ఎఫెసీయులు 6:1-24

  • పిల్లలకు, తల్లిదండ్రులకు సలహాలు (1-4)

  • దాసులకు, యజమానులకు సలహాలు (5-9)

  • దేవుడు ఇచ్చే సంపూర్ణ యుద్ధ కవచం (10-20)

  • చివర్లో శుభాకాంక్షలు (21-24)

6  పిల్లలారా, ప్రభువు ఇష్టానికి అనుగుణంగా మీ అమ్మానాన్నల మాట వినండి,*+ ఇది దేవుని దృష్టికి సరైనది.  వాగ్దానంతో పాటు ఇవ్వబడిన మొదటి ఆజ్ఞ ఇదే: “నువ్వు మీ అమ్మానాన్నల్ని గౌరవించు.+  అప్పుడు నీ జీవితం బాగుంటుంది,* నువ్వు భూమ్మీద ఎక్కువకాలం జీవిస్తావు.”  తండ్రులారా, మీ పిల్లలకు కోపం తెప్పించకండి;+ బదులుగా యెహోవా* నిర్దేశాల ప్రకారం క్రమశిక్షణను,+ ఉపదేశాన్ని ఇస్తూ* వాళ్లను పెంచండి.+  దాసులారా, క్రీస్తుకు విధేయత చూపించినట్టు, భూమ్మీదున్న మీ యజమానులకు భయంతో, గౌరవంతో మనస్ఫూర్తిగా విధేయత చూపించండి.+  మనుషుల్ని మెప్పించాలనే ఉద్దేశంతో, వాళ్లు చూస్తున్నప్పుడు మాత్రమే కాదుగానీ+ క్రీస్తు దాసుల్లా దేవుని ఇష్టాన్ని జరిగిస్తున్నట్టు నిండు హృదయంతో* విధేయత చూపించండి.+  మనుషులకు సేవ చేస్తున్నట్టు కాకుండా యెహోవాకు* సేవ చేస్తున్నట్టు+ మంచి మనసుతో చేయండి.  ఎందుకంటే దాసుడైనా, స్వతంత్రుడైనా మంచిపని చేసే ప్రతీ వ్యక్తి యెహోవా* నుండి ప్రతిఫలం పొందుతాడని మీకు తెలుసు.+  యజమానులారా, మీరు కూడా మీ దాసులతో అలాగే ప్రవర్తించండి, వాళ్లను బెదిరించకండి. ఎందుకంటే వాళ్లకూ మీకూ యజమాని అయిన వ్యక్తి పరలోకంలో ఉన్నాడని+ మీకు తెలుసు. ఆయనకు పక్షపాతం లేదు. 10  చివరిగా నేను మిమ్మల్ని వేడుకునేది ఏమిటంటే, ప్రభువు తన మహాబలంతో ఇచ్చే శక్తిని పొందుతూ ఉండండి.+ 11  మీరు అపవాది పన్నాగాలకు* పడిపోకుండా స్థిరంగా నిలబడగలిగేలా దేవుడు ఇచ్చే సంపూర్ణ యుద్ధ కవచాన్ని ధరించండి.+ 12  ఎందుకంటే, మనం పోరాడుతున్నది*+ మనుషులతో కాదు; మనం ప్రభుత్వాలతో, అధికారాలతో, ఈ చీకటి ప్రపంచ పాలకులతో, అంటే పరలోకంలోని చెడ్డదూతల* సైన్యంతో+ పోరాడుతున్నాం. 13  అందుకే, మీరు దేవుడు ఇచ్చే సంపూర్ణ యుద్ధ కవచాన్ని ధరించండి.+ మీరలా చేస్తే, శత్రువు దాడిచేసినప్పుడు* అతన్ని ఎదిరించగలుగుతారు; మీరు చేయాల్సినవన్నీ చేస్తే, స్థిరంగా నిలబడి పోరాడగలుగుతారు. 14  కాబట్టి మీరు నడుముకు సత్యం అనే దట్టీ కట్టుకుని,+ ఛాతికి నీతి అనే కవచం తొడుక్కుని+ స్థిరంగా నిలబడండి; 15  మీ పాదాలకు, శాంతి సువార్త ప్రకటించడం కోసం సంసిద్ధత అనే చెప్పులు వేసుకోండి.+ 16  వీటన్నిటితో పాటు విశ్వాసం అనే పెద్ద డాలు పట్టుకోండి,+ దానితో మీరు దుష్టుడి అగ్ని బాణాలన్నీ* ఆర్పేయగలుగుతారు.+ 17  అంతేకాదు, మీ తలకు రక్షణ అనే శిరస్త్రాణం* పెట్టుకోండి,+ పవిత్రశక్తి ద్వారా ఇవ్వబడిన దేవుని వాక్యం అనే ఖడ్గం పట్టుకోండి.+ 18  అలాగే, ప్రతీ సందర్భంలో అన్నిరకాల ప్రార్థనలతో,+ అభ్యర్థనలతో పవిత్రశక్తికి అనుగుణంగా ప్రార్థిస్తూ ఉండండి.+ అందుకోసం ఎల్లప్పుడూ మెలకువగా ఉంటూ, పవిత్రులందరి కోసం వేడుకుంటూ ఉండండి. 19  నేను మంచివార్త గురించిన పవిత్ర రహస్యాన్ని తెలియజేయడానికి నోరు తెరిచినప్పుడు సరైన పదాలతో ధైర్యంగా మాట్లాడగలిగేలా నాకోసం కూడా ప్రార్థించండి.+ 20  ఆ మంచివార్త కోసమే నేను సంకెళ్లు వేయబడిన రాయబారిగా పనిచేస్తున్నాను.+ నేను దాని గురించి మాట్లాడాల్సినంత ధైర్యంగా మాట్లాడేలా నాకోసం ప్రార్థించండి. 21  ప్రియ సహోదరుడూ ప్రభువుకు నమ్మకమైన పరిచారకుడూ అయిన తుకికు+ నా గురించి, నా పనుల గురించి మీకు అన్నీ వివరంగా చెప్తాడు.+ 22  మేమెలా ఉన్నామో మీకు తెలియాలని, అతను మీ హృదయాలకు ఊరటనివ్వాలని అతన్ని మీ దగ్గరికి పంపిస్తున్నాను. 23  తండ్రైన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి సహోదరులు శాంతిని, విశ్వాసంతో కూడిన ప్రేమను పొందాలని కోరుకుంటున్నాను. 24  మన ప్రభువైన యేసుక్రీస్తు మీద చెక్కుచెదరని ప్రేమ ఉన్నవాళ్లందరికీ దేవుని అపారదయ తోడుండాలి.

అధస్సూచీలు

లేదా “విధేయులై ఉండండి.”
లేదా “నువ్వు వర్ధిల్లుతావు.”
అనుబంధం A5 చూడండి.
లేదా “మార్గనిర్దేశాన్ని ఇస్తూ; ఆయన మనసును నాటుతూ.”
లేదా “ప్రాణంతో.” పదకోశం చూడండి.
అనుబంధం A5 చూడండి.
అనుబంధం A5 చూడండి.
లేదా “వ్యూహాలకు.”
అక్ష., “మన కుస్తీపట్టు.”
పదకోశం చూడండి.
అక్ష., “చెడ్డ రోజున.”
లేదా “విసిరే ఆయుధాలన్నీ; చిన్న బల్లెములన్నీ.”
అంటే, హెల్మెట్‌.