కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

110వ అధ్యాయం

యేసు ఆలయంలో గడిపిన చివరి రోజు

యేసు ఆలయంలో గడిపిన చివరి రోజు

మత్తయి 23:25–24:2 మార్కు 12:41–13:2 లూకా 21:1-6

  • యేసు మతనాయకుల్ని ఖండించడం ఆపలేదు

  • ఆలయం నాశనమౌతుందని చెప్పాడు

  • రెండు చిన్న నాణేలు వేసిన పేద విధవరాలు

ఆలయంలో గడిపిన చివరి రోజున యేసు అందరిముందు పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని వేషధారులని పిలిచాడు. వాళ్ల వేషధారణను ఇలా బయటపెట్టాడు: “మీరు బయటికి శుభ్రంగా కనిపించి లోపల మురికిగా ఉన్న గిన్నెల్లాంటివాళ్లు. లోపల మీరు అత్యాశతో నిండివున్నారు, అదుపులేని కోరికలు తీర్చుకోవడంలో మునిగిపోయారు. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెల్ని ముందు లోపల శుభ్రం చేయి, అప్పుడు అవి బయట కూడా శుభ్రమౌతాయి.” (మత్తయి 23:25, 26) తమను తాము శుద్ధి చేసుకునే విషయంలో, వస్త్రధారణ విషయంలో నిష్ఠగా ఉండే పరిసయ్యులు తమ లోపలి వ్యక్తిత్వాన్ని, హృదయాన్ని శుద్ధి చేసుకోవడంలో విఫలమయ్యారు.

ప్రవక్తలకు సమాధులు కట్టడంలో, వాటిని అలంకరించడంలో కూడా వాళ్ల వేషధారణ కనిపిస్తుంది. అయితే, వాళ్లు “ప్రవక్తల్ని చంపినవాళ్ల పిల్లలని” యేసు అన్నాడు. (మత్తయి 23:31) యేసును చంపడానికి ప్రయత్నించడం ద్వారా వాళ్లు దాన్ని నిరూపించుకున్నారు.—యోహాను 5:18; 7:1, 25.

ఆ మతనాయకులు పశ్చాత్తాపం చూపించకపోతే ఏం జరుగుతుందో యేసు చెప్పాడు: “సర్పాల్లారా, విషసర్పాల పిల్లలారా, గెహెన్నా తీర్పును తప్పించుకొని మీరు ఎక్కడికి పారిపోతారు?” (మత్తయి 23:33) యెరూషలేముకు దగ్గర్లో ఉన్న హిన్నోము లోయలో చెత్తను తగలబెట్టేవాళ్లు. అది శాశ్వత నాశనాన్ని సూచిస్తుంది. కాబట్టి దుష్టులైన ఆ శాస్త్రులు, పరిసయ్యులు శాశ్వతంగా నాశనం చేయబడతారు.

యేసుకు ప్రతినిధులైన శిష్యులు ‘ప్రవక్తలుగా, జ్ఞానులుగా, ఉపదేశకులుగా’ ఉంటారు. మరి వాళ్లకు ఏం జరుగుతుంది? యేసు మతనాయకులతో ఇలా అన్నాడు: ‘మీరు నా శిష్యుల్లో కొంతమందిని చంపి, కొయ్యలకు వేలాడదీస్తారు; ఇంకొంతమందిని మీ సమాజమందిరాల్లో కొరడాలతో కొడతారు, ఒక ఊరి నుండి ఇంకో ఊరికి తరుముతూ హింసిస్తారు. దానివల్ల, నీతిమంతుడైన హేబెలు రక్తంతో మొదలుపెట్టి, మీరు చంపిన జెకర్యా రక్తం వరకు, భూమ్మీద చిందించబడిన నీతిమంతులందరి రక్తం మీ మీదికి వస్తుంది.’ ఆయన ఇలా హెచ్చరించాడు: “నేను నిజంగా మీతో చెప్తున్నాను, ఇవన్నీ ఈ తరంవాళ్ల మీదికి వస్తాయి.” (మత్తయి 23:34-36) సా.శ. 70 లో రోమా సైన్యాల చేతిలో యెరూషలేము నాశనమై, ఎన్నో వేలమంది యూదులు చనిపోయినప్పుడు ఆ మాటలు నెరవేరాయి.

రానున్న ఆ భయంకరమైన పరిస్థితి గురించి ఆలోచిస్తూ యేసు ఇలా బాధపడ్డాడు: “యెరూషలేమా, యెరూషలేమా, నువ్వు ప్రవక్తల్ని చంపుతూ, నీ దగ్గరికి పంపబడినవాళ్లను రాళ్లతో కొడుతూ ఉన్నావు. కోడి తన పిల్లల్ని రెక్కల చాటున చేర్చుకున్నట్టు, నేను ఎన్నోసార్లు నీ పిల్లల్ని చేర్చుకోవాలని అనుకున్నాను! కానీ అది నీకు ఇష్టంలేదు. ఇదిగో! నీ ఇల్లు నీకే వదిలేయబడింది.” (మత్తయి 23:37, 38) ఆ “ఇల్లు” ఏంటో అక్కడున్న వాళ్లకు అర్థమై ఉండకపోవచ్చు. బహుశా, దేవుని కాపుదల ఉందని అందరూ అనుకుంటున్న మహిమాన్వితమైన యెరూషలేము ఆలయం గురించి యేసు మాట్లాడుతున్నాడా?

తర్వాత యేసు ఇలా అన్నాడు: “నేను నీతో చెప్తున్నాను, ‘యెహోవా పేరున వస్తున్న ఈయన దీవించబడాలి!’ అని నువ్వు చెప్పే వరకు ఇక నన్ను చూడవు.” (మత్తయి 23:39) ఆయన కీర్తన 118:26 లో ఉన్న ఈ ప్రవచనాన్ని ఎత్తిచెప్తున్నాడు: “యెహోవా పేరున వస్తున్న వ్యక్తి దీవించబడాలి; యెహోవా మందిరంలో నుండి మేము మిమ్మల్ని దీవిస్తున్నాం.” ఆ ఆలయం నాశనమైన తర్వాత, అక్కడికి ఎవ్వరూ దేవుని పేరున రాలేరు.

తర్వాత యేసు ఆలయంలో కానుక పెట్టెలు ఉండే చోటికి వెళ్లాడు. కానుక పెట్టెల పైభాగంలో ఉన్న చిన్న రంధ్రంలో ప్రజలు విరాళం వేసేవాళ్లు. చాలామంది యూదులు దాంట్లో డబ్బులు వేయడం యేసు చూస్తూ ఉన్నాడు. ధనవంతులు “ఎన్నో నాణేలు” వేస్తున్నారు. కానీ ఒక విధవరాలు “చాలా తక్కువ విలువగల రెండు చిన్న నాణేలు” వేయడం యేసు గమనించాడు. (మార్కు 12:41, 42) ఆమె ఇచ్చిన విరాళాన్ని బట్టి దేవుడు ఎంత సంతోషించి ఉంటాడో యేసుకు తెలుసు.

యేసు తన శిష్యుల్ని పిలిచి ఇలా అన్నాడు: “నేను నిజంగా చెప్తున్నాను, కానుక పెట్టెల్లో డబ్బులు వేసిన వాళ్లందరి కన్నా ఈ పేద విధవరాలే ఎక్కువ వేసింది.” అదెలా? యేసు ఇలా వివరించాడు: “వాళ్లందరూ తమ సంపదల్లో నుండి కొంచెం వేశారు, కానీ ఈమె ఎంతో అవసరంలో ఉన్నా, తన దగ్గర ఉన్నదంతా వేసేసింది.” (మార్కు 12:43, 44) ఆలోచనల్లో, పనుల్లో ఆమె ఆ మతనాయకులకు ఎంత భిన్నంగా ఉందో కదా!

నీసాను 11 ముగుస్తుండగా, యేసు ఆలయం నుండి వెళ్లిపోయాడు. ఆయన ఆలయంలో గడపడం అదే చివరిసారి. యేసు శిష్యుల్లో ఒకతను “బోధకుడా, ఒకసారి అటు చూడు! ఆ రాళ్లు, కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా!” అన్నాడు. (మార్కు 13:1) ఆలయ గోడల్లోని కొన్ని రాళ్లు ఎంత పెద్దగా ఉన్నాయంటే, చూసేవాళ్లకు ఆలయం పటిష్ఠంగా ఉన్నట్లు, దానికెప్పటికీ ఏమీ కాదన్నట్లు అనిపించవచ్చు. కానీ యేసు ఇలా అన్నాడు: “ఈ గొప్ప కట్టడాలు నువ్వు చూస్తున్నావు కదా? రాయి మీద రాయి అనేదే లేకుండా ఇవి పడగొట్టబడతాయి.” ఆ మాటలు వింతగా అనిపించవచ్చు.—మార్కు 13:2.

ఆ తర్వాత యేసు, ఆయన అపొస్తలులు కిద్రోను లోయ దాటి, ఒలీవల కొండ మీద ఒక చోటికి వెళ్లారు. అపొస్తలులైన పేతురు, అంద్రెయ, యాకోబు, యోహాను యేసుతో ఏకాంతంగా మాట్లాడడానికి వచ్చారు. అక్కడినుండి మహిమాన్వితమైన యెరూషలేము ఆలయం స్పష్టంగా కనిపిస్తుంది.