ఎస్తేరు 5:1-14
5 మూడో రోజు+ ఎస్తేరు తన రాచవస్త్రాల్ని ధరించుకొని, రాజగృహ లోపలి ఆవరణలో రాజగృహానికి* ఎదురుగా నిలబడింది. అప్పుడు రాజు రాజగృహంలో ప్రవేశ ద్వారానికి ఎదురుగా తన రాజ సింహాసనం మీద కూర్చొనివున్నాడు.
2 ఆవరణలో ఎస్తేరు రాణి నిలబడివుండడం చూసిన వెంటనే రాజుకు ఆమె మీద దయ కలిగింది, అతను తన చేతిలో ఉన్న బంగారు దండాన్ని ఎస్తేరు వైపుకు చాపాడు.+ ఎస్తేరు, దగ్గరికి వచ్చి ఆ దండం కొనను ముట్టుకుంది.
3 రాజు ఆమెతో, “ఎస్తేరు రాణీ, ఏంటి ఇలా వచ్చావు? నీ మనవి ఏంటి? నా రాజ్యంలో సగం* అడిగినా సరే నీకిస్తాను!” అన్నాడు.
4 అందుకు ఎస్తేరు, “రాజుకు ఇష్టమైతే, రాజు కోసం ఈ రోజు నేను సిద్ధం చేసిన విందుకు రాజు, హామాను+ కలిసి రావాలి” అని అంది.
5 కాబట్టి రాజు, “ఎస్తేరు కోరినట్టే హామానును త్వరగా రమ్మనండి” అని తన మనుషులకు చెప్పాడు. అలా రాజు, హామాను కలిసి ఎస్తేరు సిద్ధం చేసిన విందుకు వెళ్లారు.
6 విందు చివర్లో, ద్రాక్షారసం తాగే సమయంలో రాజు ఎస్తేరుతో, “నీ విన్నపం ఏంటి? అది నీకిస్తాను! నీ మనవి ఏంటి? నా రాజ్యంలో సగం* అడిగినా సరే నీకు ఇస్తాను!” అన్నాడు.+
7 అప్పుడు ఎస్తేరు ఇలా అంది: “నా విన్నపం, నా మనవి ఏంటంటే:
8 రాజు దయ నామీద ఉంటే, నేను వేడుకున్నది ఇవ్వడం, అలాగే నా మనవి ప్రకారం చేయడం రాజుకు ఇష్టమైతే, రేపు నేను మీ కోసం సిద్ధం చేయబోయే విందుకు రాజు, హామాను కలిసి రావాలి; నాకు ఏం కావాలో రేపు నేను రాజుకు చెప్తాను.”
9 ఆ రోజు హామాను సంతోషంతో, హృదయానందంతో బయటికి వచ్చాడు. అతను రాజగృహ ద్వారం దగ్గర మొర్దెకైని చూశాడు. అయితే తాను రాగానే అతను లేచి నిలబడకపోవడం, తనకు భయపడకపోవడం గమనించినప్పుడు హామానుకు మొర్దెకై మీద విపరీతమైన కోపం వచ్చింది.+
10 అయినా హామాను తన కోపాన్ని అణుచుకొని తన ఇంటికి వెళ్లిపోయాడు. తర్వాత అతను తన స్నేహితుల్ని, తన భార్య జెరెషును+ పిలిపించాడు.
11 హామాను తనకున్న గొప్ప సంపదల గురించి, తనకు చాలామంది కుమారులు+ ఉండడం గురించి, రాజు తనకు పదోన్నతిని ఇచ్చి అధిపతులకన్నా, రాజ సేవకులకన్నా తనను ఉన్నత స్థానంలో ఉంచడం+ గురించి గొప్పలు చెప్పుకున్నాడు.
12 హామాను ఇంకా ఇలా అన్నాడు: “అంతేకాదు, ఎస్తేరు రాణి తాను సిద్ధం చేసిన విందుకు రాజుతోపాటు నన్ను తప్ప ఇంకెవర్నీ ఆహ్వానించలేదు.+ రేపటి విందుకు కూడా రాజుతోపాటు రమ్మని ఆమె నన్ను ఆహ్వానించింది.+
13 అయితే రాజగృహ ద్వారం దగ్గర యూదుడైన ఆ మొర్దెకై కనిపించినంత కాలం ఇవేవీ నన్ను సంతోషపెట్టలేవు.”
14 దాంతో అతని భార్య జెరెషు, అతని స్నేహితులందరు ఇలా అన్నారు: “50 మూరల* ఎత్తున్న కొయ్య ఒకటి నిలబెట్టించు. ఉదయం వెళ్లి, మొర్దెకైని ఆ కొయ్య మీద వేలాడదీయించమని+ రాజుతో చెప్పు. తర్వాత రాజుతో కలిసి వెళ్లి విందును ఆస్వాదించు.” హామానుకు ఆ సలహా నచ్చి ఒక కొయ్యను నిలబెట్టించాడు.
అధస్సూచీలు
^ లేదా “రాజభవనానికి.”
^ లేదా “సగం వరకు.”
^ లేదా “సగం వరకు.”
^ దాదాపు 22.3 మీటర్లు (73 అడుగులు). అనుబంధం B14 చూడండి.