పీఠిక
ప్రియమైన పాఠకులకు:
మీరు దేవునికి సన్నిహితంగా ఉన్నట్లు భావిస్తున్నారా? చాలామందికి, అది ఏ మాత్రం సాధ్యం కాదనిపిస్తుంది. ఆయన అందని దూరంలో ఉన్నాడని కొందరు భయపడతారు; మరికొందరు దేవునికి సన్నిహితం కావడానికి తాము అర్హులమే కాదని భావిస్తారు. అయితే, ‘దేవునికి సన్నిహితమవండి, అప్పుడాయన మీకు సన్నిహితమవుతాడు’ అని బైబిలు ప్రేమపూర్వకంగా మనకు ఉద్బోధిస్తోంది. (యాకోబు 4:8, NW) “నీ దేవుడనైన యెహోవానగు నేను—భయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను” అని ఆయన తన ఆరాధకులకు హామీ ఇస్తున్నాడు.—యెషయా 41:13.
దేవునితో అంతటి సన్నిహిత సంబంధాన్ని మనమెలా ఏర్పరచుకోవచ్చు? మనమెవరితో స్నేహాన్ని పెంపొందింపజేసుకోవాలన్నా అది ఆ వ్యక్తిని తెలుసుకొని, అతని విశేష లక్షణాలను ప్రశంసిస్తూ వాటిని విలువైనవిగా పరిగణించడంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి బైబిల్లో వెల్లడిచేయబడిన దేవుని లక్షణాలు, విధానాలు అధ్యయనం చేయడానికి ముఖ్యమైన అంశాలు. యెహోవా తన ప్రతీ లక్షణాన్ని కనబరచిన విధానాన్ని వివేచించడం, వాటిని యేసుక్రీస్తు పరిపూర్ణంగా ఎలా ప్రతిబింబించాడో గమనించడం, మనం కూడా వాటినెలా పెంపొందించుకోవచ్చో అర్థం చేసుకోవడం మనలను దేవునికి సన్నిహితం చేస్తాయి. యెహోవాయే హక్కుదారుడైన, ఆదర్శవంతమైన విశ్వ సర్వాధిపతియని మనం చూస్తాం. అంతేకాకుండా, ఆయన మనకందరికీ కావలసిన తండ్రి. శక్తిమంతుడు, న్యాయవంతుడు, జ్ఞానవంతుడు, ప్రేమగలవాడు అయిన ఆయన తన నమ్మకమైన పిల్లలను ఎన్నడూ ఎడబాయడు.
యెహోవా దేవుణ్ణి నిత్యం స్తుతించడానికి జీవించేలా మీరాయనకు మరింత సన్నిహితమవడానికి, ఆయనతో శాశ్వతమైన బంధమేర్పరచుకోవడానికి ఈ పుస్తకం మీకు సహాయం చేయును గాక.
ప్రచురణకర్తలు