యెహోవా తన ప్రజలను సేవ నిమిత్తం సమకూర్చి సంసిద్ధులను చేయుట
యెహోవా తన ప్రజలను సేవ నిమిత్తం సమకూర్చి సంసిద్ధులను చేయుట
శతాబ్దాలుగా మత భ్రష్టత్వం భూలోకమంతటా వ్యాపించింది. అనేక చర్చి మత శాఖలు కొన్ని బైబిలు బోధలను కల్గియుండినను అవి ముఖ్యంగా మానవాచారాలను, అన్యమూలముగల అలవాట్లను అనుసరించాయి. సాధారణంగా అవి క్రీస్తు రాకడకు ప్రాధాన్యత ఇవ్వలేదు.—మత్తయి 13:24-30, 37-43 పోల్చండి.
అయినను యేసు, తన రాకడ కొరకు ఎదురుచూస్తూ వుండాలని చెప్పాడు! అలా ఎదురు చూస్తుండిన ఒక గుంపు అమెరికా లోని పెన్సిల్వేనియా నందలి ఆలెఘనీలో (పిట్స్‌బర్గ్) ఉండెను. ఆ 1870 దశాబ్ద తొలి భాగంలో చార్షెస్ తేజ్ రస్సెల్ మరియు కొంతమంది మిత్రులు క్రీస్తు రాకడను గూర్చి క్షుణ్ణంగా మత శాఖారహిత నిష్పక్షపాతంతో బైబిలును పఠించారు. వారు అనేక ఇతర మూల సిద్ధాంతాలను గూర్చి బైబిలు సత్యమేమిటో వెదుక నారంభించారు. ఇదే ఆధునిక కాల యెహోవాసాక్షుల కార్యక్రమాల ప్రారంభదశ.—మత్తయి 24:42.
త్రిత్వ సిద్ధాంతం బైబిలుకు సంబంధించింది కాదని, యెహోవాయే సర్వోన్నతుడగు దేవుడు మరియు సృష్టికర్తయని; యేసుక్రీస్తు ఆయన ప్రథమ సృష్టియు అద్వితీయ కుమారుడని; పరిశుద్ధాత్మ ఒక వ్యక్తికాదుగానీ దేవుని చురుకైన శక్తియని యీ గుంపు అర్థం చేసుకుంది. ఆత్మ అమర్త్యమైనది కాదు మర్త్యమైనదని, మృతులకు పునరుత్థానమే నిరీక్షణయని, పశ్చాత్తాపం నొందని దుర్మార్గతకు నిత్యబాధ కాదుగాని సర్వనాశనమేనని యీగుంపు తెలుసుకుంది.
యేసు మానవజాతి కొరకు తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా ధారపోయుట బైబిలు మూల బోధయని గమనించబడింది. మొదటి శతాబ్దం నుండి మన కాలం వరకు ఎన్నుకోబడిన 1,44,000 మంది పురుషులును స్త్రీలును, భూమినుండి విమోచింపబడి పరలోక రాజ్యంలో క్రీస్తుతో పాటు తోటి వారసులౌతారు. తదుపరి యేసు యొక్క విమోచన మూలంగా మానవజాతిలో కోటానుకోట్లమంది, వారిలో అధికశాతం మృతులనుండి పునరుత్థానం పొంది, ఆ రాజ్య పరిపాలన క్రింద యిదే భూమి మీద నిత్యజీవ ఉత్తరాపేక్షతో మానవ పరిపూర్ణతను పొందుతారు.
రస్సెల్ మరియు ఆయన సహచరులు క్రీస్తు ప్రత్యక్షత అదృశ్యంగా, ఆత్మరూపంగా ఉంటుందని కూడ గ్రహించారు. భూమిపైనున్న ఏ ప్రభుత్వం ద్వారా కూడ దేవుని సర్వాధిపత్యం వ్యక్తపరచబడని కాలములు, అనగా అన్యరాజుల కాలములు 1914లో అంతం కానైయుండెను. ఆ పిదప దేవుని రాజ్యం పరలోకమందు స్థాపించ బడవలసి యుండెను. నేడు ఈ బోధలు యెహోవాసాక్షులు చేసేవిగా గుర్తించబడుతున్నాయి.
రస్సెల్ మరియు ఆయన సహచరులు యీ సత్యాలను ప్రసంగాల ద్వారా ప్రచురణద్వారా ప్రపంచమంతా ప్రకటించారు. రస్సెల్, 1879 జూలై నుండి జాయెన్స్ వాచ్‌టవర్‌ను (ఇప్పుడు కావలికోట అని పిలువబడుతున్నది) ప్రచురించుట కారంభించారు. బైబిలు విద్యార్థుల ప్రకటనా కార్యములు స్వచ్ఛంద విరాళముల మీదనే పూర్తిగా ఆధారపడి జరుగవలసిందేగాని చందాలు సేకరించ కూడదని ఆయన నిశ్చయించుకున్నాడు. మరియు ఆ సమాచారం, విశ్వసించి జీతం పుచ్చుకొనని స్వచ్ఛంద సేవకుల ద్వారా ప్రకటించబడాలి. అప్పటివరకు వ్యాపారం ద్వారా ఆయన కూడబెట్టిన ధనం నుండి రస్సెల్ స్వయంగా విరాళమిచ్చారు.
బైబిలు విద్యార్థులు తరగతులలో సమకూడేవారు, ఆనాడు వారి సంఘాలను ఆ పేరుతోనే పిలిచేవారు. ప్రసంగాలు, లేఖన పఠనం, సాక్ష్యపు కూటముల కొరకు వారు వారానికి మూడుసార్లు సమావేశమయ్యేవారు. ప్రతి తరగతిలోను ఆత్మీయ కార్యక్రమాలను పర్యవేక్షించుటకు బాధ్యతగల పురుషులను క్రమంగా ఎన్నుకునేవారు.
పెన్సిల్వేనియాలో 1884లో జాయెన్స్ వాచ్‌టవర్ ట్రాక్ట్ సొసైటియనే పేరున లాభాపేక్షలేని ఓ
కార్పోరేషన్ ఏర్పాటయింది. సంవత్సరానికొకసారి ఆ కార్పోరేషన్‌కు ప్రెసిడెంటును ఎన్నుకోవలసియుండేది. ఏ వ్యక్తియొక్క జీవితం మీదను ఆధారపడకుండ, బైబిల్ విద్యాబోధను కొనసాగించుటకై ఇదొక చట్టబద్ధమైన ఉపకరణమైంది. చార్షెస్. టి. రస్సెల్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకోబడ్డారు. ఆయన కార్యాలయమే ప్రధాన కార్యాలయంగా పనిచేసింది.సేవను ఇతర దేశాలకు వ్యాపింప చేయడానికి గొప్ప ప్రయత్నాలు జరిగాయి. ఆ 1880 దశాబ్దపు ప్రథమార్థంలో అది కెనడా, ఇంగ్లాండులకు చేరింది. రస్సెల్ 1891లో ఐరోపా మరియు మధ్యప్రాచ్య దేశాలకు ప్రయాణించి, అచట సత్యాన్ని వ్యాపింపజేయుటకేమి చేయవలెనో పరిశీలించారు. మరియు 1900 దశాబ్దపు ప్రథమార్థంలో బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియాల్లో సొసైటి బ్రాంచి కార్యాలయాలు స్థాపించబడినవి.
అంతర్జాతీయంగా ప్రకటించే పని విస్తరించుటకు వీలగునట్లు 1909లో వాచ్‌టవర్ సొసైటి ప్రధాన కార్యాలయం న్యూయార్కులోని బ్రూక్లిన్‌కు తరలించబడింది. న్యూయార్క్ రాష్ట్ర చట్టం ప్రకారం ఇప్పుడు వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ న్యూయార్క్ అనే పేరున ఒక సహ కార్పొరేషన్ ఏర్పాటుచేయవలసి వచ్చింది. బ్రిటిష్ కామన్ వెల్త్ అంతటను బైబిలు విద్యార్థుల కార్యకలాపములను వృద్ధిచేయుటకై 1914లో ఇంగ్లాండులోని లండన్‌నందు, ఇంటర్నేషనల్ బైబిల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఏర్పరచబడింది. ప్రస్తుతం లోకమంతట చట్టబద్ధముగా ఏర్పడిన షుమారు 70 కార్పొరేషన్లు అనేకదేశాల్లో అసోసియేషన్లు వాచ్‌టవర్ సొసైటియొక్క సంకల్పములను నెరవేరుస్తున్నవి. అన్నీ స్వచ్ఛంద విరాళములతోను, స్వచ్ఛంద సేవకుల మద్దతుతోను నడిచే ధర్మాదాయ సంస్థలే.
చార్షెస్ తేజ్ రస్సెల్ 1916లో మరణించారు, జోసఫ్ ఫ్రాంక్లిన్ రూథర్‌ఫర్డ్ ఆయన స్థానంలో వాచ్‌టవర్ సొసైటి ప్రెసిడెంట్ అయ్యారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలాంతమున బైబిలు విద్యార్థులు హింసింపబడ్డారు. అమెరికాలోని ప్రధాన కార్యాలయములో బాధ్యతాయుత స్థానంలో పనిచేసిన ఎనమండుగురు సహోదరులు తప్పుడు అభియోగముతో జైలులో వేయబడుట ద్వారా వారికి వచ్చిన తీవ్రహింస తారాస్థాయికి చేరింది. బైబిలు విద్యార్థుల పని అపాయస్థితిలో పడినట్లు కనబడింది. అయినను, 1919లో యీ సహోదరులు విడుదలయ్యారు, స్వేచ్ఛను పొందారు, మరింత ప్రకటించే పని అక్కడిప్పుడు విస్తరించుట ఆరంభమయ్యింది.
సొసైటి ప్రధాన కార్యాలయం ద్వారా అభిషక్త క్రైస్తవ బైబిలు విద్యార్థుల ఐక్యసభ, సంస్థకు చెందినవారందరికి తగినవేళలో ఆత్మీయాహారాన్ని అందిస్తూనే వుంది. యేసు తెల్పినట్లు మొదటి శతాబ్దంలో అభిషక్త క్రైస్తవ సంఘం, “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుడై” నట్లే, సమర్పిత బైబిలు విద్యార్థుల అభిషక్త గుంపు కూడ ఆలాగే, రాజ్యపనిలో నిమగ్నులై, మన కాలములో “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుని” తరగతియై యున్నారు. సంఘాన్ని తనిఖీ చేయుటకు యేసు వచ్చినపుడు యీ తరగతి ఆయన ఇంటి వారికి తగిన వేళ ఆహారం పంచిపెడుతున్నట్లు తాను కనుగొన్నాడు; అపుడు ఆయన వారిని తన యావదాస్తి మీద నియమించాడు.—మత్తయి 24:45-47; లూకా 12:42.
మొదటి ప్రపంచ యుద్ధానంతరం వెంటనే 1914లో పరలోకమందు క్రీస్తుయేసు ఆధ్వర్యాన దేవుని రాజ్య స్థాపన జరిగినట్లు స్పష్టంగా గమనించడం జరిగింది. గనుక యేసు చెప్పిన యీ మాటలకు యిప్పుడు సంపూర్ణ నెరవేర్పు ఉండగలదు: “ఈ రాజ్యసువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతం వచ్చును.” ఇంకా అనేకులకు యీ రాజ్యవర్తమానం అందునట్లు చేయుటలో జోసఫ్. యఫ్. రూథర్‌ఫర్డ్ ముందంజ వేశారు.—మత్తయి 24:14.
అందుకే సొసైటి, వీలున్నంత తక్కువ ధరకు బైబిలు సాహిత్యాలను ఎడతెగక తయారుచేస్తూనే వుండుటకొరకు సమర్పించుకున్న పురుషులను స్వచ్ఛంద సేవకులుగా వుపయోగించి స్వయంగా ముద్రణా పనిని చేపట్టుటకు తీర్మానించుకుంది. ఈ రాజ్య సువార్తను క్రమంగా ప్రకటించుటలో భాగం కల్గివుండాలని బైబిలు విద్యార్థులందరూ పురికొల్పబడ్డారు. అనేక దేశాల్లో బైబిలు ప్రసంగాలిచ్చుటకుగాను రేడియో ప్రచారసాధనాన్ని ఉపయోగించారు.
బైబిలు విద్యార్థులు, వారు ప్రకటించుటలోగల ఉద్దేశం పరలోకమందు క్రీస్తు యేసుతోపాటు వుండుటకై ఎన్నుకొనబడినవారిలో మిగిలినవారిని సమకూర్చుటయు, రాబోవు దేవుని తీర్పును గూర్చి లోకాన్ని హెచ్చరించుటయేనని 1918 ముందు గ్రహించారు. ఈ దుష్టవిధానాంతమును తప్పించుకొని భూమియందు నివసించబోయే వారి విషయం స్వల్పంగానే ఆలోచించారు. పిమ్మట 1918 నుండి “ఇప్పుడు జీవిస్తున్న లక్షలాదిమంది యిక ఎన్నటికి మరణించకపోవచ్చును” అనే ప్రసంగం విస్తృతంగా యివ్వబడింది.
మత్తయి 25:31-46 నందు యేసు చెప్పిన గొర్రెలు మేకలనుగూర్చిన ఉపమానాన్ని 1923లో అధ్యయనం చేయుట ద్వారా ఆర్మగెద్దోనునకు ముందు పరలోక రాజ్యమునకు వెళ్లు వరుసలో లేనివారు కూడ దేవుని అంగీకారాన్ని పొంది ఆర్మగెద్దోనును తప్పించు కొందురని తెలిసింది. ఇంకను కొనసాగిన పఠనంవల్ల యీ గొర్రెలాంటి ప్రజలు, ప్రకటన 7:9-17 నందు తెలుపబడిన లెక్కింపజాలనంత గొప్ప సమూహానికి చెందిన వారని 1935లో బయలుపడింది. వీరు సమస్తజనముల నుండి ప్రోగుచేయబడవలసి వున్నారు, మరియు మహా శ్రమలను తప్పించుకొని భూమిపై నిరంతర జీవమును పొందే నిరీక్షణగలవారైయున్నారు. ఈ గ్రహింపు ప్రకటించు పనికి మంచి ప్రేరణనిచ్చింది.—యోహాను 10:16.
బైబిలు విద్యార్థులు 1931లో యెహోవాసాక్షులనే పేరు పెట్టుకున్నారు. అంతకుముందు వారు బైబిల్ స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ బైబిల్ స్టూడెంట్స్, మిలెనియల్ డాన్ పీపుల్, మరియు వాచ్‌టవర్ పీపుల్ అని పిలువబడ్డారు. రస్సెలైట్స్, రూథర్‌ఫర్‌డైట్స్ అనికూడ అవహేళనగా పిలువబడ్డారు. వీటిలో ఏ పేరుకూడ వారిని సరిగ్గా గుర్తించలేదు. మొదటి శతాబ్దంలో దైవానుగ్రహంవల్ల క్రీస్తు శిష్యులను క్రైస్తవులనే పేరుతో పిలవడం నిశ్చయంగా సమంజసమే, అబద్ధ బోధలననుసరించే గుంపులు కూడ ఆ పేరునే వుపయోగించినవి. లక్షలాదిగావున్న నామకార్థ క్రైస్తవులనుండి
వారు ప్రత్యేకంగా కనబడు నిమిత్తం యీనాటి నిజమైన క్రీస్తు అనుచరులను ప్రత్యేకంగా గుర్తించగలిగే నామమొకటి ఉండాలి.లేఖనములను పరిశోధన చేయగా యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయులను తన సాక్షులని పిలిచినట్లే, ఆయన నామమును, సంకల్పమును ప్రచురము చేయుటకు సమర్పించుకొని యీ విధానాంతములోవున్న తన ప్రజలను యెహోవాసాక్షులని పిలుచుట సముచితమేనని స్పష్టమైంది. ఈ నామము, యెహోవా నిజమైన క్రైస్తవ ఆరాధికులను యీనాడు క్రైస్తవులమని చెప్పుకొనెడి వారందరి నుండి స్పష్టంగా వేరుచేస్తుంది.—కీర్తన 83:18; యెషయా 43:10-12.
జోసఫ్. యఫ్. రూథర్‌ఫర్డ్, 1942లో రెండవ ప్రపంచయుద్ధ కాలమందు మరణించాడు, నేథన్. హెచ్. నార్ వాచ్‌టవర్ సొసైటి ప్రెసిడెంట్ అయ్యారు. యుద్ధానంతరం శాంతి స్వాతంత్ర్యములు నెలకొని యీ విధానాంతమునకు ముందు ప్రకటించేపని విస్తృతంగా జరిగే అవకాశమున్నట్లు ప్రవచనములు సూచిస్తున్నవని గుర్తించారు. విదేశాలలో మిషనరీ సేవకొరకు పూర్తికాల సేవకులకు శిక్షణ ఇవ్వడానికి 1943 ఫిబ్రవరిలో వాచ్‌టవర్ స్కూల్ ఆఫ్ గిలియడ్ స్థాపించబడింది. ఆ సంవత్సరంలోనే యెహోవాసాక్షుల వారపు కూటముల కార్యక్రమానికి ఓ ప్రత్యేక పరిచర్య శిక్షణా కార్యక్రమం జోడించబడింది.
సొసైటి 1950లో న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ది హోలి స్క్రిప్చ్‌ర్స్ అను ఆధునిక ఇంగ్లీష్ బైబిల్ అనువాదాన్ని ఆదిమ భాషల్లోనుండి తర్జుమాచేసి భాగాలుగా విడుదల చేయుట కారంభించింది. ఎంతో నిశితంగా అనువదించిన, సులభంగా అర్థంచేసుకోగల, సొసైటి అచ్చుయంత్రాలద్వారా తక్కువ ధరకే లభించు యీ బైబిలు, ప్రకటించు పనికి ఎంతో సహాయకారిగా వున్నది. ఇప్పటివరకు దీనిని 12 భాషల్లో 7 కోట్ల కంటె ఎక్కువ కాపీలు ప్రచురించారు.
నలభై ఐదు లక్షలకంటె ఎక్కువ మంది యెహోవాసాక్షులు, 1992 సంవత్సరాంతానికల్లా, 229 కంటె ఎక్కువ దేశాల్లోను సముద్ర ద్వీపాలలోను సువార్త సేవలో పాల్గొన్నారు. క్రీస్తు మరణ జ్ఞాపకార్థదినానికి 1992 సం.లో వారికున్న 69,000 సంఘాల్లో ఎన్నడూ రానంతమంది అనగా 1,14,31,171 మంది హాజరయ్యారు.
దేవుడు యెహోవాసాక్షులను నిజంగా వుపయోగించుకుంటున్నాడనే విషయాన్ని, వారాసేవలో కొనసాగుటనుబట్టి, ప్రపంచవ్యాప్త ఐక్యతలోను, యెహోవా నామమును హత్తుకొని వుండుటలోను ఆయన రాజ్యమును ప్రకటించుటలోనుగల వారికున్న ఆసక్తినిబట్టి, వారి నిర్మలమైన నైతిక నియమాలలోను, బైబిలంతా తప్పులేని దేవుని వాక్యమని వారంగీకరించుటనుబట్టి మరియు మూఢనమ్మకం, దయ్యముల బోధనుండి వేరైయుండుటనుబట్టి గమనించవచ్చును.
దేవుని సత్యారాధన పునరుద్ధరించబడుట నుండి నీవెలా ప్రయోజనం పొందగలవో రాబోవు భాగాలు నీకు తెలియజేస్తాయి.
• బైబిలుయొక్క ఏ మూలబోధలు, బైబిల్ విద్యార్థులను ఇతర చర్చి మత శాఖలనుండి వేరుగా చూపించినవి.
• బైబిలు విద్యార్థులు 1918 వరకు సంస్థీకరణకు సంబంధించిన ఏ అభివృద్ధిని అనుభవించారు?
• అభిషక్త బైబిలు విద్యార్థులు మత్తయి 24:45-47 నందున్న “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసు”నికి సంబంధించిన వారని ఎలా చెప్పవచ్చును?
• దేవుని సంకల్పములను గూర్చిన ఎటువంటి గ్రహింపు, ప్రచారపు పని విస్తరణకు గొప్ప ప్రేరణనిచ్చింది?
• యెహోవాసాక్షులనే పేరు ఏ ఉద్దేశాన్ని నెరవేర్చుతుంది?
• దేవుడు నిజంగా యెహోవాసాక్షులను ఉపయోగించు కుంటున్నాడనుటకు ఆధారము లేమున్నవి?
[8వ పేజీలోని చిత్రం]
1879లో సి.టి. రస్సెల్
జూలై 1879 సంచిక
బైబిలు విద్యార్థుల తొలి గుంపు పిట్స్‌బర్గ్, పెన్సిల్వేనియా
[9వ పేజీలోని చిత్రం]
ప్రధానకార్యాలయం, 1889-1909, పిట్స్‌బర్గ్, పెన్సిల్వేనియా
ముఖ్య కార్యాలయాలు, 1909-1918, బ్రూక్లిన్, న్యూయార్క్
ముఖ్యకార్యాలయపు నివాస భవనం 1909-1926, బ్రూక్లిన్, న్యూయార్క్
[10వ పేజీలోని చిత్రం]
యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయము, బ్రూక్లిన్, న్యూయార్క్, యు.యస్.ఎ.
పైన ఎడమవైపు: ఆఫీసు సముదాయం
పైన కుడివైపు: నివాస భవనములు
క్రింద ఎడమవైపు: ఫ్యాక్టరీ సముదాయం
క్రింద కుడివైపు: రవాణా కేంద్రం
[11వ పేజీలోని చిత్రం]
జె.యఫ్. రూథర్‌ఫర్డ్ రేడియో ప్రసారం
స్వచ్ఛంద సేవకులు నడిపిన వాచ్‌టవర్ సొసైటి ప్రథమ రోటరీ ప్రెస్
న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ అనే బైబిల్ ఇప్పుడు 12 భాషల్లో ప్రచురించబడియున్నది