యెహెజ్కేలు 24:1-27
24 తొమ్మిదో సంవత్సరం పదో నెల పదో రోజున యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది:
2 “మానవ కుమారుడా, ఈ రోజు తేదీని రాసిపెట్టు. ఈ రోజే బబులోను రాజు యెరూషలేము మీద తన దాడిని మొదలుపెట్టాడు.+
3 తిరుగుబాటుదారులైన ఈ ప్రజల గురించి ఒక సామెత* చెప్పు, వాళ్ల గురించి ఇలా అను:
“ ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు:
“ఒక వంటపాత్రను* పొయ్యి మీద పెట్టి, దానిలో నీళ్లు పోయి.+
4 దానిలో మంచిమంచి మాంసం ముక్కలు,తొడ ముక్క, జబ్బ ముక్క వేయి;+ శ్రేష్ఠమైన ఎముకలతో దాన్ని నింపు.
5 మందలోని శ్రేష్ఠమైన గొర్రెను తీసుకో,+ పాత్ర కింద చుట్టూ కట్టెలు పెట్టు.
దానిలోని ముక్కల్ని, ఎముకల్ని బాగా ఉడికించు.” ’
6 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు:
‘రక్తపాతంతో నిండిన నగరానికి శ్రమ,+ అది తుప్పు పట్టిన వంటపాత్రలా ఉంది, దాని తుప్పు పోవడం లేదు!
దానిలోని ముక్కలన్నీ ఒక్కొక్కటిగా తీసేయి;+ వాటికోసం చీట్లు* వేయకు.
7 ఎందుకంటే, అది చిందించిన రక్తం దానిలోనే ఉంది;+ అది ఆ రక్తాన్ని చదునైన బండమీద పోసింది.
మట్టితో కప్పబడేలా అది ఆ రక్తాన్ని నేలమీద పోయలేదు.+
8 దానిమీద ప్రతీకారం తీర్చుకునేలా కోపం రగలాలని,అది చిందించిన రక్తం కప్పబడకుండా ఉండేలాదాన్ని మెరిసే, చదునైన బండమీద ఉంచాను.’+
9 “కాబట్టి సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు:
‘రక్తపాతంతో నిండిన నగరానికి శ్రమ!+
నేను కట్టెల్ని ఎత్తుగా పోగుజేస్తాను.
10 చాలా కట్టెలు పెట్టి, నిప్పు రాజెయ్యి,మాంసాన్ని బాగా ఉడికించు, పులుసును పారబోసి, ఎముకల్ని బాగా మాడనివ్వు.
11 ఖాళీ పాత్రను నిప్పుల మీద పెట్టిదాని రాగి ఎర్రబడేలా బాగా వేడి చేయి.
దాని అపవిత్రత దానిలో కరిగిపోతుంది,+ అగ్ని దాని తుప్పును దహించేస్తుంది.
12 ఈ పని ఎంతో చిరాకు, అలసట తెప్పిస్తుంది,ఎందుకంటే విస్తారమైన తుప్పు పోవడం లేదు.+
తుప్పుతో పాటు పాత్రను అగ్నిలో పారేయి!’
13 “ ‘నీ అపవిత్రత నీ అసభ్యమైన ప్రవర్తన వల్లే కలిగింది.+ నేను నిన్ను శుద్ధి చేయాలని ప్రయత్నించాను, కానీ నీ అపవిత్రత పోలేదు. నీ మీద నాకున్న ఆగ్రహం చల్లారే వరకు నువ్వు శుద్ధి అవ్వవు.+
14 యెహోవానైన నేను ఈ మాట చెప్పాను. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. నేను ఏమాత్రం సంకోచించకుండా, బాధపడకుండా, విచారపడకుండా చర్య తీసుకుంటాను.+ వాళ్లు నీ మార్గాల్ని బట్టి, నీ పనుల్ని బట్టి నీకు తీర్పు తీరుస్తారు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు.”
15 తర్వాత యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది:
16 “మానవ కుమారుడా, నేను అకస్మాత్తుగా నీ ప్రియమైన భార్యను నీకు దూరం చేస్తాను.+ నువ్వు దుఃఖపడకూడదు,* ఏడ్వకూడదు, కన్నీళ్లు పెట్టుకోకూడదు.
17 మౌనంగా మూలుగు, చనిపోయినవాళ్ల కోసం దుఃఖించేటప్పుడు చేసే ఎలాంటి ఆచారాలు చేయకు.+ నీ తలపాగా చుట్టుకొని,+ చెప్పులు వేసుకో.+ నువ్వు నీ మీసాన్ని* కప్పుకోవద్దు,+ వేరేవాళ్లు నీ కోసం తెచ్చే రొట్టెను తినకు.”+
18 నేను పొద్దున ప్రజలతో మాట్లాడాను, సాయంత్రం నా భార్య చనిపోయింది. తర్వాతి ఉదయం, నాకు ఆజ్ఞాపించబడినట్టే చేశాను.
19 అప్పుడు ప్రజలు నాతో, “నువ్వు చేస్తున్నవాటికీ మాకూ సంబంధం ఏంటో మాకు చెప్తావా?” అని అన్నారు.
20 నేను వాళ్లతో ఇలా అన్నాను: “యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా అంది,
21 ‘ఇశ్రాయేలు ఇంటివాళ్లతో ఇలా చెప్పు: “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు, ‘మీకు గర్వకారణంగా, ఎంతో ప్రియంగా ఉన్న, మీ హృదయాలు ఎంతో కోరుకున్న నా పవిత్రమైన స్థలాన్ని నేను అపవిత్రపర్చబోతున్నాను.+ మీరు వదిలేసి వచ్చిన మీ కుమారులు, కూతుళ్లు కత్తివల్ల చనిపోతారు.+
22 అప్పుడు మీరు నేనిప్పుడు చేసినట్టే చేస్తారు. మీరు మీ మీసాన్ని కప్పుకోరు, వేరేవాళ్లు మీ కోసం తెచ్చిన రొట్టెను మీరు తినరు.+
23 మీ తలల మీద తలపాగాలు, మీ కాళ్లకు చెప్పులు ఉంటాయి. మీరు దుఃఖపడరు, ఏడ్వరు. బదులుగా మీ దోషాల్లోనే మీరు కుళ్లిపోతారు,+ ఒకర్ని చూసి ఒకరు మూల్గుతారు.
24 యెహెజ్కేలు మీకు ఒక సూచనగా ఉన్నాడు.+ అతను చేసినట్టే మీరు చేస్తారు. అది జరిగినప్పుడు నేను సర్వోన్నత ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ” ’ ”
25 “మానవ కుమారుడా, నేను వాళ్ల కుమారులూ కూతుళ్లతో పాటు వాళ్ల కోటను, అంటే వాళ్లకు సంతోషాన్నిచ్చిన అందమైనదాన్ని, ప్రియమైనదాన్ని, వాళ్ల హృదయం కోరుకున్నదాన్ని వాళ్ల దగ్గర నుండి తీసేసినప్పుడు,+
26 పారిపోయివచ్చిన ఒక వ్యక్తి ఆ విషయం గురించి నీకు చెప్తాడు.+
27 ఆ రోజు నువ్వు నీ నోరు తెరిచి, పారిపోయివచ్చిన ఆ వ్యక్తితో మాట్లాడతావు, ఇక మౌనంగా ఉండవు.+ నువ్వు వాళ్లకు ఒక సూచనగా ఉంటావు, అప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.”
అధస్సూచీలు
^ లేదా “ఉపమానం.”
^ లేదా “వెడల్పాటి మూతిగల వంటపాత్రను.”
^ లేదా “గుండెలు బాదుకోకూడదు.”
^ లేదా “పై పెదవిని.”