సంఖ్యాకాండం 9:1-23

  • తర్వాతి నెలలో పస్కా చేసుకునే ఏర్పాటు (1-14)

  • గుడారం పైన మేఘం, అగ్ని (15-23)

9  ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చాక, రెండో సంవత్సరం మొదటి నెలలో వాళ్లు సీనాయి ఎడారిలో ఉన్నప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు:+  “ఇశ్రాయేలీయులు నియమిత సమయంలో+ పస్కా బలిని+ సిద్ధం చేయాలి.  ఈ నెల 14వ రోజున సంధ్య వెలుగు సమయంలో,* దాని నియమిత సమయంలో మీరు దాన్ని సిద్ధం చేయాలి. దానికి సంబంధించిన నియమాలన్నిటి ప్రకారం, నిర్ణీత పద్ధతులన్నిటి ప్రకారం మీరు దాన్ని సిద్ధం చేయాలి.”+  కాబట్టి మోషే, పస్కా బలిని సిద్ధం చేయమని ఇశ్రాయేలీయులకు చెప్పాడు.  వాళ్లు సీనాయి ఎడారిలో మొదటి నెల 14వ రోజున, సంధ్య వెలుగు సమయంలో* పస్కా బలిని సిద్ధం చేశారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన దానంతటి ప్రకారం ఇశ్రాయేలీయులు చేశారు.  అయితే, శవాన్ని ముట్టుకోవడం వల్ల అపవిత్రులైనవాళ్లు+ కొందరు ఉన్నారు; అలా అపవిత్రులైనందువల్ల వాళ్లు ఆ రోజున పస్కా బలి సిద్ధం చేయలేకపోయారు. కాబట్టి వాళ్లు ఆ రోజు మోషే, అహరోనుల దగ్గరికి వచ్చి+  మోషేతో ఇలా అన్నారు: “శవాన్ని ముట్టుకోవడం వల్ల మేము అపవిత్రులమయ్యాం. అంతమాత్రాన, ఇశ్రాయేలీయుల మధ్య నియమిత సమయంలో యెహోవాకు పస్కా బలి అర్పించకుండా మమ్మల్ని ఆపాలా?”+  అప్పుడు మోషే వాళ్లతో, “ఇక్కడే ఉండండి, మీ గురించి యెహోవా ఏమని ఆజ్ఞాపిస్తాడో నేను తెలుసుకుంటాను” అని చెప్పాడు.+  అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 10  “నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘మీలో గానీ మీ భవిష్యత్తు తరాల్లో గానీ ఎవరైనా శవాన్ని ముట్టుకోవడం వల్ల అపవిత్రులైతే,+ లేదా దూర ప్రయాణంలో ఉంటే, అప్పుడు కూడా వాళ్లు యెహోవాకు పస్కా బలి సిద్ధం చేయాలి. 11  వాళ్లు రెండో నెల+ 14వ రోజున, సంధ్య వెలుగు సమయంలో* దాన్ని సిద్ధం చేయాలి. వాళ్లు పులవని రొట్టెలతో, చేదుగా ఉండే పచ్చి ఆకుకూరలతో దాన్ని తినాలి.+ 12  దానిలో కొంచెం కూడా ఉదయం వరకు మిగలనివ్వకూడదు,+ దాని ఎముకల్లో ఒక్కటి కూడా విరగ్గొట్టకూడదు.+ పస్కాకు సంబంధించిన ప్రతీ నియమాన్ని పాటిస్తూ దాన్ని సిద్ధం చేయాలి. 13  అయితే పవిత్రుడిగా ఉన్న వ్యక్తి గానీ ప్రయాణంలో లేని వ్యక్తి గానీ పస్కా బలి సిద్ధం చేయడాన్ని నిర్లక్ష్యం చేస్తే, అతన్ని తన ప్రజల్లో నుండి కొట్టివేయాలి.*+ ఎందుకంటే అతను నియమిత సమయంలో యెహోవాకు బలి అర్పించలేదు. తాను చేసిన పాపానికి అతను శిక్ష అనుభవిస్తాడు. 14  “ ‘ఒకవేళ మీ మధ్య పరదేశి నివసిస్తుంటే, అతను కూడా యెహోవాకు పస్కా బలి సిద్ధం చేయాలి.+ పస్కాకు సంబంధించిన నియమం ప్రకారం, దాని నిర్ణీత పద్ధతి ప్రకారం దాన్ని సిద్ధం చేయాలి.+ మీకూ, మీ మధ్య నివసించే పరదేశికీ ఒకే నియమం ఉండాలి.’ ”+ 15  గుడారాన్ని నిలబెట్టిన రోజున+ మేఘం ఆ గుడారాన్ని, అంటే సాక్ష్యపు గుడారాన్ని కప్పేసింది; అయితే సాయంత్రం పూట అగ్ని లాంటిది గుడారం మీద నిలిచింది, ఉదయం వరకు అది అలాగే ఉంది.+ 16  రోజూ ఇలాగే జరిగేది: పగటిపూట మేఘం, రాత్రిపూట అగ్ని లాంటిది దాన్ని కప్పేసేది.+ 17  గుడారం మీద నుండి మేఘం పైకి లేచినప్పుడల్లా, ఇశ్రాయేలీయులు వెంటనే బయల్దేరేవాళ్లు;+ ఆ మేఘం ఎక్కడ నిలిస్తే అక్కడ ఇశ్రాయేలీయులు తమ డేరాలు వేసుకునేవాళ్లు.+ 18  యెహోవా ఆదేశం ప్రకారం ఇశ్రాయేలీయులు బయల్దేరేవాళ్లు, యెహోవా ఆదేశం ప్రకారమే వాళ్లు డేరాలు వేసుకునేవాళ్లు.+ మేఘం గుడారం మీద నిలిచినంతకాలం వాళ్లు అక్కడే డేరాల్లో నివసించేవాళ్లు. 19  మేఘం గుడారం పైన చాలా రోజులు అలాగే ఉండిపోతే, ఇశ్రాయేలీయులు యెహోవాకు లోబడి అక్కడి నుండి బయల్దేరేవాళ్లు కాదు.+ 20  ఒక్కోసారి మేఘం కొన్ని రోజులే గుడారం పైన నిలిచేది. యెహోవా ఆదేశం ప్రకారం ఇశ్రాయేలీయులు డేరాలు వేసుకునేవాళ్లు, యెహోవా ఆదేశం ప్రకారమే వాళ్లు బయల్దేరేవాళ్లు. 21  కొన్నిసార్లు మేఘం సాయంత్రం నుండి ఉదయం వరకే గుడారం పైన నిలిచేది; ఉదయం అది పైకి లేచినప్పుడు వాళ్లు బయల్దేరేవాళ్లు. ఉదయమే గానీ, సాయంత్రమే గానీ మేఘం ఎప్పుడు పైకి లేస్తే అప్పుడు వాళ్లు బయల్దేరేవాళ్లు.+ 22  అది రెండు రోజులైనా, ఒక నెలైనా, అంతకన్నా ఎక్కువైనా, మేఘం గుడారం పైన ఉన్నంతకాలం ఇశ్రాయేలీయులు అక్కడే డేరాల్లో ఉండేవాళ్లు, అక్కడి నుండి బయల్దేరేవాళ్లు కాదు. కానీ అది పైకి లేచినప్పుడు వాళ్లు బయల్దేరేవాళ్లు. 23  యెహోవా ఆదేశం ప్రకారం వాళ్లు డేరాలు వేసుకునేవాళ్లు, యెహోవా ఆదేశం ప్రకారమే వాళ్లు బయల్దేరేవాళ్లు. మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆదేశం మేరకు, యెహోవా చెప్పిందంతా వాళ్లు చేసేవాళ్లు.

అధస్సూచీలు

అక్ష., “రెండు సాయంత్రాల మధ్య.” సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి పడడానికి ముందు ఉండే సమయాన్ని సూచిస్తుందని స్పష్టమౌతోంది.
అక్ష., “రెండు సాయంత్రాల మధ్య.” సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి పడడానికి ముందు ఉండే సమయాన్ని సూచిస్తుందని స్పష్టమౌతోంది.
అక్ష., “రెండు సాయంత్రాల మధ్య.” సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి పడడానికి ముందు ఉండే సమయాన్ని సూచిస్తుందని స్పష్టమౌతోంది.
లేదా “చంపేయాలి.”