యెహోషువ 13:1-33
13 యెహోషువ బాగా ముసలివాడయ్యాడు.+ కాబట్టి, యెహోవా అతనితో ఇలా అన్నాడు: “నువ్వు బాగా ముసలివాడివయ్యావు; కానీ స్వాధీనం చేసుకోవాల్సిన దేశం ఇంకా చాలా ఉంది.
2 మిగిలిన దేశం ఏదంటే:+ ఫిలిష్తీయుల, గెషూరీయుల ప్రాంతాలన్నీ,+
3 (ఐగుప్తుకు తూర్పున* ఉన్న నైలు శాఖ* మొదలుకొని ఉత్తరాన ఉన్న ఎక్రోను సరిహద్దు వరకు; ఒకప్పుడు దాన్ని కనానీయుల ప్రాంతంగా పరిగణించేవాళ్లు) వాటిలో ఫిలిష్తీయుల ఐదుగురు పాలకుల+ ప్రాంతాలు అంటే గాజీయుల, అష్డోదీయుల,+ అష్కెలోనీయుల,+ గిత్తీయుల,+ ఎక్రోనీయుల+ ప్రాంతాలు కూడా ఉన్నాయి; ఆవీయుల ప్రాంతం,+
4 అది దక్షిణం వైపు ఉంది; కనానీయుల దేశమంతా; సీదోనీయులకు+ చెందిన మేరా మొదలుకొని అమోరీయుల సరిహద్దు దగ్గర్లోని ఆఫెకు వరకు ఉన్న ప్రాంతం;
5 గెబలీయుల+ ప్రాంతం, తూర్పు వైపు లెబానోను ప్రాంతమంతా, అంటే హెర్మోను పర్వతం దిగువనున్న బయల్గాదు నుండి లెబో-హమాతు*+ వరకు ఉన్న ప్రాంతం;
6 లెబానోను+ నుండి మిశ్రేపొత్మాయిము వరకు ఉన్న పర్వత ప్రాంతంలో నివసించే సీదోనీయుల ప్రాంతమంతా. నేను వాళ్లను ఇశ్రాయేలీయుల ఎదుట నుండి వెళ్లగొడతాను.+ నేను నీకు ఆజ్ఞాపించినట్టే, నువ్వు దాన్ని ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యంగా నియమిస్తే సరిపోతుంది.+
7 ఈ దేశాన్ని నువ్వు తొమ్మిది గోత్రాలకు, మనష్షే అర్ధగోత్రానికి స్వాస్థ్యంగా పంచి ఇవ్వాలి.”+
8 మనష్షే మిగతా అర్ధగోత్రంతో పాటు రూబేనీయులు, గాదీయులు యొర్దాను తూర్పు వైపున మోషే తమకు స్వాస్థ్యంగా ఇచ్చిన భూమిని తీసుకున్నారు. యెహోవా సేవకుడైన మోషే తమకు నియమించినట్టు వాళ్లు తీసుకున్న ప్రాంతాలు ఏవంటే:+
9 అర్నోను లోయ*+ అంచున ఉన్న అరోయేరు నగరం నుండి,+ ఆ లోయ మధ్యలో ఉన్న నగరంతోపాటు, దీబోను వరకు ఉన్న మేదెబా పీఠభూమంతా;
10 హెష్బోనులో నుండి పరిపాలించిన అమోరీయుల రాజైన సీహోను కింద ఉన్న నగరాలు; అవి అమ్మోనీయుల సరిహద్దు+ వరకు ఉన్నాయి;
11 అంతేకాదు గిలాదు, అలాగే గెషూరీయుల, మాయకాతీయుల ప్రాంతం,+ హెర్మోను పర్వత ప్రాంతమంతా, సల్కా వరకు+ ఉన్న బాషాను ప్రాంతమంతా;+
12 అష్తారోతులో, ఎద్రెయిలో పరిపాలించిన బాషాను రాజైన ఓగు రాజ్యమంతా. (అతను రెఫాయీయుల చివరివాళ్లలో ఒకడు.)+ మోషే ఆ రాజుల్ని ఓడించి, వాళ్లను వెళ్లగొట్టాడు.+
13 కానీ ఇశ్రాయేలీయులు గెషూరీయుల్ని, మాయకాతీయుల్ని వెళ్లగొట్టలేదు.+ అందుకే గెషూరీయులు, మాయకాతీయులు ఈ రోజు వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తున్నారు.
14 మోషే లేవీయుల గోత్రానికి మాత్రమే భూమి ఇవ్వలేదు.+ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వాళ్లకు వాగ్దానం చేసినట్టు,+ ఆయనకు అగ్నితో అర్పించబడే అర్పణలే వాళ్ల ఆస్తి.+
15 మోషే ఆ తర్వాత రూబేనీయుల గోత్రానికి వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం భూమి ఇచ్చాడు.
16 వాళ్ల ప్రాంతం ఏదంటే: అర్నోను లోయ* అంచున ఉన్న అరోయేరు నగరం నుండి, ఆ లోయ మధ్యలో ఉన్న నగరంతోపాటు, మేదెబా పీఠభూమంతా;
17 హెష్బోను, పీఠభూమి మీద ఉన్న దాని పట్టణాలన్నీ,+ దీబోను, బామోత్బయలు, బేత్బయల్మెయోను,+
18 యాహజు,+ కెదేమోతు,+ మేఫాతు,+
19 కిర్యతాయిము, సిబ్మా,+ లోయను ఆనుకొని ఉన్న కొండమీది శెరెత్షహరు,
20 బేత్పెయోరు, పిస్గా ఏటవాలు ప్రాంతాలు,+ బేత్యేషిమోతు,
21 పీఠభూమి మీద ఉన్న నగరాలన్నీ, హెష్బోనులో పరిపాలించిన అమోరీయుల రాజైన సీహోను రాజ్యమంతా. మోషే అతన్ని, ఆ దేశంలో నివసిస్తున్న మిద్యాను ప్రధానులూ సీహోను సామంత రాజులూ* అయిన ఎవీని, రేకెమును, సూరును, హూరును, రేబను+ ఓడించాడు.+
22 ఇశ్రాయేలీయులు వేరేవాళ్లతోపాటు బెయోరు కుమారుడైన బిలాము+ అనే సోదె చెప్పేవాణ్ణి+ కత్తితో చంపారు.
23 రూబేనీయుల సరిహద్దు యొర్దాను; రూబేనీయులు తమ కుటుంబాల ప్రకారం ఈ ప్రాంతాలన్నిటినీ వాటిలోని నగరాల్ని, పల్లెల్ని ఆస్తిగా పొందారు.
24 అంతేకాదు, మోషే గాదు గోత్రానికి అంటే గాదీయులకు వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం భూమి ఇచ్చాడు.
25 వాళ్ల ప్రాంతం ఏదంటే: యాజెరు,+ గిలాదు నగరాలన్నీ, రబ్బా+ సమీపంలోని అరోయేరు వరకు ఉన్న అమ్మోనీయుల సగం దేశం;+
26 హెష్బోను నుండి రామత్మిజ్పె, బెటొనీము వరకు, మహనయీము+ నుండి దెబీరు సరిహద్దు వరకు;
27 లోయలో అంటే హెష్బోను రాజైన సీహోను రాజ్యంలోని మిగతా నగరాలైన బేత్-హారాము, బేత్నిమ్రా,+ సుక్కోతు,+ సాపోను. వాళ్ల ప్రాంతం యొర్దాను తూర్పు తీరం పొడవునా కిన్నెరెతు సముద్రం*+ వరకు ఉంది.
28 గాదీయులు తమ కుటుంబాల ప్రకారం ఈ ప్రాంతాన్ని, దానిలోని నగరాల్ని, పల్లెల్ని ఆస్తిగా పొందారు.
29 అంతేకాదు, మనష్షే అర్ధగోత్రానికి, అంటే మనష్షే గోత్రంలోని సగం మందికి వాళ్ల కుటుంబాల ప్రకారం మోషే భూమి ఇచ్చాడు.+
30 వాళ్ల ప్రాంతం ఏదంటే: మహనయీము+ నుండి బాషాను ప్రాంతమంతా అంటే బాషాను రాజైన ఓగు రాజ్యమంతా, బాషానులో ఉన్న యాయీరులోని అన్ని గ్రామాలు,*+ 60 పట్టణాలు.
31 గిలాదులో సగభాగం, బాషాను రాజైన ఓగు రాజ్యంలోని అష్తారోతు, ఎద్రెయి+ నగరాలు మనష్షే కుమారుడైన మాకీరు సంతానానికి + అంటే మాకీరు సంతానంలో సగం మందికి వాళ్ల కుటుంబాల ప్రకారం వచ్చాయి.
32 యెరికోకు తూర్పున, యొర్దాను అవతల ఉన్న మోయాబు ఎడారి మైదానాల్లో మోషే వాళ్లకు ఇచ్చిన ప్రాంతాలు ఇవే.+
33 అయితే లేవీయుల గోత్రానికి మోషే భూమి ఇవ్వలేదు.+ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వాళ్లకు వాగ్దానం చేసినట్టు, ఆయనే వాళ్ల ఆస్తి.+
అధస్సూచీలు
^ అక్ష., “ఎదురుగా.”
^ లేదా “షీహోరు.”
^ లేదా “హమాతు ప్రవేశ ద్వారం.”
^ లేదా “అర్నోను వాగు.”
^ లేదా “అర్నోను వాగు.”
^ అంటే, సీహోను అధికారం కింద ఉన్న రాజులు.
^ అంటే, గెన్నేసరెతు సరస్సు, లేదా గలిలయ సముద్రం.
^ లేదా “డేరాలున్న గ్రామాలు.”