సామెతలు 5:1-23

  • అనైతిక స్త్రీల గురించి హెచ్చరిక (1-14)

  • నీ భార్యతో సంతోషించు (15-23)

5  నా కుమారుడా, నేను చెప్పే తెలివిగల మాటల్ని శ్రద్ధగా ఆలకించు, వివేచన గురించి నేను బోధించేవాటిని జాగ్రత్తగా విను.+   అప్పుడు నువ్వు నీ ఆలోచనా సామర్థ్యాల్ని కాపాడుకుంటావు,నీ పెదాలు నిజమే* మాట్లాడతాయి.+   దిగజారిన* స్త్రీ మాటలు* తేనెలా తియ్యగా,+నూనె కన్నా మృదువుగా ఉంటాయి.+   కానీ చివరికి ఆమె మాచిపత్రి* అంత చేదుగా,+రెండంచుల కత్తి అంత పదునుగా ఉంటుంది.+   ఆమె పాదాలు మరణానికి దారితీస్తాయి. ఆమె అడుగులు నేరుగా సమాధిలోకి* తీసుకెళ్తాయి.   జీవ మార్గం గురించి ఆమె ఏమాత్రం ఆలోచించదు. ఆమె అడుగులు అటూఇటూ వెళ్తుంటాయి, కానీ ఆమె ఎక్కడికి వెళ్తుందో ఆమెకు తెలీదు.   కాబట్టి నా కుమారులారా, నా మాటలు వినండి,నేను చెప్పేవాటి నుండి పక్కకు మళ్లకండి.   ఆమెకు చాలా దూరంగా ఉండు;ఆమె ఇంటి వాకిలి దగ్గరికి కూడా వెళ్లకు.+   అలా వెళ్తే, నీ పేరు పాడౌతుంది,+మిగతా జీవితమంతా కష్టాలు పడాల్సి వస్తుంది.+ 10  నీ ఆస్తిపాస్తుల్ని* పరాయివాళ్లు తినేస్తారు,+నీ కష్టార్జితం వేరేవాళ్ల ఇంటికి చేరుతుంది. 11  చివరిదశలో నీ బలం, నీ శరీరం క్షీణించినప్పుడునువ్వు వేదన పడతావు,+ 12  నువ్వు ఇలా అనుకుంటావు: “అయ్యో, నేను క్రమశిక్షణను ఎందుకు అసహ్యించుకున్నాను? నా హృదయం గద్దింపును ఎందుకు తిరస్కరించింది? 13  నా ఉపదేశకుల మాటల్ని నేను వినిపించుకోలేదు,నా బోధకులు చెప్పింది పట్టించుకోలేదు. 14  సమాజమంతటి కళ్లముందునేను సర్వనాశనం అంచున ఉన్నాను.”+ 15  నీ సొంత తొట్టిలో నీళ్లను,నీ సొంత బావిలో ఊరే* నీళ్లను తాగు.+ 16  నీ ఊటలు బయటికి,నీ నీటి ప్రవాహాలు సంతవీధుల్లోకి ప్రవహించవచ్చా?+ 17  అవి నీ కోసమే ఉండాలి,పరాయివాళ్ల కోసం కాదు.+ 18  నీ సొంత ఊట దీవెన పొందాలి,నీ యౌవనకాల భార్యతో నువ్వు సంతోషించాలి.+ 19  ఆమె ప్రియమైన లేడి, అందమైన కొండమేక.+ ఆమె రొమ్ములవల్ల నువ్వు ఎల్లప్పుడూ తృప్తి పొందాలి. నువ్వు ఎప్పుడూ ఆమె ప్రేమలో మునిగితేలాలి.+ 20  నా కుమారుడా, నువ్వు దిగజారిన* స్త్రీ వ్యామోహంలో పడడం దేనికి?అనైతిక* స్త్రీని+ కౌగిలించుకోవడం దేనికి? 21  మనుషుల మార్గాలు యెహోవా కళ్లెదుట ఉన్నాయి;వాళ్ల దారులన్నిటినీ ఆయన పరిశీలిస్తాడు.+ 22  దుష్టులు తమ తప్పుల్లోనే చిక్కుకుంటారు,వాళ్ల పాపాలే తాళ్లలా వాళ్లను బంధిస్తాయి.+ 23  క్రమశిక్షణ లేకపోవడంవల్ల వాళ్లు చనిపోతారు,విపరీతమైన మూర్ఖత్వం వల్ల పక్కదారి పడతారు.

అధస్సూచీలు

లేదా “సరైన జ్ఞానం ప్రకారమే.”
అక్ష., “అపరిచిత.” సామెతలు 2:16 చూడండి.
అక్ష., “పెదాలు.”
పదకోశం చూడండి.
లేదా “షియోల్‌లోకి,” అంటే మానవజాతి సాధారణ సమాధిలోకి. పదకోశం చూడండి.
లేదా “శక్తిని.”
లేదా “ప్రవహించే.”
అక్ష., “అపరిచిత.” సామెతలు 2:16 చూడండి.
అక్ష., “విదేశీ.” సామెతలు 2:16 చూడండి.