ్ళపట్ల అనేకులకు గౌరవం ఉన్నట్లు, బబులోనీయులు వారి పేర్లను తమ స్వంత పేర్లతో జతచేసి పెట్టుకోవడమనే వాస్తవాన్ని బట్టి స్పష్టమవుతుంది, బెల్‌స్సరు, నెబోపోలస్సరు, నెబుకద్నెజరు, నెబుజరదాను అన్నవి మచ్చుకి కొన్ని మాత్రమే.

2. బబులోను దేవుళ్ళ అసహాయత ఎలా నొక్కి చెప్పబడింది?

2 బేలు “కూలుచున్నది,” నెబో “క్రుంగుచున్నది” అని యెషయా చెబుతున్నాడు. ఈ అబద్ధ దేవుళ్ళు అణచివేయబడతారు. యెహోవా బబులోనుకు వ్యతిరేకంగా తీర్పు చర్యలు చేపట్టినప్పుడు, ఈ దేవుళ్ళు తమ ఆరాధకులకు సహాయం చేయలేకపోతారు. వాళ్ళు తమను తాము కూడా రక్షించుకోలేరు! బబులోనీయుల నూతన సంవత్సర పండుగ దినం వంటి సమయాల్లో జరిగే ఊరేగింపుల్లో బేలు, నెబో గౌరవనీయమైన స్థానాల్లో ఇకమీదట ఊరేగించబడరు. బదులుగా, వాళ్ళను ఆరాధించేవారు మామూలు వస్తువుల్లాగా వాళ్ళను లాక్కువెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళను స్తుతించి, ఆరాధించే బదులు అపహసించి, తృణీకరించడం జరుగుతుంది.

3. (ఎ) బబులోనీయులకు దిగ్భ్రమ కలిగించేది ఏది? (బి) బబులోను దేవుళ్ళకు జరిగినదాన్ని బట్టి నేడు మనం ఏమి నేర్చుకోవచ్చు?

3 తాము ఎంతో ఇష్టపడే విగ్రహాలు, సొమ్మసిల్లిన పశువులు మోసుకు వెళ్ళే బరువుల కంటే ఎక్కువ కాదని తెలుసుకోవడం బబులోనీయులకు ఎంతటి దిగ్భ్రమ కలిగిస్తుందో కదా! అలాగే నేడు, ఈ లోకంలోని దేవుళ్ళు అంటే ప్రజలు తాము వేటినైతే నమ్ముకొని, వేటికోసమైతే తమ శక్తినీ చివరికి తమ జీవితాలనూ ధారపోస్తారో ఆ దేవుళ్ళు వట్టి భ్రమ మాత్రమే. సంపదలు, ఆయుధాలు, ఆనందాలు, పాలకులు, స్వదేశము లేదా దానికి సంబంధించిన చిహ్నాలు, ఇంకా ఇతర అనేక వస్తువులు ఆరాధనా వస్తువులుగా తయారయ్యాయి. అలాంటి దేవుళ్ళ వ్యర్థత యెహోవా నియమిత సమయంలో బయలుపరచబడుతుంది.​—⁠దానియేలు 11:​38; మత్తయి 6:​24; అపొస్తలుల కార్యములు 12:​22; ఫిలిప్పీయులు 3:​19; కొలొస్సయులు 3: 5; ప్రకటన 13:​14, 15.

4. బబులోను దేవుళ్ళు ఏ భావంలో ‘క్రుంగుతాయి, కూలుతాయి’?

4 బబులోను దేవుళ్ళ ఘోరమైన వైఫల్యాన్ని ఇంకా నొక్కి చెబుతూ ప్రవచనం ఇలా కొనసాగుతోంది: ‘అవి క్రుంగుచు కూలుచు నుండి, ఆ బరువులను విడిపించుకొనలేక [“విడిపించలేక,” NW] తామే చెరలోనికి పోయియున్నవి.’ (యెషయా 46: 2) యుద్ధంలో గాయపడినట్లు లేదా వయోభారంతో క్రుంగిపోయినట్లు బబులోను దేవుళ్ళు ‘క్రుంగిపోతాయి, కూలిపోతాయి.’ వాళ్ళు తమను మోసుకు వెళుతున్న బరువులు మోసే పశువుల భారాన్ని సహితం తగ్గించలేరు లేదా వాటిని విడిపించలేరు. అలాంటప్పుడు, యెహోవా నిబంధన ప్రజలు బబులోను చెరలో ఉన్నంతమాత్రాన, ఆ అబద్ధ దేవుళ్ళకు ఘనతనివ్వాలా? ఇవ్వనవసరం లేదు! అదే విధంగా, యెహోవా అభిషిక్త సేవకులు ఆధ్యాత్మిక చెరలో ఉన్నప్పుడు కూడా “మహాబబులోను” యొక్క అబద్ధ దేవుళ్ళకు ఘనతనివ్వలేదు. ఆ దేవుళ్ళు 1919 లో మహాబబులోనును కూలిపోకుండా ఆపలేకపోయాయి, అలాగే “మహా శ్రమ” సమయంలో దానికి సంభవించే నాశనం నుండి కూడా దాన్ని కాపాడలేవు.​—⁠ప్రకటన 18:​2, 21; మత్తయి 24:​21.

5. విగ్రహారాధకులైన బబులోనీయులు చేసిన తప్పులను చేయకుండా నేటి క్రైస్తవులు ఎలా జాగ్రత్త వహిస్తారు?

5 నిజ క్రైస్తవులు నేడు ఏ విధమైన విగ్రహాలకూ నమస్కరించరు. (1 యోహాను 5:​21) సిలువమీది క్రీస్తు బొమ్మలు, జపమాలలు, పరిశుద్ధుల ప్రతిమలు సృష్టికర్త వద్దకు చేరుకోవడానికి ఏమాత్రం సహాయం చేయవు. అవి మన పక్షాన మధ్యవర్తిత్వం నెరపలేవు. మొదటి శతాబ్దంలో, యేసు తన శిష్యులకు “నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును” అని చెప్పినప్పుడు, దేవుడ్ని ఆరాధించవలసిన సరైన విధానాన్ని బోధించాడు.​—⁠యోహాను 14:​6, 14.

‘గర్భమున పుట్టినది మొదలుకొని చంకపెట్టుకొనబడినవారు’

6. యెహోవాకూ అన్యజనుల దేవుళ్ళకూ ఉన్న తేడా ఏమిటి?

6 బబులోను విగ్రహ దేవుళ్ళను ఆరాధించడంలోని వ్యర్థతను బయలుపరచిన తర్వాత యెహోవా తన ప్రజలకు ఇలా చెబుతున్నాడు: “యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించినవారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనినవారలారా, నా మాట ఆలకించుడి.” (యెషయా 46: 3) యెహోవాకూ బబులోను విగ్రహ దేవుళ్ళకూ ఎంత తేడానో కదా! బబులోను దేవుళ్ళు తమ ఆరాధకుల కోసం ఏమీ చేయలేరు. వాళ్ళు కదలాలంటే బరువులు మోసే జంతువులు వాళ్ళను మోసుకు వెళ్ళాలి. దానికి భిన్నంగా, యెహోవా తన ప్రజలను చంకనెత్తుకుని మోస్తున్నాడు. ఆయన వారిని “గర్భమున పుట్టినది మొదలుకొని” అంటే ఆ జనాంగము ఏర్పడినప్పటి నుండి కాపాడాడు. యెహోవా తమను చంకనెత్తుకుని మోసినదాన్ని గురించి యూదులకున్న మధురమైన జ్ఞాపకాలు, వారు విగ్రహారాధనను విడనాడి తమ తండ్రిగా, స్నేహితునిగా ఆయనపై నమ్మకం ఉంచేలా వారిని ప్రోత్సహించాలి.

7. యెహోవా తన ఆరాధకుల విషయంలో తీసుకునే ప్రేమపూర్వకమైన శ్రద్ధ, మానవ తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో తీసుకునే శ్రద్ధకన్నా ఎలా గొప్పది?

7 యెహోవా తన ప్రజలతో వాత్సల్యపూరితంగా ఇంకా ఇలా అంటున్నాడు: “ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే; తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే. నేనే చేసియున్నాను, చంకపెట్టుకొనువాడను నేనే, నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే.” (యిషయా 46: 4) యెహోవా తన ప్రజలపట్ల చూపించే శ్రద్ధ, ఎంతో ప్రేమగల తల్లిదండ్రులు చూపించే శ్రద్ధకన్నా మిన్నయైనది. పిల్లలు పెద్దవారైనప్పుడు, తల్లిదండ్రులు వారి గురించి ఎక్కువ బాధ్యత వహించక పోవచ్చు. అయితే తల్లిదండ్రులు వృద్ధులైనప్పుడు, తరచూ పిల్లలు వారి తల్లిదండ్రుల గురించి శ్రద్ధ తీసుకుంటారు. కానీ యెహోవా విషయంలో ఎన్నడూ అలా జరుగదు. ఆయన తన మానవ పిల్లల గురించి శ్రద్ధ తీసుకోవడం ఎన్నడూ మానడు, చివరికి వారు వృద్ధులైనప్పుడు కూడా ఆయన వారి గురించి శ్రద్ధ తీసుకుంటాడు. నేడు దేవుని ఆరాధకులు తమ సృష్టికర్తపై నమ్మకం ఉంచి ఆయనను ప్రేమిస్తూ యెషయా ప్రవచనంలోని ఈ మాటలనుబట్టి గొప్ప ఓదార్పు పొందుతారు. వారు ఈ విధానంలో ఇంకా గడపవలసిన దినాలను లేక సంవత్సరాలను బట్టి వ్యాకులపడవలసిన అవసరం లేదు. వయోభారంతో క్రుంగిపోతున్న వారు సహించడానికీ, నమ్మకంగా ఉండడానికీ వారికి కావలసిన బలాన్ని ఇవ్వడం ద్వారా వారిని ‘ఎత్తుకుంటానని’ యెహోవా వాగ్దానం చేస్తున్నాడు. ఆయన వారిని చంకనెత్తుకుని మోస్తాడు, వారిని బలపరుస్తాడు, వారిని రక్షిస్తాడు.​—⁠హెబ్రీయులు 6:​10.

ఆధునిక దిన విగ్రహాల గురించి జాగ్రత్త!

8. యెషయా తోటివారైన ఆయన స్వదేశస్థులు కొంతమంది క్షమించరాని ఏ పాపం చేశారు?

8 పూర్తిగా నిరుపయోగమైనవిగా నిరూపించబడే విగ్రహాలను నమ్ముకునే బబులోనీయులకు ఎదురవ్వబోయే నిరాశను ఊహించండి! ఆ విగ్రహ దేవుళ్ళు, యెహోవాకు సమానులని ఇశ్రాయేలీయులు విశ్వసించాలా? అవసరంలేదు. దానికి సముచితంగానే యెహోవా ఇలా అడుగుతున్నాడు: “మేము సమానులమని నన్ను ఎవనికి సాటిచేయుదురు? మేము సమానులమని యెవని నాకు పోటిగా చేయుదురు?” (యెషయా 46: 5) యెషయా తోటివారైన ఆయన స్వదేశస్థులు కొంతమంది నోరులేని, నిర్జీవ, నిస్సహాయ విగ్రహాలను ఆరాధించడానికి తిరగడం ఎంతటి క్షమించరాని పాపం! యెహోవాను ఎరిగిన జనము నిర్జీవమైన, రక్షించలేని, మానవ నిర్మిత ప్రతిమలపై ఆధారపడడం నిజంగా మూర్ఖత్వం.

9. కొంతమంది విగ్రహారాధకుల వ్యర్థమైన తర్కాన్ని వివరించండి.

9 విగ్రహారాధకులు చేసే వ్యర్థమైన తర్కాన్ని పరిశీలించండి. ప్రవచనం ఇలా కొనసాగుతోంది: “దానికి సాగిలపడి నమస్కారము చేయుటకై సంచినుండి బంగారము మెండుగా పోయువారును వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలెనని కంసాలిని కూలికి పిలుతురు.” (యిషయా 46: 6) చెక్కతో చేసిన విగ్రహం కన్నా ఖరీదైన విగ్రహానికి రక్షించే శక్తి ఎక్కువగా ఉంటుందన్నట్లుగా, విగ్రహారాధకులు తమ దేవతను నిర్మించుకోవడానికి ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు. ఎంత కృషి చేసినప్పటికీ లేక ఎంత ఖరీదైన పదార్థాలను ఉపయోగించినప్పటికీ, నిర్జీవమైన విగ్రహం నిర్జీవంగానే ఉంటుంది తప్ప అంతకన్నా ఎక్కువేమీ కాలేదు.

10. విగ్రహారాధన యొక్క పూర్తి వ్యర్థత ఎలా వర్ణించబడింది?

10 విగ్రహారాధనలోని మూర్ఖత్వాన్ని ఇంకా నొక్కిచెబుతూ ప్రవచనం ఇలా కొనసాగుతోంది: “వారు భుజముమీద దాని నెక్కించుకొందురు, దాని మోసికొనిపోయి తగినచోట నిలువబెట్టుదురు. ఆ చోటు విడువకుండ అది అక్కడనే నిలుచును. ఒకడు దానికి మొఱ్ఱపెట్టినను ఉత్తరము చెప్పదు; వాని శ్రమ పోగొట్టి యెవనిని రక్షింపదు.” (యెషయా 46: 7) వినగల లేదా చర్యతీసుకోగల సామర్థ్యం లేని ప్రతిమకు ప్రార్థించడం ఎంత హాస్యాస్పదం! అలాంటి ఆరాధనా వస్తువుల నిరుపయోగాన్ని కీర్తనకర్త చక్కగా వర్ణిస్తున్నాడు: “వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతిపనులు. వాటికి నోరుండియు పలుకవు; కన్నులుండియు చూడవు; చెవులుండియు వినవు. ముక్కులుండియు వాసనచూడవు. చేతులుండియు ముట్టుకొనవు. పాదములుండియు నడువవు; గొంతుకతో మాటలాడవు. వాటిని చేయువారును, వాటియందు నమ్మికయుంచు వారందరును వాటివంటివారై యున్నారు.”​—⁠కీర్తన 115:​4-8.

“ధైర్యము కూడగట్టుకోండి”

11. ధైర్యాన్ని కోల్పోతున్నవారు ‘ధైర్యము కూడగట్టుకోవడానికి’ ఏది సహాయం చేస్తుంది?

11 విగ్రహారాధన యొక్క వ్యర్థతను చూపించిన తర్వాత, ఇప్పుడు యెహోవా తన ప్రజలు తన సేవ ఎందుకు చేయాలనేదానికి కారణాలు చెబుతున్నాడు: ‘దీని జ్ఞాపకము చేసికొని ధైర్యముగా నుండుడి [“ధైర్యము కూడగట్టుకోండి,” NW]. అతిక్రమము చేయువారలారా, దీని ఆలోచించుడి. చాల పూర్వమున జరిగినవాటిని జ్ఞాపకము చేసికొనుడి, దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు, నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు.’ (యిషయా 46:​8, 9) సత్యారాధనకు, విగ్రహారాధనకు మధ్య కొట్టుమిట్టాడే వారు గత చరిత్రను గుర్తుతెచ్చుకోవాలి. యెహోవా చేసిన వాటిని వారు మనస్సులో ఉంచుకోవాలి. అలాచేయడం, వారు ధైర్యం కూడగట్టుకొని సరైనది చేసేలా వారికి సహాయపడుతుంది. అది, వారు తిరిగి యెహోవాను ఆరాధించేలా వారికి సహాయం చేస్తుంది.

12, 13. క్రైస్తవులు ఏ పోరాటాల్లో నిమగ్నమై ఉన్నారు, వారు ఎలా విజయం సాధించగలరు?

12 ఈ ప్రోత్సాహం నేడు కూడా అవసరమే. ఇశ్రాయేలీయుల్లానే యథార్థ క్రైస్తవులు కూడా శోధనలతోనూ, తమ స్వంత అపరిపూర్ణతలతోనూ పోరాడాలి. (రోమీయులు 7:​21-24) అంతేగాక, అదృశ్యంగావున్నా, అత్యంత శక్తివంతుడిగావున్న శత్రువుతో వారు ఆధ్యాత్మిక పోరాటం సలపాలి. అపొస్తలుడైన పౌలు ఇలా చెబుతున్నాడు: “మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోకనాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.”​—⁠ఎఫెసీయులు 6:​12.

13 నిజ క్రైస్తవులను సత్యారాధన నుండి ప్రక్కకు మళ్ళించడానికి సాతాను, అతని దయ్యాలు చేయగలిగిందంతా చేస్తారు. వారిని ఎదుర్కోవడంలో విజయవంతులు కావాలంటే, క్రైస్తవులు యెహోవా ఇచ్చే ఉపదేశాన్ని అనుసరించి, ధైర్యం కూడగట్టుకోవలసిన అవసరం ఉంది. ఎలా? అపొస్తలుడైన పౌలు ఇలా వివరిస్తున్నాడు: “మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకొనుడి.” యెహోవా తన సేవకులకు సరైన ఆయుధాలు ఇవ్వకుండా యుద్ధానికి పంపడు. వారి ఆధ్యాత్మిక సర్వాంగకవచములో ‘విశ్వాసమను డాలు ఉంది; దానితో వారు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుతారు.’ (ఎఫెసీయులు 6:​11, 16) యెహోవా తమ కోసం చేసిన ఆధ్యాత్మిక ఏర్పాట్లను ఇశ్రాయేలీయులు నిర్లక్ష్యం చేశారు గనుక వారు దోషులు. యెహోవా తమ పక్షాన పదే పదే చేసిన శక్తివంతమైన క్రియల గురించి వారు ధ్యానించి ఉంటే, వారు హేయమైన విగ్రహారాధన వైపుకు ఎన్నడూ మరలి ఉండేవారు కాదు. మనం వారి ఉదాహరణ నుండి నేర్చుకుని, సరైనది చేసే పోరాటంలో ఎన్నడూ ధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలని నిశ్చయించుకుందాము.​—⁠1 కొరింథీయులు 10:​11.

14. తాను మాత్రమే ఏకైక సత్య దేవుడినని చూపించడానికి యెహోవా ఏ సామర్థ్యం గురించి చెబుతున్నాడు?

14 యెహోవా, ‘తన ఆలోచన నిలుచుననియు తన చిత్తమంతయు నెరవేర్చుకొనెదననియు చెప్పుకొనుచు ఆదినుండి కలుగబోవువాటిని తెలియజేస్తున్నాడు, పూర్వకాలమునుండి యింక జరుగనివాటిని తెలియజేస్తున్నాడు.’ (యెషయా 46:​10) ఈ విషయంలో ఏ ఇతర దేవుడు యెహోవాకు సాటి రాగలడు? భవిష్యత్తును ముందే తెలియజేసే సామర్థ్యం, సృష్టికర్త యొక్క దైవత్వానికి విశిష్టమైన నిదర్శనం. అయితే, ముందే తెలియజేయబడినవి తప్పక నెరవేరేలా చూడడానికి కేవలం ముందు చూపుకంటే ఎక్కువే అవసరం. ‘నా ఆలోచన నిలుచును’ అనే ప్రకటన సుస్థిరమైన దేవుని సంకల్పం యొక్క మారని గుణాన్ని నొక్కిచెబుతోంది. యెహోవాకు అపరిమితమైన శక్తి ఉంది గనుక, ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా విశ్వంలో ఉన్నదేదీ ఆయనను అడ్డగించలేదు. (దానియేలు 4:​35) కాబట్టి, ఇంకా నెరవేర వలసి ఉన్న ఏ ప్రవచనాలైనా, దేవుని నియమిత సమయంలో తప్పక నెరవేరుతాయని మనం నిశ్చయత కలిగి ఉండవచ్చు.​—⁠యెషయా 55:​11.

15. భవిష్యత్తును ముందే తెలియజేసే యెహోవా సామర్థ్యాన్ని గురించిన ఏ విశేషమైన ఉదాహరణ మన దృష్టికి తీసుకురాబడుతుంది?

15 భవిష్యత్తులోని సంఘటనలను ముందే తెలియజేసి తర్వాత తన మాటలను నెరవేర్చడంలో యెహోవాకున్న సామర్థ్యాన్ని గురించిన అనుపమానమైన ఉదాహరణను యెషయా ప్రవచనం ఇప్పుడు మన దృష్టికి తెస్తుంది: “తూర్పునుండి క్రూరపక్షిని రప్పించుచున్నాను, దూరదేశమునుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానిని పిలుచుచున్నాను. నేను చెప్పియున్నాను; దాని నెరవేర్చెదను. ఉద్దేశించియున్నాను, సఫలపరచెదను.” (యెషయా 46:​11) ‘ఆదినుండి కలుగబోవువాటిని తెలియజేసేవానిగా’ యెహోవా దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి మానవ వ్యవహారాల్లో పరిస్థితులను మలుస్తాడు. ఆయన కోరెషును “తూర్పు నుండి” లేక తూర్పునవున్న పారసీక దేశము నుండి రప్పిస్తాడు, అక్కడే కోరెషుకు ప్రియమైన రాజధానియైన పసార్‌గడీ ఉంటుంది. కోరెషు బబులోనుపై హఠాత్తుగా, అనుకోని విధంగా దాడి చేసే “క్రూరపక్షి”లా ఉంటాడు.

16. బబులోను గురించి తాను ప్రవచించినదాని ఖచ్చితత్వాన్ని యెహోవా ఎలా ధృవీకరించాడు?

16 బబులోను గురించి యెహోవా ప్రవచించిన దాని ఖచ్చితత్వం, “నేను చెప్పియున్నాను దాని నెరవేర్చెదను” అనే మాటలతో ధృవీకరించబడుతుంది. అపరిపూర్ణ మానవుడు అనాలోచిత వాగ్దానాలు చేయడానికి మొగ్గు చూపితే, సృష్టికర్త తన మాటను నెరవేర్చడంలో ఎన్నడూ విఫలుడు కాడు. యెహోవా “అబద్ధమాడనేరని” దేవుడు గనుక, ఆయన ‘ఉద్దేశించి ఉంటే’ ఆయన దాన్ని ‘సఫలం’ కూడా చేస్తాడని మనం నిశ్చయత కలిగి ఉండవచ్చు.​—⁠తీతు 1:​1-4.

అవిశ్వాస హృదయాలు

17, 18. (ఎ) ప్రాచీన కాలాల్లో ఎవరిని ‘కఠిన హృదయులుగా’ వర్ణించవచ్చు? (బి) నేడు ఎవరిని ‘కఠిన హృదయులుగా’ వర్ణించవచ్చు?

17 మరొకసారి, యెహోవా ప్రవచనార్థకంగా తన అవధానాన్ని బబులోనీయుల వైపుకు మళ్ళిస్తూ ఇలా చెబుతున్నాడు: “కఠినహృదయులై నీతికి దూరముగా ఉన్నవారలారా, నా మాట ఆలకించుడి.” (యెషయా 46:​12) ‘కఠినహృదయులు’ అనే మాట మొండివారై దేవుని చిత్తాన్ని వ్యతిరేకించాలని నిశ్చయించుకున్నవారిని వర్ణిస్తుంది. నిస్సందేహంగా, బబులోనీయులు దేవునికి ఎంతో దూరంగా ఉన్నారు. యెహోవాపట్ల, ఆయన ప్రజలపట్ల వారికున్న ద్వేషం వారు యెరూషలేమును, దాని ఆలయాన్ని నాశనం చేసి, దాని నివాసులను బంధీలుగా తీసుకువెళ్ళేలా ప్రేరేపిస్తుంది.

18 నేడు సందేహించే, అపనమ్మకమైన హృదయాలను కలిగివున్నవారు సకల జనములకు ప్రకటించబడుతున్న రాజ్యసందేశాన్ని వినడానికి మొండిగా నిరాకరిస్తారు. (మత్తయి 24:​14) యెహోవాను న్యాయబద్ధమైన సర్వాధికారిగా అంగీకరించడం వారికిష్టంలేదు. (కీర్తన 83:​18; ప్రకటన 4:​10, 11) “నీతికి దూరముగా ఉన్న” హృదయాలను కలిగివుండి, ఆయన చిత్తాన్ని ఎదిరిస్తూ, వ్యతిరేకిస్తారు. (2 తిమోతి 3:​1-5) బబులోనీయుల్లా వారు యెహోవా చెప్పేది వినడానికి నిరాకరిస్తారు.

దేవుని రక్షణ ఆలస్యము కాదు

19. యెహోవా ఇశ్రాయేలు కోసం నీతియుక్తమైన కార్యాన్ని ఏ విధంగా చేస్తాడు?

19 యెషయా గ్రంథం 46 వ అధ్యాయంలోని చివరి మాటలు యెహోవా వ్యక్తిత్వంలోని అంశాలను ఉన్నతపరుస్తున్నాయి: “నా నీతిని దగ్గరకు రప్పించియున్నాను. అది దూరమున లేదు, నా రక్షణ ఆలస్యము చేయలేదు. సీయోనులో రక్షణనుండ నియమించుచున్నాను, ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను.” (యెషయా 46:​13) దేవుడు ఇశ్రాయేలును విడుదల చేయడమన్నది నీతియుక్తమైన చర్యయై ఉంటుంది. ఆయన తన ప్రజలు చెరలోనే ఉండిపోవడానికి అనుమతించడు. సీయోనుకు రక్షణ తగిన సమయంలో వస్తుంది, అది ‘ఆలస్యము చేయదు.’ ఇశ్రాయేలీయులు చెర నుండి విడిపించబడిన తర్వాత, వారు తమ చుట్టు ప్రక్కలనున్న జనములకు వేడుక అవుతారు. యెహోవా తన జనాంగమును విడుదల చేయడం, ఆయనకున్న రక్షించే శక్తికి నిదర్శనంగా ఉంటుంది. బబులోను దేవుళ్ళయిన బేలు, నెబోల నిష్ప్రయోజకత్వం అందరికీ బయలుపరచబడుతుంది, వారి అసమర్థత వెల్లడవుతుంది.​—⁠1 రాజులు 18:​39, 40.

20. యెహోవా అనుగ్రహించే ‘రక్షణ ఆలస్యము కాదని’ క్రైస్తవులు ఎలా నిశ్చయత కలిగి ఉండవచ్చు?

20 యెహోవా తన ప్రజలను 1919 లో ఆధ్యాత్మిక చెర నుండి విడుదల చేశాడు. ఆయన ఆలస్యం చేయలేదు. ఆ సంఘటనా, బబులోనును కోరెషు స్వాధీనం చేసుకున్నప్పటి ప్రాచీన సంఘటనలూ నేడు మనల్ని ప్రోత్సహిస్తాయి. అబద్ధ ఆరాధనతో సహా ఈ దుష్ట విధానానికి అంతం తెస్తానని యెహోవా వాగ్దానం చేశాడు. (ప్రకటన 19:​1, 2, 17-21) కొంతమంది క్రైస్తవులు మానవ దృక్కోణం నుండి విషయాలను పరిశీలిస్తూ, తమ రక్షణ ఆలస్యం చేయబడుతున్నట్లు భావించవచ్చు. అయితే, ఆ వాగ్దానాన్ని నెరవేర్చేందుకు యెహోవా తన నియమిత సమయం వరకు సహనం కలిగి ఉండడమన్నది నిజంగా నీతియుక్తమైన చర్య. ఎంతైనా, ‘యెహోవా యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచున్నాడు.’ (2 పేతురు 3: 9) కాబట్టి, ప్రాచీన ఇశ్రాయేలు కాలంలోలానే ‘రక్షణ ఆలస్యము కాదని’ నిశ్చయత కలిగి ఉండండి. వాస్తవానికి రక్షణ దినం సమీపిస్తుండగా, యెహోవా ప్రేమపూర్వకంగా ఈ ఆహ్వానం అందజేయడాన్ని కొనసాగిస్తాడు: “యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను; వారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును.”​—⁠యెషయా 55: 6, 7.

[అధ్యయన ప్రశ్నలు]

[94 వ పేజీలోని చిత్రాలు]

బబులోను దేవుళ్ళు దాని నాశనం నుండి దాన్ని కాపాడవు

[98 వ పేజీలోని చిత్రాలు]

క్రైస్తవులు నేడు ఆధునిక దిన విగ్రహాల గురించి జాగ్రత్త వహించాలి

[101 వ పేజీలోని చిత్రాలు]

సరైనది చేయడానికి ధైర్యము కూడగట్టుకోండి