20వ అధ్యాయం
కానాలో చేసిన రెండో అద్భుతం
మార్కు 1:14, 15 లూకా 4:14, 15 యోహాను 4:43-54
-
“దేవుని రాజ్యం దగ్గరపడింది” అని యేసు ప్రకటించాడు
-
యేసు దూరం నుండే ఒక అబ్బాయిని బాగుచేశాడు
యేసు సమరయలో దాదాపు రెండు రోజులు ఉన్న తర్వాత తన సొంత ప్రాంతమైన గలిలయకు బయల్దేరాడు. ఆయన పెరిగింది అక్కడే. యూదయలో ఆయన చాలాకాలం ప్రకటించాడు. ఇప్పుడు ఆయన గలిలయకు వెళ్తున్నది విశ్రాంతి తీసుకోవడానికి కాదు, ఇంకా ఎక్కువ పరిచర్య చేయడానికి. అక్కడి ప్రజలు తనను సాదరంగా ఆహ్వానిస్తారని యేసు అనుకుని ఉండడు. ఎందుకంటే, “ప్రవక్తకు తన సొంత దేశంలో గౌరవం ఉండదు” అని ఆయన అన్నాడు. (యోహాను 4:44) శిష్యులు ఆయనతోపాటు ఉండే బదులు తమ ఇళ్లకు, పనులకు వెళ్లిపోయారు.
యేసు, “దేవుని రాజ్యం దగ్గరపడింది. కాబట్టి పశ్చాత్తాపపడండి, మంచివార్త మీద విశ్వాసం ఉంచండి” అని ప్రకటించడం మొదలుపెట్టాడు. (మార్కు 1:15) దానికి ప్రజలు ఎలా స్పందించారు? నిజానికి, గలిలయలో చాలామంది ఆయన్ని సాదరంగా ఆహ్వానించి, గౌరవించారు. కానీ వాళ్లు అలా చేసింది, ఆయన ప్రకటించిన సందేశాన్ని బట్టి మాత్రమే కాదు. కొన్ని నెలల క్రితం, పస్కా పండుగ సమయంలో యేసు యెరూషలేములో చేసిన గొప్ప అద్భుతాల్ని వాళ్లలో కొంతమంది చూశారు.—యోహాను 2:23.
గలిలయలో యేసు తన పరిచర్యను ఎక్కడ మొదలుపెట్టాడు? బహుశా కానాలో అయ్యుండవచ్చు. ఇంతకుముందు ఒక పెళ్లి విందులో ఆయన నీళ్లను ద్రాక్షారసంగా మార్చింది అక్కడే. ఇప్పుడు రెండోసారి కానాకు వచ్చినప్పుడు, ఒక అబ్బాయి తీవ్ర అనారోగ్యంతో చావుబ్రతుకుల మధ్య ఉన్నాడని యేసుకు తెలిసింది. ఆ అబ్బాయి వాళ్ల నాన్న, హేరోదు అంతిప దగ్గర పనిచేసే ఒక ప్రభుత్వ అధికారి. అతను ధనవంతుడు, అతని ఇంట్లో చాలామంది దాసులు ఉండేవాళ్లు. యేసు యూదయ నుండి కానాకు వచ్చాడని తెలిసి, అతను కపెర్నహూములోని తన ఇంటి నుండి కానాకు బయల్దేరాడు. అక్కడ యేసును కలిసి, చాలా బాధపడుతూ “ప్రభువా, మా అబ్బాయి చనిపోకముందే నాతో రా” అని వేడుకున్నాడు.—యోహాను 4:49.
యేసు ఆ అధికారితో, “వెళ్లు, మీ అబ్బాయి బాగయ్యాడు” అన్నాడు. అతను ఆ మాట విని ఆశ్చర్యపోయివుంటాడు. (యోహాను 4:50) అయినా, అతను యేసు మీద నమ్మకంతో ఇంటికి బయల్దేరాడు. దారిలో, అతని దాసులు ఒక మంచివార్త చెప్పాలని పరుగుపరుగున అతనికి ఎదురొచ్చారు. అవును, అతని కుమారుడు బ్రతికేవున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు! అతను జరిగినదాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, ‘ఎన్నింటికి బాగయ్యాడు?’ అని వాళ్లను అడిగాడు.
“నిన్న దాదాపు మధ్యాహ్నం ఒంటిగంటకు జ్వరం తగ్గిపోయింది” అని వాళ్లు చెప్పారు.—యోహాను 4:52.
“మీ అబ్బాయి బాగయ్యాడు” అని యేసు తనకు ఎప్పుడు చెప్పాడో, సరిగ్గా ఆ సమయానికే తన కుమారుడు బాగయ్యాడని ఆ అధికారికి అర్థమైంది. తర్వాత అతను, అతని ఇంటివాళ్లందరూ క్రీస్తు శిష్యులయ్యారు.
అలా కానాలో యేసు రెండు అద్భుతాలు చేశాడు. మొదటిది, నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం. రెండవది, దాదాపు 26 కిలోమీటర్ల దూరం నుండే ఒక అబ్బాయిని బాగుచేయడం. యేసు ఇప్పటివరకు చేసింది ఈ రెండు అద్భుతాలు మాత్రమే కాదు. అయితే ఆయన కానాలో చేసిన రెండో అద్భుతం ప్రత్యేకమైనది, ఎందుకంటే ఆయన ఒక దేవుని ప్రవక్తగా గలిలయలో అడుగుపెట్టాడని అది చూపించింది. మరి, ఈ ప్రవక్తను ‘సొంత దేశంలోని’ ప్రజలు గౌరవిస్తారా?
అది తెలుసుకోవడానికి, యేసు తన సొంతూరు నజరేతుకు వెళ్లినప్పుడు ఏం జరిగిందో పరిశీలిద్దాం.