లూకా సువార్త 13:1-35
13 ఆ సమయంలో అక్కడున్న కొంతమంది, బలులు అర్పిస్తున్న గలిలయవాళ్లను పిలాతు చంపించాడని ఆయనకు చెప్పారు.
2 అప్పుడాయన వాళ్లతో ఇలా అన్నాడు: “వాళ్లకు ఇలా జరిగింది కాబట్టి గలిలయలోని మిగతావాళ్లందరి కన్నా వాళ్లు ఘోరమైన పాపులని మీరు అనుకుంటున్నారా?
3 కాదని నేను మీతో చెప్తున్నాను. మీరు పశ్చాత్తాపపడకపోతే, వాళ్లలాగే మీరందరూ నాశనమౌతారు.+
4 అలాగే, సిలోయములో గోపురం కూలి చనిపోయిన ఆ 18 మంది, యెరూషలేములో నివసించే మిగతావాళ్లందరి కన్నా ఘోరమైన పాపులని మీరు అనుకుంటున్నారా?
5 కాదని నేను మీతో చెప్తున్నాను. మీరు పశ్చాత్తాపపడకపోతే, వాళ్లలాగే మీరందరూ నాశనమౌతారు.”
6 తర్వాత ఆయన ఈ ఉదాహరణ* చెప్పాడు: “ఒకతను తన ద్రాక్షతోటలో ఒక అంజూర చెట్టును నాటించి, దానికి పండ్లు వస్తాయేమో అని చూస్తూ ఉన్నాడు; కానీ అవి రాలేదు.+
7 అప్పుడతను తోటమాలితో ఇలా అన్నాడు: ‘ఇదిగో మూడు సంవత్సరాలుగా ఈ అంజూర చెట్టుకు పండ్లు వస్తాయేమో అని నేను ఎదురుచూస్తూ ఉన్నాను, కానీ ఏమీ రాలేదు. దీన్ని నరికేయి! దీనివల్ల ఈ స్థలం ఎందుకు వృథా కావాలి?’
8 అప్పుడు తోటమాలి అతనితో ఇలా అన్నాడు: ‘అయ్యా, ఈ ఒక్క సంవత్సరం ఆగు. ఈలోగా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేస్తాను.
9 ఒకవేళ దానికి పండ్లు వస్తే మంచిదే. లేకపోతే దాన్ని నరికేయి.’ ”+
10 విశ్రాంతి రోజున యేసు ఒక సమాజమందిరంలో బోధిస్తున్నాడు.
11 ఇదిగో! చెడ్డదూత* పట్టిన ఒక స్త్రీ అక్కడుంది. ఆ చెడ్డదూత ఆమెను 18 సంవత్సరాల పాటు బలహీనం చేశాడు. దానివల్ల ఆమె సగానికి వంగిపోయింది, నిటారుగా అస్సలు నిలబడలేకపోతోంది.
12 యేసు ఆమెను చూసినప్పుడు, “అమ్మా, నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొందావు”+ అన్నాడు.
13 తర్వాత ఆయన ఆమె మీద చేతులు ఉంచాడు. వెంటనే ఆమె నిటారుగా నిలబడింది, దేవుణ్ణి మహిమపర్చడం మొదలుపెట్టింది.
14 అయితే యేసు విశ్రాంతి రోజున ఆమెను బాగుచేశాడని చాలా కోపంగా ఉన్న ఆ సమాజమందిరం అధికారి ప్రజలతో ఇలా అన్నాడు: “పనిచేయడానికి ఆరు రోజులు ఉన్నాయి;+ అప్పుడు వచ్చి బాగవ్వండి, విశ్రాంతి రోజున కాదు.”+
15 అప్పుడు ప్రభువు ఇలా అన్నాడు: “వేషధారులారా,+ మీలో ప్రతీ ఒక్కరు విశ్రాంతి రోజున మీ ఎద్దును లేదా గాడిదను విప్పి, నీళ్లు పెట్టడానికి తీసుకెళ్తారు కదా?+
16 అలాంటప్పుడు 18 సంవత్సరాలుగా సాతాను చేత బంధించబడిన అబ్రాహాము కూతురైన ఈ స్త్రీని విశ్రాంతి రోజున విడుదల చేయకూడదా?”
17 ఆయన ఈ విషయాలు చెప్పినప్పుడు, ఆయన వ్యతిరేకులందరూ సిగ్గుపడ్డారు. కానీ ప్రజలంతా ఆయన చేసిన గొప్ప పనులన్నీ చూసి ఎంతో సంతోషించారు.+
18 కాబట్టి ఆయన ఇలా చెప్పసాగాడు: “దేవుని రాజ్యం దేనిలా ఉంది? దాన్ని దేనితో పోల్చాలి?
19 దేవుని రాజ్యం, ఒక మనిషి తన పొలంలో విత్తిన ఆవగింజ లాంటిది. అది పెరిగి పెద్ద చెట్టయింది, ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మల్లో గూడు కట్టుకున్నాయి.”+
20 మళ్లీ ఆయన ఇలా చెప్పాడు: “దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చాలి?
21 ఒక స్త్రీ పులిసిన పిండిని తీసుకొని పది కిలోల* పిండిలో కలిపింది, దాంతో పిండి అంతా పులిసిపోయింది. దేవుని రాజ్యం ఆ స్త్రీ కలిపిన పులిసిన పిండి లాంటిది.”+
22 ఆయన యెరూషలేముకు ప్రయాణిస్తున్నప్పుడు, దారిలో ఒక నగరం నుండి ఇంకో నగరానికి, ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి వెళ్తూ ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు.
23 అప్పుడు ఒకతను, “ప్రభువా, రక్షించబడేవాళ్లు కొంతమందేనా?” అని ఆయన్ని అడిగాడు. యేసు వాళ్లకు ఇలా చెప్పాడు:
24 “ఇరుకు ద్వారం గుండా వెళ్లడానికి తీవ్రంగా కృషిచేయండి.+ ఎందుకంటే, చాలామంది లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తారు కానీ అది వాళ్ల వల్ల కాదని మీతో చెప్తున్నాను.
25 ఇంటి యజమాని లేచి తలుపుకు తాళం వేసినప్పుడు మీరు బయట నిలబడి తలుపు తడుతూ, ‘ప్రభువా, మా కోసం తలుపు తెరువు’ అని అంటారు.+ కానీ ఆయన, ‘మీరు ఎక్కడి నుండి వచ్చారో నాకు తెలీదు’ అని మీతో అంటాడు.
26 అప్పుడు మీరు, ‘మేము నీతో కలిసి తిన్నాం, తాగాం; నువ్వు మా ముఖ్య వీధుల్లో బోధించావు’ అని అంటారు.+
27 కానీ ఆయన, ‘మీరు ఎక్కడి నుండి వచ్చారో నాకు తెలీదు. అక్రమంగా నడుచుకునే వాళ్లారా, మీరంతా నా దగ్గర నుండి వెళ్లిపోండి!’ అని మీతో అంటాడు.
28 అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, అలాగే ప్రవక్తలందరూ దేవుని రాజ్యంలో ఉండడం, మీరు మాత్రం బయటికి తోసేయబడడం చూసినప్పుడు మీరు అక్కడే ఏడుస్తూ, పళ్లు కొరుక్కుంటూ ఉంటారు.+
29 అంతేకాదు ప్రజలు తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి వచ్చి దేవుని రాజ్యంలో బల్ల దగ్గర కూర్చుంటారు.
30 ఇదిగో! ముందున్న కొంతమంది వెనక్కి వెళ్తారు, వెనకున్న కొంతమంది ముందుకు వస్తారు.”+
31 ఆ సమయంలోనే కొంతమంది పరిసయ్యులు వచ్చి, “ఇక్కడి నుండి వెళ్లిపో, హేరోదు నిన్ను చంపాలని అనుకుంటున్నాడు” అని ఆయనతో చెప్పారు.
32 అప్పుడాయన వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు వెళ్లి ఆ నక్కతో ఇలా చెప్పండి: ‘ఇదిగో! ఇవాళ, రేపు నేను చెడ్డదూతల్ని వెళ్లగొడతాను, మూడో రోజున నా పని అయిపోతుంది.’
33 అయినాసరే ఇవాళ, రేపు, ఎల్లుండి నేను ప్రయాణిస్తూనే ఉండాలి. ఎందుకంటే, ప్రవక్త యెరూషలేము బయట చంపబడకూడదు.+
34 యెరూషలేమా, యెరూషలేమా, నువ్వు ప్రవక్తల్ని చంపుతూ, నీ దగ్గరికి పంపబడినవాళ్లను రాళ్లతో కొడుతూ ఉన్నావు.+ కోడి తన పిల్లల్ని రెక్కల చాటున చేర్చుకున్నట్టు, నేను ఎన్నోసార్లు నీ పిల్లల్ని చేర్చుకోవాలని అనుకున్నాను! కానీ అది నీకు ఇష్టంలేదు.+
35 ఇదిగో! నీ ఇల్లు నీకే వదిలేయబడింది.+ నేను నీతో చెప్తున్నాను, ‘యెహోవా* పేరున వస్తున్న ఈయన దీవించబడాలి!’ అని నువ్వు చెప్పేవరకు ఇక నన్ను చూడవు.”+
అధస్సూచీలు
^ లేదా “ఉపమానం.”
^ అక్ష., “మూడు సీయ కొలతల.” అప్పట్లో ఒక సీయ 7.33 లీటర్లతో సమానం. అనుబంధం B14 చూడండి.
^ అనుబంధం A5 చూడండి.