యిర్మీయా 28:1-17

  • యిర్మీయా, అబద్ధ ప్రవక్త హనన్యా (1-17)

28  అదే సంవత్సరం, అంటే యూదా రాజైన సిద్కియా+ పరిపాలన ఆరంభంలోని నాలుగో సంవత్సరం, ఐదో నెలలో గిబియోనుకు+ చెందిన అజ్జూరు కుమారుడైన హనన్యా ప్రవక్త యెహోవా మందిరంలో యాజకుల ముందు, ప్రజలందరి ముందు నాతో ఇలా అన్నాడు:  “ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను బబులోను రాజు కాడిని విరగ్గొడతాను.+  బబులోను రాజు నెబుకద్నెజరు ఈ స్థలం నుండి బబులోనుకు తీసుకెళ్లిన యెహోవా మందిరంలోని పాత్రలన్నిటినీ నేను రెండు సంవత్సరాల్లోనే వెనక్కి తీసుకొస్తున్నాను.’ ”+  “ ‘యెహోయాకీము+ కుమారుడూ యూదా రాజూ అయిన యెకొన్యాను,+ బబులోనుకు బందీలుగా వెళ్లిన యూదా వాళ్లందర్నీ+ నేను వెనక్కి తీసుకొస్తాను. ఎందుకంటే, నేను బబులోను రాజు కాడిని విరగ్గొడతాను’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.”  అప్పుడు యిర్మీయా ప్రవక్త యెహోవా మందిరంలో నిలబడివున్న యాజకుల ముందు, ప్రజలందరి ముందు హనన్యా ప్రవక్తతో మాట్లాడాడు.  యిర్మీయా ప్రవక్త ఇలా అన్నాడు: “ఆమేన్‌!* యెహోవా అలాగే చేయాలి! యెహోవా మందిరంలోని పాత్రల్ని, బందీలుగా వెళ్లిన ప్రజలందర్నీ బబులోను నుండి ఈ స్థలానికి తీసుకురావడం ద్వారా నువ్వు చెప్పిన ప్రవచనాన్ని యెహోవా నెరవేర్చాలి!  అయితే, దయచేసి నీ ముందు, ఈ ప్రజలందరి ముందు నేను చెప్తున్న ఈ సందేశాన్ని విను.  చాలాకాలం క్రితం, నాకన్నా, నీకన్నా ముందున్న ప్రవక్తలు ఎన్నో దేశాల మీదికి, గొప్ప రాజ్యాల మీదికి యుద్ధం, విపత్తు, తెగులు రావడం గురించి ప్రవచించారు.  ఒక ప్రవక్త శాంతి గురించి ప్రవచించినప్పుడు, ఆ ప్రవక్త మాట నెరవేరితే, అప్పుడు యెహోవాయే నిజంగా ఆ ప్రవక్తను పంపించాడని రుజువౌతుంది.” 10  అప్పుడు హనన్యా ప్రవక్త యిర్మీయా ప్రవక్త మెడ మీది నుండి కాడిని తీసేసి, దాన్ని విరగ్గొట్టాడు.+ 11  హనన్యా ప్రజలందరి ముందు ఇలా అన్నాడు: “యెహోవా ఏమంటున్నాడంటే, ‘ఇదేవిధంగా నేను రెండు సంవత్సరాల్లోనే బబులోను రాజు నెబుకద్నెజరు కాడిని దేశాలన్నిటి మెడ మీది నుండి విరగ్గొడతాను.’ ”+ తర్వాత యిర్మీయా ప్రవక్త తన దారిన వెళ్లిపోయాడు. 12  హనన్యా ప్రవక్త యిర్మీయా ప్రవక్త మెడ మీది నుండి కాడిని విరగ్గొట్టిన తర్వాత, యెహోవా నుండి యిర్మీయా దగ్గరికి ఈ సందేశం వచ్చింది: 13  “నువ్వు వెళ్లి హనన్యాతో ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా అంటున్నాడు: “నువ్వు చెక్కతో చేసిన కాడిని విరగ్గొట్టావు,+ అయితే దాని స్థానంలో ఇనుప కాడి వస్తుంది.” 14  ఎందుకంటే, ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: “బబులోను రాజు నెబుకద్నెజరుకు సేవచేయడానికి ఈ దేశాలన్నిటి మెడ మీద నేను ఇనుప కాడిని పెడతాను, వాళ్లు ఖచ్చితంగా అతనికి సేవచేయాలి.+ చివరికి జంతువుల్ని కూడా అతనికి అప్పగిస్తాను.” ’ ”+ 15  తర్వాత యిర్మీయా ప్రవక్త హనన్యా+ ప్రవక్తతో ఇలా అన్నాడు: “హనన్యా, దయచేసి విను! యెహోవా నిన్ను పంపలేదు, అయితే నువ్వు ఈ ప్రజలు అబద్ధాన్ని నమ్మేలా చేశావు.+ 16  కాబట్టి యెహోవా ఏమంటున్నాడంటే, ‘ఇదిగో! నేను నిన్ను భూమ్మీద లేకుండా చేయబోతున్నాను. ఈ సంవత్సరం నువ్వు చనిపోతావు. ఎందుకంటే, నువ్వు యెహోవా మీదికి తిరుగుబాటును రేపావు.’ ”+ 17  కాబట్టి హనన్యా ప్రవక్త ఆ సంవత్సరం, ఏడో నెలలో చనిపోయాడు.

అధస్సూచీలు

లేదా “అలాగే జరగాలి!”