కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 19

‘పరిశుద్ధ మర్మంలోని దేవుని జ్ఞానము’

‘పరిశుద్ధ మర్మంలోని దేవుని జ్ఞానము’

1, 2.ఏ “పరిశుద్ధ మర్మము”పట్ల మనకు ఆసక్తి ఉండాలి, ఎందుకుండాలి?

 మర్మాలు! అవి కుతూహలం కలిగించేవిగా, ఉత్సుకత రేపేవిగా, చిక్కుముడులతో ఉంటాయి కాబట్టి వాటిని రహస్యంగా ఉంచడం మానవులకు తరచూ కష్టంగా ఉంటుంది. అయితే బైబిలు ఇలా చెబుతోంది: “సంగతి మరుగుచేయుట దేవునికి ఘనత.” (సామెతలు 25:2) అవును, సర్వాధికార పాలకునిగా, సృష్టికర్తగా యెహోవా కొన్ని విషయాలను మానవులకు వెల్లడిచేయడానికి సముచితమైన సమయమొచ్చే వరకు వాటిని న్యాయబద్ధంగానే మర్మంగా ఉంచుతాడు.

2 అయితే యెహోవా తన వాక్యంలో వెల్లడి చేసిన, ఉత్సుకత రేపే, కుతూహలం కలిగించే మర్మం ఒకటి ఉంది. అది “తన [దేవుని] చిత్తమునుగూర్చిన [“పరిశుద్ధ,” NW] మర్మము” అని పిలువబడింది. (ఎఫెసీయులు 1:8-9) దాని గురించి తెలుసుకోవడం, మీ కుతూహలాన్ని తీర్చడం కంటే ఎక్కువే చేస్తుంది. ఈ మర్మం గురించిన పరిజ్ఞానం రక్షణకు దారితీయడమే కాకుండా యెహోవా జ్ఞాన బాహుళ్యతా అంతర్దృష్టిని కూడా కొంతమేరకు అందిస్తుంది.

క్రమేణ వెల్లడిచేయబడింది

3, 4.ఆదికాండము 3:15​లో వ్రాయబడివున్న ప్రవచనం ఎలా నిరీక్షణ ఇచ్చింది, దీనిలో ఎలాంటి రహస్యం లేదా “పరిశుద్ధ మర్మము” ఉంది?

3 ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు పరిపూర్ణ మానవులు నివసించే భూ పరదైసును స్థాపించాలనే యెహోవా సంకల్పం అడ్డుకోబడినట్లు అనిపించి ఉండవచ్చు. అయితే దేవుడు వెంటనే ఆ సమస్యపై దృష్టి సారించాడు. ఆయనిలా అన్నాడు: “నీకును [సర్పమునకును] స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువు.”—ఆదికాండము 3:15.

4 ఇవి చిక్కుముడిగా, మార్మికంగా ఉన్న మాటలు. ఈ స్త్రీ ఎవరు? సర్పం ఎవరు? సర్పం తలమీద కొట్టే ఆ “సంతానము” ఎవరు? ఆదాము హవ్వలు కేవలం ఊహించగలరు. అయినప్పటికీ, ఆ అవిశ్వాస దంపతుల సంతానంలో నమ్మకంగా ఉండే వారెవరికైనా దేవుని మాటలు నిరీక్షణనిచ్చాయి. నీతి ఘనవిజయం సాధిస్తుంది. యెహోవా సంకల్పం నిజమవుతుంది. కానీ ఎలా? అదే మర్మం! బైబిలు దానిని ‘పరిశుద్ధ మర్మంలోని దేవుని జ్ఞానము, మరుగైయున్న జ్ఞానము’ అని అంటోంది.—1 కొరింథీయులు 2:7.

5.యెహోవా తన మర్మాలను ప్రగతిదాయకంగా ఎందుకు వెల్లడించాడో సోదాహరణంగా చెప్పండి.

5 “మర్మములను బయలుపరచగల” వానిగా యెహోవా ఈ మర్మం స్పష్టం కావడానికి సంబంధించిన తగినన్ని వివరాలను చివరకు వెల్లడిచేస్తాడు. (దానియేలు 2:28) కానీ ఆయన క్రమేణ, ప్రగతిదాయకంగా వెల్లడిచేస్తాడు. ఉదాహరణకు, “నాన్నగారు, నేనెక్కడనుండి వచ్చాను?” అని ఒక చిన్నపిల్లవాడు అడిగే ప్రశ్నకు ప్రేమగల తండ్రి ప్రత్యుత్తరమిచ్చే విధానం గురించి మనం ఆలోచించవచ్చు. జ్ఞానవంతుడైన తండ్రి ఆ చిన్న పిల్లవాడు గ్రహించగలిగినంత సమాచారమే ఇస్తాడు. ఆ పిల్లవాడు ఎదిగేకొలది, ఆ తండ్రి అతనికి మరిన్ని విషయాలు చెబుతాడు. అదే విధంగా, తన చిత్తాన్ని, సంకల్పాలను వెల్లడిచేస్తే గ్రహించడానికి తన ప్రజలు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారో యెహోవా తీర్మానిస్తాడు.—సామెతలు 4:18; దానియేలు 12:4.

6.(ఎ)ఒక నిబంధన లేదా ఒప్పందం ఏ సంకల్పం కొరకు పనిచేస్తుంది? (బి) యెహోవా చొరవ తీసుకొని మానవులతో నిబంధనలు చేయడం ఎందుకు గమనార్హమైన విషయం?

6 అలాంటి అంశాలను యెహోవా ఎలా వెల్లడిచేశాడు? ఎక్కువ భాగం వెల్లడిచేయడానికి ఆయన వరుసగా నిబంధనలను లేదా ఒప్పందాలను ఉపయోగించాడు. మీరు బహుశా ఒక ఇల్లు కొనడానికో లేదా డబ్బు అప్పు తీసుకోవడానికో ఇవ్వడానికో ఎప్పుడో ఒకప్పుడు ఏదోక విధమైన ఒప్పందం చేసుకొని ఉంటారు. అలాంటి ఒప్పందం, పరస్పరం అంగీకరించిన షరతులు నెరవేర్చబడతాయనడానికి న్యాయపరమైన హామీ ఇస్తుంది. కానీ యెహోవా మానవులతో లాంఛనప్రాయంగా నిబంధనలు లేదా ఒప్పందాలు ఎందుకు చేసుకోవాలి? నిశ్చయంగా, ఆయన మాటే ఆయన వాగ్దానాలకు సరిపడేంత హామీ ఇస్తుంది. అది నిజమే, అయినప్పటికీ దేవుడు అనేక సందర్భాల్లో దయాపూర్వకంగా తన మాటలకు చట్టబద్ధమైన ఒప్పందాలతో బలాన్ని చేకూర్చాడు. ఉక్కు కవచంలాంటి ఈ ఒడంబడికలు, యెహోవా వాగ్దానాలను నమ్మేందుకు అపరిపూర్ణ మానవులమైన మనకు బలమైన ఆధారాన్నిస్తాయి.—హెబ్రీయులు 6:16-18.

అబ్రాహాముతో నిబంధన

7, 8.(ఎ)అబ్రాహాముతో యెహోవా ఎలాంటి నిబంధన చేశాడు, పరిశుద్ధ మర్మంపై ఎలాంటి వెలుగు ప్రకాశింపజేశాడు? (బి) వాగ్దత్త సంతానం వచ్చే వంశాన్ని యెహోవా క్రమేణ ఎలా వెల్లడిచేశాడు?

7 పరదైసు నుండి మానవుడు వెళ్లగొట్టబడిన రెండువేల సంవత్సరాల కంటే ఎక్కువ కాలం తర్వాత యెహోవా తన నమ్మకమైన సేవకుడైన అబ్రాహాముకు ఇలా చెప్పాడు: “ఆకాశ నక్షత్రములవలె . . . నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను; నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును.” (ఆదికాండము 22:17, 18) ఇది వాగ్దానం మాత్రమే కాదు; యెహోవా దీనిని న్యాయబద్ధమైన నిబంధనగా క్రమపరచి తన అవిచ్ఛిత ప్రమాణం ద్వారా దానికి బలం చేకూర్చాడు. (ఆదికాండము 17:1, 2; హెబ్రీయులు 6:13-15) మానవాళిని ఆశీర్వదించేందుకు సర్వాధికార ప్రభువే నిజానికి ఒప్పందం కుదుర్చుకోవడం ఎంత అసాధారణమో గదా!

“ఆకాశ నక్షత్రములవలె . . . నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను”

8 వాగ్దత్త సంతానం అబ్రాహాము సంతానం కాబట్టి ఆయన మానవునిగా వస్తాడని అబ్రాహాము నిబంధన వెల్లడిచేసింది. కానీ ఆయన ఎవరై ఉంటాడు? కొంతకాలానికి, అబ్రాహాము కుమారుల్లో ఇస్సాకు ఆ సంతానానికి పితరునిగా ఉంటాడని యెహోవా వెల్లడిచేశాడు. ఇస్సాకు ఇద్దరు కుమారుల్లో యాకోబు ఎంచుకోబడ్డాడు. (ఆదికాండము 21:12; 28:13, 14) ఆ తర్వాత, యాకోబు తన 12 మంది కుమారుల్లో ఒకని గురించి ఈ ప్రవచనార్థక మాటలు పలికాడు: “షిలోహు [అది ఎవరికి చెందుతుందో ఆయన] వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు, అతని కాళ్ల మధ్యనుండి రాజదండము తొలగదు; ప్రజలు అతనికి విధేయులై యుందురు.” (ఆదికాండము 49:​10) అప్పుడు, ఆ సంతానం యూదా వంశం నుండి వచ్చిన రాజై ఉంటాడని తెలిసింది!

ఇశ్రాయేలుతో నిబంధన

9, 10.(ఎ)ఇశ్రాయేలు జనాంగంతో యెహోవా ఎలాంటి నిబంధన చేశాడు, ఆ నిబంధన ఎలాంటి కాపుదలనిచ్చింది? (బి) మానవాళి విమోచన క్రయధన అవసరతను ఆ ధర్మశాస్త్రం ఎలా ప్రదర్శించింది?

9 పరిశుద్ధ మర్మం గురించిన మరిన్ని విషయాలు వెల్లడిచేసేందుకు రంగం సిద్ధం చేయడానికి, సా.శ.పూ. 1513లో యెహోవా ఒక ఏర్పాటుచేశాడు. అబ్రాహాము సంతానమైన ఇశ్రాయేలు జనాంగంతో ఆయన ఒక నిబంధన చేశాడు. ఈ మోషే ధర్మశాస్త్ర నిబంధన ఇప్పుడు వాడుకలో లేకపోయినా, వాగ్దత్త సంతానాన్ని తీసుకొచ్చే యెహోవా సంకల్పంలో ఒక ఆవశ్యక పాత్ర పోషించింది. ఏ  విధంగా? మూడు విషయాలు పరిశీలించండి. మొదటిది, ఆ ధర్మశాస్త్రం రక్షణనిచ్చే గోడ మాదిరిగా ఉండింది. (ఎఫెసీయులు 2:14) దాని నీతి కట్టడలు యూదులకు, అన్యులకు మధ్య అవరోధంగా పనిచేశాయి. ఆ విధంగా, ఆ ధర్మశాస్త్రం వాగ్దత్త సంతానపు వంశావళిని కాపాడేందుకు సహాయం చేసింది. చాలామేరకు అలాంటి కాపుదల మూలంగానే, యూదా గోత్రంలో మెస్సీయ జన్మించవలసిన దేవుని నిర్ణయకాలం వచ్చేసరికి ఆ జనాంగం ఇంకా ఉనికిలోనే ఉంది.

10 రెండవది, మానవాళి విమోచన క్రయధన అవసరతను ఆ ధర్మశాస్త్రం సంపూర్ణంగా ప్రదర్శించింది. పరిపూర్ణ ధర్మశాస్త్రంగా అది, దానికి పూర్తిగా కట్టుబడి ఉండలేని పాపభరిత మానవుల అసమర్థతను బయటపెట్టింది. ఆ విధంగా, “ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చువరకు అది అతిక్రమములను” వెల్లడిచేయడానికి పనిచేసింది. (గలతీయులు 3:19) జంతు బలుల ద్వారా ఆ ధర్మశాస్త్రం పాపాలకు తాత్కాలిక పరిహారాన్ని ఏర్పాటుచేసింది. కానీ పౌలు వ్రాసినట్లుగా, “ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము” కాబట్టి ఈ బలులు క్రీస్తు విమోచన క్రయధన బలికి ఒక ఛాయగా మాత్రమే ఉన్నాయి. (హెబ్రీయులు 10:1-4) అందువల్ల నమ్మకమైన యూదులకు ఆ ధర్మశాస్త్రం ‘క్రీస్తునొద్దకు నడిపిన బాలశిక్షకుడయింది.’—గలతీయులు 3:24.

11.ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకు ఎలాంటి అత్యద్భుత ఉత్తరాపేక్షను అందించింది, కానీ ఒక జనాంగంగా అది దానినెలా పోగొట్టుకుంది?

11 మూడవది, ఆ ధర్మశాస్త్రం ఇశ్రాయేలు జనాంగానికి అత్యద్భుతమైన ఉత్తరాపేక్షనిచ్చింది. వారు ఆ నిబంధనకు నమ్మకంగా కట్టుబడి ఉంటే వారు “యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను” ఉంటారని యెహోవా వారికి చెప్పాడు. (నిర్గమకాండము 19:5, 6) శరీర సంబంధ ఇశ్రాయేలు చివరకు పరలోక రాజ్య యాజకుల తొలి సభ్యులను అందించింది. కానీ ఒక జనాంగంగా ఇశ్రాయేలు ధర్మశాస్త్ర నిబంధనకు వ్యతిరేకంగా తిరుగుబాటుచేసి, సంతానమైన మెస్సీయను తిరస్కరించి ఆ ఉత్తరాపేక్షను పోగొట్టుకుంది. అందువల్ల, రాజ్య యాజకుల సంఖ్యను ఎవరు పూర్తిచేస్తారు? ఆశీర్వదించబడిన ఆ జనాంగం వాగ్దత్త సంతానంతో ఎలాంటి సంబంధం కలిగివుంటుంది? పరిశుద్ధ మర్మానికి సంబంధించిన ఆ అంశాలు దేవుని నిర్ణయకాలంలో వెల్లడిచేయబడతాయి.

దావీదు రాజ్య నిబంధన

12.దావీదుతో యెహోవా ఎలాంటి నిబంధన చేశాడు, దేవుని పరిశుద్ధ మర్మంపై అదెలాంటి వెలుగు ప్రకాశింపజేసింది?

12 యెహోవా సా.శ.పూ. 11వ శతాబ్దంలో, మరో నిబంధనచేసి ఆ పరిశుద్ధ మర్మంపై మరింత వెలుగు ప్రకాశింపజేశాడు. నమ్మకమైన దావీదు రాజుకు ఆయనిలా వాగ్దానం చేశాడు: ‘నీ తరువాత నీ గర్భములోనుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను.’ (2 సమూయేలు 7:12, 13; కీర్తన 89:3) ఇప్పుడు వాగ్దత్త సంతానం దావీదు కుటుంబంలో నుండి ఉద్భవిస్తుందని స్పష్టమైంది. అయితే మామూలు మానవుడు “నిత్యము” పరిపాలన చేయగలడా? (కీర్తన 89:20, 29, 34-36) అలాంటి మానవ రాజు పాపమరణాల నుండి మానవాళిని విమోచించగలడా?

13, 14.కీర్తన 110 ప్రకారం యెహోవా తన అభిషిక్త రాజుకు ఏ వాగ్దానం చేశాడు? (బి) యెహోవా ప్రవక్తల ద్వారా, సంతానపు రాకడ గురించి ఇంకా ఎలాంటి విషయాలు వెల్లడిచేయబడ్డాయి?

13 దావీదు ప్రేరేపించబడి ఇలా వ్రాశాడు: “ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు —నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. —మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు, ఆయన మాట తప్పనివాడు.” (కీర్తన 110:1, 4) దావీదు మాటలు నేరుగా వాగ్దత్త సంతానానికి లేదా మెస్సీయకు అన్వయించబడ్డాయి. (అపొస్తలుల కార్యములు 2:35, 36) ఈ రాజు యెరూషలేము నుండి కాదుగాని పరలోకంలో యెహోవా “కుడి పార్శ్వము” నుండి పరిపాలిస్తాడు. అది ఆయనకు కేవలం ఇశ్రాయేలు దేశం మీదే కాదుగాని యావత్‌ భూమ్మీద అధికారమిస్తుంది. (కీర్తన 2:6-8) ఇక్కడ మరిన్ని విషయాలు వెల్లడిచేయబడ్డాయి. మెస్సీయ ‘మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడై’ ఉంటాడని యెహోవా ప్రమాణం చేశాడని గమనించండి. అబ్రాహాము కాలంలో రాజుగా యాజకునిగా సేవచేసిన మెల్కీసెదెకు మాదిరిగా, రాబోయే సంతానం రాజుగా మరియు యాజకునిగా సేవచేయడానికి నేరుగా దేవునిచే నియమించబడతాడు.—ఆదికాండము 14:17-20.

14 సంవత్సరాలు గడుస్తుండగా, యెహోవా తన పరిశుద్ధ మర్మాన్ని మరింత విశదంగా వెల్లడిచేయడానికి తన ప్రవక్తలను ఉపయోగించాడు. ఉదాహరణకు, ఆ సంతానం బలిగా మరణిస్తాడని యెషయా వెల్లడించాడు. (యెషయా 53:3-12) మెస్సీయ జన్మస్థలాన్ని మీకా ముందే చెప్పాడు. (మీకా 5:2) ఆ సంతానం వచ్చే, చనిపోయే ఖచ్చితమైన సమయాన్ని సైతం దానియేలు ప్రవచించాడు.—దానియేలు 9:24-27.

పరిశుద్ధ మర్మం వెల్లడి చేయబడింది!

15, 16.(ఎ)యెహోవా కుమారుడెలా ‘స్త్రీయందు పుట్టాడు’? (బి) యేసు తన మానవ తలిదండ్రుల నుండి వారసత్వంగా ఏమి పొందాడు, వాగ్దత్త సంతానంగా ఆయనెప్పుడు వచ్చాడు?

15 ఆ సంతానం నిజంగా వచ్చేవరకు, ఈ ప్రవచనాలు ఎలా నెరవేరతాయనేది మర్మంగానే ఉండిపోయింది. గలతీయులు 4:4 ఇలా చెబుతోంది: “కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను; ఆయన స్త్రీయందు పు[ట్టెను].” సా.శ.పూ. 2వ సంవత్సరంలో యూదా కన్యకయైన మరియతో దేవదూత ఇలా అన్నాడు: “ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు; ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. . . . పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.”—లూకా 1:31, 32, 35.

16 ఆ తర్వాత, యెహోవా తన కుమారుని జీవాన్ని పరలోకం నుండి మరియ గర్భానికి మార్చాడు, అలా యేసు ఒక స్త్రీ ద్వారా జన్మించాడు. మరియ అపరిపూర్ణురాలు. అయినప్పటికీ, ఆయన మరియ నుండి అపరిపూర్ణతను వారసత్వంగా పొందలేదు ఎందుకంటే ఆయన “దేవుని కుమారుడు.” అదే సమయంలో దావీదు వంశస్థులైన యేసు మానవ తలిదండ్రులు, దావీదు వంశస్థునిగా ఆయనకు సహజమైన, చట్టబద్ధమైన హక్కులు సంక్రమించేటట్లు చేశారు. (అపొస్తలుల కార్యములు 13:22, 23) సా.శ. 29లో యేసు బాప్తిస్మమప్పుడు యెహోవా ఆయనను పరిశుద్ధాత్మతో అభిషేకించి ఇలా అన్నాడు: “ఈయనే నా ప్రియ కుమారుడు.” (మత్తయి 3:16, 17) చివరకు, ఆ సంతానం రానేవచ్చింది! (గలతీయులు 3:16) అది పరిశుద్ధ మర్మం గురించి మరింత వెల్లడిచేయవలసిన సమయం.—2 తిమోతి 1:9.

17.ఆదికాండము 3:15​కున్న భావంపై వెలుగెలా ప్రకాశింపజేయబడింది?

17 యేసు తన పరిచర్యా కాలంలో ఆదికాండము 3:15​లోని సర్పాన్ని సాతానుగా, ఆ సర్పసంతానాన్ని సాతాను అనుచరులుగా గుర్తించాడు. (మత్తయి 23:33; యోహాను 8:44) ఆ తర్వాత, వీరందరు ఎలా శాశ్వతంగా నలగగొట్టబడతారో వెల్లడిచేయబడింది. (ప్రకటన 20:1-3, 10, 15) ఆ స్త్రీ ‘పైనున్న యోరూషలేముగా’ అంటే ఆత్మసంబంధ ప్రాణులతో కూడిన యెహోవా పరలోక, భార్యవంటి సంస్థగా గుర్తించబడింది. aగలతీయులు 4:26; ప్రకటన 12:1-6.

కొత్త నిబంధన

18.‘కొత్త నిబంధన’ సంకల్పమేమిటి?

18 యేసు తన మరణానికి ముందు రాత్రి ‘కొత్త నిబంధన’ గురించి తన నమ్మకమైన శిష్యులకు చెప్పినప్పుడు బహుశా అన్నింటికంటే అత్యంత నాటకీయ విషయం వెల్లడయింది. (లూకా 22:20) దానికి ముందున్న మోషే ధర్మశాస్త్ర నిబంధనవలెనే, ఈ కొత్త నిబంధన “యాజక రూపమైన రాజ్యమును” ఉత్పత్తిచేయాలి. (నిర్గమకాండము 19:6; 1 పేతురు 2:9) అయితే, ఈ నిబంధన శరీర సంబంధ జనాంగాన్ని కాదుగాని ఆధ్యాత్మిక జనాంగాన్ని అంటే కేవలం క్రీస్తు నమ్మకమైన అభిషిక్త అనుచరులతో రూపొందించబడిన “దేవుని ఇశ్రాయేలును” స్థిరపరుస్తుంది. (గలతీయులు 6:16) కొత్త నిబంధనలోని ఈ భాగస్థులు, మానవజాతిని ఆశీర్వదించడంలో యేసుతో పాలుపంచుకుంటారు.

19.(ఎ)‘యాజక రూపమైన రాజ్యమును’ ఉత్పన్నం చేయడంలో కొత్త నిబంధన ఎందుకు విజయం సాధిస్తుంది? (బి) అభిషిక్త క్రైస్తవులు “నూతన సృష్టి” అని ఎందుకు పిలువబడ్డారు, క్రీస్తుతోపాటు పరలోకంలో ఎంతమంది సేవచేస్తారు?

19 అయితే మానవాళిని ఆశీర్వదించడానికి ‘యాజక రూపమైన రాజ్యమును’ ఉత్పన్నం చేయడంలో కొత్త నిబంధన ఎందుకు విజయం సాధిస్తుంది? ఎందుకంటే క్రీస్తు శిష్యులను పాపులుగా కొట్టివేయడానికి బదులుగా ఆయన బలి ద్వారా అది వారికి పాప క్షమాపణను సాధ్యం చేస్తుంది. (యిర్మీయా 31:31-34) యెహోవా ఎదుట వారు ఒకసారి నీతియుక్త స్థానాన్ని పొందిన తర్వాత, ఆయన వారిని తన పరలోక కుటుంబానికి దత్తత తీసుకొని వారిని తన పరిశుద్ధాత్మతో అభిషేకిస్తాడు. (రోమీయులు 8:15-17; 2 కొరింథీయులు 1:21) ఆ విధంగా, వారు ‘పరలోకమందు భద్రపరచబడిన జీవముతో కూడిన నిరీక్షణ కలుగునట్లు మళ్లీ జన్మించే’ అనుభవాన్ని చవిచూస్తారు. (1 పేతురు 1:3-5) అలాంటి ఉత్కృష్టమైన హోదా మానవులకు పూర్తిగా కొత్త కాబట్టి ఆత్మ జనిత అభిషిక్త క్రైస్తవులు “నూతన సృష్టి” అని పిలువబడ్డారు. (2 కొరింథీయులు 5:17) చివరకు 1,44,000 మంది విమోచించబడిన మానవాళిపై పరలోకం నుండి పరిపాలించడంలో భాగం వహిస్తారని బైబిలు వెల్లడిచేస్తోంది.—ప్రకటన 5:9, 10; 14:1-4.

20.(ఎ)సా.శ. 36లో పరిశుద్ధ మర్మానికి సంబంధించిన ఏ విషయం వెల్లడించబడింది? (బి) అబ్రాహాముకు వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలను ఎవరు అనుభవిస్తారు?

20 యేసుతోపాటు ఈ అభిషిక్తులు “అబ్రాహాముయొక్క సంతాన[ముగా]” తయారవుతారు. b (గలతీయులు 3:29) మొదట శరీర సంబంధ యూదులు ఎంపికచేయబడ్డారు. అయితే సా.శ. 36లో పరిశుద్ధ మర్మం యొక్క మరో అంశం వెల్లడిచేయబడింది అదేమిటంటే అన్యులు లేదా యూదేతరులు సైతం పరలోక నిరీక్షణలో పాలుపంచుకుంటారు. (రోమీయులు 9:6-8; 11:25, 26; ఎఫెసీయులు 3:5, 6) అబ్రాహాముకు వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలను అభిషిక్త క్రైస్తవులు మాత్రమే అనుభవిస్తారా? లేదు, ఎందుకంటే యేసు బలి సర్వలోకానికి ప్రయోజనాలు తెస్తుంది. (1 యోహాను 2:2) సాతాను విధానాంతం నుండి తప్పించుకొనే అసంఖ్యాక “గొప్ప సమూహము” ఒకటి ఉంటుందని తగిన కాలంలో యెహోవా వెల్లడించాడు. (ప్రకటన 7:9, 14) పరదైసు భూమిపై నిత్యజీవ ఉత్తరాపేక్షతో మరింత బహుళసంఖ్యలో ప్రజలు పునరుత్థానం చేయబడతారు.—లూకా 23:43; యోహాను 5:28, 29; ప్రకటన 20:11-15; 21:3, 4.

దేవుని జ్ఞానము, పరిశుద్ధ మర్మము

21, 22.యెహోవా పరిశుద్ధ మర్మము ఏయే విధాలుగా ఆయన జ్ఞానాన్ని కనబరచింది?

21 పరిశుద్ధ మర్మము ‘దేవుని నానావిధమైన జ్ఞానాన్ని’ ఆశ్చర్యకరమైన రీతిలో ప్రదర్శించింది. (ఎఫెసీయులు 3:8-10) ఈ మర్మాన్ని రూపొందించడంలో, దానిని క్రమేపీ వెల్లడిచేయడంలో యెహోవా ఎంతటి జ్ఞానాన్ని ప్రదర్శించాడో గదా! మానవులు తమ హృదయ నిజ స్థితిని కనబరచడానికి అనుమతిస్తూ ఆయన జ్ఞానయుక్తంగా వారి పరిమితులను పరిగణలోకి తీసుకున్నాడు.—కీర్తన 103:14.

22 యేసును రాజుగా ఎన్నుకోవడంలో కూడా యెహోవా సాటిలేని జ్ఞానాన్ని చూపాడు. విశ్వంలోని ఏ ఇతర ప్రాణికంటే కూడా యెహోవా కుమారుడే ఎక్కువ నమ్మకస్థుడు. రక్తమాంసాలున్న మానవునిగా జీవించడంలో యేసు వివిధ ప్రతికూల పరిస్థితులను చవిచూశాడు. ఆయన మానవ సమస్యలను పూర్తిగా అర్థంచేసుకుంటాడు. (హెబ్రీయులు 5:7-9) మరి యేసు సహ పరిపాలకుల సంగతేమిటి? శతాబ్దాల కాలంలో, అన్ని జాతుల నుండి, భాషల నుండి, నేపథ్యాలనుండి ఎంపికచేయబడిన స్త్రీపురుషులు అభిషేకించబడ్డారు. వారు ఎదుర్కొనని, అధిగమించని సమస్య అంటూ ఏదీలేదు. (ఎఫెసీయులు 4:22-24) కనికరంగల రాజులు, యాజకులు అయిన వీరి పాలనక్రింద జీవించడం ఎంత ఆనందదాయకమో గదా!

23.యెహోవా పరిశుద్ధ మర్మానికి సంబంధించి క్రైస్తవులకు ఎలాంటి ఆధిక్యత ఉంది?

23 అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: ‘యుగములలోను తరములలోను మరుగు చేయబడియున్న మర్మము పరిశుద్ధులకు బయలుపరచబడెను.’ (కొలొస్సయులు 1:25-27) అవును, యెహోవా అభిషిక్త పరిశుద్ధులు ఈ పరిశుద్ధ మర్మము గురించి ఎంతో అర్థంచేసుకొని ఆ జ్ఞానాన్ని లక్షలాది మందితో పంచుకున్నారు. మనందరికి ఎంత గొప్ప ఆధిక్యత ఉందో గదా! యెహోవా “తన చిత్తమునుగూర్చిన [“పరిశుద్ధ,” NW] మర్మమును మనకు తెలియజే[శాడు].” (ఎఫెసీయులు 1:8) ఈ అద్భుత మర్మాన్ని మనం ఇతరులతో పంచుకుంటూ, వారు కూడా యెహోవా దేవుని జ్ఞాన బాహుళ్యతను చూసేందుకు సహాయపడదాం.

a “దైవభక్తిని గూర్చిన [“పరిశుద్ధ,” NW] మర్మము” కూడా యేసు ద్వారా వెల్లడిచేయబడింది. (1 తిమోతి 3:16) యెహోవాపట్ల ఎవరైనా పరిపూర్ణ యథార్థతను కాపాడుకోగలరా లేదా అనేది చాలాకాలంగా ఒక రహస్యంగా, మర్మంగా ఉండింది. దానికి జవాబును యేసు వెల్లడిచేశాడు. సాతాను తనమీదికి తీసుకొచ్చిన ప్రతీ పరీక్షలో ఆయన తన యథార్థతను కాపాడుకున్నాడు.—మత్తయి 4:1-11; 27:26-50.

b అదే గుంపుతో యేసు ‘రాజ్యము కొరకైన నిబంధన’ కూడా చేశాడు. (లూకా 22:29, 30, NW) నిజానికి, అబ్రాహాము సంతానంలో రెండవ భాగంగా తనతోపాటు పరలోకంలో పరిపాలించేందుకు, ‘చిన్నమందతో’ యేసు ఈ నిబంధనను చేశాడు.—లూకా 12:32.