రోమీయులు 1:1-32

  • శుభాకాంక్షలు (1-7)

  • రోముకు వెళ్లాలనే పౌలు కోరిక (8-15)

  • నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవిస్తాడు (16, 17)

  • భక్తిహీనులు క్షమాపణకు అర్హులు కారు (18-32)

    • సృష్టిలో దేవుని లక్షణాలు కనిపిస్తున్నాయి (20)

1  క్రీస్తుయేసు దాసుడినైన పౌలు అనే నేను మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. నేను అపొస్తలునిగా ఉండడానికి పిలవబడ్డాను, దేవుని మంచివార్త ప్రకటించడానికి నియమించబడ్డాను.*+  ఆ మంచివార్తను దేవుడు తన ప్రవక్తల ద్వారా ముందే పవిత్ర లేఖనాల్లో వాగ్దానం చేశాడు.  అది ఆయన కుమారునికి సంబంధించిన మంచివార్త; ఆ కుమారుడు దావీదు సంతానం*+ నుండి వచ్చాడు, మనిషిగా పుట్టాడు.  అయితే ఆయన మృతుల్లో నుండి తిరిగి బ్రతికించబడినప్పుడు*+ పవిత్రశక్తి బలం ద్వారా ఆయన దేవుని కుమారుడని+ తెలియజేయబడింది, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు.  ఆయన నా* మీద అపారదయ చూపించి నన్ను* అపొస్తలునిగా నియమించాడు.+ అన్నిదేశాల ప్రజలు విశ్వాసంతో విధేయత చూపించాలని అలా చేశాడు.+ దానివల్ల ఆయన పేరుకు మహిమ వస్తుంది.  ఆ అన్నిదేశాల ప్రజల్లో మీరు కూడా ఉన్నారు, మీరు కూడా యేసుక్రీస్తు శిష్యులుగా ఉండడానికి పిలవబడ్డారు.  పవిత్రులుగా ఉండడానికి పిలవబడిన రోములోని దేవుని ప్రియమైన వాళ్లందరికీ నేను ఈ ఉత్తరం రాస్తున్నాను. మన తండ్రైన దేవుడు, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు మీకు అపారదయను, శాంతిని అనుగ్రహించాలి.  నేను ముందుగా యేసుక్రీస్తు ద్వారా మీ అందరి విషయంలో నా దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాను, ఎందుకంటే మీ విశ్వాసం గురించి ప్రపంచమంతటా మాట్లాడుకుంటున్నారు.  నేను ఆయన కుమారుని గురించిన మంచివార్తను తెలియజేయడం ద్వారా నిండు హృదయంతో* దేవునికి పవిత్రసేవ చేస్తున్నాను. నేను మానకుండా ఎప్పుడూ నా ప్రార్థనల్లో మిమ్మల్ని గుర్తుచేసుకుంటున్నాను,+ దీనికి ఆ దేవుడే సాక్షి. 10  దేవునికి ఇష్టమైతే, కనీసం ఇప్పుడైనా మీ దగ్గరికి వచ్చే అవకాశం నాకు దొరకాలని ప్రార్థనల్లో ఆయన్ని వేడుకుంటున్నాను. 11  మిమ్మల్ని చూడాలని, మీరు స్థిరపడేలా దేవునికి సంబంధించిన ఏదైనా వరాన్ని మీతో పంచుకోవాలని నేను ఎంతో తపించిపోతున్నాను; 12  మనం ఒకరి విశ్వాసం వల్ల ఒకరం ప్రోత్సాహం పొందాలన్నదే+ నా ఉద్దేశం. 13  అయితే సహోదరులారా, ఒక విషయం మీకు తెలియాలని కోరుకుంటున్నాను. అదేమిటంటే, నా ప్రకటనా పని వల్ల వేరే దేశాల్లో వచ్చినట్టే మీ దగ్గర కూడా మంచి ఫలితాలు రావడం చూడాలనే ఉద్దేశంతో చాలాసార్లు మీ దగ్గరికి రావాలనుకున్నాను. కానీ ప్రతీసారి ఏదో ఒకటి నన్ను అడ్డగిస్తోంది. 14  నేను గ్రీకువాళ్లకు-విదేశీయులకు,* తెలివిగలవాళ్లకు-తెలివిలేనివాళ్లకు రుణపడివున్నాను. 15  అందుకే రోములో ఉన్న మీకు కూడా మంచివార్త ప్రకటించాలని ఎంతో కోరుకుంటున్నాను.+ 16  మంచివార్త విషయంలో నేను సిగ్గుపడను;+ నిజానికి అది, విశ్వాసం ఉన్న ప్రతీ ఒక్కర్ని,+ ముందు యూదుల్ని,+ తర్వాత గ్రీకువాళ్లను+ రక్షించడానికి దేవుని శక్తిగా పనిచేస్తుంది. 17  ఎందుకంటే మంచివార్త ద్వారా దేవుడు తన నీతిని బయల్పరుస్తున్నాడని విశ్వాసం ఉన్నవాళ్లు గుర్తిస్తారు, అది వాళ్ల విశ్వాసాన్ని బలపరుస్తుంది.+ “నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవిస్తాడు”+ అని లేఖనాల్లో కూడా రాసివుంది. 18  తమ అవినీతి పనులతో ప్రజలు సత్యం తెలుసుకోకుండా అడ్డుకుంటున్న+ భక్తిహీనుల మీద, తన నీతి ప్రమాణాలు పాటించనివాళ్ల మీద దేవుడు పరలోకం నుండి తన ఆగ్రహాన్ని+ బయల్పరుస్తున్నాడు. 19  ఎందుకంటే వాళ్లు తన గురించి తెలుసుకోవడానికి కావాల్సినన్ని రుజువుల్ని దేవుడు వాళ్లకు ఇచ్చాడు.+ 20  ఆయన అదృశ్య లక్షణాలు, అంటే ఆయన శాశ్వత శక్తి,+ దైవత్వం*+ లోకం సృష్టించబడినప్పటి నుండి స్పష్టంగా కనిపిస్తున్నాయి; ఆయన చేసినవాటిని గమనించడం ద్వారా ఆ లక్షణాల్ని తెలుసుకోవచ్చు,+ కాబట్టి వాళ్లకు సాకులు చెప్పే అవకాశం లేదు. 21  వాళ్లకు దేవుడు తెలిసినా, వాళ్లు ఆయన్ని దేవునిగా మహిమపర్చలేదు, ఆయనకు కృతజ్ఞతలు తెలపలేదు. వాళ్ల మనసు మూర్ఖమైనది, వాళ్ల తెలివిలేని హృదయాలు చీకటిమయం అయిపోయాయి.+ 22  వాళ్లు తెలివిగల వాళ్లమని చెప్పుకుంటూ మూర్ఖులయ్యారు. 23  వాళ్లు అక్షయుడైన* దేవుణ్ణి మహిమపర్చే బదులు నశించిపోయే మనుషుల, పక్షుల, నాలుగు కాళ్ల జంతువుల, పాకే జీవుల* విగ్రహాల్ని మహిమపర్చారు.+ 24  వాళ్లు తమ హృదయంలోని కోరికల ప్రకారం జీవించాలనుకున్నారు కాబట్టి, అపవిత్రమైన పనులు చేస్తూ తమ సొంత శరీరాల్ని అవమానపర్చుకునేలా దేవుడు వాళ్లను వదిలేశాడు. 25  వాళ్లు దేవుని గురించిన సత్యాన్ని కాకుండా అబద్ధాన్ని నమ్మారు; సృష్టికర్తకు బదులు సృష్టిని పూజించారు, దానికి పవిత్రసేవ చేశారు. ఆ సృష్టికర్త నిరంతరం స్తుతించబడతాడు, ఆమేన్‌. 26  అందుకే దేవుడు వాళ్లను నీచమైన లైంగిక వాంఛకు+ అప్పగించాడు, వాళ్లలో స్త్రీలు సహజమైన లైంగిక సంబంధాలు వదిలేసి అసహజమైన లైంగిక సంబంధాలు పెట్టుకున్నారు;+ 27  అలాగే పురుషులు సహజంగా స్త్రీలతో కలిగివుండాల్సిన లైంగిక సంబంధాలు వదిలేసి, ఒకరిపట్ల ఒకరు విపరీతమైన కామంతో రగిలిపోయారు. పురుషులతో పురుషులు+ అసహ్యమైన పనులు చేస్తూ, తమ తప్పుడు ప్రవర్తనకు తగిన శిక్షను* తామే పూర్తిస్థాయిలో పొందుతున్నారు.+ 28  వాళ్లు దేవుని గురించి తెలుసుకోవాల్సిన* అవసరంలేదని అనుకున్నారు కాబట్టి, చేయకూడని పనులు+ చేసేలా దేవుడు వాళ్లను భ్రష్ట మనసుకు అప్పగించాడు. 29  వాళ్ల ఆలోచనలు అన్నిరకాల అవినీతితో,+ దుష్టత్వంతో, అత్యాశతో,*+ చెడుతనంతో, విపరీతమైన ఈర్ష్యతో+ నిండిపోయాయి; అందుకే వాళ్లు హత్యలు+ చేస్తారు, గొడవలు పెట్టుకుంటారు, మోసాలు+ చేస్తారు, ఇతరులకు హాని చేయాలనుకుంటారు;+ గుసగుసలు* చెప్పుకుంటారు, 30  వెనక మాట్లాడుకుంటారు,+ దేవుణ్ణి ద్వేషిస్తారు, తలబిరుసుగా ప్రవర్తిస్తారు, గర్వం చూపిస్తారు, గొప్పలు చెప్పుకుంటారు, హాని తలపెట్టడానికి పన్నాగాలు పన్నుతారు,* తల్లిదండ్రులకు లోబడరు,+ 31  వాళ్లకు అవగాహన ఉండదు,+ ఇచ్చిన మాటకు* కట్టుబడి ఉండరు, ప్రేమానురాగాలు చూపించరు, వాళ్లకు కరుణ ఉండదు. 32  అలాంటి పనులు చేస్తూ ఉండేవాళ్లు మరణానికి అర్హులనే+ దేవుని నీతి నియమం వాళ్లకు చాలా బాగా తెలుసు. అయినా వాళ్లు అలాంటివి చేస్తూనే ఉంటారు, పైగా అలాంటివి చేసేవాళ్లకు తమ ఆమోదం తెలుపుతుంటారు.

అధస్సూచీలు

అక్ష., “ప్రత్యేకించబడ్డాను.”
అక్ష., “విత్తనం.”
లేదా “పునరుత్థానం చేయబడినప్పుడు.”
అక్ష., “మా.”
అక్ష., “మమ్మల్ని.”
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
లేదా “గ్రీకువాళ్లు కానివాళ్లకు.”
లేదా “నిజంగా ఆయన దేవుడని.”
లేదా “నశించిపోని.”
లేదా “సరీసృపాల.”
లేదా “ప్రతిఫలాన్ని.”
లేదా “సరైన జ్ఞానం సంపాదించాల్సిన.”
లేదా “పుకార్లు.”
లేదా “దురాశతో.”
లేదా “కొత్తకొత్త మార్గాలు కనిపెడతారు.”
లేదా “ఒప్పందాలకు.”