నిర్గమకాండం 27:1-21

  • బలిపీఠం (1-8)

  • ప్రాంగణం (9-19)

  • దీపస్తంభం కోసం నూనె (20, 21)

27  “నువ్వు తుమ్మ చెక్కతో ఒక బలిపీఠం చేయాలి;+ దాని పొడవు ఐదు మూరలు,* వెడల్పు ఐదు మూరలు ఉండాలి. ఆ బలిపీఠం చతురస్ర ఆకారంలో ఉండాలి, దాని ఎత్తు మూడు మూరలు ఉండాలి.+  నువ్వు బలిపీఠం నాలుగు మూలల్లో కొమ్ములు+ తయారుచేయాలి; ఆ కొమ్ములు బలిపీఠంలో భాగమై ఉండాలి. నువ్వు బలిపీఠానికి రాగి రేకు తొడగాలి.+  దాని బూడిదను* తీసేయడానికి బాల్చీల్ని, పారల్ని, గిన్నెల్ని, ముళ్ల గరిటల్ని, నిప్పు పాత్రల్ని తయారుచేయాలి; దాని పాత్రలన్నిటినీ రాగితో చేయాలి.+  అలాగే బలిపీఠం కోసం ఒక రాగి జల్లెడ తయారుచేయాలి; దాని నాలుగు మూలల్లో నాలుగు రాగి ఉంగరాలు చేయాలి.  నువ్వు ఆ జల్లెడను బలిపీఠం అంచు కింద పెట్టాలి, అది బలిపీఠం లోపల మధ్యభాగం వరకు ఉంటుంది.  బలిపీఠం కోసం తుమ్మ చెక్కతో కర్రలు చేసి, వాటికి రాగి రేకు తొడగాలి.  బలిపీఠాన్ని మోస్తున్నప్పుడు ఆ కర్రలు దానికి రెండువైపుల ఉండేలా వాటిని ఉంగరాల్లో పెట్టాలి.+  నువ్వు ఆ బలిపీఠాన్ని పలకలతో ఖాళీ పెట్టెలా తయారుచేయాలి. పర్వతం మీద నేను నీకు చూపించినట్టే దాన్ని చేయాలి.+  “అలాగే నువ్వు గుడారానికి ప్రాంగణం ఏర్పాటుచేయాలి.+ ప్రాంగణం దక్షిణం వైపు, పేనిన సన్నని నారతో తయారుచేసిన వేలాడే తెరలు ఉంటాయి. అవి 100 మూరల పొడవు ఉంటాయి.+ 10  దానికి 20 స్తంభాలు, 20 రాగి దిమ్మలు ఉంటాయి. ఆ స్తంభాల కొక్కేల్ని, వాటిని కలిపే ఉంగరాల్ని వెండితో చేయాలి. 11  ప్రాంగణం ఉత్తరం వైపు కూడా 100 మూరల పొడవున వేలాడే తెరలు ఉంటాయి. దానికి 20 స్తంభాలు, 20 రాగి దిమ్మలు ఉంటాయి. ఆ స్తంభాల కొక్కేల్ని, వాటిని కలిపే ఉంగరాల్ని వెండితో చేయాలి. 12  పడమటి వైపున, అంటే ప్రాంగణం వెడల్పున 50 మూరల వరకు వేలాడే తెరలు ఉంటాయి. వాటికి పది స్తంభాలు, పది దిమ్మలు ఉంటాయి. 13  తూర్పు వైపున, అంటే సూర్యుడు ఉదయించే వైపున ప్రాంగణం వెడల్పు 50 మూరలు ఉండాలి. 14  ద్వారానికి కుడిపక్కన 15 మూరల పొడవున వేలాడే తెరలు ఉంటాయి. వాటికి మూడు స్తంభాలు, మూడు దిమ్మలు+ ఉంటాయి. 15  ద్వారానికి ఎడమపక్కన కూడా 15 మూరల పొడవున వేలాడే తెరలు ఉంటాయి. వాటికి మూడు స్తంభాలు, మూడు దిమ్మలు ఉంటాయి. 16  “ప్రాంగణ ప్రవేశ ద్వారానికి 20 మూరల తెర ఉండాలి. ఆ తెరను నీలంరంగు దారం, ఊదారంగు ఉన్ని, ముదురు ఎరుపు దారం, పేనిన సన్నని నారతో అల్లాలి.+ దానికి నాలుగు స్తంభాలు, నాలుగు దిమ్మలు+ ఉండాలి. 17  ప్రాంగణం చుట్టూ ఉండే స్తంభాలన్నిటికీ వెండి కట్లను, వెండి కొక్కేల్ని చేయాలి. కానీ వాటి దిమ్మల్ని రాగితో చేయాలి.+ 18  ప్రాంగణం పొడవు 100 మూరలు,+ వెడల్పు 50 మూరలు, ఎత్తు 5 మూరలు ఉండాలి. దాన్ని పేనిన సన్నని నారతో చేయాలి. దాని దిమ్మల్ని రాగితో చేయాలి. 19  గుడారపు సేవలో ఉపయోగించే పాత్రలన్నిటినీ, వస్తువులన్నిటినీ, దాని మేకుల్ని, అలాగే ప్రాంగణం మేకులన్నిటినీ రాగితో చేయాలి.+ 20  “దీపాలు ఎప్పుడూ మండుతూ వెలుగిచ్చేలా వాటి కోసం స్వచ్ఛమైన, దంచితీసిన ఒలీవ నూనె తెమ్మని నువ్వు ఇశ్రాయేలీయుల్ని ఆజ్ఞాపించాలి.+ 21  ప్రత్యక్ష గుడారంలో, సాక్ష్యపు మందసం+ దగ్గరున్న తెర బయట, యెహోవా ముందు సాయంత్రం నుండి ఉదయం వరకు దీపాలు మండుతూ ఉండేలా+ అహరోను, అతని కుమారులు ఏర్పాటుచేయాలి. ఇది ఇశ్రాయేలీయులు తరతరాలు పాటించాల్సిన శాశ్వత శాసనం.+

అధస్సూచీలు

అప్పట్లో ఒక మూర 44.5 సెంటీమీటర్లతో (17.5 అంగుళాలతో) సమానం. అనుబంధం B14 చూడండి.
లేదా “కొవ్వు బూడిదను,” అంటే, బలి ఇచ్చే జంతువుల కొవ్వులో నానిన బూడిద.