కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సీయోనులో నీతి ఉజ్జీవింపజేయబడును

సీయోనులో నీతి ఉజ్జీవింపజేయబడును

ఇరవై రెండవ అధ్యాయం

సీయోనులో నీతి ఉజ్జీవింపజేయబడును

యెషయా 61:​1-11

1, 2. ఇశ్రాయేలుపైకి ఏ మార్పు రానైయుంది, ఆ మార్పును ఎవరు తీసుకువస్తారు?

 స్వేచ్ఛ ప్రకటించబడును గాక! యెహోవా తన ప్రజలను విడుదలచేసి వారిని తమ పూర్వీకుల దేశంలో పునఃస్థాపించాలని నిశ్చయించుకున్నాడు. చిరుజల్లు కురిసిన తర్వాత మొలకెత్తే విత్తనంలా, సత్యారాధన మరోసారి అంకురిస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు, నిరాశానిస్పృహల స్థానంలో ఆనందభరితమైన స్తుతి ఉంటుంది, మునుపు దుఃఖం అనే బూడిదతో కప్పబడిన తలలపై దైవిక ఆమోదమనే కిరీటం ఉంటుంది.

2 ఈ అద్భుతమైన మార్పును ఎవరు తీసుకువస్తారు? కేవలం యెహోవా మాత్రమే ఆ పని చేయగలడు. (కీర్తన 9:​19, 20; యెషయా 40:​25) జెఫన్యా ప్రవక్త ప్రవచనార్థకంగా ఇలా ఆజ్ఞాపించాడు: “సీయోను నివాసులారా, ఉత్సాహధ్వని చేయుడి! ఇశ్రాయేలీయులారా, జయధ్వని చేయుడి! యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి! తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసియున్నాడు.” (జెఫన్యా 3:​14, 15) అదెంత ఆనందభరితమైన సమయమై ఉంటుందో కదా! సా.శ.పూ. 537 లో యెహోవా పునఃస్థాపిత శేషమును సమకూర్చినప్పుడు, కల నిజమైనట్లుగా ఉంటుంది.​—⁠కీర్తన 126:​1, 2.

3. యెషయా 61 వ అధ్యాయంలోని ప్రవచనార్థక మాటలు ఏయే విధాలుగా నెరవేరాయి?

3 ఈ పునఃస్థాపన గురించి యెషయా 61 వ అధ్యాయంలో ప్రవచించబడింది. అయితే, ఆ ప్రవచనం సా.శ.పూ. 537 లో స్పష్టంగా నెరవేరినా, ఆ తర్వాతి కాలంలో అది మరింత విస్తృతంగా నెరవేరింది. మరింత విస్తృతమైన ఆ నెరవేర్పులో యేసు, ఆయన మొదటి శతాబ్దపు అనుచరులు, ఆధునిక కాలాల్లోని యెహోవా ప్రజలు భాగమై ఉన్నారు. కాబట్టి ఈ ప్రేరేపిత మాటలు ఎంత అర్థవంతమైనవో కదా!

“హితవత్సరము”

4. యెషయా 61:1 మొదటి నెరవేర్పులో సువర్తమానము ప్రకటించే నియామకం ఎవరికి ఇవ్వబడింది, ఆ తర్వాత ఎవరికి ఇవ్వబడింది?

4 యెషయా ఇలా వ్రాస్తున్నాడు: “ప్రభువగు యెహోవా ఆత్మ నామీదికి వచ్చియున్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును . . . ఆయన నన్ను పంపియున్నాడు.” (యెషయా 61:​1-3) సువర్తమానము ప్రకటించే నియామకం ఎవరికివ్వబడింది? మొదటి సందర్భంలో, యెషయాకు ఇవ్వబడి ఉండవచ్చు, ఆయన బబులోనులో బంధీలుగా ఉన్న వారి కోసం సువర్తమానమును వ్రాసి ఉంచడానికి దేవునిచే ప్రేరేపించబడ్డాడు. అయితే, యెషయా మాటలను యేసు తనకు అన్వయించుకున్నప్పుడు ఆయన అత్యంత ప్రాముఖ్యమైన నెరవేర్పును సూచించాడు. (లూకా 4:​16-21) అవును, సాత్వికులకు సువర్తమానము ప్రకటించడానికే యేసు పంపబడ్డాడు, అందుకే ఆయన తాను బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మచే అభిషేకించబడ్డాడు.​—⁠మత్తయి 3:​16, 17.

5. దాదాపు 2,000 సంవత్సరాలుగా ఎవరు సువార్త ప్రకటిస్తున్నారు?

5 అంతేగాక, యేసు తన అనుచరులకు సువార్తికులుగా లేక సువార్త ప్రచారకులుగా ఉండడాన్ని నేర్పించాడు. సా.శ. 33 పెంతెకొస్తు సమయంలో, వీరిలో దాదాపు 120 మంది పరిశుద్ధాత్మచే అభిషేకించబడి, దేవుని ఆధ్యాత్మిక కుమారులయ్యారు. (అపొస్తలుల కార్యములు 2:​1-4, 14-42; రోమీయులు 8:​14-16) వారు కూడా, సాత్వికులకు, నలిగిన హృదయంగలవారికి సువార్తను ప్రకటించే నియామకాన్ని పొందారు. ఆ 120 మంది, ఈ విధంగా అభిషేకించబడే 1,44,000 మందిలో మొదటివారు. ఈ గుంపులోని చివరివారు నేటికీ భూమిపై చురుగ్గా ఉన్నారు. కాబట్టి, దాదాపు 2,000 సంవత్సరాలుగా, యేసు అభిషిక్త అనుచరులు, “దేవుని యెదుట మారుమనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము” ఉంచడం గురించి సాక్ష్యమిస్తున్నారు.​—⁠అపొస్తలుల కార్యములు 20:​21.

6. ప్రాచీన కాలాల్లో ప్రకటించబడిన సువార్తను విని ఎవరు ఉపశమనం పొందారు, నేటి సంగతి ఏమిటి?

6 యెషయా ప్రేరేపిత సందేశం బబులోనులో ఉన్న పశ్చాత్తప్తులైన యూదులకు ఉపశమనాన్ని తీసుకువచ్చింది. అలాగే యేసు కాలంలోనూ, ఆయన శిష్యుల కాలంలోనూ, ఇశ్రాయేలులోని దుష్టత్వాన్నిబట్టి నలిగిన హృదయంతోవున్న, మొదటి శతాబ్దపు యూదా అబద్ధమత సాంప్రదాయాల చెరలో కృశించిపోతున్న యూదులకు కూడా ఉపశమనాన్ని తీసుకువచ్చింది. (మత్తయి 15:​3-6) నేడు క్రైస్తవమత సామ్రాజ్య అన్య ఆచారాల్లోనూ, దేవుని అగౌరవపరిచే సాంప్రదాయాల్లోనూ చిక్కుకుపోయి ఉన్న లక్షలాదిమంది, ఆ మత విధానంలో జరుగుతున్న హేయ క్రియలను బట్టి “మూల్గులిడుచు ప్రలాపించు”చున్నారు. (యెహెజ్కేలు 9:⁠4) సువార్తకు ప్రతిస్పందించేవారు ఆ దయనీయమైన స్థితి నుండి విడుదల చేయబడుతున్నారు. (మత్తయి 9:​35-38) వారు యెహోవాను “ఆత్మతో సత్యముతో” ఆరాధించడాన్ని నేర్చుకున్నప్పుడు వారి అవగాహనా నేత్రాలు సువిశాలంగా తెరువబడుతున్నాయి.​—⁠యోహాను 4:​24.

7, 8. (ఎ) రెండు ‘హితవత్సరాలు’ ఏవి? (బి) యెహోవా యొక్క ‘ప్రతిదండన దినాలు’ ఏవి?

7 సువార్త ప్రకటించడానికి ఒక కాలపట్టిక ఉంది. “యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును” యేసుకు, ఆయన అనుచరులకు నియామకం ఇవ్వబడింది. (యెషయా 61:⁠2) సంవత్సరం అన్నది దీర్ఘకాలం, కానీ దానికి ఒక ఆరంభం, ఒక ముగింపు ఉంటాయి. యెహోవా యొక్క “హితవత్సరము” అనేది, తాను ప్రకటింపజేస్తున్న స్వేచ్ఛకు ప్రతిస్పందించడానికి సాత్వికులకు అవకాశమివ్వబడే సమయం.

8 మొదటి శతాబ్దంలో, సా.శ. 29 లో యేసు తన భూపరిచర్యను ప్రారంభించినప్పుడు యూదా జనముకు హితవత్సరము ప్రారంభమైంది. “పరలోకరాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని” ఆయన యూదులకు చెప్పాడు. (మత్తయి 4:​17) ఆ హితవత్సరము యెహోవా “ప్రతిదండన దినము” వచ్చే వరకు కొనసాగింది, సా.శ. 70 లో, రోమా సైన్యాలు యెరూషలేమును, దాని ఆలయాన్ని నాశనం చేయడానికి యెహోవా అనుమతించినప్పుడు ఆ దినము చరమాంకాన్ని చేరుకుంది. (మత్తయి 24:​3-22) నేడు మనం మరో హితవత్సరములో అంటే 1914 లో పరలోకంలో దేవుని రాజ్యం స్థాపించబడడంతో ప్రారంభమైన దానిలో జీవిస్తున్నాము. ఈ హితవత్సరము, ‘మహాశ్రమల’ సమయంలో ఈ లోక విధానాన్నంతటినీ యెహోవా నాశనం చేసేటటువంటి మరింత విస్తృతమైన మరో ప్రతిదండన దినముతో ముగుస్తుంది.​—⁠మత్తయి 24:​21.

9. యెహోవా హితవత్సరము నుండి నేడు ఎవరు ప్రయోజనం పొందుతారు?

9 దేవుని హితవత్సరము నుండి నేడు ఎవరు ప్రయోజనం పొందుతారు? సందేశాన్ని అంగీకరించేవారే, వారు సాత్వికాన్ని ప్రదర్శిస్తూ దేవుని రాజ్యాన్ని “సకల జనములకు” ప్రకటించడానికి అత్యాసక్తితో మద్దతునిస్తారు. (మార్కు 13:​10) సువార్త నిజమైన ఓదార్పును తెస్తుందని అలాంటివారు కనుగొంటారు. అయితే, యెహోవా హితవత్సరం నుండి ప్రయోజనం పొందడానికి నిరాకరిస్తూ ఆ సందేశాన్ని తిరస్కరించేవారు ఆయన ప్రతిదండన దినపు వాస్తవాన్ని త్వరలోనే ఎదుర్కోవలసి ఉంటుంది.​—⁠2 థెస్సలొనీకయులు 1:​6-9.

దేవుని మహిమపరిచే ఆధ్యాత్మిక ఫలము

10. బబులోను నుండి తిరిగివస్తున్న యూదులు యెహోవా తమ పక్షాన చేసిన గొప్ప కార్యములను బట్టి ఎలా ప్రభావితమయ్యారు?

10 బబులోను నుండి తిరిగి వచ్చే యూదులు, యెహోవా తమ పక్షాన గొప్ప కార్యములు జరిగించాడని గ్రహిస్తారు. బంధీలుగా వారు చేస్తున్న విలాపము, వారు స్వేచ్ఛను పొందుతారు గనుక చివరికి హర్షధ్వనిగా, స్తుతిగా మారుతుంది. అలా, యెషయా తనకివ్వబడిన ఈ ప్రవచనార్థక నియామకాన్ని నెరవేరుస్తాడు: “సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును.”​—యెషయా 61: 3.

11. యెహోవా చేసిన గొప్ప కార్యమును బట్టి ఆయనను స్తుతించడానికి మొదటి శతాబ్దంలో ఎవరికి మంచి కారణం ఉంది?

11 మొదటి శతాబ్దంలో, అబద్ధమత దాసత్వం నుండి విడుదల పొందడానికి అంగీకరించిన యూదులు కూడా దేవుడు తమ పక్షాన చేసిన గొప్ప కార్యములను బట్టి ఆయనను స్తుతించారు. వారు ఆధ్యాత్మికంగా మృతమైన జనాంగము నుండి విడుదల చేయబడినప్పుడు భారభరితమైన ఆత్మకు ప్రతిగా వారికి “స్తుతివస్త్రము” లభించింది. అలాంటి మార్పును యేసు శిష్యులు మొదట చవిచూశారు, అదెప్పుడంటే, యేసు మరణాన్ని బట్టి వారు చేస్తున్న విలాపము, పునరుత్థానం చేయబడిన తమ ప్రభువు ద్వారా తాము పరిశుద్ధాత్మచే అభిషేకించబడినందుకు ఆనందంగా మారినప్పుడు వారు అలాంటి మార్పును చవిచూశారు. తర్వాత త్వరలోనే, 3,000 మంది దీనులు అలాంటి మార్పునే చవిచూశారు, వీరు సా.శ. 33 పెంతెకొస్తునాడు క్రొత్తగా అభిషేకించబడిన క్రైస్తవులు ప్రకటించినప్పుడు ప్రతిస్పందించి, బాప్తిస్మము తీసుకున్నారు. (అపొస్తలుల కార్యములు 2:​41) యెహోవా ఆశీర్వాదాన్ని పొందుతామన్న నిశ్చయత కలిగి ఉండడం ఎంత మంచిదో కదా! “సీయోనులో దుఃఖించ”డానికి బదులు వారు పరిశుద్ధాత్మను పొంది, యెహోవాచేత గొప్పగా ఆశీర్వదించబడినవారు పొందే ఆనందాన్ని సూచించే “ఆనందతైలము”తో ఉపశమనాన్ని పొందారు.​—⁠హెబ్రీయులు 1: 9.

12, 13. (ఎ) సా.శ.పూ. 537 లో తిరిగి వస్తున్న యూదులలో “నీతి అను మస్తకివృక్షము”లు ఎవరు? (బి) సా.శ. 33 పెంతెకొస్తు నాటి నుండి “నీతి అను మస్తకివృక్షము”లు ఎవరు?

12 యెహోవా తన ప్రజలను “నీతి అను మస్తకివృక్షముల”తో ఆశీర్వదిస్తాడు. ఈ మస్తకివృక్షాలు ఎవరు? వారు, సా.శ.పూ. 537 తర్వాతి సంవత్సరాల్లో వాక్యాన్ని అధ్యయనం చేసి దాన్ని ధ్యానించి, యెహోవా నీతియుక్తమైన ప్రమాణాలను అలవర్చుకున్న వ్యక్తులు. (కీర్తన 1:​1-3; యెషయా 44:​2-4; యిర్మీయా 17:​7, 8) ఎజ్రా, హగ్గయి, జెకర్యా, ప్రధాన యాజకుడైన యెహోషువ వంటి వ్యక్తులు విశేషమైన “మస్తకివృక్షము”లుగా అంటే సత్యం కోసం దృఢంగా నిలబడేవారిగా, ఆ జనాంగంలో ఆధ్యాత్మిక కాలుష్యాన్ని నిరోధించేవారిగా నిరూపించుకున్నారు.

13 సా.శ. 33 పెంతెకొస్తు నాటి నుండి దేవుడు అలాంటి “నీతి అను మస్తకివృక్షముల”ను అంటే ధైర్యవంతులైన అభిషిక్త క్రైస్తవులను తన క్రొత్త జనమైన “దేవుని ఇశ్రాయేలు” యొక్క ఆధ్యాత్మిక ఎస్టేటులో నాటాడు. (గలతీయులు 6:​16) శతాబ్దాలు గడుస్తుండగా, ఈ “వృక్షము”లు 1,44,000 సంఖ్యను చేరుకొని, యెహోవా దేవుడ్ని మహిమపరచడానికి నీతి ఫలాలను ఉత్పన్నం చేస్తున్నారు. (ప్రకటన 14: 3) దారుఢ్యంగల ఈ వృక్షాల్లోని చివరివారు 1919 నుండి తర్వాతి సంవత్సరాల్లో, అంటే దేవుని ఇశ్రాయేలులోని మిగిలినవారిని తమ తాత్కాలికమైన నిష్క్రియా స్థితినుండి యెహోవా పునరుద్ధరించినప్పటి నుండి ఎంతో వర్ధిల్లారు. వారికి ఆధ్యాత్మిక జలములను సమృద్ధిగా అందజేయడం ద్వారా నీతియుక్తమైన, ఫలాలనిచ్చే వృక్షాల నిజమైన వనాన్ని యెహోవా ఉత్పన్నం చేశాడు.​—⁠యెషయా 27: 6.

14, 15. యెహోవా యొక్క విడుదల పొందిన ఆరాధకులు (ఎ) సా.శ.పూ. 537 లో, (బి) సా.శ. 33 లో, (సి) 1919 లో ఏ కార్యక్రమాలను చేపట్టారు?

14 ఈ ‘వృక్షములు’ చేసే పనిని ఉన్నతపరుస్తూ, యెషయా ఇలా కొనసాగిస్తున్నాడు: “చాలకాలమునుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు; పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరములనుండి శిథిలములైయున్న పురములను బాగు చేయుదురు.” (యెషయా 61: 4) పారసీక రాజైన కోరెషు ఆజ్ఞ మేరకు, బబులోను నుండి తిరిగి వచ్చిన నమ్మకమైన యూదులు, ఎంతో కాలం నుండి పాడుగా విడువబడిన యెరూషలేమును దాని ఆలయాన్ని పునర్నిర్మించారు. సా.శ. 33 మరియు 1919 తర్వాతి సంవత్సరాల్లో కూడా పునఃస్థాపన కార్యక్రమాలు జరిగాయి.

15 సా.శ. 33 లో యేసు శిష్యులు ఆయన నిర్భంధం, విచారణ, మరణాలను బట్టి ఎంతో దుఃఖితులయ్యారు. (మత్తయి 26:​31) అయితే, ఆయన తన పునరుత్థానం తర్వాత వారికి కనిపించినప్పుడు వారి దృక్కోణం మారింది. ఒకసారి పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరింపబడడంతో వారు, “యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును” సువార్త ప్రకటించే పనిలో నిమగ్నమయ్యారు. (అపొస్తలుల కార్యములు 1: 8) అలా వారు స్వచ్ఛారాధనను పునఃస్థాపించడం ప్రారంభించారు. అదే విధంగా, 1919 నుండి యేసుక్రీస్తు తన అభిషిక్త సహోదరుల శేషము “తరతరములనుండి శిథిలములైయున్న పురములను” పునర్నిర్మించేలా చేశాడు. శతాబ్దాల నుండి క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకులు యెహోవాను గూర్చిన జ్ఞానాన్ని అందజేయడంలో విఫలమై, దానికి బదులుగా మానవ నిర్మిత సాంప్రదాయాలకు, లేఖనరహితమైన సిద్ధాంతాలకు ప్రాధాన్యతనిచ్చారు. అభిషిక్త క్రైస్తవులు సత్యారాధన యొక్క పునఃస్థాపన ముందుకు సాగేలా, అబద్ధ మతంచే కళంకితమైన ఆచారాలను తమ సంఘాల్లో నుండి తొలగించి వేశారు. ఆ తర్వాత, ఇంతవరకూ కనీవినీ ఎరుగనిదిగా నిరూపించబడే అత్యంత గొప్ప సాక్ష్యపు పనిని ప్రారంభించారు.​—⁠మార్కు 13:​10.

16. అభిషిక్త క్రైస్తవులు చేస్తున్న పునఃస్థాపన పనిలో వారికి ఎవరు సహాయం చేస్తున్నారు, వారికి ఏ పనులు అప్పగించబడ్డాయి?

16 ఇది చాలా పెద్ద నియామకం. సాపేక్షికంగా కొద్దిమందిగా ఉన్న దేవుని ఇశ్రాయేలులోని మిగిలిన వారు అంత పెద్ద పనిని ఎలా సాధించగలరు? ఇలా ప్రకటించేలా యెహోవా యెషయాను ప్రేరేపించాడు: “అన్యులు నిలువబడి మీ మందలను మేపెదరు, పరదేశులు మీకు వ్యవసాయకులును మీ ద్రాక్షతోట కాపరులును అగుదురు.” (యిషయా 61: 5) ఆలంకారికంగా చెప్పబడిన అన్యులు, పరదేశులు యేసు “వేరే గొఱ్ఱెల”లోని “యొక గొప్ప సమూహము”గా నిరూపించబడ్డారు. a (ప్రకటన 7: 9; యోహాను 10:​11, 16) వారు పరలోక వారసత్వాన్ని పొందే నిరీక్షణతో పరిశుద్ధాత్మచే అభిషేకించబడలేదు. బదులుగా, వారికి పరదైసు భూమిపై నిరంతరం జీవించే నిరీక్షణ ఉంది. (ప్రకటన 21:​3, 4) అయినప్పటికీ వారు యెహోవాను ప్రేమిస్తున్నారు, వారికి ఆధ్యాత్మికభావంలో మందలను మేపడం, వ్యవసాయం చేయడం, ద్రాక్షతోటను కాయడం వంటి పనులు అప్పగించబడ్డాయి. అలాంటి పనులు అల్పమైన పనులేమీ కాదు. దేవుని ఇశ్రాయేలులోని మిగిలివున్న వారి నిర్దేశం క్రింద, ఈ పనివారు ప్రజలను కాసేపనిలో, వారికి పోషణనివ్వడంలో, కోతకోసేపనిలో సహాయం చేస్తారు.​—⁠లూకా 10: 2; అపొస్తలుల కార్యములు 20:​28; 1 పేతురు 5: 2; ప్రకటన 14:​15, 16.

17. (ఎ) దేవుని ఇశ్రాయేలు యొక్క సభ్యులు ఏమని పిలవబడతారు? (బి) పాపాల క్షమాపణకు అవసరమైన ఏకైక బలి ఏది?

17 అయితే దేవుని ఇశ్రాయేలు మాటేమిటి? యెషయా ద్వారా యెహోవా వారికిలా చెబుతున్నాడు: “మీరు యెహోవాకు యాజకులనబడుదురు​—⁠వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు.” (యెషయా 61: 6) ప్రాచీన ఇశ్రాయేలులో, యాజకులు తమ కోసమూ, తమ తోటి ఇశ్రాయేలీయుల కోసమూ బలులు అర్పించేందుకు యెహోవా లేవీ యాజకత్వాన్ని ఏర్పాటు చేశాడు. అయితే, సా.శ. 33 లో యెహోవా లేవీ యాజకత్వాన్ని ఉపయోగించడం మానుకుని మరింత శ్రేష్ఠమైన ఏర్పాటును ప్రారంభించాడు. మానవజాతి పాపాలకు బలిగా యేసు పరిపూర్ణ జీవాన్ని ఆయన అంగీకరించాడు. అప్పటి నుండి, ఏ ఇతర బలి అవసరం లేదు. యేసు అర్పించిన బలి ఎల్లవేళలా విలువైనదే.​—⁠యోహాను 14: 6; కొలొస్సయులు 2:​13, 14; హెబ్రీయులు 9:​11-14, 24.

18. దేవుని ఇశ్రాయేలు ఏ విధమైన యాజకత్వంగా ఏర్పడుతుంది, వారికివ్వబడిన నియామకం ఏమిటి?

18 అయితే, దేవుని ఇశ్రాయేలు యొక్క సభ్యులు ఎలా ‘యెహోవాకు యాజకులై’ ఉన్నారు? తోటి అభిషిక్త క్రైస్తవులకు వ్రాస్తూ, అపొస్తలుడైన పేతురు ఇలా చెప్పాడు: “మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధజనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.” (1 పేతురు 2: 9) కాబట్టి ఒక గుంపుగా, అభిషిక్త క్రైస్తవులు ఒక నిర్దిష్టమైన నియామకంతో యాజకత్వంగా ఏర్పడతారు, యెహోవా మహిమ గురించి జనములకు తెలియజేయడమే ఆ నియామకం. వారు ఆయనకు సాక్షులై ఉండాలి. (యెషయా 43:​10-12) అంత్యదినాలన్నిటిలోనూ అభిషిక్త క్రైస్తవులు ఈ ఆవశ్యకమైన నియామకాన్ని నమ్మకంగా నిర్వర్తించారు. ఫలితంగా, ఇప్పుడు యెహోవా రాజ్యాన్ని గూర్చి సాక్ష్యమిచ్చే పనిలో లక్షలాదిమంది పాల్గొంటున్నారు.

19. అభిషిక్త క్రైస్తవులు ఏ సేవ చేసే ఆధిక్యతను పొందుతారు?

19 అంతేగాక, దేవుని ఇశ్రాయేలు సభ్యులకు మరో విధంగా యాజకులుగా సేవచేసే ఉత్తరాపేక్ష ఉంది. వారు తమ మరణం తర్వాత, పరలోకంలో అమర్త్యమైన ఆత్మ జీవితానికి పునరుత్థానం చేయబడతారు. అక్కడ వారు యేసుతోపాటు ఆయన రాజ్యంలో పరిపాలకులుగా సేవచేయడమే గాక దేవునికి యాజకులుగా కూడా సేవచేస్తారు. (ప్రకటన 5: 9; 20: 6) అలాగే, వారు యేసు విమోచన క్రయధన బలి ప్రయోజనాలను భూమిపైనున్న నమ్మకమైన సేవకులకు అన్వయించే ఆధిక్యతను కలిగి ఉంటారు. ప్రకటన గ్రంథం 22 వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్న అపొస్తలుడైన యోహాను దర్శనంలో, వారు మళ్ళీ ‘వృక్షములుగా’ వర్ణించబడ్డారు. మొత్తం 1,44,000 ‘వృక్షములు’ పరలోకంలో ‘నెలనెలకు ఫలిస్తూ పండ్రెండు కాపులు కాస్తున్నట్లు’ చూడడం జరిగింది, ‘ఆ వృక్షముల ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించబడును.’ (ప్రకటన 22:​1, 2) అదెంత అద్భుతమైన యాజక సేవనో కదా!

అవమానము, నింద, ఆ తర్వాత ఆనందం

20. వ్యతిరేకత ఉన్నప్పటికీ రాచరిక యాజకత్వం ఏ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తోంది?

20 యెహోవా హితవత్సరము ప్రారంభమైనప్పటి నుండి అంటే 1914 మొదలుకొని, రాచరిక యాజకత్వం క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకుల నుండి నిరంతరం వ్యతిరేకతనే ఎదుర్కొన్నది. (ప్రకటన 12:​17) అయినప్పటికీ, సువార్త ప్రకటనను ఆపడానికి జరిగిన ప్రయత్నాలన్నీ చివరికి విఫలమయ్యాయి. ఇలా చెబుతూ యెషయా ప్రవచనం దాన్ని ముందుగా తెలియజేసింది: “మీ యవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము ననుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపుభాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును.”​—యెషయా 61: 7.

21. అభిషిక్త క్రైస్తవులు రెట్టింపు ఆశీర్వాదాలను ఎలా పొందారు?

21 మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, అభిషిక్త శేషము జాతీయవాద క్రైస్తవమత సామ్రాజ్యం చేతుల్లో అవమానాన్ని అనుభవించారు, నిందలపాలయ్యారు. బ్రూక్లిన్‌లోని ప్రధాన కార్యాలయానికి చెందిన ఎనిమిదిమంది నమ్మకమైన సహోదరులపై, తిరుగుబాటు చేశారనే అపనింద వేసినవారిలో మతనాయకుల్లోని సభ్యులు కూడా ఉన్నారు. ఈ సహోదరులు అన్యాయంగా తొమ్మిది నెలలపాటు జైలులో వేయబడ్డారు. చివరికి, 1919 వసంతంలో వారు విడుదల చేయబడ్డారు, ఆ తర్వాత, వారిపై వేయబడిన నిందలన్నీ కొట్టివేయబడ్డాయి. అలా ప్రకటనా పనిని ఆపాలని వేసిన పథకం త్రిప్పి కొట్టింది. తన ఆరాధకులు నిరంతరం అవమానాన్ని అనుభవించేందుకు అనుమతించే బదులు యెహోవా వారిని విడుదల చేసి, వారిని “తమ దేశము”లోనికి అంటే ఆధ్యాత్మిక ఎస్టేటులోకి పునఃస్థాపించాడు. అక్కడ వారు రెట్టింపు ఆశీర్వాదాలను పొందారు. తాము అనుభవించిన బాధలన్నిటి కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా వారు యెహోవా ఆశీర్వాదాన్ని పొందారు. నిజంగా వారు ఆనందంతో కేకలు వేయడానికి కారణం ఉంది!

22, 23. అభిషిక్త క్రైస్తవులు యెహోవాను ఎలా అనుకరించారు, ఆయన వారికి ఎలా ప్రతిఫలమిచ్చాడు?

22 యెహోవా తర్వాత చెప్పేది, క్రైస్తవులు నేడు ఆనందించడానికి మరో కారణాన్ని ఇస్తుంది: “న్యాయముచేయుట యెహోవానగు నాకిష్టము, ఒకడు అన్యాయముగా ఒకనిసొత్తు పట్టుకొనుట నాకసహ్యము. సత్యమునుబట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచు వారితో నిత్యనిబంధన చేయుదును.” (యెషయా 61: 8) అభిషిక్త శేషము తమ బైబిలు అధ్యయనం ద్వారా న్యాయాన్ని ప్రేమించడం, దుష్టత్వాన్ని ద్వేషించడం నేర్చుకున్నారు. (సామెతలు 6:​12-19; 11:​20) వారు “తమ ఖడ్గములను నాగటి నక్కులుగా” సాగగొట్టుకోవడం నేర్చుకుని, మానవులు చేసే యుద్ధాల్లోనూ, రాజకీయ విప్లవాల్లోనూ తటస్థంగా ఉంటున్నారు. (యెషయా 2: 4) అపనిందలు వేయడం, జారత్వం, దొంగతనం, త్రాగుబోతుతనం వంటి దేవునిని అగౌరవపరిచే అలవాట్లను కూడా వారు విడిచిపెట్టారు.​—⁠గలతీయులు 5:​19-21.

23 అభిషిక్త క్రైస్తవులు న్యాయంపట్ల తమ సృష్టికర్తకు ఉన్నటువంటి ప్రేమనే కలిగి ఉన్నారు గనుక, యెహోవా “సత్యమునుబట్టి వారి క్రియాఫలమును” వారికిచ్చాడు. అలాంటి ఒక ‘క్రియా ఫలమే’ నిరంతరం నిలిచి ఉండే నిబంధన, యేసు తాను మరణించక ముందు రాత్రి తన అనుచరులకు ప్రకటించిన క్రొత్త నిబంధన. ఈ నిబంధన ఆధారంగానే వారు ఆధ్యాత్మిక జనముగా, దేవుని ప్రత్యేకమైన ప్రజలుగా అయ్యారు. (యిర్మీయా 31:​31-34; లూకా 22:​20) దాని క్రింద, అభిషిక్తుల పాపాల, మానవజాతిలోని నమ్మకమైన ఇతరులందరి పాపాల క్షమాపణతో సహా యేసు విమోచన క్రయధనబలి ప్రయోజనాలన్నిటినీ యెహోవా అన్వయిస్తాడు.

యెహోవా ఆశీర్వాదాలను బట్టి ఆనందించడం

24. జనములలో, ఆశీర్వదించబడే “సంతతి” ఎవరు, వారు ఎలా ‘సంతతి’ అయ్యారు?

24 జనములకు చెందిన కొందరు యెహోవా ప్రజలపై ఆయన ఆశీర్వాదం ఉందని గుర్తించారు. ఈ విషయం యెహోవా చేసిన ఈ వాగ్దానం ద్వారా ముందే తెలియజేయబడింది: ‘జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధినొందును.​—⁠వారు యెహోవా ఆశీర్వదించిన జనమని [“సంతతి అని” NW] వారిని చూచినవారందరు ఒప్పుకొందురు.’ (యెషయా 61: 9) దేవుని ఇశ్రాయేలు సభ్యులైన అభిషిక్త క్రైస్తవులు, యెహోవా హితవత్సరంలో జనముల మధ్య చురుగ్గా ఉన్నారు. వారి పరిచర్యకు ప్రతిస్పందించిన వారు నేడు లక్షల సంఖ్యలో ఉన్నారు. జనముల నుండి వచ్చిన వారు దేవుని ఇశ్రాయేలుతో సన్నిహితంగా పని చేయడం ద్వారా ‘యెహోవా ఆశీర్వదించిన సంతతి’ అయ్యే ఆధిక్యతను పొందుతారు. వారి సంతోషభరితమైన స్థితి మానవజాతికంతటికీ కనిపిస్తూనే ఉంది.

25, 26. యెషయా 61:10 లో వ్యక్తపరచబడిన భావాలను క్రైస్తవులందరూ ఎలా ప్రతిధ్వనింపజేస్తారు?

25 క్రైస్తవులందరూ అంటే అభిషిక్తులూ, వేరే గొఱ్ఱెలూ యెహోవాను నిరంతరం స్తుతించడానికి ఎదురు చూస్తున్నారు. వారు యెషయా ప్రవక్తతో హృదయపూర్వకంగా ఏకీభవిస్తారు, ఆయన ప్రేరేపితుడై ఇలా చెబుతున్నాడు: “శృంగారమైనపాగా ధరించుకొనిన పెండ్లికుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లికుమార్తె రీతిగాను, ఆయన రక్షణవస్త్రములను నాకు ధరింపజేసియున్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసియున్నాడు. కాగా యెహోవానుబట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవునిబట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది.”​—యెషయా 61:​10.

26 “నీతి అను పైబట్టను” ధరించిన అభిషిక్త క్రైస్తవులు యెహోవా దృష్టిలో స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉండడానికి నిశ్చయించుకున్నారు. (2 కొరింథీయులు 11:​1, 2) పరలోక జీవితాన్ని పొందే నిరీక్షణతో యెహోవాచే నీతిమంతులుగా నిర్ణయించబడి, వారు మహా బబులోను యొక్క నిర్జనమైన భూమికి ఎప్పటికీ తిరిగిరారు, వారు అక్కడి నుండే విడుదల చేయబడ్డారు. (రోమీయులు 5: 9; 8:​30) రక్షణవస్త్రములు వారికి ఎంతో అమూల్యమైనవి. అలాగే వేరే గొఱ్ఱెలనబడే వారి సహచరులు కూడా స్వచ్ఛారాధనకు సంబంధించి యెహోవా దేవుని ఉన్నతమైన ప్రమాణాలను పాటించేందుకు నిశ్చయించుకున్నారు. “గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొని”నందున వీరు నీతిమంతులుగా తీర్చబడి, “మహాశ్రమలను” తప్పించుకుంటారు. (ప్రకటన 7:​14; యాకోబు 2:​23, 25) అప్పటి వరకు, మహా బబులోనుచే ఏ విధమైన కలుషితానికి గురి కాకుండా ఉండడంలో వారు తమ అభిషిక్త సహచరులను అనుకరిస్తారు.

27. (ఎ) వెయ్యేండ్ల పరిపాలన సమయంలో, గమనార్హమైన విధంగా ఏమి ‘ఉజ్జీవింపజేయబడుతోంది’? (బి) మానవజాతి మధ్యన నీతి ఇప్పటికే ఎలా ఉజ్జీవింపజేయబడుతోంది?

27 నేడు యెహోవా ఆరాధకులు ఆధ్యాత్మిక పరదైసులో ఉండడానికి ఆనందిస్తారు. త్వరలోనే వారు భౌతిక భావంలో కూడా పరదైసును ఆనందిస్తారు. మనం హృదయపూర్వకంగా ఆ సమయం కోసం ఎదురు చూస్తాము, యెషయా 61 వ అధ్యాయం చివరి మాటల్లో అది సుస్పష్టంగా ఇలా వర్ణించబడింది: “భూమి మొలకను మొలిపించునట్లుగాను, తోటలో విత్తబడినవాటిని అది మొలిపించునట్లుగాను, నిశ్చయముగా సమస్త జనముల యెదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేయును.” (యిషయా 61:​11) క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన సమయంలో, భూమి ‘నీతిని ఉజ్జీవింపచేస్తుంది.’ మానవులు విజయోత్సాహంతో కేకలు వేస్తారు, నీతి భూదింగతముల వరకు విస్తరిస్తుంది. (యెషయా 26: 9) అయితే, మనం జనములన్నిటి ఎదుట ఆయనను స్తుతించడానికి ఆ మహిమకరమైన దినం కోసం వేచి ఉండవలసిన అవసరం లేదు. పరలోక దేవుని మహిమపరుస్తూ, ఆయన రాజ్యాన్ని గూర్చిన సువార్తను ప్రచురించే లక్షలాదిమంది మధ్యన నీతి ఇప్పటికే ఉజ్జీవింపచేయబడుతోంది. మన దేవుడిచ్చే ఆశీర్వాదములను బట్టి ఆనందించడానికి ఇప్పుడు కూడా మన విశ్వాసం, మన నిరీక్షణ మనకు ప్రతి కారణాన్ని ఇస్తాయి.

[అధస్సూచి]

a సహజ యూదులు యెరూషలేముకు తిరిగి వస్తున్నప్పుడు యూదేతరులు కూడా వారితోపాటు వచ్చి, దేశాన్ని పునఃస్థాపించడంలో బహుశా సహాయం చేసి ఉండవచ్చు గనుక యెషయా 61:5 ప్రాచీన కాలాల్లో కూడా నెరవేరి ఉంటుంది. (ఎజ్రా 2:​43-58) అయితే, ఆరవ వచనం నుండి, ప్రవచనం కేవలం దేవుని ఇశ్రాయేలుకు మాత్రమే అన్వయిస్తున్నట్లు ఉంది.

[అధ్యయన ప్రశ్నలు]

[323 వ పేజీలోని చిత్రం]

బంధీలుగా ఉన్న యూదులకు ప్రకటించేందుకు యెషయా వద్ద సువార్త ఉంది

[331 వ పేజీలోని చిత్రం]

సా.శ. 33 మొదలుకొని యెహోవా 1,44,000 “నీతి అను మస్తకివృక్షముల”ను నాటాడు

[334 వ పేజీలోని చిత్రం]

భూమి నీతిని ఉజ్జీవింపజేస్తోంది