నిర్గమకాండం 10:1-29

  • 8వ తెగులు: మిడతలు (1-20)

  • 9వ తెగులు: చీకటి (21-29)

10  తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు ఫరో దగ్గరికి వెళ్లు, ఎందుకంటే నేను అతని హృదయాన్ని, అతని సేవకుల హృదయాల్ని మొద్దుబారిపోనిచ్చాను.+ నేను ఈ అద్భుతాల్ని అతని కళ్లముందే చేయాలనీ,+  అలాగే నేను ఐగుప్తు దేశాన్ని ఎంత కఠినంగా శిక్షించానో, ఆ ప్రజల మధ్య ఎలాంటి అద్భుతాలు చేశానో నువ్వు నీ కుమారులకు, నీ మనవళ్లకు ప్రకటించాలనీ+ అలా చేశాను; నేను యెహోవానని మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు.”  కాబట్టి మోషే, అహరోనులు ఫరో దగ్గరికి వెళ్లి అతనితో ఇలా అన్నారు: “హెబ్రీయుల దేవుడైన యెహోవా చెప్పేదేమిటంటే, ‘ఎంతకాలం నువ్వు నాకు లొంగకుండా ఉంటావు?+ నా ప్రజలు నన్ను సేవించేలా వాళ్లను పంపించేయి.  నువ్వు నా ప్రజల్ని పంపించకుండా ఇలాగే నిరాకరిస్తూ ఉంటే, ఇదిగో! రేపు నీ సరిహద్దుల లోపలికి నేను మిడతల్ని తీసుకొస్తాను.  అవి నేల కనిపించనంతగా భూమిని కప్పేస్తాయి. వడగండ్ల వాన తర్వాత మీకు మిగిలిందంతా అవి తినేస్తాయి, పొలంలో పెరిగే చెట్లన్నిటినీ అవి తినేస్తాయి.+  నీ ఇళ్లు, నీ సేవకులందరి ఇళ్లు, ఐగుప్తులోని వాళ్లందరి ఇళ్లు వాటితో నిండిపోతాయి. ఎంతగా అంటే నీ తాతలు, తండ్రులు తాము ఈ దేశంలో ఉన్నప్పటి నుండి ఇప్పటివరకు అలాంటిది చూడలేదు.’ ”+ తర్వాత మోషే ఫరో దగ్గర నుండి వెళ్లిపోయాడు.  ఆ తర్వాత ఫరో సేవకులు అతనితో, “ఈ మనిషి ఎంతకాలం మనకు ఉరిగా* ఉంటాడు? ఆ ప్రజలు తమ దేవుడైన యెహోవాను సేవించేలా వాళ్లను పంపించేయి. ఐగుప్తు నాశనమైపోయిందనే విషయం నీకింకా అర్థంకావట్లేదా?” అన్నారు.  కాబట్టి మోషే, అహరోనుల్ని మళ్లీ ఫరో దగ్గరికి తీసుకొచ్చారు, అప్పుడు ఫరో వాళ్లతో ఇలా అన్నాడు: “వెళ్లి, మీ దేవుడైన యెహోవాను సేవించండి. అయితే ఎవరెవరు వెళ్తారో చెప్పండి.”  అప్పుడు మోషే ఇలా అన్నాడు: “మేము మా యౌవనుల్ని, వృద్ధుల్ని, మా కుమారుల్ని, కూతుళ్లను, మా గొర్రెల్ని, పశువుల్ని తీసుకొని వెళ్తాం.+ ఎందుకంటే మేము యెహోవాకు పండుగ ఆచరిస్తాం.”+ 10  అప్పుడు ఫరో వాళ్లతో ఇలా అన్నాడు: “నేను నిజంగా మిమ్మల్ని, మీ పిల్లల్ని పంపిస్తానని అనుకుంటున్నారా? అదే జరిగితే, యెహోవా నిజంగా మీకు తోడు ఉన్నట్టే!+ మీ మనసులో ఏదో దురుద్దేశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. 11  మీ అందర్నీ నేను పంపించను! యెహోవాను సేవించడానికి మీలోని పురుషులు మాత్రమే వెళ్లొచ్చు. మీరు అడిగింది కూడా అదే కదా.” దాంతో మోషే, అహరోనుల్ని ఫరో ముందు నుండి వెళ్లగొట్టేశారు. 12  తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “మిడతలు వచ్చేలా ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపు. అప్పుడవి ఐగుప్తు దేశం మీదికి వచ్చి దేశంలోని మొక్కలన్నిటినీ, వడగండ్ల వాన తర్వాత మిగిలిన దాన్నంతటినీ తినేస్తాయి.” 13  వెంటనే మోషే తన కర్రను ఐగుప్తు దేశం మీద చాపాడు. అప్పుడు యెహోవా ఆ రోజంతా, అలాగే ఆ రాత్రంతా దేశం మీద తూర్పు గాలి వీచేలా చేశాడు. తెల్లవారినప్పుడు, తూర్పు గాలితో పాటు మిడతలు వచ్చాయి. 14  ఐగుప్తు దేశమంతటి మీదికి మిడతలు వచ్చి ఆ దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉండిపోయాయి.+ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది;+ అన్ని మిడతలు అంతకుముందు ఎప్పుడూ లేవు, ఇకముందు కూడా ఉండవు. 15  అవి దేశంలోని నేల అంతటినీ కప్పేశాయి, వాటివల్ల దేశం నల్లగా మారింది; అవి దేశంలోని మొక్కలన్నిటినీ, అలాగే వడగండ్ల వాన తర్వాత మిగిలిన చెట్ల పండ్లన్నిటినీ మింగేశాయి; ఐగుప్తు దేశమంతటా చెట్ల మీద గానీ, పొలంలోని మొక్కల మీద గానీ పచ్చనిది ఏదీ మిగల్లేదు. 16  ఫరో వెంటనే మోషే, అహరోనుల్ని పిలిపించి ఇలా అన్నాడు: “నేను మీ దేవుడైన యెహోవాకు, మీకు వ్యతిరేకంగా పాపం చేశాను. 17  దయచేసి ఈ ఒక్కసారి నా పాపాన్ని మన్నించి, ఈ భయంకరమైన తెగులును నా మీద నుండి తీసేయమని మీ దేవుడైన యెహోవాను వేడుకోండి.” 18  కాబట్టి అతను* ఫరో దగ్గర నుండి వెళ్లిపోయి, యెహోవాను వేడుకున్నాడు.+ 19  అప్పుడు యెహోవా గాలిని మలుపు తిప్పి, దాన్ని బలమైన పడమటి గాలిగా మార్చాడు; ఆ గాలికి మిడతలు కొట్టుకుపోయి ఎర్రసముద్రంలో పడ్డాయి. ఐగుప్తు దేశమంతట్లో ఒక్క మిడత కూడా మిగల్లేదు. 20  అయితే యెహోవా ఫరో హృదయాన్ని కఠినం అవ్వనిచ్చాడు,+ కాబట్టి అతను ఇశ్రాయేలీయుల్ని పంపించలేదు. 21  తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఐగుప్తు దేశాన్ని కటిక చీకటి కమ్ముకునేలా నీ చేతిని ఆకాశం వైపు చాపు.” 22  మోషే వెంటనే తన చేతిని ఆకాశం వైపు చాపాడు, దాంతో మూడు రోజుల పాటు ఐగుప్తు దేశమంతా కటిక చీకటి కమ్ముకుంది.+ 23  దానివల్ల వాళ్లు ఒకరినొకరు చూడలేకపోయారు, మూడు రోజులపాటు ఎక్కడున్నవాళ్లు అక్కడే ఉండిపోయారు. అయితే ఇశ్రాయేలీయులు నివసించిన ప్రాంతాలన్నిట్లో వెలుగు ఉంది.+ 24  తర్వాత ఫరో మోషేను పిలిపించి ఇలా అన్నాడు: “వెళ్లి యెహోవాను సేవించండి.+ మీ గొర్రెలు, పశువులు మాత్రమే ఇక్కడుంటాయి. మీ పిల్లల్ని కూడా మీతోపాటు తీసుకెళ్లొచ్చు.” 25  కానీ మోషే ఇలా అన్నాడు: “అర్పణల్ని, దహనబలుల్ని అర్పించడానికి కావాల్సిన జంతువుల్ని కూడా నువ్వే మాకిస్తావు,* వాటిని మేము మా దేవుడైన యెహోవాకు అర్పిస్తాం.+ 26  మా పశువుల్ని కూడా మాతోపాటు తీసుకెళ్తాం. ఒక్క జంతువును* కూడా ఇక్కడ ఉండనివ్వం. ఎందుకంటే వాటిలో కొన్నిటిని మేము మా దేవుడైన యెహోవాను ఆరాధించడానికి ఉపయోగిస్తాం. పైగా మేము అక్కడికి వెళ్లే వరకు యెహోవా ఆరాధనలో వేటిని అర్పిస్తామో మాకు తెలీదు.” 27  అయితే యెహోవా ఫరో హృదయాన్ని కఠినం అవ్వనిచ్చాడు, కాబట్టి అతను వాళ్లను పంపించడానికి ఒప్పుకోలేదు.+ 28  తర్వాత ఫరో మోషేతో ఇలా అన్నాడు: “నా కళ్లముందు నుండి వెళ్లిపో! మళ్లీ నా ముఖం చూడకుండా జాగ్రత్తపడు. ఏ రోజైతే నువ్వు నా ముఖం చూస్తావో, ఆ రోజు నువ్వు చస్తావు.” 29  దానికి మోషే, “సరే, నువ్వు చెప్పినట్టే నేను మళ్లీ నీ ముఖం చూడడానికి ప్రయత్నించను” అన్నాడు.

అధస్సూచీలు

లేదా “మనల్ని బెదిరిస్తూ.”
మోషే అని తెలుస్తోంది.
లేదా “తీసుకెళ్లనిస్తావు.”
అక్ష., “ఒక్క డెక్కను.”