లేవీయకాండం 14:1-57

  • కుష్ఠువ్యాధి నుండి శుద్ధీకరణ (1-32)

  • కుష్ఠు సోకిన ఇళ్లను శుద్ధీకరించడం (33-57)

14  యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు:  “ఒక కుష్ఠురోగి శుద్ధుడని నిర్ధారించబడే రోజున అంటే అతన్ని యాజకుని దగ్గరికి తీసుకురావాల్సిన రోజున అతను పాటించాల్సిన నియమం ఇది:+  యాజకుడు పాలెం బయటికి వెళ్లి, ఆ కుష్ఠురోగిని పరిశీలిస్తాడు. ఒకవేళ అతని కుష్ఠు తగ్గిపోతే,  అతని శుద్ధీకరణ కోసం, బ్రతికున్న రెండు పవిత్రమైన పక్షుల్ని, దేవదారు కర్రను, ఎర్రని వస్త్రాన్ని, హిస్సోపును తీసుకురమ్మని యాజకుడు అతనికి ఆజ్ఞాపిస్తాడు.+  ఆ రెండు పక్షుల్లో ఒకదాన్ని స్వచ్ఛమైన నీళ్లున్న మట్టికుండలో చంపమని యాజకుడు ఆజ్ఞాపిస్తాడు.  అయితే యాజకుడు సజీవంగా ఉన్న ఇంకో పక్షిని, దేవదారు కర్రను, ఎర్రని వస్త్రాన్ని, హిస్సోపును తీసుకొని అన్నిటిని ఒక్కసారే, స్వచ్ఛమైన నీళ్లున్న మట్టికుండలో చంపిన పక్షి రక్తంలో ముంచుతాడు.  తర్వాత యాజకుడు దాన్ని కుష్ఠువ్యాధి నుండి శుద్ధీకరణ చేసుకుంటున్న వ్యక్తి మీద ఏడుసార్లు చిమ్మి, అతన్ని పవిత్రుడని ప్రకటిస్తాడు; సజీవంగా ఉన్న పక్షిని మైదానంలో వదిలేస్తాడు.+  “శుద్ధీకరణ చేసుకుంటున్న వ్యక్తి తన వస్త్రాల్ని ఉతుక్కొని, వెంట్రుకలన్నిటినీ క్షౌరం చేసుకొని, నీళ్లతో స్నానం చేయాలి. అప్పుడు అతను పవిత్రుడౌతాడు. తర్వాత అతను పాలెం లోపలికి రావచ్చు, కానీ ఏడురోజుల పాటు అతను తన డేరా బయటే నివసించాలి.  ఏడో రోజున అతను తన తల మీద, గడ్డం మీద, కనుబొమ్మల మీద ఉన్న వెంట్రుకలన్నిటినీ క్షౌరం చేసుకోవాలి. అతను తన వెంట్రుకలన్నిటినీ క్షౌరం చేసుకున్న తర్వాత తన వస్త్రాల్ని ఉతుక్కొని, నీళ్లతో స్నానం చేస్తాడు. అప్పుడు అతను పవిత్రుడౌతాడు. 10  “ఎనిమిదో రోజున అతను ఏ లోపంలేని రెండు మగ గొర్రెపిల్లల్ని, ఏ లోపంలేని ఏడాది ఆడ గొర్రెపిల్లను,+ ధాన్యార్పణగా ఈఫాలో మూడు పదోవంతుల* మెత్తని పిండిని నూనె కలిపి+ తీసుకురావాలి, అలాగే ఒక లాగ్‌ కొలత* నూనెను కూడా తీసుకురావాలి;+ 11  అతన్ని పవిత్రుడని ప్రకటించే యాజకుడు, శుద్ధీకరణ చేసుకుంటున్న ఆ వ్యక్తిని, అతను తెచ్చిన అర్పణల్ని ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర యెహోవా ముందుకు తీసుకొస్తాడు. 12  యాజకుడు వాటిలో ఒక మగ గొర్రెపిల్లను తీసుకొని, లాగ్‌ కొలత నూనెతో పాటు దాన్ని అపరాధ పరిహారార్థ బలిగా అర్పిస్తాడు;+ అంతేకాదు వాటిని యెహోవా ముందు అల్లాడించే అర్పణగా ముందుకు, వెనుకకు కదిలిస్తాడు.+ 13  తర్వాత అతను ఆ మగ గొర్రెపిల్లను ఒక పవిత్రమైన చోట, అంటే సాధారణంగా పాపపరిహారార్థ బలి జంతువును, దహనబలి జంతువును వధించే చోట వధిస్తాడు.+ ఎందుకంటే పాపపరిహారార్థ బలిలాగే అపరాధ పరిహారార్థ బలి కూడా యాజకునికి చెందుతుంది.+ అది అతి పవిత్రమైనది.+ 14  “తర్వాత యాజకుడు అపరాధ పరిహారార్థ బలి రక్తంలో కొంత తీసుకొని, శుద్ధీకరణ చేసుకుంటున్న వ్యక్తి కుడిచెవి తమ్మెకు, కుడిచేతి బొటనవేలికి, కుడికాలి బొటనవేలికి పూస్తాడు. 15  తర్వాత యాజకుడు లాగ్‌ కొలత నూనె+ నుండి కొంత తీసుకొని తన ఎడమ అరచేతిలో పోసుకుంటాడు. 16  ఆ తర్వాత యాజకుడు తన ఎడమ అరచేతిలో ఉన్న నూనెలో కుడిచేతి వేలిని ముంచి కొంత నూనెను యెహోవా ముందు ఏడుసార్లు చిమ్ముతాడు. 17  తర్వాత యాజకుడు తన అరచేతిలో మిగిలిన నూనెలో కొంత తీసుకొని, శుద్ధీకరణ చేసుకుంటున్న వ్యక్తి కుడిచెవి తమ్మె మీద, కుడిచేతి బొటనవేలి మీద, కుడికాలి బొటనవేలి మీద ఉన్న అపరాధ పరిహారార్థ బలి రక్తం పైన పూస్తాడు. 18  ఆ తర్వాత యాజకుడు తన అరచేతిలో మిగిలిన నూనెను శుద్ధీకరణ చేసుకుంటున్న వ్యక్తి తలమీద పోస్తాడు, యాజకుడు యెహోవా ముందు అతని కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు.+ 19  “యాజకుడు పాపపరిహారార్థ బలిని+ అర్పించి, తన అశుద్ధత నుండి పవిత్రపర్చుకుంటున్న వ్యక్తి కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు, తర్వాత దహనబలి జంతువును వధిస్తాడు. 20  యాజకుడు దహనబలిని, ధాన్యార్పణను+ బలిపీఠం మీద అర్పిస్తాడు, యాజకుడు అతని కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు,+ అతను పవిత్రుడౌతాడు.+ 21  “ఒకవేళ అతను పేదవాడై ఉండి, అతనికి అంత స్తోమత లేకపోతే, తన కోసం ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అపరాధ పరిహారార్థ బలిని అర్పించేలా ఒక మగ గొర్రెపిల్లను తీసుకురావాలి, దాన్ని అల్లాడించే అర్పణగా అర్పిస్తారు; అలాగే ధాన్యార్పణగా ఈఫాలో పదోవంతు* మెత్తని పిండిని నూనె కలిపి తీసుకురావాలి, అంతేకాదు లాగ్‌ కొలత నూనెను, 22  తన స్తోమతకు తగ్గట్టు రెండు గువ్వల్ని లేదా రెండు పావురం పిల్లల్ని తీసుకురావాలి. వాటిలో ఒకటి పాపపరిహారార్థ బలి కోసం, ఇంకొకటి దహనబలి కోసం.+ 23  ఎనిమిదో రోజున,+ తాను శుద్ధుణ్ణని ప్రకటించబడడం కోసం అతను వాటిని ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర యెహోవా ఎదుట యాజకుని దగ్గరికి తీసుకొస్తాడు.+ 24  “యాజకుడు అపరాధ పరిహారార్థ బలి మగ గొర్రెపిల్లను,+ లాగ్‌ కొలత నూనెను తీసుకుంటాడు. తర్వాత యాజకుడు వాటిని యెహోవా ముందు అల్లాడించే అర్పణగా ముందుకు, వెనుకకు కదిలిస్తాడు.+ 25  ఆ తర్వాత అతను అపరాధ పరిహారార్థ బలి మగ గొర్రెపిల్లను వధిస్తాడు. యాజకుడు ఆ అపరాధ పరిహారార్థ బలి రక్తంలో కొంత తీసుకొని, శుద్ధీకరణ చేసుకుంటున్న వ్యక్తి కుడిచెవి తమ్మెకు, కుడిచేతి బొటనవేలికి, కుడికాలి బొటనవేలికి పూస్తాడు.+ 26  యాజకుడు కొంత నూనెను తన ఎడమ అరచేతిలో పోసుకుంటాడు.+ 27  ఆ తర్వాత యాజకుడు తన ఎడమ అరచేతిలో ఉన్న నూనెలో తన కుడిచేతి వేలిని ముంచి కొంత నూనెను యెహోవా ముందు ఏడుసార్లు చిమ్ముతాడు. 28  తర్వాత యాజకుడు తన అరచేతిలో ఉన్న నూనెలో కొంత తీసుకొని శుద్ధీకరణ చేసుకుంటున్న వ్యక్తి కుడిచెవి తమ్మె మీద, కుడిచేతి బొటనవేలి మీద, కుడికాలి బొటనవేలి మీద పూస్తాడు. అపరాధ పరిహారార్థ బలి రక్తాన్ని పూసిన చోట్లలోనే ఆ నూనెను కూడా పూస్తాడు. 29  ఆ తర్వాత యాజకుడు తన అరచేతిలో మిగిలిన నూనెను శుద్ధీకరణ చేసుకుంటున్న వ్యక్తి తలమీద పోసి, యెహోవా ముందు అతని కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు. 30  “యాజకుడు ఆ గువ్వల్లో లేదా పావురం పిల్లల్లో ఒకదాన్ని అంటే తన స్తోమతకు తగ్గట్టు+ 31  అతను తేగలిగిన వాటిలో ఒకదాన్ని పాపపరిహారార్థ బలిగా, ఇంకొకదాన్ని దహనబలిగా అర్పిస్తాడు;+ వాటిని ధాన్యార్పణతో పాటు అర్పిస్తాడు. అలా యాజకుడు, తనను తాను పవిత్రపర్చుకుంటున్న వ్యక్తి కోసం యెహోవా ముందు ప్రాయశ్చిత్తం చేస్తాడు.+ 32  “కుష్ఠువ్యాధి వచ్చిన వ్యక్తికి తన శుద్ధీకరణ కోసం అవసరమైనవాటిని తీసుకొచ్చే స్తోమత లేకపోతే, అతను పాటించాల్సిన నియమం ఇది.” 33  తర్వాత యెహోవా మోషే, అహరోనులతో ఇలా అన్నాడు: 34  “నేను మీకు ఆస్తిగా ఇస్తున్న కనాను దేశంలోకి+ మీరు వచ్చినప్పుడు,+ మీ దేశంలో ఏ ఇంటినైనా నేను కుష్ఠువ్యాధితో మలినపరిస్తే,+ 35  ఆ ఇంటి యజమాని యాజకుడి దగ్గరికి వెళ్లి, ‘నా ఇంట్లో ఒక రకమైన పొడ కనిపించింది’ అని చెప్పాలి. 36  యాజకుడు ఆ ఇంట్లో ఉన్న ప్రతీ వస్తువు అపవిత్రమైనదని ప్రకటించకుండా ఉండేలా, అతను ఆ ఇంట్లోని పొడను పరిశీలించడానికి రాకముందే, ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నిటినీ తీసేయమని ఆజ్ఞాపిస్తాడు; ఆ తర్వాత యాజకుడు ఆ ఇంటిని తనిఖీ చేయడానికి వస్తాడు. 37  యాజకుడు పొడ వచ్చిన ప్రాంతాన్ని పరిశీలిస్తాడు. ఒకవేళ ఆ ఇంటి గోడల మీద ఆకుపచ్చ లేదా ఎర్ర మచ్చలు కనిపిస్తే, ఆ మచ్చలు గోడ ఉపరితలం కన్నా లోతుగా ఉంటే, 38  యాజకుడు ఆ ఇంట్లో నుండి వాకిట్లోకి వచ్చి, ఆ ఇంటిని ఏడురోజుల పాటు మూసేస్తాడు.+ 39  “తర్వాత యాజకుడు ఏడో రోజున వచ్చి ఆ ఇంటిని తనిఖీ చేస్తాడు. ఒకవేళ ఆ పొడ ఇంటి గోడల మీద వ్యాపిస్తే, 40  పొడ సోకిన రాళ్లను గోడలో నుండి తీసేసి, నగరం బయట ఒక అపవిత్రమైన చోట పారేయమని యాజకుడు ఆజ్ఞాపిస్తాడు. 41  ఆ తర్వాత అతను ఇంటి లోపలంతా గీకించి, ఆ పెచ్చుల్ని నగరం బయట ఒక అపవిత్రమైన చోట పారవేయిస్తాడు. 42  తర్వాత వాళ్లు తాము తీసేసిన రాళ్ల స్థానంలో వేరే రాళ్లను పెడతారు, అతను వేరే బంకమట్టితో ఆ ఇంటికి గిలాబు* చేయించాలి. 43  “కానీ వాళ్లు రాళ్లను తీసేసి, గోడల్ని గీకించి, మళ్లీ గిలాబు చేయించిన తర్వాత, ఆ పొడ మళ్లీ ఆ ఇంట్లో కనిపిస్తే, 44  యాజకుడు లోపలికి వెళ్లి దాన్ని తనిఖీ చేస్తాడు. ఒకవేళ ఆ పొడ ఇంట్లో వ్యాపించి ఉంటే, అది ఆ ఇంట్లో వచ్చిన హానికరమైన కుష్ఠు.+ ఆ ఇల్లు అపవిత్రమైనది. 45  అతను ఆ ఇంటిని కూలగొట్టించి, దాని రాళ్లను, మొద్దుల్ని, బంకమట్టి పెల్లలన్నిటినీ నగరం బయట ఒక అపవిత్రమైన చోట పారవేయిస్తాడు.+ 46  కానీ ఆ ఇంటిని మూసేయించిన రోజుల్లో+ ఎవరైనా దాని లోపలికి వెళ్తే అతను సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు;+ 47  ఎవరైనా ఆ ఇంట్లో పడుకుంటే లేదా భోజనం చేస్తే వాళ్లు తమ వస్త్రాల్ని ఉతుక్కోవాలి. 48  “ఒకవేళ యాజకుడు వచ్చి చూసినప్పుడు, మళ్లీ గిలాబు చేయించిన తర్వాత ఆ ఇంట్లో పొడ వ్యాపించలేదని గమనిస్తే, ఆ ఇల్లు పవిత్రమైనదని యాజకుడు ప్రకటిస్తాడు. ఎందుకంటే ఆ పొడ తగ్గిపోయింది. 49  అపవిత్రత* నుండి ఆ ఇంటిని శుద్ధి చేయడం కోసం అతను రెండు పక్షుల్ని, దేవదారు కర్రను, ఎర్రని వస్త్రాన్ని, హిస్సోపును తీసుకొస్తాడు.+ 50  అతను వాటిలో ఒక పక్షిని స్వచ్ఛమైన నీళ్లున్న మట్టికుండలో చంపాలి. 51  తర్వాత అతను దేవదారు కర్రను, హిస్సోపును, ఎర్రని వస్త్రాన్ని, బ్రతికున్న పక్షిని తీసుకొని స్వచ్ఛమైన నీళ్లున్న మట్టికుండలో చంపిన పక్షి రక్తంలో ముంచుతాడు. తర్వాత అతను ఆ రక్తాన్ని ఆ ఇంటివైపు ఏడుసార్లు చిమ్మాలి.+ 52  అలా అతను ఆ పక్షి రక్తంతో, స్వచ్ఛమైన నీళ్లతో, బ్రతికున్న పక్షితో, దేవదారు కర్రతో, హిస్సోపుతో, ఎర్రని వస్త్రంతో ఆ ఇంటిని అపవిత్రత* నుండి శుద్ధి చేస్తాడు. 53  తర్వాత అతను సజీవంగా ఉన్న పక్షిని నగరం బయట మైదానంలో వదిలేసి ఆ ఇంటి కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు, అప్పుడది పవిత్రమౌతుంది. 54  “ఈ నియమం, ఏదైనా కుష్ఠువ్యాధి వస్తే అంటే మాడు మీద గానీ, గడ్డం మీద గానీ పొడ వస్తే,+ 55  లేదా వస్త్రం మీద గానీ, ఇంట్లో గానీ కుష్ఠు కనిపిస్తే,+ 56  లేదా వాపులు, పక్కులు, నిగనిగలాడే మచ్చలు+ వస్తే, 57  ఒక వ్యక్తి లేదా వస్తువు ఎప్పుడు అపవిత్రమౌతుందో, ఎప్పుడు పవిత్రమౌతుందో నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది.+ ఇది కుష్ఠువ్యాధి గురించిన నియమం.”+

అధస్సూచీలు

అప్పట్లో ఈఫాలో మూడు పదోవంతులు 6.6 లీటర్లతో (3.9 కిలోలతో) సమానం. అనుబంధం B14 చూడండి.
అప్పట్లో ఒక లాగ్‌ 0.31 లీటర్లతో సమానం. అనుబంధం B14 చూడండి.
అప్పట్లో ఈఫాలో పదోవంతు 2.2 లీటర్లతో (1.3 కిలోలతో) సమానం. అనుబంధం B14 చూడండి.
అంటే, ప్లాస్టరింగ్‌.
అక్ష., “పాపం.”
అక్ష., “పాపం.”