యెహోషువ 11:1-23
11 జరిగినదాని గురించి విన్న వెంటనే హాసోరు రాజైన యాబీను మాదోను రాజైన యోబాబుకు, షిమ్రోను రాజుకు, అక్షాపు రాజుకు కబురు పంపాడు.
2 అలాగే, ఉత్తరాన ఉన్న పర్వత ప్రాంతంలో, కిన్నెరెతుకు దక్షిణాన ఉన్న మైదానాల్లో,* షెఫేలా ప్రాంతంలో, పడమటి వైపు దోరు+ ఏటవాలు ప్రాంతాల్లో ఉన్న రాజులకు,
3 తూర్పు వైపున, పడమటి వైపున ఉన్న కనానీయులకు,+ అమోరీయులకు,+ హిత్తీయులకు, పెరిజ్జీయులకు, పర్వత ప్రాంతంలో ఉన్న యెబూసీయులకు, మిస్పా దేశంలోని హెర్మోను పర్వతం+ దిగువన ఉన్న హివ్వీయులకు+ కబురు పంపాడు.
4 కాబట్టి వాళ్లు సముద్రతీరంలోని ఇసుక రేణువులంత విస్తారంగా ఉన్న తమ సైన్యాలన్నిటినీ వెంటబెట్టుకొని, లెక్కలేనన్ని గుర్రాలతో, యుద్ధ రథాలతో బయల్దేరారు.
5 ఈ రాజులందరూ కలుసుకోవాలని నిర్ణయించుకుని, ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి మేరోము నీళ్ల దగ్గర మకాం వేశారు.
6 అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు: “వాళ్లకు భయపడకు. రేపు దాదాపు ఈ సమయానికి నేను వాళ్లందర్నీ ఇశ్రాయేలీయులకు అప్పగిస్తాను, మీరు వాళ్లందర్నీ చంపేస్తారు. నువ్వు వాళ్ల గుర్రాల్ని కుంటివాటిగా చేయాలి,+ వాళ్ల రథాల్ని అగ్నిలో కాల్చేయాలి.”
7 అప్పుడు యెహోషువ సైనికులందరితో కలిసి మేరోము నీళ్ల దగ్గర హఠాత్తుగా వాళ్లమీద దాడిచేశాడు.
8 యెహోవా వాళ్లను ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించాడు.+ ఇశ్రాయేలీయులు వాళ్లను ఓడించి మహా సీదోను+ వరకు, మిశ్రేపొత్మాయిము+ వరకు, తూర్పున మిస్పే లోయ వరకు తరిమి, వాళ్లలో ఒక్కరు కూడా మిగలకుండా అందర్నీ చంపారు.+
9 యెహోవా తనకు చెప్పినట్టే యెహోషువ వాళ్లకు చేశాడు; అతను వాళ్ల గుర్రాల్ని కుంటివాటిగా చేశాడు, వాళ్ల రథాల్ని అగ్నిలో కాల్చేశాడు.
10 అంతేకాదు, యెహోషువ ఆ తర్వాత వెనక్కి వచ్చి హాసోరును స్వాధీనం చేసుకొని, దాని రాజును కత్తితో చంపాడు. ఎందుకంటే ఒకప్పుడు ఈ రాజ్యాలన్నిట్లో హాసోరు ఎంతో శక్తివంతమైనది.
11 వాళ్లు దానిలో ఉన్న ప్రతీ ఒక్కర్ని కత్తితో చంపి, నాశనం చేశారు.+ వాళ్లలో ఎవ్వర్నీ ప్రాణాలతో వదల్లేదు.+ ఆ తర్వాత అతను హాసోరును అగ్నితో కాల్చేశాడు.
12 యెహోషువ ఈ రాజుల నగరాలన్నిటినీ స్వాధీనం చేసుకొని, వాటి రాజులందర్నీ కత్తితో చంపాడు.+ యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్టే, అతను వాళ్లను నాశనం చేశాడు.+
13 ఇశ్రాయేలీయులు హాసోరును తప్ప మట్టిదిబ్బల మీద ఉన్న ఏ నగరాన్ని కాల్చేయలేదు; యెహోషువ హాసోరును మాత్రమే అలా కాల్చాడు.
14 ఈ నగరాల దోపుడుసొమ్ము అంతటినీ, పశువుల్ని ఇశ్రాయేలీయులు కొల్లగొట్టారు. కానీ వాళ్లు ప్రతీ ఒక్కర్ని పూర్తిగా నాశనం చేసేంతవరకు అందర్నీ కత్తితో చంపారు.+ వాళ్లు ఏ ఒక్కర్నీ బ్రతకనివ్వలేదు.+
15 యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్టు, మోషే యెహోషువకు ఆజ్ఞాపించాడు.+ యెహోషువ అలాగే చేశాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినవాటిలో యెహోషువ ఒక్కటి కూడా విడిచిపెట్టలేదు.+
16 యెహోషువ ఈ దేశాన్నంతటినీ జయించాడు; అంటే పర్వత ప్రాంతాన్ని, నెగెబు+ అంతటినీ, గోషెను, షెఫేలా,+ అరాబా+ ప్రాంతాలన్నిటినీ, ఇశ్రాయేలు పర్వత ప్రాంతాన్ని, దాని లోతట్టు ప్రాంతాన్ని,*
17 శేయీరు దగ్గర ఉన్న హాలాకు కొండ నుండి హెర్మోను పర్వతం+ కింద ఉన్న లెబానోను లోయలోని బయల్గాదు+ వరకు ఉన్న ప్రాంతాల్ని జయించాడు. అతను వాటి రాజులందర్నీ పట్టుకొని, వాళ్లను ఓడించి చంపాడు.
18 యెహోషువ చాలాకాలం పాటు ఈ రాజులందరితో యుద్ధం చేశాడు.
19 గిబియోనులో నివసించే హివ్వీయులు తప్ప వేరే ఏ నగరమూ ఇశ్రాయేలీయులతో సంధి చేసుకోలేదు.+ మిగతా నగరాలన్నిటినీ ఇశ్రాయేలీయులు యుద్ధం చేసి గెలిచారు.+
20 ఆ ప్రజలు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసేలా యెహోవా వాళ్ల హృదయాల్ని మొండిగా తయారవ్వనిచ్చాడు.+ వాళ్ల మీద దయ చూపించకుండా వాళ్లను నాశనం చేయడానికే దేవుడు అలా చేశాడు.+ యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు వాళ్లు పూర్తిగా నాశనం చేయబడాలి.+
21 అప్పుడు యెహోషువ పర్వత ప్రాంతం నుండి, అంటే హెబ్రోను, దెబీరు, అనాబు నుండి, యూదా పర్వత ప్రాంతమంతటి నుండి, ఇశ్రాయేలు పర్వత ప్రాంతమంతటి నుండి అనాకీయుల్ని+ నిర్మూలించాడు. యెహోషువ వాళ్లను, వాళ్ల నగరాల్ని నాశనం చేశాడు.+
22 ఇక ఇశ్రాయేలీయుల దేశంలో అనాకీయులు ఎవ్వరూ మిగల్లేదు; వాళ్లు గాజా,+ గాతు,+ అష్డోదు+ ప్రాంతాల్లోనే మిగిలారు.+
23 కాబట్టి యెహోవా మోషేకు వాగ్దానం చేసినట్టే యెహోషువ దేశాన్నంతటినీ స్వాధీనం చేసుకున్నాడు.+ తర్వాత అతను ఇశ్రాయేలీయులకు వాళ్లవాళ్ల గోత్రాల ప్రకారం, వంతుల చొప్పున దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు.+ ఆ తర్వాత దేశం యుద్ధం లేకుండా ప్రశాంతంగా ఉంది.+