ప్రసంగి 10:1-20

  • కొంచెం తెలివితక్కువతనం తెలివిని ​పాడుచేస్తుంది (1)

  • అసమర్థత ప్రమాదకరం (2-11)

  • మూర్ఖుల కష్టాలు (12-15)

  • పరిపాలకుల తెలివితక్కువతనం (16-20)

    • పక్షి నీ మాటల్ని చెప్పవచ్చు (20)

10  చచ్చిన ఈగల వల్ల పరిమళ తైలం పాడై కంపు కొడుతుంది, అలాగే కొంచెం తెలివితక్కువతనం తెలివిని, ఘనతను పాడుచేస్తుంది.+  తెలివిగలవాళ్ల హృదయం వాళ్లను సరైన దారిలో నడిపిస్తుంది,* కానీ మూర్ఖుల హృదయం వాళ్లను తప్పుదారిలోకి తీసుకెళ్తుంది.*+  తెలివితక్కువవాళ్లు ఏ దారిలో వెళ్లినా, వాళ్లకు వివేచన ఉండదు;+ వాళ్లు తమ తెలివితక్కువతనాన్ని అందరిముందూ చూపించుకుంటారు.+  పరిపాలకుని కోపం* నీ మీద రగులుకుంటే, నీ చోటు నుండి వెళ్లిపోకు;+ ఎందుకంటే ప్రశాంతత పెద్దపెద్ద పాపాల్ని ఆపుతుంది.+  సూర్యుని కింద నేనొక దుఃఖకరమైన విషయాన్ని చూశాను, అధికారంలో ఉన్నవాళ్లు అలాంటి పొరపాటు చేస్తారు.+  అదేంటంటే, తెలివితక్కువవాళ్లను పై స్థానాల్లో ఉంచుతారు, సమర్థులు* మాత్రం కింది స్థానాల్లో ఉండిపోతారు.  సేవకులు గుర్రాలు ఎక్కి తిరగడం, అధిపతులేమో సేవకుల్లా నడుచుకుంటూ వెళ్లడం నేను చూశాను.+  గుంటను తవ్వేవాడు అందులో పడిపోవచ్చు; రాతిగోడను పడగొట్టేవాణ్ణి పాము కాటేయవచ్చు.  రాళ్లు పగలగొట్టేవాడు వాటివల్ల గాయపడొచ్చు, మొద్దులు చీల్చేవాడు వాటివల్ల ప్రమాదంలో పడొచ్చు.* 10  ఇనుప పనిముట్టు మొద్దుబారినప్పుడు దానికి పదును పెట్టకపోతే, పనివాడు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అయితే తెలివితో విజయం సాధించవచ్చు. 11  పాముమంత్రం వేయకముందే పాము కాటేస్తే, నైపుణ్యంగల పాములోడి వల్ల లాభం లేదు. 12  తెలివిగలవాళ్లు తమ మాటలతో అనుగ్రహం సంపాదించుకుంటారు,+ కానీ మూర్ఖుల పెదాలు వాళ్లనే నాశనం చేస్తాయి.+ 13  మూర్ఖులు తెలివితక్కువ మాటలతో మొదలుపెట్టి,+ విపరీతమైన వెర్రి మాటలతో ముగిస్తారు. 14  అయితే తెలివితక్కువవాళ్లు మాట్లాడుతూనే ఉంటారు.+ ముందుముందు ఏం జరుగుతుందో మనిషికి తెలీదు; అతను చనిపోయాక ఏం జరుగుతుందో అతనికి ఎవరు చెప్పగలరు?+ 15  మూర్ఖుని ప్రయాస అతన్ని అలసిపోయేలా చేస్తుంది, ఎందుకంటే నగరానికి వెళ్లే దారి ఎలా కనుక్కోవాలో కూడా అతనికి తెలీదు. 16  ఏ దేశంలోనైతే ఒక పిల్లవాడు రాజుగా ఉంటాడో, అధిపతులు ఉదయాన్నే విందు చేసుకుంటారో ఆ దేశ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది!+ 17  ఏ దేశంలోనైతే గొప్ప వంశానికి చెందిన వ్యక్తి రాజుగా ఉంటాడో, అధిపతులు మత్తుగా ఉండడానికి కాకుండా బలం కోసం సరైన సమయానికి తిని తాగుతారో ఆ దేశం చాలా సంతోషంగా ఉంటుంది!+ 18  విపరీతమైన సోమరితనం వల్ల ఇంటి దూలాలు కుంగిపోతాయి, బద్దకం వల్ల ఇల్లు కురుస్తుంది.*+ 19  నవ్వుల కోసం ఆహారం, జీవితాన్ని ఆనందించడం కోసం ద్రాక్షారసం ఉన్నాయి;+ కానీ డబ్బు అన్నిటికీ పనికొస్తుంది. 20  నీ మనసులో* కూడా రాజును శపించకు,+ నీ పడకగదిలో ధనవంతుల్ని తిట్టుకోకు; ఎందుకంటే ఆకాశంలో ఎగిరే పక్షి* ఆ సందేశాన్ని చేరవేయవచ్చు, రెక్కలున్న ప్రాణి ఆ విషయాన్ని తెలియజేయవచ్చు.

అధస్సూచీలు

అక్ష., “కుడిచేతి దగ్గర ఉంటుంది.”
అక్ష., “ఎడమచేతి దగ్గర ఉంటుంది.”
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
అక్ష., “ధనవంతులు.”
లేదా “వాటితో జాగ్రత్తగా ఉండాలి” అయ్యుంటుంది.
లేదా “కారుతుంది.”
లేదా “నీ మంచం మీద” అయ్యుంటుంది.
లేదా “రెక్కలుగల ప్రాణి.”