కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

138వ అధ్యాయం

క్రీస్తు దేవుని కుడిపక్కన కూర్చున్నాడు

క్రీస్తు దేవుని కుడిపక్కన కూర్చున్నాడు

అపొస్తలుల కార్యాలు 7:56

  • దేవుని కుడిపక్కన యేసు కూర్చున్నాడు

  • సౌలు యేసు శిష్యుడు అయ్యాడు

  • మనం సంతోషించడానికి కారణం

యేసు పరలోకానికి వెళ్లిన పది రోజుల తర్వాత, పెంతెకొస్తు రోజున శిష్యుల మీద పవిత్రశక్తి కుమ్మరించబడింది. యేసు పరలోకానికి వెళ్లాడని అది రుజువుచేసింది. ఆయన పరలోకానికి వెళ్లాడు అనడానికి ఇంకో రుజువు కూడా ఉంది. ఆ రుజువును శిష్యుడైన స్తెఫను చూశాడు. నమ్మకంగా సాక్ష్యమిస్తున్నందుకు అతన్ని రాళ్లతో కొట్టారు, ఆ సమయంలో స్తెఫను ఇలా అన్నాడు: “ఇదిగో! ఆకాశం తెరవబడి ఉండడం, మానవ కుమారుడు దేవుని కుడిపక్కన నిలబడి ఉండడం నేను చూస్తున్నాను.”—అపొస్తలుల కార్యాలు 7:56.

పరలోకంలో యేసు తన తండ్రి కుడిపక్కన వేచివుండి, ఆయన ఇచ్చే ప్రత్యేకమైన ఆజ్ఞ కోసం ఎదురుచూశాడు. ఆ ఆజ్ఞ ఏంటో దేవుని వాక్యం ముందే చెప్పింది. దావీదు దైవప్రేరణతో ఇలా రాశాడు: “యెహోవా నా ప్రభువుతో [యేసుతో] ఇలా అన్నాడు: ‘నేను నీ శత్రువుల్ని నీ పాదపీఠంగా చేసేవరకు నా కుడిపక్కన కూర్చో.’” ఆ వేచివుండే కాలం పూర్తైన తర్వాత, యేసు ‘[తన] శత్రువుల మధ్య జయిస్తూ వెళ్తాడు.’ (కీర్తన 110:1, 2) మరి, తన శత్రువుల మీద చర్య తీసుకునే సమయం వచ్చేవరకు యేసు ఏం చేస్తాడు?

సా.శ. 33 పెంతెకొస్తు రోజున క్రైస్తవ సంఘం ఏర్పడింది. పవిత్రశక్తితో అభిషేకించబడిన తన శిష్యుల్ని యేసు పరలోకం నుండి పరిపాలించడం మొదలుపెట్టాడు. (కొలొస్సయులు 1:13) ఆయన వాళ్ల ప్రకటనా పనిని నిర్దేశించాడు, భవిష్యత్తులో చేపట్టాల్సిన బాధ్యత కోసం వాళ్లను సిద్ధం చేశాడు. ఏంటా బాధ్యత? క్రీస్తుతోపాటు పరిపాలించడం. వాళ్లలో ఎవరైతే చనిపోయేవరకు నమ్మకంగా ఉంటారో, వాళ్లు పునరుత్థానమై యేసుతోపాటు సహరాజులుగా పరిపాలిస్తారు.

అలా సహరాజులుగా పరిపాలించే వాళ్లలో ఒకరు, పౌలు అనే రోమా పేరుతో సుపరిచితుడైన సౌలు. యూదుడైన సౌలు ఎన్నో ఏళ్లుగా ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నాడు. యూదా మతనాయకులు అతన్ని ఎంతగా తప్పుదారి పట్టించారంటే, స్తెఫనును రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు అతను దాన్ని ఆమోదించాడు. తర్వాత అతను, “ప్రభువు శిష్యుల్ని బెదిరిస్తూ ఉన్నాడు.” వాళ్లను చంపేయాలని గట్టిగా కోరుకుని అతను దమస్కుకు బయల్దేరాడు. యేసు శిష్యుల్ని బంధించి, యెరూషలేముకు తీసుకొచ్చేలా ప్రధానయాజకుడైన కయప దగ్గర అనుమతి కూడా తీసుకున్నాడు. (అపొస్తలుల కార్యాలు 7:58; 9:1) అయితే అతను దమస్కుకు వెళ్తున్నప్పుడు, దారిలో ఒక గొప్ప వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడు అతను నేల మీద పడిపోయాడు.

“సౌలా, సౌలా, నన్నెందుకు హింసిస్తున్నావు?” అని పరలోకం నుండి ఒక స్వరం వినిపించింది. అప్పుడు సౌలు, “ప్రభువా, నువ్వెవరు?” అని అడిగాడు. “నేను నువ్వు హింసిస్తున్న యేసును” అని ఆ స్వరం చెప్పింది.—అపొస్తలుల కార్యాలు 9:4, 5.

దమస్కుకు వెళ్లి, తాను మళ్లీ చెప్పే వరకు అక్కడే ఉండమని యేసు సౌలుకు చెప్పాడు. ఆ ప్రకాశవంతమైన వెలుగు వల్ల అతనికి కంటిచూపు పోయింది. కాబట్టి అతన్ని ఆ నగరం వరకు తీసుకెళ్లడానికి ఎవరోఒకరు సహాయం చేయాలి. యేసు దమస్కులో ఉంటున్న అననీయ అనే శిష్యుడికి మరో దర్శనంలో కనిపించి, ఫలానా చోటికి వెళ్లి సౌలును కలవమని చెప్పాడు. కానీ అననీయ భయపడడంతో యేసు ఇలా అభయం ఇచ్చాడు: “అన్యజనులకు, రాజులకు, ఇశ్రాయేలు ప్రజలకు నా పేరు గురించి సాక్ష్యమివ్వడానికి నేను ఎంచుకున్న వ్యక్తి అతను [సౌలు].” సౌలుకు చూపు వచ్చిన తర్వాత, యేసే దేవుని కుమారుడని అతను దమస్కులోనే ప్రకటించడం మొదలుపెట్టాడు.—అపొస్తలుల కార్యాలు 9:15, 20.

పౌలు, ఇతర సువార్తికులు యేసు మొదలుపెట్టిన ప్రకటనా పనిని కొనసాగించారు. యేసు మద్దతుతో, దేవుని ఆశీర్వాదంతో వాళ్లు అసాధారణ విజయం సాధించారు. దమస్కుకు వెళ్తున్న దారిలో తనకు యేసు కనిపించిన దాదాపు 25 సంవత్సరాలకు ‘మంచివార్త భూమంతటా,’ అంటే రోమా సామ్రాజ్యమంతటా ప్రకటించబడింది అని పౌలు రాశాడు.—కొలొస్సయులు 1:23.

కొన్ని సంవత్సరాల తర్వాత, యేసు తనకు ఇష్టమైన అపొస్తలునికి అంటే యోహానుకు కొన్ని దర్శనాలు ఇచ్చాడు. అవి, బైబిల్లోని ప్రకటన పుస్తకంలో ఉన్నాయి. ఆ దర్శనాల్లో యేసు రాజ్యాధికారంతో తిరిగిరావడం యోహాను చూశాడు. అలా యేసు చెప్పినట్టే అప్పటివరకు అతను బ్రతికివున్నాడు. (యోహాను 21:22) అతను “పవిత్రశక్తితో నిండిపోయి ప్రభువు రోజున జరిగే విషయాల్ని” చూశాడు. (ప్రకటన 1:10) ప్రభువు రోజు ఎప్పుడు మొదలైంది?

బైబిలు ప్రవచనాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, “ప్రభువు రోజు” 1914 లో మొదలైందని తెలుస్తుంది. ఆ సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. అప్పటినుండి యుద్ధాలు, తెగుళ్లు, కరువులు, భూకంపాలు వంటివి ఎక్కువైపోయాయి. ఆ విధంగా, తన “ప్రత్యక్షతకు, ఈ వ్యవస్థ ముగింపుకు” సంబంధించి యేసు తన అపొస్తలులకు ఇచ్చిన సూచన విస్తృత స్థాయిలో నెరవేరుతోంది. (మత్తయి 24:3, 7, 8, 14) ఇప్పుడు రాజ్యం గురించిన మంచివార్త ఒక్క రోమా సామ్రాజ్యంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడుతోంది.

వాటన్నిటి అర్థాన్ని వివరిస్తూ యోహాను దైవప్రేరణతో ఇలా రాశాడు: “ఇప్పుడు రక్షణ, శక్తి, రాజ్యం మన దేవునివి అయ్యాయి. అధికారం ఆయన క్రీస్తుకు వచ్చింది.” (ప్రకటన 12:10) అవును, యేసు దేని గురించైతే ఎక్కువగా ప్రకటించాడో, ఆ దేవుని రాజ్యం ఇప్పుడు పరలోకంలో పరిపాలిస్తోంది!

యేసు నమ్మకమైన శిష్యులందరికీ అది నిజంగా ఒక శుభవార్త. అయితే, వాళ్లు యోహాను రాసిన ఈ మాటల గురించి ఆలోచించాలి: “కాబట్టి పరలోకమా, పరలోక నివాసులారా, సంతోషించండి! అయితే భూమీ, సముద్రమా, మీకు శ్రమ. ఎందుకంటే అపవాది తనకు కొంచెం సమయమే ఉందని తెలిసి చాలా కోపంతో మీ దగ్గరికి దిగివచ్చాడు.”—ప్రకటన 12:12.

ఇప్పుడు యేసు తన తండ్రి కుడిపక్కన కూర్చుని వేచి చూడట్లేదు, ప్రస్తుతం ఆయన రాజుగా పరిపాలిస్తున్నాడు. త్వరలోనే తన శత్రువులందర్నీ నాశనం చేస్తాడు. (హెబ్రీయులు 10:12, 13) అప్పుడు ఎలాంటి ఆసక్తికరమైన విషయాలు జరుగుతాయి?