కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

16వ అధ్యాయం

సత్యారాధన విషయంలో యేసుకున్న ఆసక్తి

సత్యారాధన విషయంలో యేసుకున్న ఆసక్తి

యోహాను 2:12-22

  • యేసు ఆలయాన్ని శుభ్రం చేశాడు

కానాలో పెళ్లి విందు తర్వాత యేసు కపెర్నహూముకు బయల్దేరాడు. యేసువాళ్ల అమ్మ, ఆయన తమ్ముళ్లు యాకోబు, యోసేపు, సీమోను, యూదా కూడా ఆయనతోపాటు వెళ్తున్నారు.

యేసు కపెర్నహూముకు ఎందుకు వెళ్తున్నాడు? కపెర్నహూము రాకపోకలకు అనుకూలంగా ఉండేది. అది నజరేతు, కానాల కన్నా పెద్ద నగరం. పైగా, యేసు కొత్త శిష్యుల్లో చాలామంది కపెర్నహూము, దాని చుట్టుపక్కల ప్రాంతాలవాళ్లే కాబట్టి, ఆయన వాళ్ల సొంతూరిలోనే వాళ్లకు శిక్షణ ఇవ్వవచ్చు.

కపెర్నహూములో ఉన్నప్పుడు యేసు అద్భుతాలు కూడా చేశాడు. దానివల్ల ఆ నగరంలో, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది ఆయన చేసినవాటి గురించి విన్నారు. అయితే యేసు, దైవభక్తిగల యూదులైన ఆయన సహచరులు త్వరలో యెరూషలేముకు బయల్దేరాల్సి ఉంది. ఎందుకంటే సా.శ. 30 పస్కా దగ్గరపడుతోంది.

వాళ్లు యెరూషలేము ఆలయానికి వెళ్లాక యేసులో అంతకుముందు చూడని ఒక కొత్త విషయాన్ని చూస్తారు. అది వాళ్లను ఎంతో ఆకట్టుకుంటుంది.

ధర్మశాస్త్రం ప్రకారం, ఇశ్రాయేలీయులు ఆలయంలో జంతు బలులు అర్పించాలి. యెరూషలేముకు వచ్చేవాళ్లకు అక్కడ ఉన్నన్ని రోజులు ఆహారం కావాలి. కాబట్టి, దూర ప్రాంతం నుండి వచ్చేవాళ్లు తమ వెంట తెచ్చుకున్న డబ్బుతో ‘ఎద్దుల్ని, గొర్రెల్ని, మేకల్ని,’ అక్కడున్నప్పుడు అవసరమయ్యే ఇతర వస్తువుల్ని కొనుక్కోవడాన్ని ధర్మశాస్త్రం అనుమతించింది. (ద్వితీయోపదేశకాండం 14:24-26) అయితే యెరూషలేములోని వ్యాపారస్థులు జంతువుల్ని, పక్షుల్ని ఏకంగా ఆలయంలోని పెద్ద ప్రాంగణంలోకి తెచ్చి అమ్ముతున్నారు. వాళ్లలో కొంతమంది, వాటిని ఎక్కువ ధరలకు అమ్ముతూ ప్రజల్ని మోసం చేస్తున్నారు.

అది చూసి యేసుకు చాలా కోపం వచ్చింది. ఆయన డబ్బు మార్చేవాళ్ల నాణేల్ని, వాళ్ల బల్లల్ని కింద పడేసి వాళ్లను బయటికి తరిమేశాడు. తర్వాత ఇలా అన్నాడు: “వీటిని ఇక్కడి నుండి తీసుకెళ్లండి! నా తండ్రి మందిరాన్ని వ్యాపార స్థలంగా మార్చకండి!”—యోహాను 2:16.

అది చూసినప్పుడు, దేవుని కుమారుని గురించిన ఈ ప్రవచనం శిష్యులకు గుర్తొచ్చింది: “నీ మందిరం విషయంలో నాకున్న ఆసక్తి మండుతున్న అగ్నిలా ఉంటుంది.” అయితే యూదులు యేసును, “నువ్వు ఈ పనులు చేస్తున్నావు కదా, వీటిని చేసే హక్కు నీకుందని నిరూపించుకోవడానికి ఏ అద్భుతం చేస్తావు?” అని అడిగారు. అప్పుడు యేసు, “ఈ ఆలయాన్ని పడగొట్టండి, మూడు రోజుల్లో నేను దాన్ని లేపుతాను” అని జవాబిచ్చాడు.—యోహాను 2:17-19; కీర్తన 69:9.

యేసు యెరూషలేము ఆలయం గురించి మాట్లాడుతున్నాడని అనుకొని యూదులు ఆయన్ని ఇలా అడిగారు: “ఈ ఆలయాన్ని కట్టడానికి 46 సంవత్సరాలు పట్టింది, నువ్వు మూడు రోజుల్లో దాన్ని లేపుతావా?” (యోహాను 2:20) అయితే యేసు ఇక్కడ తన శరీరాన్నే ఆలయం అని అన్నాడు. మూడు సంవత్సరాల తర్వాత, అంటే యేసు పునరుత్థానం అయినప్పుడు శిష్యులు ఈ మాటల్ని గుర్తుచేసుకుంటారు.