ఎస్తేరు 7:1-10
7 అలా రాజు, హామాను+ కలిసి ఎస్తేరు రాణి ఏర్పాటు చేసిన విందుకు వచ్చారు.
2 రెండో రోజు కూడా విందు చివర్లో, ద్రాక్షారసం తాగే సమయంలో రాజు ఎస్తేరుతో, “ఎస్తేరు రాణీ, నీ విన్నపం ఏంటి? అది నీకిస్తాను! నీ మనవి ఏంటి? నా రాజ్యంలో సగం* అడిగినా సరే నీకిస్తాను!” అన్నాడు.+
3 అప్పుడు ఎస్తేరు రాణి ఇలా అంది: “రాజా! నామీద నీ దయ ఉంటే, నీకు ఇష్టమైతే నాకు ప్రాణభిక్ష పెట్టు, ఇదే నా విన్నపం; నా ప్రజల+ ప్రాణాలు కాపాడు, ఇదే నా మనవి.
4 ఎందుకంటే నేను, నా ప్రజలు అమ్మేయబడ్డాం;+ మమ్మల్ని చంపబోతున్నారు, సమూలంగా నాశనం చేయబోతున్నారు.+ మేము కేవలం దాసులుగా, దాసురాళ్లుగా అమ్మబడి ఉంటే, నేను మౌనంగా ఉండేదాన్ని. కానీ ఈ విపత్తు వల్ల రాజుకు చాలా నష్టం కలుగుతుంది, కాబట్టి ఇలా జరగనివ్వకూడదు.”
5 అప్పుడు అహష్వేరోషు రాజు ఎస్తేరు రాణిని, “ఎవరతను? ఇలాంటి పని చేయడానికి తెగించిన ఆ వ్యక్తి ఎక్కడున్నాడు?” అని అడిగాడు.
6 అందుకు ఎస్తేరు, “ఆ విరోధి, శత్రువు ఈ చెడ్డ హామానే!” అని అంది.
రాజును, రాణిని చూసి హామాను భయంతో వణికిపోయాడు.
7 రాజు చాలా కోపంతో ద్రాక్షారసపు విందు నుండి లేచి, రాజభవనం తోటలోకి వెళ్లాడు; కానీ హామాను తన ప్రాణాలు కాపాడమని ఎస్తేరు రాణిని బ్రతిమాలడానికి లేచి నిలబడ్డాడు, ఎందుకంటే రాజు తనను శిక్షించాలని నిశ్చయించుకున్నట్టు అతనికి అర్థమైంది.
8 రాజు రాజభవనం తోట నుండి ద్రాక్షారసపు విందు జరిగిన గృహానికి తిరిగొచ్చినప్పుడు, ఎస్తేరు పరుపు మీద హామాను పడివుండడం చూసి, “వీడు నా ఇంట్లోనే రాణిపై అత్యాచారం చేయడానికి కూడా తెగించాడా?” అని అరిచాడు. రాజు నోటి నుండి ఆ మాట రావడం ఆలస్యం, హామాను తలకు ముసుగు వేశారు.
9 అప్పుడు రాజు ఆస్థాన అధికారుల్లో ఒకడైన హర్బోనా,+ “రాజు ప్రాణాల్ని కాపాడిన సమాచారం అందించిన+ మొర్దెకై కోసం హామాను ఒక కొయ్యను కూడా సిద్ధం చేశాడు.+ 50 మూరల* ఎత్తున్న ఆ కొయ్య హామాను ఇంటి దగ్గర నిలబెట్టబడివుంది” అని చెప్పాడు. దాంతో రాజు, “ఆ కొయ్య మీద వీణ్ణే వేలాడదీయండి” అని అన్నాడు.
10 కాబట్టి వాళ్లు, మొర్దెకై కోసం హామాను సిద్ధం చేసిన కొయ్య మీద హామానునే వేలాడదీశారు, అప్పుడు రాజు కోపం చల్లారింది.