కొలొస్సయులు 1:1-29

  • శుభాకాంక్షలు (1, 2)

  • కొలొస్సయుల విశ్వాసాన్ని బట్టి కృతజ్ఞతలు (3-8)

  • సరైన జ్ఞానం విషయంలో ఎదుగుతూ ఉండమని ప్రార్థన (9-12)

  • క్రీస్తు కీలక పాత్ర (13-23)

  • సంఘం కోసం పౌలు పడిన కష్టం (24-29)

1  దేవుని ఇష్టప్రకారం క్రీస్తుయేసుకు అపొస్తలుడినైన పౌలు అనే నేను, మన సహోదరుడైన తిమోతి+  కొలొస్సయిలో క్రీస్తు శిష్యులుగా ఉన్న పవిత్రులకు, నమ్మకమైన సహోదరులకు రాస్తున్న ఉత్తరం. మన తండ్రైన దేవుడు మీకు అపారదయను, శాంతిని అనుగ్రహించాలి.  మేము మీ గురించి ప్రార్థించినప్పుడల్లా, మన ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రైన దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాం.  ఎందుకంటే, క్రీస్తుయేసు మీద మీకున్న విశ్వాసం గురించి, పవిత్రులందరి మీద మీకున్న ప్రేమ గురించి మేము విన్నాం.  పరలోకంలో మీకోసం సిద్ధంగా ఉన్నవాటి మీద మీకున్న నిరీక్షణ+ వల్ల మీరు ఆ ప్రేమ చూపిస్తున్నారు. మంచివార్త గురించిన సత్యం మీకు ప్రకటించబడినప్పుడు మీరు ఆ నిరీక్షణ గురించి విన్నారు.  మంచివార్త ఫలించి ప్రపంచమంతటా వ్యాపిస్తున్నట్టే,+ మీ మధ్య కూడా ఫలించి వ్యాపిస్తోంది. మీరు దేవుని అపారదయ గురించిన సత్యాన్ని విని, దాన్ని సరిగ్గా అర్థంచేసుకున్న రోజు నుండి అలా జరుగుతోంది.  మా ప్రియమైన తోటి దాసుడూ క్రీస్తుకు నమ్మకమైన పరిచారకుడూ అయిన ఎపఫ్రా+ దగ్గర మీరు నేర్చుకున్నది ఆ సత్యాన్నే.  మీరు దేవుని పవిత్రశక్తి సహాయంతో అలవర్చుకున్న ప్రేమ గురించి అతనే మాకు చెప్పాడు.  అందుకే, అది విన్న రోజు నుండి మేము మానకుండా మీ గురించి ప్రార్థిస్తూ ఉన్నాం.+ మీరు అసలైన తెలివిని, పవిత్రశక్తి ఇచ్చే అవగాహనను పొంది+ దేవుని ఇష్టం గురించిన సరైన జ్ఞానంతో నిండివుండాలని;+ 10  మీరు ప్రతీ మంచిపని చేస్తూ, దేవుని గురించిన సరైన జ్ఞానం విషయంలో ఎదుగుతూ+ ఆయన్ని పూర్తిగా సంతోషపెట్టేలా యెహోవాకు* తగినట్టు నడుచుకోవాలని; 11  మీరు ఓర్పుతో, సంతోషంతో అన్నిటినీ సహించేలా దేవుని గొప్పశక్తి మీకు కావాల్సిన బలాన్ని ఇవ్వాలని;+ 12  వెలుగులో ఉన్న పవిత్రులకు తాను ఇచ్చే స్వాస్థ్యంలో భాగం పొందేలా+ మిమ్మల్ని అర్హుల్ని చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు తెలుపుతూ ఉండాలని ప్రార్థిస్తున్నాం. 13  దేవుడు మనల్ని చీకటి అధికారం నుండి విడిపించి,+ తన ప్రియ కుమారుని రాజ్యంలోకి తెచ్చాడు. 14  ఆ కుమారుని ద్వారానే విమోచన క్రయధనం* వల్ల మనం విడుదలయ్యాం, అంటే మన పాపాలకు క్షమాపణ దొరికింది.+ 15  ఆయన, కనిపించని దేవుని ప్రతిబింబం,+ మొత్తం సృష్టిలో మొట్టమొదట పుట్టినవాడు;+ 16  మిగతా వాటన్నిటినీ, అంటే అటు పరలోకంలో ఇటు భూమ్మీద, కనిపించేవాటినీ కనిపించనివాటినీ అవి సింహాసనాలైనా, పరిపాలనలైనా, ప్రభుత్వాలైనా, అధికారాలైనా అన్నిటినీ దేవుడు ఆయన్ని ఉపయోగించుకునే సృష్టించాడు.+ అన్నీ ఆయన ద్వారా,+ ఆయన కోసం సృష్టించబడ్డాయి. 17  అంతేకాదు, ఆ కుమారుడు మిగతా వాటన్నిటికన్నా ముందే ఉన్నాడు,+ దేవుడు ఆయన్ని ఉపయోగించుకునే వాటన్నిటినీ ఉనికిలోకి తెచ్చాడు. 18  సంఘమనే శరీరానికి ఆయనే శిరస్సు.*+ ఆయనే అన్నిటికీ ఆరంభం. మృతుల్లో నుండి మొట్టమొదట బ్రతికించబడింది కూడా ఆయనే,+ అలా ఆయన అన్నిట్లో మొదటివాడు అయ్యాడు; 19  ఎందుకంటే, అన్నిటినీ ఆయనలో సంపూర్ణం చేయడం+ దేవునికి నచ్చింది. 20  అంతేకాదు అన్నీ, అంటే ఇటు భూమ్మీద ఉన్నవి, అటు పరలోకంలో ఉన్నవి ఆ కుమారుని ద్వారా మళ్లీ తనతో శాంతియుత సంబంధం కలిగివుండేలా చేయడం+ దేవునికి నచ్చింది. ఆ కుమారుడు హింసాకొయ్య* మీద చిందించిన రక్తం వల్లే అది సాధ్యమైంది.+ 21  నిజంగానే, ఒకప్పుడు మీరు దేవునికి దూరంగా ఉండేవాళ్లు, దేవునికి శత్రువులుగా ఉండేవాళ్లు; ఎందుకంటే, మీ మనసు చెడ్డవాటి మీద ఉండేది; 22  కానీ ఇప్పుడు, శరీరాన్ని అర్పించిన తన కుమారుని మరణం ద్వారా మీరు మళ్లీ తనతో శాంతియుత సంబంధం కలిగివుండేలా దేవుడు చేశాడు. మిమ్మల్ని తన ముందు పవిత్రులుగా, మచ్చలేనివాళ్లుగా, నిందలేనివాళ్లుగా నిలబెట్టుకోవాలని+ ఆయన అలా చేశాడు. 23  అయితే అందుకోసం మీరు మీ విశ్వాసాన్ని పునాది+ మీద స్థాపించుకుని, స్థిరంగా ఉంటూ+ అందులో కొనసాగాలి.+ అంతేకాదు, మీరు ఏ మంచివార్తనైతే విన్నారో, ఏ మంచివార్తయితే భూమంతటా* ప్రకటించబడిందో+ ఆ మంచివార్త ఇచ్చిన నిరీక్షణ నుండి మీరు పక్కకు వెళ్లకూడదు. పౌలు అనే నేను ఆ మంచివార్తకే పరిచారకుణ్ణి అయ్యాను. 24  ఇప్పుడు నేను మీకోసం పడుతున్న బాధల్ని బట్టి సంతోషిస్తున్నాను; క్రీస్తు విషయంలో ఆయన శరీరం కోసం, అంటే సంఘం కోసం+ నేను* అనుభవించాల్సి ఉన్న శ్రమల్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను.+ 25  దేవుడు నాకు అప్పగించిన బాధ్యత+ ప్రకారం ఆ సంఘానికే నేను పరిచారకుణ్ణి అయ్యాను. మీకు ప్రయోజనం కలిగేలా దేవుని వాక్యాన్ని పూర్తిగా ప్రకటించాలని, 26  అంటే ఎన్నో యుగాలుగా,* ఎన్నో తరాలుగా దాచబడిన+ పవిత్ర రహస్యాన్ని+ ప్రకటించాలని దేవుడు నాకు ఆ బాధ్యతను అప్పగించాడు. ఆ రహస్యం ఇప్పుడు దేవుని పవిత్రులకు బయల్పర్చబడింది;+ 27  అలాగే అన్యజనుల్లో ప్రకటించబడుతున్న ఆ పవిత్ర రహస్యం గొప్ప సంపదల్ని పవిత్రులైన మీకు వెల్లడిచేయడం దేవునికి నచ్చింది.+ మీరు క్రీస్తుతో ఐక్యమవ్వడం, ఆయనతో పాటు మహిమపర్చబడడం+ అన్నదే ఆ రహస్యం. 28  దేవుని ముందు ప్రతీ ఒక్కర్ని పరిణతిగల క్రీస్తు శిష్యునిగా నిలబెట్టడం కోసం+ క్రీస్తు గురించే మనం ప్రతీ ఒక్కరికి ప్రకటిస్తున్నాం, ఉపదేశిస్తున్నాం, పూర్తి తెలివితో బోధిస్తున్నాం. 29  ఇందుకోసమే నేను కష్టపడుతున్నాను, నాలో బలంగా పనిచేస్తున్న ఆయన శక్తి సహాయంతో తీవ్రంగా కృషిచేస్తున్నాను.+

అధస్సూచీలు

అనుబంధం A5 చూడండి.
పదకోశం చూడండి.
లేదా “తల.”
పదకోశం చూడండి.
లేదా “ఆకాశం కింద ఉన్న సృష్టంతటికీ.”
అక్ష., “నా శరీరంలో.”
అక్ష., “గత వ్యవస్థల్లో.” పదకోశం చూడండి.