జెకర్యా 3:1-10

  • 4వ దర్శనం: ప్రధానయాజకుని వస్త్రాల్ని మార్చడం (1-10)

    • ప్రధానయాజకుడైన యెహోషువను సాతాను ఎదిరించడం (1)

    • ‘మొలక అనే నా సేవకుణ్ణి తీసుకొస్తాను!’ (8)

3  తర్వాత ఆయన నాకు యెహోవా దూత ముందు నిలబడిన ప్రధానయాజకుడైన యెహోషువను+ చూపించాడు, అతన్ని ఎదిరించడానికి సాతాను+ అతని కుడిపక్కన నిలబడి ఉన్నాడు.  అప్పుడు యెహోవా దూత సాతానుతో ఇలా అన్నాడు: “సాతానూ, యెహోవా నిన్ను గద్దించాలి!+ అవును, యెరూషలేమును ఎంచుకున్న యెహోవా నిన్ను గద్దించాలి! ఇతను* మంటల్లో నుండి లాగబడిన కొయ్యే  కదా?”  అప్పుడు యెహోషువ మురికి వస్త్రాలతో దేవదూత ముందు నిలబడి ఉన్నాడు.  దేవదూత అక్కడున్న వాళ్లతో, “అతని మురికి వస్త్రాల్ని తీసేయండి” అని చెప్పాడు. తర్వాత దేవదూత అతనితో “ఇదిగో, నేను నీ దోషాన్ని* తీసేశాను, నీకు శ్రేష్ఠమైన వస్త్రాలు తొడగబడతాయి”+ అన్నాడు.  కాబట్టి నేను, “అతని తలపై ఒక శుభ్రమైన తలపాగా పెట్టండి”+ అన్నాను. అప్పుడు వాళ్లు అతని తలపై శుభ్రమైన తలపాగా పెట్టి, అతనికి వస్త్రాలు తొడిగారు; యెహోవా దూత ఆ దగ్గర్లో నిలబడి ఉన్నాడు.  తర్వాత యెహోవా దూత యెహోషువకు ఇలా ప్రకటించాడు:  “సైన్యాలకు అధిపతైన యెహోవా చెప్పేదేమిటంటే, ‘నువ్వు నా మార్గాల్లో నడుస్తూ, నా ముందు నీ బాధ్యతల్ని నెరవేరిస్తే, నువ్వు నా మందిరంలో న్యాయమూర్తిగా సేవచేస్తావు,+ నా ప్రాంగణాల్ని చూసుకుంటావు;* ఇక్కడ నిల్చున్న వాళ్లలాగే నీకు కూడా నా సన్నిధిలోకి వచ్చే అవకాశం  ఇస్తాను.’  “ ‘ప్రధానయాజకుడివైన యెహోషువా, దయచేసి నువ్వూ, నీ ముందు కూర్చునే నీ సహచరులూ వినండి, ఎందుకంటే మీరు ఒక సూచనగా ఉన్నారు; ఇదిగో! నేను నా సేవకుణ్ణి+ తీసుకొస్తున్నాను, అతని పేరు మొలక!+  యెహోషువ ముందు నేను ఉంచిన రాయిని చూడు! ఆ రాయి మీద ఏడు కళ్లు ఉన్నాయి; నేను ఆ రాయి మీద ఒక మాట చెక్కుతున్నాను, నేను ఈ దేశపు అపరాధాన్ని ఒక్కరోజులో తీసేస్తాను’+ అని సైన్యాలకు అధిపతైన యెహోవా ప్రకటిస్తున్నాడు. 10  “ ‘ఆ రోజున, మీలో ప్రతీ ఒక్కరు మీ ద్రాక్షచెట్టు కిందికి, అంజూర చెట్టు కిందికి రమ్మని మీ పొరుగువాళ్లను ఆహ్వానిస్తారు’+ అని సైన్యాలకు అధిపతైన యెహోవా ప్రకటిస్తున్నాడు.”

అధస్సూచీలు

అంటే, యెహోషువ.
లేదా “అపరాధాన్ని.”
లేదా “అధికారిగా ఉంటావు; కాపలా కాస్తావు.”