కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

14వ అధ్యాయం

‘పట్టజాలనంత విస్తారమైన దీవెనలు’

‘పట్టజాలనంత విస్తారమైన దీవెనలు’

1, 2. (ఎ) మనలో ప్రతీ ఒక్కరూ ఏ ప్రయోజనకరమైన ఎంపికలు చేసుకోవాలి? (బి) మనం దీవెనలు పొందడం ఏ ప్రవచన నెరవేర్పుతో ముడిపడివుంది?

 మనం తీర్పులు వెలువడుతున్న కాలంలో, ఆశీర్వాదాలు కురుస్తున్న సమయంలో జీవిస్తున్నాం. ఓవైపు మతాలు పతనమౌతుంటే, మరోవైపు సత్యారాధన పునస్థాపితమౌతోంది. ఆ పునస్థాపన వల్ల ఇప్పుడు, భవిష్యత్తులో మంచి ఫలితాలు రావాలనీ ఆశీర్వాదాలు ప్రాప్తించాలనీ మీరు తప్పకుండా కోరుకుంటారు. అయితే ఇవన్నీ జరుగుతాయని నమ్మేదెలా? దానికోసం, 1914 లో “అంత్యదినములు” మొదలైన వెంటనే విస్తృత స్థాయిలో నెరవేరిన ఒక ప్రవచనాన్ని పరిశీలించాలి. (2 తిమోతి 3:1) ఆ ప్రవచనం మలాకీ చెప్పిన ఈ మాటల్లో ఉంది: “మీరు వెదుకుతున్న నిజమైన ప్రభువు [యెహోవా] తన ఆలయానికి హఠాత్తుగా వస్తాడు; మీరు ఇష్టపడే నిబంధన దూత కూడా వస్తాడు. ఇదిగో ఆయన తప్పకుండా వస్తాడని సైన్యాలకు అధిపతి అయిన యెహోవా చెబుతున్నాడు.”—మలాకీ 3:1, NW.

2 మీ జీవితంపై ప్రభావం చూపించే ఎంతో కీలకమైన ఆ ప్రవచనం 12 పుస్తకాల్లోని చివరిదానిలో ఉంది. ఆ 12 పుస్తకాల చర్చ ముగుస్తున్న ఈ తరుణంలో మలాకీ రాసిన ఆ ప్రవచనాన్ని పరిశీలించడం ప్రాముఖ్యం. మీరూ, మిగతా యెహోవా సేవకులూ “పట్టజాలనంత విస్తారముగా దీవెనలు” పొందడానికి అవసరమైన ముఖ్యోపదేశం మలాకీ పుస్తకంలో ఉంది. (మలాకీ 3:10) మనం మలాకీ పుస్తకంలోని 3వ అధ్యాయాన్ని ఇప్పుడు నిశితంగా పరిశీలిద్దాం.

ఆధ్యాత్మిక శుద్ధీకరణకు సమయం

3. దేవుడు తన ప్రాచీన ప్రజలకు బదులుగా “దేవుని ఇశ్రాయేలును” ఎందుకు ఎంచుకున్నాడు?

3 మలాకీ జీవించిన దాదాపు ఐదు శతాబ్దాల తర్వాత, యెహోవా తన నిబంధన ప్రజలకు తీర్పు తీర్చడానికి (‘[అబ్రాహాముతో చేసిన] నిబంధనకు దూత’ అయిన) యేసుక్రీస్తును ప్రతినిధిగా చేసుకుని యెరూషలేము దేవాలయానికి వచ్చాడు. ఒక జనాంగంగా వాళ్లు తన అనుగ్రహానికి అనర్హులవడంతో యెహోవా వాళ్లను తిరస్కరించాడు. (మత్తయి 23:37, 38) సా.శ. 70⁠లో జరిగిన సంఘటనే దానికి నిదర్శనం. అయితే ఆ జనాంగానికి బదులు యెహోవా అన్ని జనాంగాల నుండి వచ్చిన ఆధ్యాత్మిక జనాంగాన్ని అంటే 1,44,000 మందితో కూడిన “దేవుని ఇశ్రాయేలును” ఎంచుకున్నాడు. (గలతీయులు 6:16; రోమీయులు 3:25, 26) కానీ, మలాకీ ప్రవచనానికి అదే అంతిమ నెరవేర్పు కాదు. ఆధునిక కాలంలో కూడా దానికి మరో నెరవేర్పు ఉంది. అంతేకాదు మీరు భవిష్యత్తులో “పట్టజాలనంత విస్తారముగా దీవెనలు” పొందడానికి, ఆ ప్రవచన నెరవేర్పుకు నేరుగా సంబంధం ఉంది.

4. యేసు 1914 లో రాజయ్యాక ఏ ప్రశ్నలు తలెత్తాయి?

4 యెహోవా 1914 లో తన పరలోక రాజ్యానికి యేసుక్రీస్తును రాజుగా నియమించాడని నెరవేరిన బైబిలు ప్రవచనాలు ధృవీకరిస్తున్నాయి. దేవుని అనుగ్రహానికి అర్హమైన క్రైస్తవ గుంపేదో గుర్తించాల్సిన సమయం అప్పుడు వచ్చింది. ఆధ్యాత్మిక శుద్ధీకరణ పరీక్షలో ఎవరు ఉత్తీర్ణులౌతారు? మలాకీ రాసిన ఈ మాటల్లో దానికి జవాబు ఉంది: “అయితే ఆయన వచ్చుదినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్నివంటివాడు.” (మలాకీ 3:2) తీర్పు తీర్చేందుకు యెహోవా తన “ఆలయానికి” ఎప్పుడు వచ్చాడు, ఎలా వచ్చాడు?

5, 6. (ఎ) యెహోవా తన ఆధ్యాత్మిక ఆలయాన్ని తనిఖీ చేయడానికి వచ్చినప్పుడు, దేవుని ఆరాధకులమని చెప్పుకుంటున్న అధిక సంఖ్యాకుల్లో ఆయన ఏమి గమనించాడు? (బి) దేవుని ఆత్మాభిషిక్త సేవకులకు ఏమి అవసరమైంది?

5 దేవుడు రాళ్లతో, సున్నంతో కట్టిన ఆలయానికైతే వచ్చే ప్రసక్తి లేదు. ఎందుకంటే సత్యారాధన జరిగే అలాంటి ఆలయం సా.శ. 70 లో నాశనమైపోయింది. అదే చివరి భౌతిక ఆలయం. నిజానికి, యెహోవా ఆధ్యాత్మిక ఆలయాన్ని తనిఖీ చేయడానికి వచ్చాడు. యేసు విమోచన క్రయధన బలి ఆధారంగా మనుషులు యెహోవాను సమీపించి, ఆరాధించే ఏర్పాటే ఆ ఆధ్యాత్మిక ఆలయం. (హెబ్రీయులు 9:2-10, 23-28) అయితే క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలు ఆ ఆధ్యాత్మిక ఆలయంలో భాగంగా లేవు. ఎందుకంటే, స్వచ్ఛారాధనకు బదులు అబద్ధ బోధలను ప్రోత్సహిస్తూ ఆధ్యాత్మిక వ్యభిచారానికి ఒడిగట్టిన, రక్తపాతాన్ని సృష్టించిన మత వ్యవస్థలో ఆ చర్చీలు భాగంగా ఉన్నాయి. అలాంటి వాళ్లకు వ్యతిరేకంగా యెహోవా ‘దృఢంగా సాక్ష్యం పలికాడు,’ ఆయన తీర్చిన తీర్పు న్యాయమైనదని మీకూ తెలుసు. (మలాకీ 3:5) మరోవైపు, దేవుని రాజ్య స్థాపన తర్వాత, దేవుని ఆధ్యాత్మిక ఆలయ ఆవరణాల్లో సేవచేస్తున్న నిజక్రైస్తవుల గుంపు కనిపించింది. వాళ్లు ఎన్ని శ్రమలు ఎదురైనా దేవునికి నమ్మకంగా ఉన్నారు. అయినా, ఆ అభిషిక్తులకు కూడా కాస్త శుద్ధీకరణ అవసరమైంది. ఆ 12 పుస్తకాలు అలాంటి శుద్ధీకరణ గురించి ప్రస్తావించాయి. దేవుని సేవకులు ఆధ్యాత్మికంగా, భౌతికంగా మళ్లీ పూర్వ వైభవం పొందడానికి సంబంధించిన సంతోషకరమైన వాగ్దానాలు ఆ పుస్తకాల్లో ఉన్నాయి. ‘వెండి బంగారాలు’ శుద్ధి అయినట్లు యెహోవా చేతుల్లో శుద్ధి అయ్యే ప్రజలు ఉంటారని మలాకీ ప్రవచించాడు. ఖచ్చితంగా వాళ్లు “నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు” అర్పించే ప్రజలౌతారని కూడా ఆయన రాశాడు.—మలాకీ 3:3.

6 అయితే 1914 నుండి 1919 తొలినాళ్ల వరకు యెహోవా ఆ అభిషిక్త క్రైస్తవుల ఆరాధనను, ఆచారాలను, సిద్ధాంతాలను శుద్ధి చేస్తూ వాళ్లకు అవసరమైన శుద్ధీకరణ చేపట్టాడని మనం అర్థం చేసుకున్నాం. a దాంతో వాళ్లూ, కొంతకాలానికి వాళ్లతో కలిసిన “గొప్ప సమూహం” సభ్యులూ చాలా ప్రయోజనాలు పొందారు. (ప్రకటన 7:9) ఇప్పుడు ఆ రెండు గుంపుల వాళ్లు ఐక్యంగా, “నీతిని అనుసరించి,” “యెహోవాకు ఇంపుగా” ఉండే “నైవేద్యములు” అర్పిస్తున్నారు.—మలాకీ 3:3, 4.

యెహోవా తన ప్రజలందర్నీ ఓ గుంపుగా శుద్ధి చేస్తున్నాడు. మరి మనకు వ్యక్తిగతంగా ఇంకాస్త శుద్ధీకరణ అవసరమా?

7. దేవుని దృష్టిలో మన స్థానానికి సంబంధించి మనం ఏ ప్రశ్నలు వేసుకుంటే బాగుంటుంది?

7 దేవుని సేవకుల్ని ఓ గుంపుగా తీసుకుంటే ఆ మాటలు అక్షరాలా నిజం. కానీ, వ్యక్తిగతంగా మన విషయమేమిటి? మీరు ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘నా వైఖరుల్లో, పనుల్లో నేను ఇంకా శుద్ధి చేసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? యెహోవా తన అభిషిక్తుల్ని శుద్ధి చేసినట్టు, నేను నా ప్రవర్తనను ఇంకా శుద్ధి చేసుకోవాల్సి ఉందా?’ మనం ముందటి అధ్యాయాల్లో చూసినట్టు, ఆ 12 మంది ప్రవక్తలు తమ పుస్తకాల్లో చెడు వైఖరులు, చెడు ప్రవర్తన గురించీ అలాగే మంచి లక్షణాలు, మంచి పనుల గురించీ నొక్కిచెప్పారు. వాళ్లు అలా చెప్పడం వల్ల, యెహోవా మిమ్మల్ని ఏమి అడుగుతున్నాడో తెలుసుకోవడం మీకు మరింత సులభమైంది. (మీకా 6:8) ఈ వచనంలో “నిన్ను” అనే మాట ఉంది గమనించారా? దాన్ని బట్టి, ‘నాకు మరింత శుద్ధీకరణ అవసరమా?’ అని మనలో ప్రతీ ఒక్కరం ఎందుకు ఆలోచించుకోవాలో అర్థమౌతోంది.

“నన్ను శోధించి” చూడండి

8. యెహోవా తన ప్రజలకు ఏ ఆహ్వానాన్నిచ్చాడు?

8 మలాకీ 3:10⁠లో యెహోవా ఇంకా ఏమంటున్నాడో చూడండి. ఆయన ఆప్యాయంగా ఇస్తున్న ఈ ఆహ్వానం అందులో ఉంది: “నా మందిరములో ఆహారముండునట్లు పదియవభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.” ఆ ఆహ్వానం దేవుని ప్రజలందరి కోసం. దాన్ని యెహోవా మీకు కూడా ఇచ్చాడని మీకు అనిపించడం లేదా?

9. మీరు యెహోవాకు ఎలాంటి అర్పణలు, దశమభాగాలు చెల్లించవచ్చు?

9 యెహోవాకు మీరు “పదియవభాగమంతయు” ఎలా ఇవ్వవచ్చు? ధర్మశాస్త్రం ప్రస్తావించిన అర్పణలు, దశమభాగాల వంటివి చెల్లించాల్సిన అవసరం ఇప్పుడు లేదన్నది నిజమే. కానీ దేవుడు ఇప్పుడు మరో రకమైన అర్పణలను కోరుతున్నాడు. ఇంతకు ముందు అధ్యాయంలో పరిశీలించినట్లు, ప్రకటనా పనిని పౌలు అర్పణతో పోల్చాడు. (హోషేయ 14:2) ఆ సందర్భంలో అపొస్తలుడు మరో రకమైన అర్పణను కూడా ప్రస్తావిస్తూ ఇలా రాశాడు: “ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికిష్టమైనవి.” (హెబ్రీయులు 13:15, 16) దీన్నిబట్టి మలాకీ 3:10 చెబుతున్న ‘పదవ భాగం’ ఆధ్యాత్మిక, భౌతిక అర్పణలను సూచిస్తున్నాయని స్పష్టమౌతోంది. బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవులుగా మీరు మీ జీవితాన్ని పూర్తిగా యెహోవాకు సమర్పించేశారు, అయితే మీరు ఇవ్వాల్సిన పదవ భాగం, మీకున్నదానిలో యెహోవాకు మీరు ఇవ్వగలిగే భాగాన్ని లేదా ఆయన సేవలో మీరు ఉపయోగించగలిగే భాగాన్ని సూచిస్తుంది. యెహోవా సేవ కోసం మీరు ఇచ్చే సమయం, శక్తి, వనరులు, కానుకలు అన్నీ ఆ కోవలోకే వస్తాయి.

10. మీరు యెహోవాను మంచి ఉద్దేశంతో ఎలా పరీక్షించవచ్చు?

10 మీరు ప్రేమతో, భక్తితో యెహోవాకు అలాంటి దశమభాగాలు చెల్లించడం ఎంత సమంజసమో కదా! అయితే ఇదేదో తీరిగ్గా చేయాల్సింది కాదు. యెహోవా మహాదినం వేగంగా ముంచుకొస్తోందని, అది ‘బహు భయంకరమైనదని’ మీకు తెలుసు. (యోవేలు 2:1, 2, 11) ఎంతోమంది ప్రాణాలు అపాయంలో ఉన్నాయి. యెహోవా మీకోసం ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. ‘తనను శోధించి’ చూడమని అంటే పరీక్షించి చూడమని ఆయన మిమ్మల్ని అడుగుతున్నాడు. అలాగని అల్పులైన మనుషులెవరూ, దేవుడు నమ్మకూడని వ్యక్తి అన్నట్టుగా ఆయన్ని పరీక్షించే సాహసం చేయకూడదు. (హెబ్రీయులు 3:8-10) కానీ మీరు ఆయన్ని ఒక మంచి ఉద్దేశంతో వినయంగా పరీక్షించవచ్చు. అదెలా? ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. మీరు ఆయనకు విధేయులైన ప్రతీసారి, ‘ఆయన నన్ను ఆశీర్వదిస్తాడా?’ అని అడుగుతూ ఆయన్ని పరీక్షిస్తున్నట్టే. అప్పుడు ఆయన తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ, మిమ్మల్ని ఆశీర్వదించాల్సిన బాధ్యత తనకుందని భావిస్తాడు. అలా, దేవుడు తనను పరీక్షించే అవకాశం మనకు ఇస్తున్నాడు. ఆయన మనల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడనే నమ్మకాన్ని అది మనలో ఇంకా పెంచుతుంది.

11, 12. యెహోవా తన ప్రజలపై కుమ్మరించిన ఏ ఆశీర్వాదాలను మనం కళ్లారా చూశాం?

11 యెహోవా ప్రజలు వస్తుపరమైన కానుకలు, ఆధ్యాత్మిక అర్పణలు ఉదారంగా ఇచ్చారు. దానికి యెహోవా కూడా “పట్టజాలనంత విస్తారంగా దీవెనలు” కుమ్మరించాడు. 20వ శతాబ్దం తొలినాళ్ల నుండి నేటివరకు యెహోవాసాక్షులు చవిచూసిన సంఖ్యాపరమైన పెరుగుదలను గమనిస్తే, యెహోవా తన ప్రజలమీద దీవెనల వర్షం కురిపించాడని స్పష్టమౌతుంది. “దేవుని మర్మములను” అర్థం చేసుకునే విషయంలో సాధించిన అద్భుతమైన ప్రగతిని కూడా మీరు చూశారు. (1 కొరింథీయులు 2:10; సామెతలు 4:18) అయితే, ఈ కోణంలో కూడా ఒకసారి ఆలోచించండి: వ్యక్తిగతంగా మీపై అది ఎలాంటి ప్రభావం చూపించింది?

12 కొంతకాలం క్రితం, మనం చర్చి సభ్యులుగా ఉండివుంటాం లేదా యెహోవాసాక్షుల కూటాలకు రావడం కొత్తగా మొదలుపెట్టి ఉంటాం. అప్పట్లో మనం బైబిల్లోని ప్రాథమిక సత్యాల్ని ఎంతవరకు అర్థంచేసుకున్నాం? దాంతో పోలిస్తే, అప్పటినుండి ఇప్పటివరకు మనం నేర్చుకున్న విషయాలు ఎంత ఎక్కువో ఆలోచించండి. మనం ఇప్పుడు ఎన్ని విషయాలను లేఖనాలతో రుజువు చేయగలమో ఆలోచించండి. లేదా నేడు నెరవేరుతున్న ప్రవచనాలతో సహా ఎన్ని లోతైన విషయాలను మనం అర్థంచేసుకున్నామో ఆలోచించండి. బైబిల్లోని ఆయా వృత్తాంతాలను మన జీవితంలోని వివిధ రంగాలకు అన్వయించుకునే విషయంలో మనం సాధించిన ప్రగతి గురించి ఆలోచించండి. నిజంగా మనం ఎంత అభివృద్ధి సాధించామో కదా! అపొస్తలుడైన పేతురులాగే మనమూ స్వయంగా ఇలా అనగలుగుతాం: ‘మన దగ్గరున్న ప్రవచన వాక్యం మరింత స్థిరమైంది.’ (2 పేతురు 1:19, NW) విషయమేమిటంటే, మనం ‘యెహోవాచేత ఉపదేశం పొందాం,’ నిజ క్రైస్తవులుగా జీవిస్తూ, యెహోవాను నిత్యం సేవించాలనుకునే ప్రజల మధ్య ఉన్నాం. (యెషయా 54:13) యెహోవా మనల్ని మెండుగా దీవించాడనేందుకు మనం ఇప్పటికే ఎన్నో రుజువులు చూశాం.

జీవగ్రంథంలో మీ పేరు

13. దేవుని జ్ఞాపకార్థ గ్రంథంలో ఒక వ్యక్తి పేరు ఉండడం ఎలా సాధ్యం?

13 యెహోవా కుమ్మరించే మరిన్ని దీవెనల గురించి మలాకీ 3:16 ఇలా చెబుతోంది: “అప్పుడు, యెహోవాయందు భయభక్తులుగలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను.” అభిషిక్తులూ, గొప్పసమూహం వాళ్లూ “యెహోవాయందు భయభక్తులు” కలిగి నడుచుకుంటారు. యెహోవా నామాన్ని స్మరిస్తూ, ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఘనపర్చే సంతోషంగల ప్రజలైన యెహోవాసాక్షుల్లో ఒకరిగా ఉండడం ఓ గొప్ప గౌరవమని మీకు తప్పక అనిపిస్తుంది. మన విశ్వసనీయతను మర్చిపోనని యెహోవా ఇస్తున్న అభయం మనకు ఎంత సంతృప్తినిస్తుందో కదా!—హెబ్రీయులు 6:10.

14. యెహోవా అసహ్యించుకునే వైఖరులు, అలవాట్లు ఏమిటో తెలుసుకోవడానికి ఆ 12 పుస్తకాలు మీకు ఎలా దోహదపడ్డాయి?

14 అయితే, ఇప్పుడు కూడా యెహోవా సముఖంలో లిఖితమౌతున్న జ్ఞాపకార్థ గ్రంథంలో మీ పేరు చేరాలంటే మీరు ఏమి చేయాలి? ఆ 12 పుస్తకాల్లో మనం చూసిన కొన్ని చక్కని సలహాల్ని జ్ఞాపకం చేసుకోండి. యెహోవాకు ఇష్టం లేని ప్రవర్తన, లక్షణాలు, వైఖరుల విషయంలో ఇప్పుడు మన అవగాహన పెరిగింది. ఉదాహరణకు, దేవుని నీతియుక్త ప్రమాణాలకు విరుద్ధంగా ఉండే, మన జీవితాల్ని నాశనం చేసే “ఘోరమైన కాముకత్వము,” “వ్యభిచారమనస్సు” వంటివాటి గురించి ప్రవక్తలు హెచ్చరించారు. (హోషేయ 4:12; 6:9) జీవిత భాగస్వామికి గానీ కుటుంబ సభ్యులకు గానీ ద్రోహం చేసే వాళ్లంటే దేవునికి అసహ్యం. (మలాకీ 2:15, 16) హింస ఏ రూపంలో ఉన్నాసరే, అది తనకు అసహ్యమని యెహోవా తన ప్రవక్తల ద్వారా పదేపదే హెచ్చరించాడు. (ఆమోసు 3:10) వ్యాపార, డబ్బు లావాదేవీల్లో అన్యాయానికి, అవినీతికి పాల్పడకూడదని కూడా యెహోవా వాళ్ల చేత చెప్పించాడు. (ఆమోసు 5:24; మలాకీ 3:5) తీర్పు తీర్చే అధికారం ఉన్నవాళ్ల కళ్లు పక్షపాతంతో, స్వార్థంతో మసకబారకూడదని కూడా 12 పుస్తకాలు మరీమరీ చెప్పాయి.—మీకా 7:3, 4.

15. ఆ 12 మంది ప్రవక్తలు ఇచ్చిన ఉపదేశాల్ని పాటిస్తే మీరు పొందే కొన్ని మంచి ప్రయోజనాలు ఏమిటి?

15 ప్రవక్తలు కేవలం మనం దూరంగా ఉండాల్సిన విషయాలే చెప్పలేదు. మన జీవితంలో దేవుని ప్రమాణాలకు పెద్దపీట వేసినప్పుడు మనం పొందే ప్రయోజనాలను కూడా వాళ్లు ప్రస్తావించారు. మనం యెహోవాకు మరింత చేరువౌతాం. (మీకా 4:5) నీతి వర్ధిల్లినప్పుడు సంఘం మరింత స్థిరంగా, చురుగ్గా ఉంటుంది. వివాహబంధం దృఢమౌతుంది, కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది, అందరం దేవునికి దగ్గరయ్యే పనుల మీద దృష్టి నిలుపుతాం. (హోషేయ 2:19; 11:4) న్యాయంగా, నిజాయితీగా ప్రవర్తించడం వల్ల ఇతరుల గౌరవాన్ని చూరగొంటాం. యెహోవాలా కనికరం చూపిస్తూ తోటి సహోదరసహోదరీలతో కరుణతో, ప్రేమపూర్వక దయతో వ్యవహరిస్తాం, అప్పుడు వాళ్లూ మనతో అలాగే వ్యవహరిస్తారు. (మీకా 7:18, 19) సత్యాన్ని, శాంతిని ప్రేమించే ఆధ్యాత్మిక సహోదరసహోదరీల మధ్య మనం ఉంటాం. అన్నిటినీ మించి యెహోవా స్నేహాన్ని సంపాదించుకుంటాం. (జెకర్యా 8:16, 19) మీకేమనిపిస్తోంది, ఈ దీవెనలన్నీ మీరు ఇప్పటికే అనుభవిస్తున్నారు కదా?

16. ఇప్పుడు ఏ వ్యత్యాసం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది? దానివల్ల యెహోవా దినాన ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి?

16 మనం ఇప్పటివరకు పరిశీలించిన వాటివల్ల ‘నీతిగలవాళ్లకు, దుర్మార్గులకు’ మధ్య అంటే నిజ క్రైస్తవులకు, అబద్ధ క్రైస్తవులకు మధ్య ఉన్న వ్యత్యాసం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. (మలాకీ 3:18) మన చుట్టూ ఉన్న లోకం భక్తిహీనత అనే ఊబిలో కూరుకుపోతున్నా మనం మాత్రం యెహోవా ప్రమాణాల ప్రకారం జీవించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాం. “యెహోవా మహా దినము” వచ్చినప్పుడు ఈ వ్యత్యాసం గొప్ప పరిణామాలను తీసుకొస్తుందని మీకు తెలుసు.—జెఫన్యా 1:14; మత్తయి 25:46.

17. ఈ పుస్తకంలోని సమాచారాన్ని భవిష్యత్తులో మీరు ఎలా ఉపయోగించుకోవచ్చు?

17 ఆ 12 మంది ప్రవక్తలు ఇచ్చిన ఉపదేశం అన్ని కాలాలకు వర్తిస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. మీకు ఏవైనా సవాళ్లు ఎదురైనప్పుడు, ఏవైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ పుస్తకంలోని ఉపయోగకరమైన సమాచారాన్ని పరిశీలించండి. అలాచేస్తే, ఎప్పటికీ యెహోవా మార్గాల గురించి నేర్చుకోవాలని, ‘ఆయన త్రోవలలో నడవాలని’ మీరు కోరుకుంటున్నట్లు చూపిస్తారు. (మీకా 4:2) అయితే, ఆ త్రోవలో నడవడం ఒక్కసారితో ఆగిపోయేది కాదు. మీ పేరు యెహోవా జ్ఞాపకార్థ గ్రంథంలో లిఖితమై శాశ్వతంగా ఉండిపోవాలనేదే మీ బలమైన కోరిక, అవునా? ఆ దిశగా మీరు చేసే ప్రయత్నాలకు ఆ 12 పుస్తకాలు మీకు తోడ్పడతాయి.

విశ్వాసం ఉంటే రక్షణ పొందుతాం

18.యోవేలు 2:32లో రక్షణకు అవసరమైన ఏ ప్రాముఖ్యమైన అంశం ఉంది? అపొస్తలుడైన పౌలు దానికి ఏమి జోడించాడు?

18 మీకు దేవుని నిత్యానుగ్రహాన్ని తీసుకురాగల ఓ ముఖ్య విషయాన్ని నొక్కిచెబుతూ యోవేలు ప్రవక్త ఇలా అన్నాడు: “యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థనచేయు వారందరును రక్షింపబడుదురు.” (యోవేలు 2:32) ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని అపొస్తలులైన పేతురు, పౌలు ఇద్దరూ ఉల్లేఖించారు. (అపొస్తలుల కార్యములు 2:21; రోమీయులు 10:13) పౌలు దానికి మరో అంశాన్ని జోడిస్తూ ఇలా అడిగాడు: “వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు?” (రోమీయులు 10:14) మీరైతే ఇప్పుడూ ఎల్లప్పుడూ యెహోవా పేరున ప్రార్థించాలని, ఆయనపై విశ్వాసం ఉంచాలని తప్పకుండా కోరుకుంటారు.

యోవేలు

19. యెహోవా పేరున ప్రార్థించాలంటే ఏమేమి చేయాలి?

19 యెహోవా పేరున ప్రార్థించాలంటే ఆ పేరు తెలుసుకొని, దాన్ని ఉపయోగిస్తే సరిపోదు. (యెషయా 1:15) యోవేలు 2:32కు ముందున్న వచనాలు నిజమైన పశ్చాత్తాపాన్ని, యెహోవా క్షమాగుణంపై విశ్వాసాన్ని చూపించాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతున్నాయి. (యోవేలు 2:12, 13) దేవుని పేరున ప్రార్థించాలంటే ఆయన్ని నిజంగా తెలుసుకోవాలి, నమ్మాలి, ఆయన మాట వినాలి, జీవితంలో ఆయనకు మొదటిస్థానం ఇవ్వాలి. అవును, యెహోవా సేవకే మన జీవితంలో ప్రాధాన్యతను ఇస్తాం. ఫలితంగా దేవుడు ఆశీర్వాదంగా ఇచ్చే సంతృప్తికరమైన శాశ్వత జీవాన్ని పొందుతాం.—మత్తయి 6:33.

20. మీరు విశ్వాసాన్ని చూపిస్తే ఏ అద్భుతమైన ఆశీర్వాదం పొందుతారు?

20 హబక్కూకు ద్వారా యెహోవా ఇలా చెప్పాడు: “నీతిమంతుడు విశ్వాసము మూలముగ బ్రదుకును.” (హబక్కూకు 2:4) ఆ విషయాన్ని మీ మనసుమీద, హృదయంమీద గట్టిగా ముద్రించుకోండి. బైబిలు బోధించే కీలక సత్యాల్లో అదొకటి. పౌలు రాసిన ప్రేరేపిత పత్రికల్లో ఆ లేఖన భాగాన్ని మూడుసార్లు ఉల్లేఖించాడు. b (రోమీయులు 1:16, 17; గలతీయులు 3:11, 13, 14; హెబ్రీయులు 10:38) మనం జీవం పొందాలంటే, మన పాపాల కోసం యేసుక్రీస్తు అర్పించిన బలిమీద కూడా విశ్వాసం ఉంచాలి. యేసు ఇలా వివరించాడు: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును . . . నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” ఆ తర్వాతి వచనాల్లో ఇలా ఉంది: “కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు.” (యోహాను 3:16, 36) మన విమోచకుని వల్ల మాత్రమే జరిగే స్వస్థతను ఆ బలి అందుబాటులోకి తెచ్చింది. యెహోవా తన మహా దినాన సాతాను దుష్ట ప్రపంచాన్ని ఏమి చేయనున్నాడో చెప్పిన తర్వాత మలాకీ ద్వారా ఇలా అన్నాడు: “నా నామమందు భయభక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును.” అవును, యేసుక్రీస్తు మనందరికీ ఆరోగ్యాన్నిస్తూ మన మీద ఉదయిస్తాడు. మనం ఇప్పుడు పొందుతున్న ఆధ్యాత్మిక స్వస్థత కూడా అందులో భాగమే. అయితే, నూతన లోకంలో శారీరక స్వస్థత కూడా కలుగుతుందని, అదీ పూర్తిస్థాయిలో జరుగుతుందని ఆలోచిస్తుంటేనే మన మది ఎంతగా పులకించిపోతుందో కదా!—మలాకీ 4:2.

21. యెహోవా తన సంకల్పాన్ని నెరవేర్చగల సమర్థుడని మీరెందుకు నమ్మవచ్చు?

21 దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చగల సమర్థుడని నమ్మడం కూడా ప్రాముఖ్యం. మీకా ప్రవక్త కాలంలో, తోటి మనుషుల్ని నమ్మడం చాలా కష్టంగా ఉండేది. “స్నేహితునియందు నమ్మికయుంచవద్దు, ముఖ్యస్నేహితుని నమ్ముకొనవద్దు” అని మీకా చెప్పాడు. అయితే మీకా ప్రవక్త యెహోవా మీద నమ్మకం పెట్టుకోవడానికి ఎప్పుడూ సంకోచించలేదు; మీరు కూడా సంకోచించనక్కర్లేదు. మీకా ఇలా అన్నాడు: “యెహోవాకొరకు నేను ఎదురు చూచెదను.” (మీకా 7:5, 7) ఎప్పుడు ఎలా మారిపోతారో చెప్పలేని మనుషుల్లాంటివాడు కాడు యెహోవా. తన సర్వాధిపత్య నిరూపణ కోసం, విశ్వాసుల శాశ్వత సంక్షేమం కోసం తన సంకల్పాన్ని నెరవేర్చాలనే కోరిక, నెరవేర్చగల సత్తా ఆయనకు ఉన్నాయి.

22. విశ్వాసంతో యెహోవా పేరున ప్రార్థించేవాళ్లు వేటిని చవిచూస్తారు?

22 హబక్కూకు ప్రవక్తలా మీరు కూడా నమ్మకంగా ఇలా చెప్పగలరు: “నేను యెహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతోషించెదను.” (హబక్కూకు 3:18) విశ్వాసంతో యెహోవా పేరున ప్రార్థించేవాళ్లు సంతోషించడానికిగల కారణాన్ని స్పష్టం చేస్తూ, ‘వాళ్లు రక్షింపబడతారు’ అని యోవేలు అన్నాడు. పౌలు కూడా అదే అన్నాడు. (యోవేలు 2:32; రోమీయులు 10:13) ఇంతకీ వాళ్లు ఎలా రక్షణ పొందుతారు? మీ విశ్వాసం వల్ల మీరు ఇప్పటికే సాతాను కుయుక్తుల నుండి, చెడ్డవాళ్లకు పట్టే దుర్గతి నుండి విడుదల పొందారు. (1 పేతురు 1:18) అంతేకాదు, ఈ దుష్ట వ్యవస్థ మీదకు రానున్న విపత్కరమైన అంతాన్ని తప్పించుకుని రక్షణ పొందుతామని మీరు నమ్మకంగా ఎదురుచూడవచ్చు. ఇక అక్కడ నుండి మీరు ఆ 12 మంది ప్రవక్తలు ప్రవచించిన మరిన్ని ఆశీర్వాదాల వెల్లువలో తడిసిముద్దవుతారు.

పరదైసు ఛాయలు

23, 24. (ఎ) ఆ 12 మంది ప్రవక్తలు పరదైసు గురించి చేసిన కొన్ని వర్ణనలు ఏమిటి? (బి) ఆ ప్రవక్తలు రాసిన విషయాలు భవిష్యత్తు విషయంలో మీ అభిప్రాయాన్ని ఎలా ప్రభావితం చేశాయి?

23 “యెహోవాయందు భయభక్తులుగల” వాళ్ల కోసం నిత్య ఆశీర్వాదాలు వేచివున్నాయి. (మలాకీ 3:16) మనం అతిత్వరలో చూడబోయే భూపరదైసు గురించి ఆ 12 మంది ప్రవక్తల్లో కొందరు వివిధ రకాలుగా వర్ణించారు, ఆ వర్ణనలు మీలో సంతోషాన్ని, ఆశల్ని నింపుతాయి. ఉదాహరణకు మీకా ఇలా రాశాడు: “ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును.” (మీకా 4:4) నిజం, దేవుని రాజ్యంలో మీరు ఎంతో సురక్షితంగా ఉంటారు, మీ శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు!

24 రోగాలు, బాధలు, చివరికి మరణం లేని కాలం కోసం మీ ఎదురుచూపులు పగటికలలేమీ కాదు. తిరిగి బ్రతికినవాళ్లు, పరిపూర్ణ మనుషులౌతామన్న విషయం తెలుసుకున్నప్పుడు వాళ్లెంత సంతోషిస్తారో ఆలోచించండి. హోషేయ 13:14 లోని ఈ మాటలు భూమ్మీద పూర్తిస్థాయిలో నెరవేరడం వాళ్లు చూస్తారు: “పాతాళ వశములోనుండి నేను వారిని విమోచింతును; మృత్యువునుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?” పౌలు ఆ లేఖనాన్ని పరలోక పునరుత్థానానికి అన్వయించాడు.—1 కొరింథీయులు 15:55-57.

25. నూతనలోకంలో మీ అనుభూతులు ఎలా ఉంటాయి?

25 చనిపోయినవాళ్లు ఈ భూమ్మీద మళ్లీ బతుకుతారని నమ్మడం కష్టంగా అనిపిస్తోందా? అలా అనిపించకూడదు. (జెకర్యా 8:6) దేవుని ప్రజలు చెర నుండి విడుదల అవుతారని ఆమోసు, మీకా ప్రవక్తలు ప్రవచించినప్పుడు ఆ ప్రజలకు నమ్మడం కష్టంగా అనిపించివుంటుంది. కానీ అది జరిగిందని మీకు తెలుసు. (ఆమోసు 9:14, 15; మీకా 2:12; 4:1-7) విడుదలైన ఆ ప్రజల స్పందన ఇలా ఉంది: “మనము కలకనినవారివలె నుంటిమి మన నోటి నిండ నవ్వుండెను మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. . . . యెహోవా మనకొరకు గొప్పకార్యములు చేసి యున్నాడు మనము సంతోషభరితులమైతిమి.” (కీర్తన 126:1-3) నూతనలోకంలో “పట్టజాలనంత విస్తారమైన దీవెనలు” పొందినప్పుడు మీ స్పందన కూడా అలాగే ఉంటుంది.

సత్యాన్ని, న్యాయాన్ని ప్రేమించేవాళ్ల మధ్య యెహోవా సేవకులు ఉన్నారు

26. యెహోవా మహా దినాన్ని మనసులో ఉంచుకొని జీవించే వాళ్లకోసం ఏమి వేచివుంది?

26 “యెహోవా దినము” ఈ భూమ్మీది దుష్టత్వాన్ని కడిగిపారేసిన తర్వాత పూర్తిగా “రాజ్యము యెహోవాది యగును.” (ఓబద్యా 15, 21) అది ఆయన ప్రజలందరికీ అపురూపమైన ఆశీర్వాదం అవుతుంది, కాదంటారా? మలాకీ 3వ అధ్యాయంలోని మాటలు ఎవరికైతే వర్తిస్తాయో వాళ్లలో మీరూ ఉండవచ్చు. అక్కడ ఇలా ఉంది: “వారు నావారై . . . యుందురు; తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించునట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.” (మలాకీ 3:17) రక్షణ మార్గంలో మిమ్మల్ని ఉంచిన మీ విశ్వాసం భవిష్యత్తులో మీకు “పట్టజాలనంత విస్తారమైన దీవెనలు” తీసుకొస్తుంది. ఎంత ఉజ్వలమైన భవిష్యత్తో కదా!

b పౌలు ఈ మాటలను గ్రీకు సెప్టువజింటు నుండి ఉల్లేఖించాడు. అందులో, ఈ లేఖనానికి ఉపయోగించిన పదాలు, హీబ్రూ మూల ప్రతుల్లోని పదాలకు కాస్త వేరుగా ఉన్నాయి.