జెకర్యా 14:1-21
14 “ఇదిగో! ఆ రోజు వస్తోంది, అది యెహోవాకు చెందిన రోజు; అప్పుడు నీ* దగ్గర కొల్లగొట్టబడిన సొమ్ము నీ ముందే పంచిపెట్టబడుతుంది.
2 యెరూషలేము మీద యుద్ధం చేయడానికి నేను అన్నిదేశాల్ని పోగుచేస్తాను; వాళ్లు నగరాన్ని ఆక్రమిస్తారు, ఇళ్లను దోచుకుంటారు, స్త్రీలను చెరుపుతారు. నగరంలోని సగం మంది బందీలుగా తీసుకెళ్లబడతారు, మిగిలినవాళ్లు నగరంలోనే వదిలేయబడతారు.
3 “యెహోవా బయల్దేరి వెళ్లి, యుద్ధం రోజున పోరాడే విధంగా+ ఆ దేశాలతో యుద్ధం చేస్తాడు.+
4 ఆ రోజున, ఆయన పాదాలు యెరూషలేముకు తూర్పున ఉన్న ఒలీవల కొండ మీద ఉంటాయి;+ అప్పుడు ఒలీవల కొండ తూర్పు* నుండి పడమర* వరకు మధ్యలో చీలిపోయి, చాలా పెద్ద లోయ ఏర్పడుతుంది; సగం కొండ ఉత్తరం వైపుకు, సగం కొండ దక్షిణం వైపుకు జరుగుతుంది.
5 మీరు నా కొండల మధ్య ఉన్న లోయకు పారిపోతారు, ఎందుకంటే ఆ కొండల మధ్య ఉన్న లోయ ఆజేలు వరకు విస్తరిస్తుంది. యూదా రాజైన ఉజ్జియా కాలంలో భూకంపం వచ్చినప్పుడు+ పారిపోయినట్టు మీరు పారిపోవాల్సి వస్తుంది. అప్పుడు నా దేవుడైన యెహోవా వస్తాడు, పవిత్రులందరూ ఆయనతో ఉంటారు.+
6 “ఆ రోజు, ప్రకాశవంతమైన వెలుగు కొంచెం కూడా ఉండదు,+ వస్తువులు గడ్డకట్టుకుపోతాయి.
7 ఆ రోజు ప్రత్యేకమైన రోజు అవుతుంది, అది యెహోవాకు చెందిన రోజు అని పిలవబడుతుంది.+ అప్పుడు పగలూరాత్రీ అనే తేడా ఉండదు; సాయంత్రం సమయంలో కూడా వెలుగు ఉంటుంది.
8 ఆ రోజున, యెరూషలేము నుండి జీవజలాలు+ బయటికి ప్రవహిస్తాయి,+ సగం తూర్పు సముద్రం* వైపుకు,+ సగం పడమటి సముద్రం*+ వైపుకు ప్రవహిస్తాయి. ఎండాకాలంలో, చలికాలంలో కూడా ప్రవహిస్తాయి.
9 అప్పుడు యెహోవా భూమంతటికీ రాజుగా ఉంటాడు.+ ఆ రోజున, ప్రతీ ఒక్కరు యెహోవాను మాత్రమే ఆరాధిస్తారు,+ వాళ్లు ఆయన పేరును మాత్రమే స్తుతిస్తారు.+
10 “గెబా+ నుండి యెరూషలేముకు దక్షిణాన రిమ్మోను+ వరకు దేశమంతా అరాబాలా+ ఉంటుంది; ఆమె లేచి తన స్థలంలో, అంటే బెన్యామీను ద్వారం+ నుండి మొదటి ద్వారం వరకూ, మూల ద్వారం వరకూ, అలాగే హనన్యేలు గోపురం+ నుండి రాజు ద్రాక్ష తొట్ల* వరకూ ఉన్న స్థలంలో నివసిస్తుంది.+
11 దానిలో ప్రజలు నివసిస్తారు; మళ్లీ ఇక ఎప్పుడూ దాని మీదికి నాశనం అనే శాపం రాదు,+ యెరూషలేములోని ప్రజలు సురక్షితంగా నివసిస్తారు.+
12 “యెరూషలేముతో యుద్ధం చేసే దేశాలన్నిటినీ యెహోవా ఈ తెగులుతో మొత్తుతాడు:+ వాళ్లు తమ పాదాల మీద నిలబడి ఉండగానే వాళ్ల శరీరం కుళ్లిపోతుంది, వాళ్ల కళ్లు వాళ్ల కనుగుంటల్లోనే కుళ్లిపోతాయి, వాళ్ల నాలుకలు వాళ్ల నోళ్లలోనే కుళ్లిపోతాయి.
13 “ఆ రోజున యెహోవా వాళ్లను పూర్తిగా అయోమయంలో పడేస్తాడు; ప్రతీ ఒక్కరు తమ సహవాసి చెయ్యి పట్టుకుని ఈడ్చుకెళ్తారు, వాళ్ల చెయ్యి వాళ్ల సహవాసి చెయ్యి మీదికి లేస్తుంది.*+
14 యెరూషలేములో జరిగే యుద్ధంలో యూదా కూడా పాల్గొంటుంది; చుట్టుపక్కలున్న దేశాలన్నిటి సంపద అంటే బంగారం, వెండి, వస్త్రాలు భారీ ఎత్తున పోగుచేయబడతాయి.+
15 “అలాంటి తెగులు శత్రువుల శిబిరాల్లోని గుర్రాల మీదికి, కంచర గాడిదల మీదికి, ఒంటెల మీదికి, గాడిదల మీదికి, పశువులన్నిటి మీదికి కూడా వస్తుంది.
16 “యెరూషలేము మీదికి వచ్చే దేశాల్లో మిగిలినవాళ్లు ఏటేటా రాజుకు, అంటే సైన్యాలకు అధిపతైన యెహోవాకు వంగి నమస్కరించడానికి,*+ పర్ణశాలల* పండుగను+ జరుపుకోవడానికి వస్తారు.+
17 అయితే భూమ్మీద ఉన్న కుటుంబాల్లో ఏదైనా ఒకటి రాజుకు, అంటే సైన్యాలకు అధిపతైన యెహోవాకు వంగి నమస్కరించడానికి యెరూషలేముకు రాకపోతే, దాని మీద వర్షం అస్సలు కురవదు.+
18 ఒకవేళ ఐగుప్తులోని ఒక కుటుంబం యెరూషలేముకు రాకపోతే, వాళ్ల మీద వర్షం కురవదు. బదులుగా, పర్ణశాలల పండుగను జరుపుకోవడానికి రాని దేశాల మీదికి యెహోవా తెచ్చే తెగులు వాళ్ల మీదికి వస్తుంది.
19 ఐగుప్తు దేశ పాపానికి, పర్ణశాలల పండుగ జరుపుకునేందుకు యెరూషలేముకు రాని దేశాల పాపానికి పడే శిక్ష ఇదే.
20 “ఆ రోజున, ‘పవిత్రత యెహోవాకు చెందుతుంది!’ అనే మాట గుర్రాల గంటల మీద రాసి ఉంటుంది. యెహోవా మందిరంలోని వంటపాత్రలు*+ బలిపీఠం ముందు ఉండే గిన్నెల్లా+ ఉంటాయి.
21 యెరూషలేము, యూదాల్లోని ప్రతీ వంటపాత్ర* పవిత్రంగా ఉంటుంది, సైన్యాలకు అధిపతైన యెహోవాకు చెందుతుంది; బలి ఇచ్చే వాళ్లందరూ లోపలికి వచ్చి, ఆ పాత్రల్లో కొన్నిటిని ఉడకబెట్టుకోవడానికి ఉపయోగిస్తారు. ఆ రోజున, సైన్యాలకు అధిపతైన యెహోవా మందిరంలో ఏ కనానీయుడూ* ఉండడు.”+
అధస్సూచీలు
^ అంటే, 2వ వచనంలో ప్రస్తావించిన నగరం.
^ లేదా “సూర్యోదయం వైపు.”
^ అక్ష., “సముద్రం.”
^ అంటే, మధ్యధరా సముద్రం.
^ అంటే, మృత సముద్రం.
^ లేదా “గానుగల.”
^ లేదా “ఒకరు ఇంకొకరి మీద దాడిచేస్తారు.”
^ లేదా “తాత్కాలిక ఆశ్రయాల.”
^ లేదా “ఆరాధించడానికి.”
^ లేదా “వెడల్పాటి మూతిగల వంటపాత్రలు.”
^ లేదా “వెడల్పాటి మూతిగల వంటపాత్ర.”
^ లేదా “వర్తకుడూ” అయ్యుంటుంది.