ఆదికాండం 30:1-43

  • బిల్హాకు దాను, నఫ్తాలి పుట్టారు (1-8)

  • జిల్పాకు గాదు, ఆషేరు పుట్టారు (9-13)

  • లేయాకు ఇశ్శాఖారు, జెబూలూను పుట్టారు (14-21)

  • రాహేలుకు యోసేపు పుట్టాడు (22-24)

  • యాకోబు మందలు వర్ధిల్లడం (25-43)

30  తాను యాకోబుకు పిల్లల్ని కనట్లేదని రాహేలు చూసినప్పుడు, ఆమె తన అక్క మీద అసూయపడి యాకోబుతో ఇలా అనడం మొదలుపెట్టింది: “నువ్వు నాకు పిల్లల్ని ఇవ్వు, లేకపోతే నేను చచ్చిపోతాను.”  అప్పుడు యాకోబు రాహేలు మీద కోపంతో మండిపడి, “నేనేమైనా దేవుని స్థానంలో ఉన్నానా? దేవుడే నీకు పిల్లలు పుట్టకుండా* చేశాడు” అన్నాడు.  దానికి ఆమె ఇలా అంది: “ఇదిగో, నా దాసురాలు బిల్హా.+ ఆమె నాకోసం* పిల్లల్ని కనేలా ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకో. అప్పుడు ఆమె ద్వారా నాకు కూడా పిల్లలు ఉంటారు.”  అలా రాహేలు తన సేవకురాలు బిల్హాను యాకోబుకు భార్యగా ఇచ్చింది, అతను ఆమెతో కలిశాడు.+  బిల్హా గర్భవతి అయ్యి, ఒక కుమారుణ్ణి కన్నది.  అప్పుడు రాహేలు, “దేవుడు నాకు న్యాయమూర్తిగా వ్యవహరించాడు, నా మొర విన్నాడు. అందుకే ఒక కుమారుణ్ణి ఇచ్చాడు” అనుకుంటూ ఆ పిల్లవాడికి దాను*+ అని పేరు పెట్టింది.  రాహేలు సేవకురాలు బిల్హా మళ్లీ గర్భవతి అయ్యి, యాకోబుకు రెండో కుమారుణ్ణి కన్నది.  అప్పుడు రాహేలు, “నేను మా అక్కతో గట్టిగా కుస్తీపడి గెలిచాను!” అంటూ ఆ పిల్లవాడికి నఫ్తాలి*+ అని పేరు పెట్టింది.  లేయా తనకు పిల్లలు పుట్టడం లేదని గమనించినప్పుడు, తన సేవకురాలు జిల్పాను యాకోబుకు భార్యగా ఇచ్చింది.+ 10  లేయా సేవకురాలు జిల్పా యాకోబుకు ఒక కుమారుణ్ణి కన్నది. 11  అప్పుడు లేయా, “ఎంతటి భాగ్యం!” అని అంటూ ఆ పిల్లవాడికి గాదు*+ అని పేరు పెట్టింది. 12  ఆ తర్వాత లేయా సేవకురాలు జిల్పా యాకోబుకు రెండో కుమారుణ్ణి కన్నది. 13  అప్పుడు లేయా, “ఎంత సంతోషం! స్త్రీలు తప్పకుండా నన్ను సంతోషవంతురాలని పిలుస్తారు”+ అంటూ, ఆ పిల్లవాడికి ఆషేరు*+ అని పేరు  పెట్టింది. 14  గోధుమ పంట కోతకోసే రోజుల్లో, రూబేను+ పొలంలో నడుస్తున్నప్పుడు పుత్రదాత చెట్టు పండ్లు చూశాడు. అతను వాటిని తెచ్చి తన తల్లి లేయాకు ఇచ్చాడు. అప్పుడు రాహేలు లేయాను, “దయచేసి, నీ కుమారుడు తెచ్చిన పుత్రదాత చెట్టు పండ్లు కొన్ని నాకు ఇవ్వు” అని అడిగింది. 15  దానికి ఆమె, “నువ్వు నా భర్తను తీసేసుకున్నావు,+ అది చాలదా? ఇప్పుడు నా కుమారుడు తెచ్చిన పుత్రదాత చెట్టు పండ్లు కూడా కావాలా?” అంది. అప్పుడు రాహేలు, “సరే మంచిది. నీ కుమారుడు తెచ్చిన పుత్రదాత చెట్టు పండ్లు నాకు ఇస్తే, ఈ రాత్రి యాకోబు నీతో గడుపుతాడు” అంది. 16  సాయంకాలం యాకోబు పచ్చిక మైదానం నుండి వస్తున్నప్పుడు, లేయా అతనికి ఎదురెళ్లి, “నువ్వు ఈ రాత్రి నాతో గడపాలి, ఎందుకంటే నేను నా కుమారుడు తెచ్చిన పుత్రదాత చెట్టు పండ్లతో నిన్ను కొన్నాను” అంది. కాబట్టి అతను ఆ రాత్రి ఆమెతో గడిపాడు. 17  దేవుడు లేయా మొర విన్నాడు. దాంతో ఆమె గర్భవతి అయ్యి, యాకోబుకు ఐదో కుమారుణ్ణి కన్నది. 18  తర్వాత లేయా, “నేను నా సేవకురాల్ని నా భర్తకు ఇచ్చినందుకు దేవుడు నా జీతం* నాకు ఇచ్చాడు” అంటూ ఆ పిల్లవాడికి ఇశ్శాఖారు*+ అని పేరు పెట్టింది. 19  లేయా మళ్లీ గర్భవతి అయ్యి యాకోబుకు ఆరో కుమారుణ్ణి కన్నది.+ 20  అప్పుడు లేయా, “దేవుడు నాకు మంచి బహుమతి ఇచ్చాడు, ఇప్పుడు నా భర్త నన్ను సహిస్తాడు.+ ఎందుకంటే నేను అతనికి ఆరుగురు కుమారుల్ని కన్నాను”+ అంటూ ఆ పిల్లవాడికి జెబూలూను*+ అని పేరు పెట్టింది. 21  తర్వాత లేయా ఒక కూతుర్ని కని, ఆమెకు దీనా+ అని పేరు పెట్టింది. 22  చివరికి దేవుడు రాహేలును గుర్తుచేసుకున్నాడు. దేవుడు ఆమె మొర విని, ఆమెకు పిల్లలు పుట్టేలా చేశాడు.*+ 23  దాంతో ఆమె గర్భవతి అయ్యి ఒక కుమారుణ్ణి కన్నది. అప్పుడు ఆమె ఇలా అనుకుంది: “దేవుడు నా మీద ఉన్న నిందను తీసేశాడు!”+ 24  కాబట్టి ఆమె, “యెహోవా నాకు ఇంకో కుమారుణ్ణి ఇచ్చాడు” అంటూ ఆ పిల్లవాడికి యోసేపు*+ అని పేరు పెట్టింది. 25  రాహేలు యోసేపును కన్న తర్వాత, యాకోబు ఆలస్యం చేయకుండా లాబానుతో ఇలా అన్నాడు: “నన్ను ఇక్కడి నుండి పంపించేయి. నేను నా ఊరికి, నా దేశానికి వెళ్లిపోతాను.+ 26  నా భార్యల్ని, నా పిల్లల్ని నాకు ఇచ్చి పంపించు. నేను నీ దగ్గర పనిచేసింది వాళ్ల కోసమే. నేను నీకు ఎలా సేవచేశానో నీకు బాగా తెలుసు.”+ 27  అప్పుడు లాబాను అతనితో, “నీ దయ నా మీద ఉంటే, దయచేసి నా దగ్గరే ఉండు. నీ వల్లే యెహోవా నన్ను దీవిస్తున్నాడని నేను శకునాలు* చూసి తెలుసుకున్నాను” అని అన్నాడు. 28  లాబాను ఇంకా ఇలా అన్నాడు: “నీకు జీతంగా ఏమి కావాలో చెప్పు, నేను ఇస్తాను.”+ 29  దానికి యాకోబు ఇలా అన్నాడు: “నేను నీకు ఎలా సేవచేశానో, నా వల్ల నీ మంద ఎలా వర్ధిల్లిందో+ నీకు తెలుసు; 30  నేను రాకముందు నీ మంద చాలా చిన్నది, కానీ ఇప్పుడు అది చాలా రెట్లు పెరిగింది. నేను వచ్చిన దగ్గర నుండి యెహోవా నిన్ను దీవించాడు. ఇప్పుడు నేను నా కుటుంబం కోసం ఏదోకటి చేయాలనుకుంటున్నాను.”+ 31  దానికి లాబాను, “నేను నీకు ఏమి ఇవ్వాలి?” అని అడిగాడు. అప్పుడు యాకోబు ఇలా అన్నాడు: “నువ్వు నాకు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు! నాకోసం ఈ ఒక్క పని చేయి చాలు, నేను ఎప్పటిలాగే నీ మందల్ని కాస్తూ సంరక్షిస్తాను.+ 32  నేను ఈ రోజు నీ మంద అంతటి మధ్య నడుస్తాను. నువ్వు పొడలు, మచ్చలు ఉన్న ప్రతీ గొర్రెను; ముదురు గోధుమ* రంగులోవున్న ప్రతీ మగ గొర్రెపిల్లను; పొడలు, మచ్చలు ఉన్న ప్రతీ మేకను వేరు చేసి పెట్టు. ఇప్పటినుండి అవి నాకు జీతం అవుతాయి.+ 33  నువ్వు నా జీతాన్ని చూడడం కోసం వచ్చే రోజున నా నీతి* నా తరఫున మాట్లాడుతుంది; మేకల్లో పొడలు, మచ్చలు లేనిది ఏదైనా, గొర్రెపిల్లల్లో ముదురు గోధుమ రంగులో లేని మగది ఏదైనా నా దగ్గర ఉంటే, దాన్ని నేను దొంగిలించినట్టే లెక్క.” 34  దానికి లాబాను, “మంచిది! నువ్వు చెప్పినట్టే కానివ్వు” అన్నాడు.+ 35  ఆ రోజు అతను చారలు, మచ్చలు ఉన్న మేకపోతుల్ని; పొడలు, మచ్చలు ఉన్న మేకలన్నిటిని, అంటే ఏ కాస్తయినా తెలుపున్న ప్రతీదాన్ని; అలాగే ముదురు గోధుమ రంగులో ఉన్న మగ గొర్రెపిల్లల్ని వేరుచేసి తన కుమారులకు అప్పగించాడు. 36  తర్వాత అతను యాకోబు నుండి మూడు రోజుల ప్రయాణమంత దూరం వెళ్లిపోయాడు. యాకోబు మిగిలివున్న లాబాను మందల్ని కాస్తూ ఉన్నాడు. 37  ఆ తర్వాత యాకోబు గుగ్గిలం, బాదం, సాల చెట్ల పచ్చి కర్రల్ని తీసుకొని, అక్కడక్కడ వాటి బెరడు ఒలిచి, వాటిలోని తెల్లని భాగం బయటికి కనిపించేలా చేశాడు. 38  తాను ఒలిచిన ఆ కర్రల్ని మందలు నీళ్లు తాగడానికి వచ్చే చోట అంటే కాలువల్లో, నీటి తొట్లలో వాటికి కనిపించేలా వాటి ఎదుట పెట్టాడు. మంద నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు ఆ కర్రల ఎదుట జతకట్టాలనే ఉద్దేశంతో అతను అలా చేశాడు. 39  అలా మందలు ఆ కర్రల ఎదుట జతకట్టేవి. దానివల్ల వాటికి చారలు, పొడలు, మచ్చలు ఉన్న పిల్లలు పుట్టేవి. 40  అప్పుడు యాకోబు మందల్లోని మగ గొర్రెపిల్లల్ని వేరు చేసి, మిగతావాటిని లాబాను మందల్లోని చారలు ఉన్నవాటికి, ముదురు గోధుమ రంగులో ఉన్న వాటన్నిటికి ఎదురుగా పెట్టేవాడు. ఆ తర్వాత తన మందలు లాబాను మందలతో కలిసిపోకుండా వేరు చేసి పెట్టేవాడు. 41  బలమైన జంతువులు జతకట్టే ప్రతీసారి, అవి ఆ కర్రల పక్కనే జతకట్టేలా యాకోబు ఆ కర్రల్ని కాలువల్లో వాటి కళ్లముందు పెట్టేవాడు. 42  కానీ బలహీనమైనవి జతకట్టేటప్పుడు, అతను ఆ కర్రల్ని అక్కడ పెట్టేవాడు కాదు. దానివల్ల ప్రతీసారి బలహీనమైనవి లాబానుకు, బలమైనవి యాకోబుకు వచ్చేవి.+ 43  అలా యాకోబు చాలా ధనవంతుడయ్యాడు; అతను పెద్దపెద్ద మందల్ని, సేవకుల్ని, సేవకురాళ్లను, ఒంటెల్ని, గాడిదల్ని సంపాదించుకున్నాడు.+

అధస్సూచీలు

లేదా “గర్భఫలం లేకుండా.”
అక్ష., “నా మోకాళ్ల మీద.”
“న్యాయమూర్తి” అని అర్థం.
“నా కుస్తీపట్లు” అని అర్థం.
“భాగ్యం” అని అర్థం.
“సంతోషంగా ఉండడం; సంతోషం” అని అర్థం.
లేదా “కూలివాడి జీతం.”
“ఇతనే జీతం” అని అర్థం.
“సహించడం” అని అర్థం.
అక్ష., “ఆమె గర్భాన్ని తెరిచాడు.”
ఇది యోసిఫియా అనే పదానికి సంక్షిప్త రూపం. దీనికి “‘యా’ కలుపును (పెంచును) గాక!” అని అర్థం. “యా” అనేది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
లేదా “రుజువులు.”
అంటే, బ్రౌన్‌.
లేదా “నిజాయితీ.”