కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వేషధారణ బయలుపరచబడింది!

వేషధారణ బయలుపరచబడింది!

పందొమ్మిదవ అధ్యాయం

వేషధారణ బయలుపరచబడింది!

యెషయా 58:​1-14

1. వేషధారణను యెహోవా, యేసు ఎలా దృష్టిస్తారు, యెషయా కాలంలో అది ఏ రూపాన్ని దాల్చింది?

 యేసు తన కాలంనాటి మతనాయకులతో ఇలా అన్నాడు: “మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని, లోపల వేషధారణతోను అక్రమముతోను నిండియున్నారు.” (మత్తయి 23:​28) యేసు వేషధారణను ఖండించడం ఆయన పరలోక తండ్రి దృక్కోణాన్ని ప్రతిబింబిస్తోంది. యెషయా ప్రవచనంలోని 58 వ అధ్యాయం, యూదాలో విశృంఖలంగా ఉన్న వేషధారణపై నిర్దిష్టమైన అవధానాన్ని నిలుపుతుంది. పోరాటాలు, అణచివేత, హింస సర్వసాధారణమై పోయాయి, విశ్రాంతి దినాన్ని పాటించడం అర్థరహితమైన ఆచరణగా దిగజారిపోయింది. ప్రజలు యెహోవాకు నామమాత్రపు సేవచేస్తూ, బూటకపు ఉపవాసాలు చేస్తూ భక్తిపరులమన్నట్లు ఆర్భాటం చేస్తుంటారు. యెహోవా వారి వేషధారణను బయలుపరచడంలో ఆశ్చర్యమేమీ లేదు!

‘జనులకు వారి పాపములను తెలియజేయుము’

2. యెషయా యెహోవా సందేశాన్ని ప్రకటించేటప్పుడు ఎలాంటి దృక్పథాన్ని చూపించాడు, నేడు ఆయనలా ఎవరున్నారు?

2 యూదా ప్రవర్తనను బట్టి యెహోవాకు అసహ్యం కలిగినా, ఆయన మాటల్లో పశ్చాత్తాపపడమని వారికి చేస్తున్న హృదయపూర్వకమైన విజ్ఞప్తి కూడా ఉంది. అయినప్పటికీ, తన మందలింపు అస్పష్టంగా ఉండాలని యెహోవా అనుకోవడం లేదు. అందుకే, ఆయన యెషయాకు ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు: “తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయుము, యాకోబు ఇంటివారికి వారి పాపములను తెలియజేయుము.” (యెషయా 58: 1) యెహోవా మాటలను యెషయా ధైర్యంగా ప్రకటించడంవల్ల ప్రజలు ఆయనను ద్వేషించవచ్చు, అయినా ఆయన వెనుక తీయడు. “చిత్తగించుము, నేనున్నాను నన్ను పంపు”మన్నప్పుడు ఆయన చూపించిన అదే అంకిత భావాన్ని ఆయన ఇప్పటికీ కలిగివున్నాడు. (యెషయా 6: 8) ఆధునిక దిన యెహోవాసాక్షులకు కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించి, మత వేషధారణను బయలుపరచమని ఆజ్ఞాపించబడింది గనుక సహనం విషయంలో యెషయా వారికి ఎంత చక్కని మాదిరో కదా!​—⁠కీర్తన 118: 6; 2 తిమోతి 4:​1-5.

3, 4. (ఎ) యెషయా కాలంలోని ప్రజలు ఏ బూటకపు రూపాన్ని దాలుస్తారు? (బి) యూదాలో వాస్తవంగా పరిస్థితి ఎలా ఉంది?

3 ఎంతో ఆడంబరంగా, యెషయా కాలంలోని ప్రజలు యెహోవాను వెదకుతూ, ఆయన న్యాయమైన తీర్పులకు తమ ఇష్టాన్ని వ్యక్తపరుస్తున్నారు. యెహోవా మాటలను మనమిలా చదువుతాము: “తమ దేవుని న్యాయవిధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు, అనుదినము వారు నాయొద్ద విచారణచేయుచు, నా మార్గములను తెలిసికొన నిచ్ఛ కనుపరచుదురు, తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలెనని వారడుగుదురు, దేవుడు తమకు ప్రత్యక్షుడు కావలెనని యిచ్ఛయింతురు.” (యెషయా 58: 2) వారు చెప్పుకుంటున్నట్లుగా, యెహోవా మార్గాలపట్ల వారికున్న ఇష్టం యథార్థమైనదేనా? కాదు. వారు “నీతిని అనుసరించువారైనట్టు” ఉన్నారు గానీ అదంతా కేవలం బూటకమే. నిజానికి, ఈ జనము ‘దేవుని న్యాయవిధిని విడిచిపెట్టేసింది.’

4 పరిస్థితి చాలామేరకు, ప్రవక్తయైన యెహెజ్కేలుకు ఆ తర్వాత బయలుపరచబడిన దానిలా ఉంది. “పోదము రండి, యెహోవాయొద్దనుండి బయలుదేరు మాట యెట్టిదో చూతము రండి” అని యూదులు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారని యెహోవా యెహెజ్కేలుకు చెప్పాడు. కాని దేవుడు వారి వేషధారణ గురించి యెహెజ్కేలును హెచ్చరించాడు: “నా జనులు . . . నీయొద్దకు వచ్చి, . . . నీ మాటలు విందురు గాని వాటి ననుసరించి ప్రవర్తింపరు, వారు నోటితో ఎంతో ప్రేమ కనుపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడవుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు.” (యెహెజ్కేలు 33:​30-32) యెషయా సమకాలీనులు ఎల్లప్పుడూ యెహోవాను వెదకుతున్నామని చెప్పుకుంటారు కానీ వారు ఆయన మాటలకు విధేయత చూపించరు.

వేషధారణతో కూడిన ఉపవాసం

5. యూదులు దైవానుగ్రహాన్ని పొందడానికి ఎలా ప్రయత్నిస్తారు, దానికి యెహోవా ఎలా ప్రతిస్పందిస్తాడు?

5 దైవానుగ్రహాన్ని సంపాదించుకోవాలనే ప్రయత్నంలో, యూదులు లాంఛనప్రాయంగా ఉపవాసం ఉంటారు గానీ వారు నటిస్తున్న భక్తి వారిని యెహోవా నుండి దూరమే చేస్తుంది. స్పష్టమైన దిగ్భ్రమతో వారిలా అడుగుతారు: “మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు?” యెహోవా నిర్మొహమాటంగా ఇలా అంటాడు: “మీ ఉపవాసదినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారిచేత కఠినమైనపని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు, అట్టి ఉపవాసము నాకనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్మువలె తలవంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిదె పరచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరనుకొందురా?”​—యెషయా 58:​3-5.

6. యూదుల ఉపవాసం వేషధారణతో కూడినదని వారు చేసే ఏ చర్యలు చూపిస్తాయి?

6 ప్రజలు ఉపవాసం ఉండి, కపట నీతిని ప్రదర్శిస్తూ, చివరికి యెహోవా న్యాయమైన తీర్పుల కోసం అడుగుతూ, అదేసమయంలో స్వార్థపూరితమైన ఆనందాల కోసం, వ్యాపార లాభాల కోసం వెంపర్లాడతారు. వారు పోరాటాలు, అణచివేత, హింసలకు పాల్పడతారు. తమ చెడు ప్రవర్తనను దాచుకోవాలనే ప్రయత్నంలో వారు తమ పాపాలకు తాము పశ్చాత్తాపపడుతున్నామన్నట్లుగా జమ్ములా తలలువంచుకొని, గోనెపట్ట కట్టుకొని బూడిదెలో కూర్చుంటారు. వారు తిరుగుబాటు చేస్తూనే ఉంటే దీనంతటి వల్ల ప్రయోజనమేమిటి? యథార్థమైన ఉపవాసాలతోపాటు ఉండవలసిన దైవిక విచారాన్ని, పశ్చాత్తాపాన్ని వారు ఏ మాత్రం చూపించరు. వారు ఎంత బిగ్గరగా విలపించినా, దాన్ని పరలోకంలో వినడం జరుగదు.

7. యేసు కాలంనాటి యూదులు వేషధారణతో ఎలా ప్రవర్తించారు, నేడు అనేకులు అదేవిధంగా ఎలా ప్రవర్తిస్తున్నారు?

7 యేసు కాలంనాటి యూదులు కూడా అలానే ఆచారం నిమిత్తం ఉపవాసమున్నారు, కొందరు వారానికి రెండుసార్లు ఉపవాసం ఉన్నారు! (మత్తయి 6:​16-18; లూకా 18:​11, 12) చాలామంది మతనాయకులు కూడా కఠినంగా, అధికార దర్పం చూపించేవారిగా ఉండడం ద్వారా యెషయా తరం వారిని అనుకరించారు. కాబట్టి, యేసు ధైర్యంగా ఆ మతసంబంధమైన వేషధారులను బయలుపరచి, వారు చేస్తున్నటువంటి ఆరాధన వ్యర్థమైనదని వారికి చెప్పాడు. (మత్తయి 15:​7-9) నేడు కూడా లక్షలాదిమంది ‘దేవుని ఎరుగుదుమని చెప్పుకొందురు గాని, వారు అసహ్యులును అవిధేయులును ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునైయుండి తమ క్రియలవలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు.’ (తీతు 1:​16) అలాంటి వారు దేవుని కనికరం కోసం ఆశించవచ్చు కాని వారి ప్రవర్తన వారి వేషధారణను బయలుపరుస్తుంది. దానికి భిన్నంగా, యెహోవాసాక్షులు నిజమైన దైవభక్తిని, యథార్థమైన సహోదర ప్రేమను ప్రదర్శిస్తారు.​—⁠యోహాను 13:​35.

నిజమైన పశ్చాత్తాపంలో ఏమి ఇమిడివుంది?

8, 9. యథార్థమైన పశ్చాత్తాపంతో పాటు అనుకూలమైన ఏ చర్యలు కూడా అవసరం?

8 యెహోవా తన ప్రజలు తమ పాపాలను బట్టి ఉపవాసం ఉండడం కంటే ఎక్కువే చేయాలని కోరుకుంటున్నాడు; వారు తమ పాపాల విషయమై పశ్చాత్తాపపడాలని ఆయన కోరుకుంటున్నాడు. అప్పుడు వారు ఆయన అనుగ్రహాన్ని పొందుతారు. (యెహెజ్కేలు 18:​23, 32) ఉపవాసం అర్థవంతమైనదై ఉండాలంటే ఉపవాసం ఉండడంతో పాటు గత పాపాలను సరిదిద్దుకోవడం కూడా అవసరమని ఆయన వివరిస్తున్నాడు. యెహోవా అడుగుతున్న, హృదయాన్ని శోధించే ఈ ప్రశ్నలను పరిశీలించండి: “దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడినవారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము గదా?”​—యెషయా 58: 6.

9 కట్లు, కాడిమానులు కఠిన బానిసత్వానికి సరైన చిహ్నాలు. కాబట్టి ప్రజలు ఉపవాసం ఉంటూ, అదే సమయంలో తమ తోటి విశ్వాసులను అణచివేసే బదులు, “నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను” అనే ఆజ్ఞకు విధేయులవ్వాలి. (లేవీయకాండము 19:​18) వారు తాము అణచివేసి, అన్యాయంగా బానిసలుగా చేసుకున్న వారినందరినీ విడుదల చేయాలి. a ఉపవాసం ఉండడం వంటి, ఆడంబరంతో కూడిన మతపరమైన చర్యలు నిజమైన దైవ భక్తికి, సహోదర ప్రేమను ప్రదర్శించే చర్యలకు ప్రత్యామ్నాయాలేమీ కాదు. యెషయా సమకాలీన ప్రవక్త అయిన మీకా ఇలా వ్రాస్తున్నాడు: “న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.”​—⁠మీకా 6: 8.

10, 11. (ఎ) యూదులకు, ఉపవాసం ఉండడం కన్నా ఏది మిన్న? (బి) యెహోవా యూదులకు ఇచ్చిన ఉపదేశాన్ని నేడు క్రైస్తవులు ఎలా అన్వయించుకోవచ్చు?

10 న్యాయాన్ని, దయను, వినయాన్ని కనబర్చాలంటే ఇతరులకు మంచి చేయడం అవసరం, యెహోవా ధర్మశాస్త్ర సారం అదే. (మత్తయి 7:​12) ఉపవాసం ఉండడం కన్నా, తమకున్న సమృద్ధిని అవసరతలో ఉన్నవారితో పంచుకోవడమే ఎంతో మిన్న. యెహోవా ఇలా అడుగుతున్నాడు: “నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము?” (యెషయా 58: 7, 8ఎ) అవును, ఉపవాసం ఉన్నట్లు పెద్ద ఆర్భాటం చేసే బదులు, ఇవ్వగల స్థితిలో ఉన్నవారు అవసరతలో ఉన్న తమ తోటి యూదా నివాసులకు అంటే తమ రక్త సంబంధీకులకు ఆహారాన్ని, వస్త్రాలను లేదా ఆశ్రయాన్ని ఇవ్వాలి.

11 సహోదర ప్రేమ గురించి, దయ గురించి యెహోవా వ్యక్తపరచిన ఈ రమ్యమైన సూత్రాలు యెషయా కాలం నాటి యూదులకు మాత్రమే వర్తిస్తాయని కాదు. అవి క్రైస్తవులకు కూడా నడిపింపునిస్తాయి. అందుకే అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “కాబట్టి మనకు సమయము దొరకినకొలది అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము.” (గలతీయులు 6:​10) ప్రాముఖ్యంగా మనం జీవిస్తున్న అత్యంత క్లిష్టమైన సమయాల దృష్ట్యా, క్రైస్తవ సంఘం ప్రేమ సహోదరానురాగాల ఆశ్రయమై ఉండాలి.​—⁠2 తిమోతి 3: 1; యాకోబు 1:​27.

విధేయత గొప్ప ఆశీర్వాదములను తెస్తుంది

12. యెహోవా తన ప్రజలు తనకు విధేయులయితే ఏమి చేస్తాడు?

12 యెహోవా ఇస్తున్న ప్రేమపూర్వక మందలింపును లక్ష్యపెట్టే వివేకము యెహోవా ప్రజలకు గనుక ఉంటే ఎంత బాగుంటుందో కదా! యెహోవా ఇలా చెబుతున్నాడు: “ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును; స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి నీ ముందర నడచును; యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును; నీవు మొఱ్ఱపెట్టగా ఆయన​—⁠నేనున్నాననును.” (యెషయా 58:8బి, 9ఎ) అవి ఎంత ప్రేమపూర్వకమైన, ఆకర్షణీయమైన మాటలో కదా! కృపాతిశయమును, నీతిని ప్రేమించేవారిని యెహోవా ఆశీర్వదిస్తాడు, కాపుదలనిస్తాడు. యెహోవా ప్రజలు గనుక తమ కఠినత్వాన్ని, వేషధారణను బట్టి పశ్చాత్తాపపడి, ఆయనకు విధేయులైతే, వారికి పరిస్థితులు ఎంతో మెరుగవుతాయి. యెహోవా ఆ జనముకు “స్వస్థత”ను అంటే ఆధ్యాత్మిక, శారీరక పునరుద్ధరణను ఇస్తాడు. వారి పితరులు ఐగుప్తును విడిచి వస్తున్నప్పుడు వారిని కాపాడినట్లుగానే ఆయన వారిని కూడా కాపాడతాడు. సహాయం కోసం వారు చేసే విన్నపాలకు ఆయన వెంటనే ప్రతిస్పందిస్తాడు.​—⁠నిర్గమకాండము 14:​19, 20, 31.

13. యూదులు యెహోవా చెప్పినదానికి ప్రతిస్పందిస్తే వారికి ఏ ఆశీర్వాదములు లభిస్తాయి?

13 యెహోవా ఇప్పుడు తన మునుపు చెప్పినదానికి ఇంకా ఇలా జత చేస్తున్నాడు: ‘ఇతరులను [అన్యాయంగా బానిసలుగా చేసుకుని కఠినంగా వ్యవహరిస్తూ వారిని] బాధించుటయు, [బహుశా తృణీకారంగా లేదా అబద్ధ ఆరోపణలతో] వ్రేలుపెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానినిబట్టి మాటలాడుటయు నీవు మాని, ఆశించినదానిని ఆకలిగొనినవానికిచ్చి శ్రమపడినవానిని తృప్తిపరచినయెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నమువలె నుండును.’ (యెషయా 58:9బి, 10) స్వార్థపరత్వము, కఠినత్వము స్వనాశనానికే దారితీస్తాయి, యెహోవా ఉగ్రతకు కారణమవుతాయి. అయితే, దయ ఉదారతలు ప్రాముఖ్యంగా ఆకలిగొన్నవారిపట్ల, బాధింపబడుతున్న వారిపట్ల చూపించబడినప్పుడు దేవుని గొప్ప దీవెనలను తీసుకువస్తాయి. యూదులు ఈ సత్యాలను హృదయంలోకి తీసుకుంటే ఎంత బాగుండేది! అప్పుడు వారి ఆధ్యాత్మిక ప్రకాశము, సమృద్ధి, సమస్త అంధకారాన్నీ పారద్రోలుతూ వారు మధ్యాహ్నపు సూర్యునిలా వెలిగేటట్లు చేస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా, తమ మహిమాశీర్వాదాలకు మూలమైన యెహోవాకు వారు ఘనతను, స్తుతిని తీసుకువస్తారు.​—⁠1 రాజులు 8:​41-43.

పునఃస్థాపించబడిన జనము

14. (ఎ) యెషయా సమకాలీనులు ఆయన మాటలకు ఎలా ప్రతిస్పందిస్తారు? (బి) యెహోవా ఏమి ఇస్తూనే ఉన్నాడు?

14 విచారకరంగా, ఆ జనము యెహోవా విజ్ఞప్తిని అలక్ష్యం చేసి, దుష్టత్వంలోకి ఇంకా లోతుగా కూరుకుపోతుంది. చివరికి వారు, యెహోవా తాను హెచ్చరించినట్లుగానే వారిని బంధీలుగా పంపడం తప్పనిసరి అయ్యేలా చేసుకుంటారు. (ద్వితీయోపదేశకాండము 28:​15, 36, 37, 64, 65) అయినప్పటికీ, యెషయా ద్వారా యెహోవా పలికిన తర్వాతి మాటలు నిరీక్షణను ఇస్తున్నాయి. యూదా దేశము నిర్జనంగా విడువబడినప్పటికీ, క్రమశిక్షణను అంగీకరించి దానికి ప్రతిస్పందించి, పశ్చాత్తాపపడిన శేషము ఆనందంగా తిరిగి వస్తుందని దేవుడు ముందుగా తెలియజేస్తాడు.

15. యెహోవా ఏ ఆనందభరితమైన పునఃస్థాపన గురించి ముందుగా తెలియజేశాడు?

15 యెహోవా తన ప్రజలు సా.శ.పూ. 537 లో పునఃస్థాపించబడడాన్ని సూచిస్తూ, యెషయా ద్వారా ఇలా చెబుతున్నాడు: “యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ యెముకలను బలపరచును; నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు.” (యెషయా 58:​11) యెహోవా ఇశ్రాయేలు యొక్క ఎండిన స్వదేశాన్ని పచ్చని ఫలవంతమైన నేలగా మారుస్తాడు. అంతకంటే అద్భుతమైనదేమిటంటే, ఆయన పశ్చాత్తాపపడిన తన ప్రజలను ఆశీర్వదించి, వారి “యెముకలను” ఆధ్యాత్మిక నిర్జీవ స్థితి నుండి సంపూర్ణ శక్తివంతమైన స్థితికి తీసుకువచ్చి, వాటిని బలపరుస్తాడు. (యెహెజ్కేలు 37:​1-14) ప్రజలు ఆధ్యాత్మిక ఫలములతో నింపబడి “నీరు కట్టిన తోట” వలె అవుతారు.

16. దేశం ఎలా పునఃస్థాపించబడుతుంది?

16 బబులోనీయులు సా.శ.పూ. 607 లో దాడి చేసినప్పుడు నాశనం చేయబడిన నగరాలను పునర్నిర్మించడం కూడా పునఃస్థాపనలో భాగమే. “పూర్వకాలమునుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు; అనేకతరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరల కట్టెదవు. విరుగబడినదానిని బాగుచేయువాడవనియు దేశములో నివసించునట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును.” (యెషయా 58:​12) ‘పూర్వకాలమునుండి పాడైపోయిన స్థలములు,’ ‘అనేకతరముల క్రిందట పాడైపోయిన పునాదులు’ (లేదా, తరతరాల నుండి శిథిలావస్థలోవున్న పునాదులు) వంటి సమాంతరమైన వ్యక్తీకరణలు, తిరిగి వచ్చే శేషము, నాశనం చేయబడిన యూదా నగరాలను ప్రాముఖ్యంగా యెరూషలేమును పునర్నిర్మిస్తుందని చూపిస్తున్నాయి. (నెహెమ్యా 2: 5; 12:​27; యెషయా 44:​28) వారు యెరూషలేము యొక్క “విరుగబడిన” గోడలను, నిస్సందేహంగా ఇతర నగరాల గోడలను కూడా బాగుచేస్తారు.​—⁠యిర్మీయా 31:​38-40; ఆమోసు 9:​14.

విశ్రాంతి దినాన్ని నమ్మకంగా ఆచరించడం మూలంగా లభించే ఆశీర్వాదములు

17. విశ్రాంతి దిన కట్టడలను అనుసరించమని యెహోవా తన ప్రజలకు ఎలా విజ్ఞప్తి చేస్తున్నాడు?

17 విశ్రాంతి దినం, దేవునికి తన ప్రజల భౌతిక, ఆధ్యాత్మిక సంక్షేమం పట్ల ఉన్న ప్రగాఢమైన శ్రద్ధకు నిదర్శనం. “విశ్రాంతిదినము మనుష్యులకొరకే నియమింపబడెను” అని యేసు అన్నాడు. (మార్కు 2:​27) యెహోవాచే పరిశుద్ధపరచబడిన ఈ దినము ఇశ్రాయేలీయులు దేవునిపట్ల తమకున్న ప్రేమను చూపించడానికి వారికి ప్రత్యేకమైన అవకాశాన్నిచ్చింది. విచారకరంగా, యెషయా కాలానికల్లా అది, వ్యర్థమైన ఆచారాలను ఆచరించే, స్వార్థపూరితమైన కోరికల్లో నిమగ్నమయ్యే దినంగా తయారయ్యింది. కాబట్టి యెహోవా మరొకసారి తన ప్రజలను గద్దించే పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ ఆయన వారి హృదయాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆయనిలా అంటున్నాడు: ‘నా విశ్రాంతిదినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినయెడల విశ్రాంతిదినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితదినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల నీవు యెహోవాయందు ఆనందించెదవు; దేశము [“భూమి,” NW] యొక్క ఉన్నతస్థలములమీద నేను నిన్నెక్కించెదను; నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవములో ఉంచెదను, యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే.’​—యెషయా 58:​13, 14.

18. విశ్రాంతి దినాన్ని ఘనపరచడంలో యూదా విఫలమవ్వడం యొక్క ఫలితమేమై ఉంటుంది?

18 విశ్రాంతి దినం ఆధ్యాత్మిక ధ్యానం, ప్రార్థన, కుటుంబ ఆరాధన చేయవలసిన దినం. యూదులు యెహోవా తమ కోసం చేసిన అద్భుత కార్యాల గురించి, ఆయన ధర్మశాస్త్రములో చూపించబడిన న్యాయము ప్రేమల గురించి ధ్యానించడానికి అది వారికి సహాయం చేయాలి. అలా, ఈ పరిశుద్ధ దినాన్ని నమ్మకంగా పాటించడం, ప్రజలు తమ దేవునికి సన్నిహితం కావడానికి వారికి సహాయం చేయాలి. అయితే, వారు విశ్రాంతి దినాన్ని పెడదారిపట్టిస్తున్నారు గనుక వారు యెహోవా ఆశీర్వాదమును పోగొట్టుకునే ప్రమాదంలో ఉన్నారు.​—⁠లేవీయకాండము 26:​34; 2 దినవృత్తాంతములు 36:​21.

19. దేవుని ప్రజలు విశ్రాంతి దినాన్ని పాటించడం మొదలుపెడితే వారి కోసం ఏ గొప్ప ఆశీర్వాదములు వేచివుంటాయి?

19 అయినప్పటికీ, యూదులు తమకు ఇవ్వబడిన క్రమశిక్షణ నుండి పాఠం నేర్చుకొని విశ్రాంతి దిన ఏర్పాటును ఘనపరచడం మొదలుపెడితే, వారికి గొప్ప ఆశీర్వాదములు లభిస్తాయి. సత్యారాధన చేయడం, విశ్రాంతి దినంపట్ల గౌరవం చూపించడం యొక్క మంచి ప్రభావాలు వారి జీవితాల్లోని ఇతర అంశాల్లో కూడా పొంగి పొరలుతాయి. (ద్వితీయోపదేశకాండము 28:​1-13; కీర్తన 19:​7-11) ఉదాహరణకు, యెహోవా తన ప్రజలు ‘భూమి యొక్క ఉన్నతస్థలములమీదకు ఎక్కేలా’ చేస్తాడు. ఈ వ్యక్తీకరణ భద్రతను, ఒకరు తమ శత్రువులను జయించడాన్ని సూచిస్తుంది. కొండలు, పర్వతాలు వంటి ఉన్నత స్థలాలను ఎవరైతే స్వాధీనం చేసుకోగలుగుతారో వారే దేశాన్ని స్వాధీనం చేసుకోగలుగుతారు. (ద్వితీయోపదేశకాండము 32:​13; 33:​29) ఒకప్పుడు ఇశ్రాయేలువారు యెహోవాకు విధేయత చూపించారు, అప్పుడు వారు ఆయన కాపుదలను అనుభవించి, ఇతర జనముల గౌరవాన్ని పొందారు, చివరికి ఇతర జనములు వారికి భయపడ్డారు కూడా. (యెహోషువ 2:​9-11; 1 రాజులు 4:​20, 21) మళ్ళీ వారు యెహోవాకు విధేయులైతే, మునుపటి మహిమలో కొంత మహిమను తిరిగి పొందగలుగుతారు. యెహోవా తన ప్రజలకు “యాకోబు స్వాస్థ్యము”లో పూర్తి భాగమును, అంటే వారి పితరులతో ఆయన చేసిన నిబంధన ద్వారా వాగ్దానం చేయబడిన ఆశీర్వాదములను, ముఖ్యంగా వాగ్దాన దేశాన్ని స్వాస్థ్యముగా కలిగివుండడమనే ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు.​—⁠కీర్తన 105:​8-11.

20. క్రైస్తవుల కోసం ఏ “విశ్రాంతి” నిలిచి ఉంది?

20 దీనిలో క్రైస్తవులకు ఏమైనా పాఠం ఉందా? యేసుక్రీస్తు మరణంతో, విశ్రాంతి దిన ఆవశ్యకతలతో సహా మోషే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. (కొలొస్సయులు 2:​16, 17) అయితే, విశ్రాంతి దినాన్ని పాటించడం యూదాలో ప్రోత్సహించి ఉండవలసిన స్ఫూర్తి యెహోవా ఆరాధకులకు ఇప్పటికీ ఆవశ్యకమైనదే, అదేమిటంటే, ఆధ్యాత్మిక విషయాలకు మొదటిస్థానం ఇస్తూ యెహోవాకు సన్నిహితం కావడం. (మత్తయి 6:​33; యాకోబు 4: 8) అంతేగాక, పౌలు హెబ్రీయులకు తాను వ్రాసిన పత్రికలో ఇలా చెబుతున్నాడు: “దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది.” యెహోవాకు విధేయులై, యేసుక్రీస్తు చిందించిన రక్తంలో విశ్వాసం ఆధారంగా నీతిని సంపాదించుకోవడానికి ప్రయాసపడడం ద్వారా క్రైస్తవులు ఈ “విశ్రాంతి”లోకి ప్రవేశిస్తారు. (హెబ్రీయులు 3:​12, 18, 19; 4:​6, 9-11, 14-16) క్రైస్తవులు ఈ విధమైన విశ్రాంతి దినాన్ని వారానికి ఒక రోజు కాదు గానీ, ప్రతీ రోజు పాటించాలి.​—⁠కొలొస్సయులు 3:​23, 24.

ఆధ్యాత్మిక ఇశ్రాయేలు ‘భూమియొక్క ఉన్నతస్థలముల మీదకు ఎక్కుతుంది’

21, 22. దేవుని ఇశ్రాయేలు ‘భూమి యొక్క ఉన్నతస్థలముల మీదకు ఎక్కేలా’ యెహోవా ఎలా చేశాడు?

21 అభిషిక్త క్రైస్తవులు 1919 లో బబులోను చెర నుండి విడుదల చేయబడినప్పటి నుండి విశ్రాంతి దినం దేనికైతే పూర్వచ్ఛాయగా ఉందో దానిని నమ్మకంగా పాటించారు. ఫలితంగా, యెహోవా వారిని ‘భూమి యొక్క ఉన్నతస్థలముల మీదకు ఎక్కేలా’ చేశాడు. ఏ భావంలో? అబ్రాహాము సంతానము గనుక విధేయంగా ఉంటే వారు యాజకరూపమైన రాజ్యము, పరిశుద్ధమైన జనము అవుతారని యెహోవా వారితో సా.శ.పూ. 1513 లో ఒక నిబంధన చేశాడు. (నిర్గమకాండము 19:​5, 6) వారు అరణ్యంలో సంచరించిన 40 సంవత్సరాల్లో యెహోవా వారిని, ఒక పక్షిరాజు తన పిల్లలను మోసినట్లుగా సురక్షితంగా తీసుకువెళ్ళి, వారిని అపారమైన ఏర్పాట్లతో ఆశీర్వదించాడు. (ద్వితీయోపదేశకాండము 32:​10-12) అయితే, ఆ జనముకు విశ్వాసం కొరవడి చివరికి అది తాను పొంది ఉండగలిగిన ఆధిక్యతలన్నిటినీ పోగొట్టుకుంది. అలా జరిగినా, యెహోవాకు నేటికీ యాజకుల రాజ్యం ఒకటి ఉంది. అదే దేవుని ఆధ్యాత్మిక ఇశ్రాయేలు.​—⁠గలతీయులు 6:​16; 1 పేతురు 2: 9.

22 “అంత్యకాలము”లో, ఈ ఆధ్యాత్మిక జనము ప్రాచీన ఇశ్రాయేలు చేయలేకపోయిన దాన్ని చేసింది. వీరు యెహోవాపై విశ్వాసం ఉంచారు. (దానియేలు 8:​17) దాని సభ్యులు యెహోవా ఉన్నతమైన, ఉత్కృష్టమైన ప్రమాణాలను ఖచ్చితంగా అనుసరిస్తుండగా, ఆధ్యాత్మిక భావంలో యెహోవా వారిని పైకి ఎక్కిస్తాడు. (సామెతలు 4:​4, 5, 8; ప్రకటన 11:​12) తమ చుట్టూ ఉన్న అపరిశుభ్రత నుండి కాపాడబడి, వారు ఉన్నతమైన జీవన విధానాన్ని ఆనందిస్తారు, వారు తమ సొంత మార్గాలను అనుసరించాలని పట్టుబట్టే బదులు, “యెహోవానుబట్టి” ఆయన వాక్యమునుబట్టి ‘సంతోషిస్తారు.’ (కీర్తన 37: 4) వారికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికీ, యెహోవా వారిని ఆధ్యాత్మికంగా సురక్షితంగా ఉంచాడు. వారి ఆధ్యాత్మిక “దేశము”కు 1919 నుండి ఎటువంటి గండి ఏర్పడలేదు. (యెషయా 66:​8, NW) ఆయన ఉన్నతమైన నామము కోసం ఏర్పరచబడిన ప్రజలుగా కొనసాగుతూ వారు ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఆనందంగా ప్రకటిస్తారు. (ద్వితీయోపదేశకాండము 32: 3; అపొస్తలుల కార్యములు 15:​14) అంతేగాక, అన్ని జనములకు చెందిన అసంఖ్యాకులు వారితో కలిసి యెహోవా మార్గాల గురించి బోధించబడే, ఆయన మార్గాల్లో నడిచేందుకు సహాయాన్నిపొందే గొప్ప ఆధిక్యతలో భాగం వహిస్తున్నారు.

23. యెహోవా ఎలా తన అభిషిక్త సేవకులు ‘యాకోబు స్వాస్థ్యమును అనుభవించేలా’ చేశాడు?

23 యెహోవా తన అభిషిక్త సేవకులు ‘యాకోబు స్వాస్థ్యమును అనుభవించేలా’ లేదా మూలభాషా ప్రతి యొక్క జాగ్రత్తతో కూడిన అనువాదం ప్రకారం, దాని “నుండి తినే”లా చేశాడు. ఇస్సాకు ఏశావుకు బదులుగా యాకోబును ఆశీర్వదించినప్పుడు ఆ పితరుని మాటలు, అబ్రాహాము యొక్క వాగ్దత్త సంతానంలో విశ్వాసం ఉంచే వారందరికీ ఆశీర్వాదములను ముందుగా తెలియజేశాయి. (ఆదికాండము 27:​27-29; గలతీయులు 3:​16, 17) ఏశావు వలె గాక యాకోబు వలె అభిషిక్త క్రైస్తవులు, వారి సహవాసులు ‘పరిశుద్ధ విషయాలను,’ ప్రాముఖ్యంగా దేవుడు సమృద్ధిగా అనుగ్రహించే ఆధ్యాత్మిక ఆహారాన్ని ‘విలువైనదిగా ఎంచుతారు.’ (హెబ్రీయులు 12:​16, 17, NW; మత్తయి 4: 4) ఈ ఆధ్యాత్మిక ఆహారం బలవర్థకమైనది, పుష్టికరమైనది, వారి ఆధ్యాత్మిక జీవానికి ఆవశ్యకమైనది, దానిలో, వాగ్దానం చేయబడిన సంతానం ద్వారా ఆయన సహవాసుల ద్వారా యెహోవా సాధిస్తున్న దాన్ని గురించిన జ్ఞానము కూడా ఇమిడి ఉంది. కాబట్టి, వారు దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా, దాన్ని ధ్యానించడం ద్వారా ఆధ్యాత్మిక పోషకాహారాన్ని ఎల్లప్పుడూ తీసుకోవడం ఎంతో అవశ్యం. (కీర్తన 1:​1-3) వారు క్రైస్తవ కూటాల్లో తోటి విశ్వాసులతో సహవసించడం తప్పనిసరి. వారు ఆ పోషకాహారాన్ని ఆనందంగా ఇతరులతో పంచుకుంటుండగా వారు స్వచ్ఛారాధన యొక్క ఉత్కృష్టమైన ప్రమాణాలను ఉన్నతపరచడం ఎంతో అత్యావశ్యకం.

24. నిజ క్రైస్తవులు నేడు ఎలా ప్రవర్తిస్తారు?

24 యెహోవా వాగ్దానాల నెరవేర్పు కోసం ఆత్రంగా ఎదురుచూస్తూ, నిజ క్రైస్తవులు అన్ని విధాలైన వేషధారణలను వదిలిపెట్టడాన్ని కొనసాగించుదురు గాక. “యాకోబు స్వాస్థ్యము” ద్వారా పోషించబడి, వారు ‘భూమి యొక్క ఉన్నత స్థలములలో’ ఆధ్యాత్మిక భద్రతను అనుభవిస్తూ ఉందురు గాక.

[అధస్సూచి]

a అప్పుల పాలైన తన ప్రజలు తమ అప్పులను తీర్చేందుకు తమను తాము బానిసత్వంలోకి అమ్మేసుకునేలా, ప్రాముఖ్యంగా జీతగానిగా మారేలా యెహోవా ఏర్పాటు చేశాడు. (లేవీయకాండము 25:​39-43) అయితే, ధర్మశాస్త్రం ప్రకారం, దాసుల పట్ల కనికరంతో వ్యవహరించాలి. క్రూరత్వానికి గురవుతున్న వారిని విడుదల చేయాలి.​—⁠నిర్గమకాండము 21:​2, 3, 26, 27; ద్వితీయోపదేశకాండము 15:​12-15.

[అధ్యయన ప్రశ్నలు]

[278 వ పేజీలోని చిత్రం]

యూదులు బూటకపు పశ్చాత్తాపంతో ఉపవాసం ఉంటూ, తమ తలలు వంచేవారు ​—⁠కానీ వారు తమ మార్గములను మార్చుకోలేదు

[283 వ పేజీలోని చిత్రం]

ఇవ్వగల స్థితిలో ఉన్నవారు, అవసరంలో ఉన్నవారికి ఆశ్రయాన్ని, వస్త్రాలను, లేదా ఆహారపదార్థాలను ఇస్తారు

[286 వ పేజీలోని చిత్రం]

యూదా గనుక పశ్చాత్తాపపడితే, అది నాశనమైన తన నగరాలను పునర్నిర్మించుకుంటుంది