ఆదికాండం 22:1-24

  • ఇస్సాకును బలి ఇవ్వమని అబ్రాహామును అడగడం (1-19)

    • అబ్రాహాము సంతానం వల్ల దీవెన (15-18)

  • రిబ్కా కుటుంబం (20-24)

22  అది జరిగిన తర్వాత సత్యదేవుడు అబ్రాహామును పరీక్షించాడు.+ దేవుడు అతన్ని, “అబ్రాహామూ!” అని పిలిచాడు, దానికి అతను, “చెప్పు ప్రభువా!” అన్నాడు.  దేవుడు అతనితో ఇలా అన్నాడు: “దయచేసి, నీ కుమారుణ్ణి, అంటే నువ్వు ఎంతగానో ప్రేమించే+ నీ ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకును+ తీసుకొని, మోరీయా+ దేశానికి వెళ్లు. అక్కడ నేను నీకు చూపించబోయే కొండ మీద అతన్ని దహనబలిగా అర్పించు.”  కాబట్టి అబ్రాహాము తెల్లవారుజామునే లేచి, గాడిదకు జీను* కట్టి తనతోపాటు ఇద్దరు సేవకుల్ని, తన కుమారుడు ఇస్సాకును తీసుకొని, దహనబలి కోసం కట్టెలు కొట్టి, లేచి, సత్యదేవుడు తనకు చెప్పిన చోటికి ప్రయాణమయ్యాడు.  మూడో రోజున అబ్రాహాము తల ఎత్తి దూరంలో ఉన్న ఆ చోటును చూశాడు.  అప్పుడు అబ్రాహాము తన సేవకులతో ఇలా అన్నాడు: “మీరు గాడిదతోపాటు ఇక్కడే ఉండండి. నేనూ, అబ్బాయి అక్కడికి వెళ్లి, ఆరాధించి, మీ దగ్గరికి తిరిగొస్తాం.”  అబ్రాహాము దహనబలి కోసం తెచ్చిన కట్టెల్ని తీసి తన కుమారుడు ఇస్సాకు భుజాల మీద పెట్టాడు. తర్వాత అబ్రాహాము నిప్పుల్ని, కత్తిని* తీసుకున్నాడు. అలా వాళ్లిద్దరూ కలిసి నడుచుకుంటూ ముందుకు సాగారు.  అప్పుడు ఇస్సాకు తన తండ్రి అబ్రాహామును, “నాన్నా!” అని పిలిచాడు. దానికి అతను, “చెప్పు బాబు!” అన్నాడు. అప్పుడు ఇస్సాకు, “ఇక్కడ నిప్పులు, కట్టెలు ఉన్నాయి కానీ దహనబలి కోసం గొర్రె ఏది?” అని అడిగాడు.  దానికి అబ్రాహాము, “దహనబలికి కావాల్సిన గొర్రెను+ దేవుడే ఇస్తాడు బాబు” అన్నాడు. అలా వాళ్లిద్దరూ కలిసి నడుచుకుంటూ ముందుకు సాగారు.  చివరికి, వాళ్లు సత్యదేవుడు తనకు చెప్పిన చోటికి చేరుకున్నారు. అక్కడ అబ్రాహాము ఒక బలిపీఠం కట్టి, దానిమీద కట్టెలు పేర్చాడు. తర్వాత అబ్రాహాము తన కుమారుడు ఇస్సాకు చేతుల్ని, కాళ్లను కట్టేసి బలిపీఠంపై తాను పేర్చిన కట్టెల మీద అతన్ని పడుకోబెట్టాడు.+ 10  తర్వాత అబ్రాహాము తన చెయ్యి చాపి తన కుమారుణ్ణి చంపడానికి కత్తి* తీసుకున్నాడు.+ 11  కానీ పరలోకం నుండి యెహోవా దూత, “అబ్రాహామూ, అబ్రాహామూ!” అని పిలిచాడు. దానికి అతను, “చెప్పు, ప్రభువా!” అన్నాడు. 12  అప్పుడు దూత ఇలా అన్నాడు: “ఆ అబ్బాయిని చంపకు, అతనికి ఏ హానీ చేయకు. నువ్వు దైవభయం ఉన్న వ్యక్తివని నాకు ఇప్పుడు తెలిసింది. ఎందుకంటే, నువ్వు నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి వెనకాడలేదు.”+ 13  అప్పుడు అబ్రాహాము తల ఎత్తి చూశాడు. కొంతదూరంలో, పొదలో కొమ్ములు చిక్కుకున్న ఒక పొట్టేలు అతనికి కనిపించింది. కాబట్టి అబ్రాహాము వెళ్లి, ఆ పొట్టేలును తెచ్చి తన కుమారునికి బదులు దాన్ని దహనబలిగా అర్పించాడు. 14  అబ్రాహాము ఆ చోటికి యెహోవా-యీరే* అని పేరు పెట్టాడు. అందుకే, “యెహోవా పర్వతం మీద అది ఇవ్వబడుతుంది”+ అని ప్రజలు నేటికీ అంటుంటారు. 15  యెహోవా దూత రెండోసారి పరలోకం నుండి మాట్లాడుతూ అబ్రాహాముతో 16  ఇలా అన్నాడు: “యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు, ‘నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి నువ్వు వెనకాడలేదు.+ నువ్వు ఇలా చేశావు కాబట్టి నామీద ఒట్టు వేసుకొని చెప్తున్నాను,+ 17  నేను నిన్ను ఖచ్చితంగా దీవిస్తాను, నీ సంతానాన్ని* ఖచ్చితంగా ఆకాశ నక్షత్రాలంతమంది, సముద్రతీరాన ఉండే ఇసుక రేణువులంతమంది అయ్యేలా చేస్తాను.+ నీ సంతానం* శత్రువుల నగరాల్ని స్వాధీనపర్చుకుంటుంది.+ 18  నువ్వు నా మాట విన్నావు కాబట్టి నీ సంతానం* ద్వారా+ భూమ్మీదున్న అన్నిదేశాల ప్రజలు దీవెన సంపాదించుకుంటారు.’ ”*+ 19  తర్వాత అబ్రాహాము తన సేవకుల దగ్గరికి తిరిగొచ్చాడు. అప్పుడు వాళ్లంతా కలిసి బెయేర్షెబాకు+ తిరిగెళ్లిపోయారు; అబ్రాహాము బెయేర్షెబాలోనే నివసిస్తూ ఉన్నాడు. 20  ఆ తర్వాత అబ్రాహాముకు ఈ కబురు అందింది: “మిల్కా కూడా నీ సహోదరుడైన నాహోరుకు+ కుమారుల్ని కన్నది. వాళ్లు ఎవరంటే: 21  పెద్ద కుమారుడు ఊజు, అతని తమ్ముడు బూజు, అరాము తండ్రి కెమూయేలు, 22  కెసెదు, హజో, పిల్దాషు, యిద్లాపు, బెతూయేలు.”+ 23  బెతూయేలుకు రిబ్కా+ పుట్టింది. అబ్రాహాము సహోదరుడైన నాహోరుకు మిల్కా ఈ ఎనిమిది మందిని కన్నది. 24  నాహోరు ఉపపత్ని రయూమా కూడా కుమారుల్ని కన్నది. వాళ్లు ఎవరంటే: తెబహు, గహము, తహషు, మయకా.

అధస్సూచీలు

ఇది జంతువు మీద కూర్చోవడానికి దాని వీపుమీద వేసేది.
లేదా “వధించే కత్తిని.”
లేదా “వధించే కత్తి.”
“యెహోవా ఇస్తాడు; యెహోవా చూసుకుంటాడు” అని అర్థం.
అక్ష., “విత్తనాన్ని.”
అక్ష., “విత్తనం.”
అక్ష., “విత్తనం.”
దానికోసం కష్టపడాల్సి ఉంటుందని ఇది సూచిస్తుండవచ్చు.