హోషేయ 5:1-15
-
ఎఫ్రాయిము, యూదాల మీద తీర్పు (1-15)
5 “యాజకులారా,+ ఈ మాటలు వినండి,ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, ఆలకించండి,రాజు ఇంటివాళ్లారా, వినండి,ఎందుకంటే మీకు తీర్పు జరగబోతుంది;మీరు మిస్పాకు ఉచ్చులా,తాబోరు+ మీద పరిచిన వలలా ఉన్నారు.
2 తిరుగుబాటుదారులు* వధించడంలో మునిగిపోయారు,వాళ్లందర్నీ నేను హెచ్చరిస్తున్నాను.*
3 ఎఫ్రాయిము నాకు తెలుసు,ఇశ్రాయేలు నాకు కనిపిస్తూనే ఉంది.
ఎఫ్రాయిమూ, నువ్వు విచ్చలవిడిగా అక్రమ సంబంధాలు పెట్టుకున్నావు;*ఇశ్రాయేలు తనను తాను మలినపర్చుకుంది.+
4 వాళ్ల పనులు వాళ్లను దేవుని దగ్గరికి తిరిగి రానివ్వడం లేదు,ఎందుకంటే వాళ్లది వ్యభిచార* మనసు;+వాళ్లు యెహోవాను గుర్తించడం లేదు.
5 ఇశ్రాయేలు గర్వం అతని మీద సాక్ష్యం చెప్పింది;+ఇశ్రాయేలు, ఎఫ్రాయిము ఇద్దరూ తమ తప్పుల వల్ల తడబడ్డారు,వాళ్లతోపాటు యూదా కూడా తడబడ్డాడు.+
6 వాళ్లు తమ మందను, పశువుల్ని తీసుకొని యెహోవాను వెదకడానికి వెళ్లారు,కానీ ఆయన వాళ్లకు కనిపించలేదు.
ఆయన వాళ్లకు దూరంగా వెళ్లిపోయాడు.+
7 వాళ్లు యెహోవాకు నమ్మకద్రోహం చేశారు,+వాళ్లు అక్రమ సంతానానికి తండ్రులయ్యారు.
ఒక నెల వాళ్లను, వాళ్ల స్వాస్థ్యాన్ని* మింగేస్తుంది.*
8 గిబియాలో బూర* ఊదండి,+ రామాలో+ బాకా శబ్దం వినిపించండి!
బేతావెనులో+ యుద్ధకేక వేయండి; బెన్యామీనూ, ముందుండి నడిపించు!
9 ఎఫ్రాయిమూ, శిక్షించే రోజున+ నిన్ను చూసి ప్రజలు భయపడతారు.
ఇశ్రాయేలు గోత్రాల మధ్య ఖచ్చితంగా ఏమి జరగబోతుందో నేను తెలియజేశాను.
10 యూదా అధిపతులు సరిహద్దు రాళ్లను జరిపే వాళ్లలా ఉన్నారు.+
నేను నీళ్లలా నా కోపాన్ని వాళ్ల మీద కుమ్మరిస్తాను.
11 ఎఫ్రాయిము అణచివేయబడ్డాడు, తీర్పు వల్ల నలగ్గొట్టబడ్డాడు,ఎందుకంటే అతను తన శత్రువు వెంట వెళ్లాలని తీర్మానించుకున్నాడు.+
12 కాబట్టి నేను ఎఫ్రాయిముకు చిమ్మెటలా,యూదా ఇంటివాళ్లకు కుళ్లులా ఉన్నాను.
13 ఎఫ్రాయిము తన జబ్బును, యూదా తన పుండును చూసుకున్నప్పుడు,ఎఫ్రాయిము అష్షూరుకు వెళ్లాడు,+ గొప్ప రాజు దగ్గరికి దూతల్ని పంపాడు.
కానీ అతను నిన్ను బాగుచేయలేకపోయాడు,నీ పుండును నయం చేయలేకపోయాడు.
14 ఎందుకంటే, నేను ఎఫ్రాయిముకు కొదమ సింహంలా,యూదా ఇంటివాళ్లకు బలమైన సింహంలా ఉంటాను.
స్వయంగా నేనే వాళ్లను ముక్కలుముక్కలుగా చీల్చేసి వెళ్లిపోతాను;+నేనే వాళ్లను తీసుకెళ్లిపోతాను, వాళ్లను విడిపించేవాళ్లు ఎవ్వరూ ఉండరు.+
15 నేను నా చోటికి తిరిగెళ్లిపోతాను, వాళ్లు తమ దోషశిక్షను అనుభవించే వరకు అక్కడే ఉంటాను,తర్వాత వాళ్లు నా అనుగ్రహం కోసం* చూస్తారు.+
కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను వెదుకుతారు.”+
అధస్సూచీలు
^ అక్ష., “పడిపోతున్నవాళ్లు.”
^ లేదా “క్రమశిక్షణ ఇస్తాను.”
^ లేదా “అనైతికతకు పాల్పడ్డావు; వ్యభిచారం చేశావు.”
^ లేదా “అనైతిక; విచ్చలవిడి అక్రమ సంబంధాల.”
^ లేదా “ఒక నెలలో వాళ్లు, వాళ్ల స్వాస్థ్యం మింగేయబడుతుంది” అయ్యుంటుంది.
^ లేదా “పొలాల్ని.”
^ అక్ష., “కొమ్ము.”
^ అక్ష., “ముఖాన్ని.”