అధ్యాయం 16
దేవుని ఎదుట ‘న్యాయముగా నడుచుకోండి’
1-3.(ఎ)మనమెందుకు యెహోవాకు రుణపడి ఉన్నాము? (బి) మన ప్రేమగల రక్షకుడు మననుండి ఏమి అడుగుతున్నాడు?
మునిగిపోతున్న ఒక ఓడలో ఇరుక్కుపోవడాన్ని ఊహించుకోండి. ఇక ఆశ వదులుకోవలసిందేనని మీరు అనుకుంటుండగా, ఒక వ్యక్తి అక్కడకొచ్చి మిమ్మల్ని సురక్షిత ప్రాంతానికి చేర్చాడు. ఆ వ్యక్తి మిమ్మల్ని ప్రమాద స్థలం నుండి దూరంగా తీసుకెళుతూ “మీకు ప్రమాదం తప్పినట్టే” అన్నప్పుడు మీ మనస్సెంత కుదుట పడుతుందో కదా! ఆ వ్యక్తికి మీరు రుణపడివున్నట్టు మీరు భావించరా? నిజం చెప్పాలంటే ఆయనకు మీరు మీ జీవితాన్నే రుణపడి ఉంటారు.
2 కొన్ని విధాల్లో ఇది యెహోవా మనకు చేసినదానిని ఉదహరిస్తోంది. మనం నిశ్చయంగా ఆయనకు రుణపడి ఉన్నాము. నిజానికి ఆయన మన కోసం విమోచన క్రయధనం చెల్లించి పాపమరణాల బంధకాల నుండి మనం రక్షించబడే వీలు కల్పించాడు. ఆ ప్రశస్త బలియందు విశ్వాసం ఉంచినంత కాలం మన పాపాలు క్షమించబడతాయనీ, మన నిరంతర భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందనీ తెలుసుకుని మనం నెమ్మదితో ఉంటాము. (1 యోహాను 1:7; 4:9) మనం 14వ అధ్యాయంలో చూసినట్లుగా, విమోచన క్రయధనం యెహోవా ప్రేమ, న్యాయాల సర్వోన్నత వ్యక్తీకరణ. దానికి మనమెలా ప్రతిస్పందించాలి?
3 మన ప్రేమగల రక్షకుడు తానుగా మననుండి ఏమి అడుగుతున్నాడో పరిశీలించడం మంచిది. మీకా ప్రవక్త ద్వారా యెహోవా ఇలా చెబుతున్నాడు: “మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.” (మీకా 6:8) యెహోవా మననుండి అడిగే వాటిలో “న్యాయముగా నడుచుకొనుట” ఒకటని గమనించండి. మనం న్యాయంగా ఎలా నడుచుకోవచ్చు?
‘యథార్థమైన నీతిని’ అనుసరించండి
4.యెహోవా మనం తన నీతి ప్రమాణాల ప్రకారం జీవించాలని ఆశిస్తాడని మనకెలా తెలుసు?
4 తప్పొప్పుల విషయంలో మనం తన ప్రమాణాల ప్రకారం జీవించాలని యెహోవా ఆశిస్తున్నాడు. ఆయన ప్రమాణాలు న్యాయమైనవీ, నీతిగలవీ కాబట్టి, మనం వాటికి అనుగుణంగా నడుచుకున్నప్పుడు మనం నీతిన్యాయాలను వెంబడిస్తున్నట్లే. “మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి” అని యెషయా 1:17 చెబుతోంది. ‘నీతిని అనుసరించండి’ అని దేవుని వాక్యం మనకు బోధిస్తోంది. (జెఫన్యా 2:3) అలాగే ‘నీతి గలవారై, దేవుని పోలికగా సృష్టించబడిన నవీనస్వభావమును ధరించుకొనుడి’ అని కూడా అది మనకు ఉద్బోధిస్తోంది. (ఎఫెసీయులు 4:24) నిజమైన నీతి, నిజమైన న్యాయం హింసకు, అపవిత్రతకు, లైంగిక దుర్నీతికి చోటివ్వవు ఎందుకంటే ఇవన్నీ పరిశుద్ధమైన దానిని పాడు చేస్తాయి.—కీర్తన 11:5; ఎఫెసీయులు 5:3-5.
5, 6.(ఎ)యెహోవా ప్రమాణాల ప్రకారం జీవించడం మనకెందుకు భారం కాదు? (బి) నీతిని అనుసరించడం ఒక నిర్విరామ ప్రక్రియ అని బైబిలు ఎలా చూపిస్తోంది?
5 యెహోవా నీతి ప్రమాణాల ప్రకారం జీవించడం మనకు భారమా? కాదు. యెహోవావైపు ఆకర్షించబడిన హృదయం ఆయన కోరేవాటిని బట్టి చికాకుపడదు. మనం మన దేవుణ్ణి, ఆయన వ్యక్తిత్వాన్ని ప్రేమిస్తాం కాబట్టి ఆయనను సంతోషపరిచే విధంగా జీవించాలని మనం కోరుకుంటాం. (1 యోహాను 5:3) యెహోవా “నీతిని ప్రేమించువాడు” అని గుర్తుతెచ్చుకోండి. (కీర్తన 11:7) మనం నిజంగా దేవుని న్యాయాన్ని లేదా నీతిని అనుసరించాలనుకుంటే మనం తప్పకుండా యెహోవా ప్రేమించేదానిని ప్రేమించాలి, ఆయన ద్వేషించేదానిని ద్వేషించాలి.—కీర్తన 97:10.
6 నీతిని అనుసరించడం అపరిపూర్ణ మానవులకు అంత సులభం కాదు. మనం ప్రాచీన స్వభావాన్ని దాని పాపభరిత అలవాట్లతోపాటు వదిలేసి నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. ఖచ్చితమైన జ్ఞానం ద్వారా ఆ నవీన స్వభావం “నూతన పరచబడుచున్న[ది]” అని బైబిలు చెబుతోంది. (కొలొస్సయులు 3:9, 10) “నూతన పరచబడుచున్న[ది]” అనే మాటలు నవీన స్వభావాన్ని ధరించుకోవడమనేది ఒక నిర్విరామ ప్రక్రియ అనీ, దానికి పట్టుదలతో కూడిన ప్రయత్నం అవసరమనీ సూచిస్తున్నాయి. సరైనది చేయడానికి మనమెంత కష్టపడి ప్రయత్నించినా, మన పాపపు స్వభావం మనం ఆలోచనలో, మాటలో లేదా క్రియలో కొన్నిసార్లు తొట్రుపడేలా చేస్తుంది.—రోమీయులు 7:14-20; యాకోబు 3:2.
7.నీతిని అనుసరించడంలో మన వైఫల్యాలను మనమే విధంగా దృష్టించాలి?
7 నీతిని అనుసరించడంలో మన ప్రయత్నాల వైఫల్యాలను మనమెలా దృష్టించాలి? నిజమే పాపపు గాంభీర్యతను మనం తక్కువ చేయాలని కోరుకోము. అదే సమయంలో, మన తప్పులు మనలను యెహోవాను సేవించడానికి పనికిరాకుండా చేస్తాయని భావిస్తూ మనమెన్నటికీ మన ప్రయత్నాలు మానుకోకూడదు. కృపగల మన దేవుడు యథార్థంగా పశ్చాత్తాపపడేవారిని తన అనుగ్రహానికి పునరుద్ధరించే ఏర్పాట్లు చేశాడు. అపొస్తలుడైన యోహాను పలికిన ఈ ఓదార్పుకరమైన మాటలు పరిశీలించండి: “మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను.” అయితే వాస్తవిక పరిస్థితి తెలిసి ఆయన ఇంకా ఇలా అన్నాడు: “ఎవడైనను [వారసత్వంగా వచ్చిన అపరిపూర్ణతనుబట్టి] పాపము చేసినయెడల . . . యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు.” (1 యోహాను 2:1) అవును, మనకు పాపపు స్వభావం ఉన్నప్పటికీ మనం యెహోవాకు అంగీకృతమైన విధంగా ఆయనను సేవించే అవకాశాన్ని ఆయన యేసు విమోచన క్రయధన బలి ద్వారా ఏర్పాటు చేశాడు. యెహోవాను సంతోషపరచడానికి మన శాయశక్తులా పనిచేయాలని కోరుకునేలా అది మనల్ని పురికొల్పడం లేదా?
సువార్త మరియు దేవుని న్యాయం
8, 9.సువార్త ప్రకటించడం యెహోవా న్యాయాన్నెలా ప్రదర్శిస్తోంది?
8 ఇతరులకు దేవుని రాజ్య సువార్తను ప్రకటించడంలో సంపూర్ణంగా పాల్గొనడం ద్వారా మనం న్యాయంగా నడుచుకోవచ్చు, నిజానికి దేవుని న్యాయాన్ని అనుకరించవచ్చు. యెహోవా న్యాయానికీ సువార్తకూ మధ్య ఎలాంటి సంబంధముంది?
9 ముందు హెచ్చరిక చేయకుండా యెహోవా ఈ దుష్ట విధానాన్ని అంతమొందించడు. అంత్యకాలంలో ఏమి జరుగుతుందో ప్రవచిస్తూ యేసు ఇలా చెప్పాడు: “సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను.” (మార్కు 13:10; మత్తయి 24:3) ఇక్కడ “ముందుగా” అనే మాట ప్రపంచవ్యాప్త ప్రకటనా పని తర్వాత ఇతర సంఘటనలు జరుగుతాయనే భావాన్నిస్తోంది. ఆ సంఘటనల్లో ఒకటి ముందే తెలియజేయబడిన మహా శ్రమ, అప్పుడు దుష్టులు నాశనం చేయబడి నీతియుక్త నూతనలోకానికి మార్గం సిద్ధం చేయబడుతుంది. (మత్తయి 24:14, 21, 22) నిశ్చయంగా, యెహోవా దుష్టులకు అన్యాయం చేశాడని ఎవరూ న్యాయంగా నిందించలేరు. ఆయన హెచ్చరించడం ద్వారా అలాంటివారు తమ మార్గాలను మార్చుకొని ఆ నాశనం నుండి తప్పించుకోవడానికి వారికి తగినంత అవకాశమిస్తున్నాడు.—యోనా 3:1-10.
10, 11.సువార్త ప్రకటనలో మనం పాలుపంచుకోవడం దైవిక న్యాయాన్నెలా ప్రతిబింబిస్తుంది?
10 మనం సువార్త ప్రకటించడం దైవిక న్యాయాన్నెలా ప్రదర్శిస్తుంది? మొట్టమొదట, ఇతరులు రక్షణ పొందడానికి సహాయం చేసేందుకు మనం చేయగలిగినదంతా చేయడం సరైనదే. మునిగిపోతున్న ఓడ నుండి రక్షించబడడం గురించిన ఆ ఉదాహరణను మళ్ళీ ఒకసారి పరిశీలించండి. మీరు సురక్షితమైన ఆ పడవలోకి క్షేమంగా చేరుకున్న తర్వాత, ఇంకా నీటిలోవున్న ఇతరులకు మీరు సహాయం చేయాలని ఖచ్చితంగా కోరుకుంటారు. అదే ప్రకారం, ఈ దుష్టలోకపు “నీటిలో” ఇంకా పెనుగులాడుతున్న వారిపట్ల మనకు బాధ్యతవుంది. నిజమే, అనేకులు మన సందేశాన్ని తిరస్కరిస్తారు. అయితే యెహోవా సహనం చూపినంతకాలం, అలాంటివారు ‘మారుమనస్సు పొంది,’ రక్షించబడడానికి వారికి అవకాశమిచ్చే బాధ్యత మనకుంది.—2 పేతురు 3:9.
11 మనం కలిసే వారందరికీ సువార్త ప్రకటించడం ద్వారా, మనం మరో ప్రాముఖ్యమైన రీతిలో న్యాయాన్ని ప్రదర్శిస్తాం, అదేమిటంటే నిష్పక్షపాతంగా వ్యవహరించడం. “దేవుడు పక్షపాతి కాడు. . . . ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును” అని గుర్తుతెచ్చుకోండి. (అపొస్తలుల కార్యములు 10:34, 35) మనమాయన న్యాయాన్ని అనుకరించాలంటే, మనం ప్రజల గురించి ఏమీ తెలుసుకోక ముందే ఒక నిర్ణయానికి రాకూడదు. బదులుగా, ప్రజల జాతి, సామాజిక హోదా లేదా ఆర్థిక స్థితి ఏదైనప్పటికీ వారికి సువార్త ప్రకటించడంలో మనం పాలుపంచుకోవాలి. ఆ విధంగా మనం, వినేవారందరికీ సువార్త విని ప్రతిస్పందించడానికి అవకాశమిస్తాము.—రోమీయులు 10:11-13.
ఇతరులను మనమెలా చూస్తాము?
12, 13.(ఎ)మనం తొందరపడి ఇతరులకు ఎందుకు తీర్పుతీర్చకూడదు? (బి) “తీర్పు తీర్చకుడి,” “నేరము మోపకుడి” అని యేసు ఇచ్చిన ఉపదేశ భావమేమిటి? (అధస్సూచి కూడా చూడండి.)
12 యెహోవా మనల్నెలా చూస్తున్నాడో అదేరీతిలో మనం ఇతరులను చూడడం ద్వారా కూడా మనం న్యాయంగా నడుచుకోవచ్చు. ఇతరుల తప్పులను విమర్శిస్తూ వారి ఉద్దేశాలను ప్రశ్నిస్తూ వారికి తీర్పు తీర్చడం చాలా సులభం. అయితే మన ఉద్దేశాలను, తప్పులను యెహోవా నిర్దాక్షిణ్యంగా సూక్ష్మపరీక్ష చేయాలని మనలో ఎవరం కోరుకుంటాము? యెహోవా మనతో అలా వ్యవహరించడం లేదు. కీర్తనకర్త ఇలా పేర్కొన్నాడు: “యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు?” (కీర్తన 130:3) న్యాయం, కనికరం గల మన దేవుడు ఎప్పుడూ మన పొరపాట్లనే చూస్తూ ఉండనందుకు మనం కృతజ్ఞులం కాదా? (కీర్తన 103:8-10) అలాంటప్పుడు ఇతరులను మనమెలా చూడాలి?
13 దేవుని న్యాయంలోని కనికరంగల స్వభావాన్ని మనం గ్రహించినప్పుడు, మనకు నిజంగా సంబంధించని లేదా తక్కువ ప్రాముఖ్యంగల విషయాల్లో మనం తొందరపడి ఇతరులకు తీర్పు తీర్చము. కొండమీది ప్రసంగంలో యేసు ఇలా హెచ్చరించాడు: “మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు.” (మత్తయి 7:1) లూకా వృత్తాంతం ప్రకారం, యేసు ఇంకా ఇలా అన్నాడు: “నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు.” a (లూకా 6:37) అపరిపూర్ణ మానవులకు తీర్పు తీర్చే స్వభావం ఉంటుందన్న సంగతి తనకు తెలుసని యేసు చూపించాడు. ఆయన శ్రోతల్లో ఎవరికైనా తొందరపడి ఇతరులకు తీర్పుతీర్చే అలవాటు ఉంటే దానిని వారు మానుకోవాలి.
14.ఏ కారణాలనుబట్టి ఇతరులకు ‘తీర్పు తీర్చడం’ మనం మానుకోవాలి?
14 ఇతరులకు ‘తీర్పు తీర్చడం’ మనమెందుకు మానుకోవాలి? ఒక సంగతేమిటంటే, మన అధికారం పరిమితమైనది. శిష్యుడైన యాకోబు మనకిలా గుర్తుచేస్తున్నాడు: యెహోవా “ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు.” కాబట్టి యాకోబు సూటిగా ఇలా ప్రశ్నిస్తున్నాడు: “పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు?” (యాకోబు 4:12; రోమీయులు 14:1-4) దానికితోడు, మన పాప స్వభావం మనం సులభంగా అన్యాయపు తీర్పులు తీర్చేలా చేయగలదు. వివక్ష, దెబ్బతిన్న అహం, ఈర్ష్య, స్వనీతితోపాటు అనేక దృక్పథాలు, ఉద్దేశాలు తోటి మానవులను మనం చూసే విధానాన్ని వికృతం చేయగలవు. మనకు ఇతర పరిమితులున్నాయి, వీటిని మనస్సులో పెట్టుకోవడం తొందరపడి ఇతరుల్లో తప్పులు పట్టకుండా మనల్ని నిరోధించాలి. మనం హృదయాలను చదవలేము; లేదా ఇతరుల వ్యక్తిగత పరిస్థితులన్నిటినీ మనం తెలుసుకోలేము. కాబట్టి తోటి విశ్వాసులకు తప్పుడు ఉద్దేశాలు అంటగట్టడానికి లేదా దేవుని సేవలో వారి ప్రయత్నాలను విమర్శించడానికి మనమెవరము? మన సహోదర సహోదరీల వైఫల్యాలపై దృష్టి కేంద్రీకరించడానికి బదులు వారిలో మంచి కోసం చూడడం ద్వారా యెహోవాను అనుకరించడం ఎంత శ్రేష్ఠమో గదా!
15.దేవుని ఆరాధకుల మధ్య ఎలాంటి మాటలకు, వ్యవహారానికి చోటులేదు, ఎందుకు?
15 మన కుటుంబ సభ్యుల సంగతేమిటి? విచారకరంగా, నేటి ప్రపంచంలో శాంతి నిలయంగా ఉండాల్సిన గృహంలో అత్యంత కఠోరమైన తీర్పులు తీర్చబడుతున్నాయి. క్రూర మనస్తత్వంగల భర్తలు, భార్యలు, తలిదండ్రులు తమ కుటుంబ సభ్యులను గాయపరిచే మాటలతో లేదా శారీరక హింసతో అదేపనిగా కట్టడిచేస్తూ “శిక్షించడం” గురించి వినడం అసాధారణమేమీ కాదు. అయితే చెడ్డ మాటలు, కటువుగా దెప్పిపొడవడం, శారీరకంగా గాయపరచడం వంటివాటికి దేవుని ఆరాధకుల మధ్య చోటులేదు. (ఎఫెసీయులు 4:29, 31; 5:33; ) “తీర్పు తీర్చకుడి,” “నేరం మోపకుడి” అని యేసు ఇచ్చిన ఉపదేశపు అన్వయింపు మనం ఇంట్లో ఉన్నప్పుడు ఆగిపోదు. న్యాయముగా నడుచుకోవడంలో యెహోవా మనల్ని చూసినట్లుగానే మనం ఇతరులను చూడడం ఇమిడివున్నదని గుర్తుంచుకోండి. మన దేవుడు మనతో ఎన్నడూ కఠినంగా లేదా క్రూరంగా వ్యవహరించడు. బదులుగా, ఆయన తనను ప్రేమించువారిపట్ల “ఎంతో జాలియు కనికరమును గలవాడు.” ( 6:4యాకోబు 5:11) అనుకరించడానికి అదెంత మహత్తరమైన మాదిరో కదా!
“న్యాయమునుబట్టి” సేవచేసే పెద్దలు
16, 17.(ఎ)పెద్దలనుండి యెహోవా ఏమి ఆశిస్తాడు? (బి) తప్పిదస్థుడు నిజమైన పశ్చాత్తాపం చూపకపోతే ఏమిచేయాలి, ఎందుకు?
16 న్యాయముగా నడుచుకోవలసిన బాధ్యత మనందరికీ ఉంది, అయితే ఈ విషయంలో ప్రత్యేకంగా క్రైస్తవ సంఘంలోని పెద్దలకు బాధ్యత ఉంది. “అధికారుల” గురించి లేదా పెద్దల గురించి యెషయా నమోదుచేసిన ప్రవచనాత్మక వర్ణన గమనించండి: “ఆలకించుడి, రాజు నీతినిబట్టి రాజ్యపరిపాలన చేయును; అధికారులు న్యాయమునుబట్టి యేలుదురు.” (యెషయా 32:1) అవును, పెద్దలు న్యాయానికి అనుగుణంగా సేవ చేయాలని యెహోవా ఆశిస్తున్నాడు. వారలాంటి సేవను ఎలా చేయగలరు?
17 నీతిన్యాయాలను బట్టి సంఘాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆధ్యాత్మిక యోగ్యతగల ఈ పురుషులకు బాగా తెలుసు. కొన్నిసార్లు, గంభీరమైన తప్పుల విషయంలో తీర్పు తీర్చే బాధ్యత పెద్దలకు ఉంటుంది. అలా చేసేటప్పుడు, సాధ్యమైతే కనికరం చూపడానికే దేవుని న్యాయం ప్రయత్నిస్తుందని వారు గుర్తుంచుకుంటారు. ఆ విధంగా వారు తప్పిదస్థుణ్ణి పశ్చాత్తాపానికి నడిపించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ తప్పిదస్థునికి సహాయపడే ఉద్దేశంతో అలాంటి ప్రయత్నాలు చేసినా అతడు నిజమైన పశ్చాత్తాపం చూపకపోతే అప్పుడెలా? పరిపూర్ణ న్యాయంతో, స్థిరమైన చర్య తీసుకోవాలని చెబుతూ యెహోవా వాక్యం ఇలా నిర్దేశిస్తోంది: “ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి.” అంటే సంఘం నుండి అతణ్ణి బహిష్కరించమని దానర్థం. (1 కొరింథీయులు 5:11-13; 2 యోహాను 9-11) అలాంటి చర్య తీసుకోవడం పెద్దలకు దుఃఖం కలిగిస్తుంది, అయితే సంఘ నైతిక, ఆధ్యాత్మిక పరిశుభ్రతను కాపాడడానికి అది అవసరమని వారు గుర్తిస్తారు. అయినప్పటికీ ఏదోక రోజు ఆ తప్పిదస్థుడు తన తప్పు గ్రహించి సంఘానికి తిరిగివస్తాడని వారు నిరీక్షిస్తారు.—లూకా 15:17, 18.
18.పెద్దలు ఇతరులకు బైబిలు ఆధారిత ఉపదేశమిచ్చేటప్పుడు దేనిని గుర్తుంచుకుంటారు?
18 న్యాయానికి అనుగుణంగా సేవ చేయడంలో అవసరమైనప్పుడు బైబిలు ఆధారిత ఉపదేశమివ్వడం కూడా ఇమిడివుంది. అలాగని, పెద్దలు ఇతరుల్లో తప్పుల కోసం వెదకరు. అంతేగాక దిద్దుబాటు ఇవ్వడానికి అవకాశాల కోసం ఆత్రంగా వెదకరు. అయితే తోటి విశ్వాసి ఒకరు తనకు తెలియకుండానే ‘తప్పితములో చిక్కుకోవచ్చు.’ దేవుని న్యాయం క్రూరంగా లేదా కఠినంగా ఉండదని గుర్తుంచుకోవడం ‘సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసికొని రావడానికి’ ప్రయత్నించేలా పెద్దలను పురికొల్పుతుంది. (గలతీయులు 6:1) కాబట్టి, పెద్దలు తప్పిదస్థుని తిట్టరు లేదా కఠిన పదాలు ఉపయోగించరు. బదులుగా, ప్రేమతో ఇవ్వబడే ఉపదేశం దానిని పొందేవారిని ప్రోత్సహిస్తుంది. న్యాయంగా గద్దించేటప్పుడు అంటే ఒకానొక అజ్ఞానపు చర్య తీసుకోవడం మూలంగా కలిగే పరిణామాల గురించి సూటిగా చెప్పేటప్పుడు కూడా తప్పుచేసిన ఆ తోటి విశ్వాసి యెహోవా మందలోని గొఱ్ఱె అని పెద్దలు గుర్తుంచుకుంటారు. b (లూకా 15:7) ఉపదేశంగానీ గద్దింపుగానీ స్పష్టంగా ప్రేమతో పురికొల్పబడి, ప్రేమగా ఇవ్వబడినప్పుడే ఆ తప్పిదస్థుని మంచిదారిలోకి తెచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి.
19.పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది, వేటి ఆధారంగా వారు అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి?
19 పెద్దలు తరచూ తమ తోటి విశ్వాసులపై ప్రభావంచూపే నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు, సంఘంలోని ఇతర సహోదరులు పెద్దలుగా లేదా పరిచర్య సేవకులుగా సిఫారసు చేయబడడానికి యోగ్యులా కాదా అని పరిశీలించేందుకు పెద్దలు తరచూ సమావేశమవుతారు. నిష్పక్షపాతంగా ఉండడం యొక్క ప్రాముఖ్యత పెద్దలకు తెలుసు. అలాంటి నియామకాల విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారు తమ వ్యక్తిగత భావాలపై ఆధారపడకుండా, అలాంటి నియామకాల సంబంధంగా దేవుడు కోరుతున్నవి తమను నిర్దేశించేందుకు వారు అనుమతిస్తారు. ఆ విధంగా వారు “విరోధబుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమియుచేయ[కుండా]” ఉంటారు.—1 తిమోతి 5:21.
20, 21.(ఎ)పెద్దలు ఎలా ఉండడానికి కృషిచేస్తారు, ఎందుకు? (బి) ‘ధైర్యము చెడినవారికి’ సహాయం చేయడానికి పెద్దలు ఏమి చేయవచ్చు?
20 పెద్దలు ఇతర విధాలుగా కూడా దేవుని న్యాయాన్ని అమలుచేస్తారు. పెద్దలు “న్యాయమునుబట్టి” సేవచేస్తారని ప్రవచించిన తర్వాత యెషయా ఇంకా ఇలా అన్నాడు: “మనుష్యుడు గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను ఉండును ఎండినచోట నీళ్లకాలువలవలెను అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను ఉండును.” (యెషయా 32:2) అందుచేత, పెద్దలు తమ తోటి విశ్వాసులకు ఓదార్పు, సేదదీర్పుల ఊటగా ఉండేందుకు కృషిచేస్తారు.
21 అధైర్యపరిచే అనేక సమస్యలున్నందున నేడు చాలామందికి ప్రోత్సాహం అవసరం. పెద్దలారా, ‘ధైర్యము చెడినవారికి’ సహాయం చేసేందుకు మీరేమి చేయవచ్చు? (1 థెస్సలొనీకయులు 5:14) వారు చెప్పేది సహానుభూతితో వినండి. (యాకోబు 1:19) తాము నమ్మగల ఎవరితోనైనా తమ హృదయ ‘విచారం’ చెప్పుకొనే అవసరం వారికి ఉండవచ్చు. (సామెతలు 12:) వారు యెహోవాకే కాదు వారి సహోదర సహోదరీలకు కూడా అవసరమనీ, వారు ప్రశస్తమైనవారనీ, ప్రియమైన వారనీ వారికి హామీ ఇవ్వండి. ( 251 పేతురు 1:22; 5:6, 7) దానికితోడు, మీరు అలాంటి వారికోసం, వారితోపాటు ప్రార్థించవచ్చు. తమ పక్షాన ఒక పెద్ద హృదయపూర్వకంగా ప్రార్థించడం వారికి అత్యధిక ఓదార్పునివ్వగలదు. (యాకోబు 5:14, 15) ధైర్యము చెడినవారికి సహాయం చేయాలనే మీ ప్రేమపూర్వక ప్రయత్నాలను న్యాయవంతుడైన దేవుడు గమనించకుండా ఉండడు.
పెద్దలు ధైర్యము చెడినవారిని ప్రోత్సహించినప్పుడు యెహోవా న్యాయాన్ని ప్రతిబింబిస్తారు
22.యెహోవా న్యాయాన్ని మనం ఏయే విధాలుగా అనుకరించవచ్చు, దాని ఫలితమేమిటి?
22 నిజంగా, యెహోవా న్యాయాన్ని అనుకరించడం ద్వారా మనం ఆయనకు ఎంతో సన్నిహితులమవుతాం! మనమాయన నీతి ప్రమాణాలు సమర్థించినప్పుడు, ఇతరులతో ప్రాణ రక్షక సువార్త పంచుకున్నప్పుడు, ఇతరుల తప్పిదాలు చూడడానికి బదులు వారిలోగల మంచిపై దృష్టి కేంద్రీకరించడానికి ఎంచుకున్నప్పుడు మనం దేవుని న్యాయాన్ని ప్రదర్శిస్తాం. పెద్దలారా, మీరు సంఘ పరిశుభ్రతను కాపాడినప్పుడు, క్షేమాభివృద్ధికరమైన లేఖన ఉపదేశం ఇచ్చినప్పుడు, నిష్పక్షపాత నిర్ణయాలు తీసుకున్నప్పుడు, ధైర్యము చెడినవారిని ప్రోత్సహించినప్పుడు మీరు దేవుని న్యాయాన్ని ప్రతిబింబిస్తారు. తమ దేవుని ఎదుట ‘న్యాయముగా నడుచుకోవడానికి’ తన ప్రజలు శాయశక్తులా ప్రయత్నించడాన్ని పరలోకం నుండి యెహోవా చూసినప్పుడు అది ఆయన హృదయాన్ని ఎంత సంతోషింపజేస్తుందో కదా!
a “తీర్పు తీర్చకుడి,” “నేరము మోపకుడి” అనే పదబంధాలు “తీర్పు తీర్చ మొదలుపెట్టకండి,” “నేరం మోప మొదలుపెట్టకండి” అనే భావమిస్తున్నాయి. అయితే ఆదిమ భాషలో, బైబిలు రచయితలు ఇక్కడ (కొనసాగే) వర్తమానకాలంలో వ్యతిరేకార్థ ఆదేశాలు ఉపయోగించారు. కాబట్టి వర్ణించబడిన పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి అయితే వాటిని చేయడం మానుకోవాలి.
b 2 తిమోతి 4:2లో, పెద్దలు కొన్నిసార్లు ‘ఖండించి, గద్దించి, బుద్ధిచెప్పాలని’ బైబిలు చెబుతోంది. “బుద్ధిచెప్పుము” అని తర్జుమా చేయబడిన గ్రీకు పదానికి (పారాకేలియో) “ప్రోత్సహించడం” అనే అర్థం కూడా ఉంది. సంబంధిత గ్రీకు పదమైన పారాక్లెటోస్, న్యాయ విషయాల వకీలును సూచించగలదు. కాబట్టి పెద్దలు స్థిరంగా గద్దింపు ఇచ్చేటప్పుడు కూడా, ఆధ్యాత్మిక సహాయం అవసరమున్న వారికి సహాయకులుగా ఉండాలి.