మొదటి థెస్సలొనీకయులు 4:1-18
4 సహోదరులారా, దేవుణ్ణి సంతోషపెట్టడానికి మీరు ఎలా నడుచుకోవాలో మేము మీకు నిర్దేశాలు ఇచ్చాం,+ నిజానికి మీరు ఇప్పుడు అలాగే నడుచుకుంటున్నారు. అయితే, ఇంకా పూర్తిస్థాయిలో అలా నడుచుకోమని యేసు ప్రభువు పేరున మిమ్మల్ని అర్థిస్తున్నాం, బ్రతిమాలుతున్నాం.
2 యేసు ప్రభువు పేరున మేము మీకు ఇచ్చిన నిర్దేశాలేమిటో* మీకు తెలుసు.
3 మీరు పవిత్రులుగా ఉండాలి,+ లైంగిక పాపానికి* దూరంగా ఉండాలి+ అనేదే దేవుని ఇష్టం.
4 మీరు పవిత్రంగా,+ గౌరవప్రదంగా ఉండాలంటే, మీలో ప్రతీ ఒక్కరికి మీ శరీరాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలిసుండాలి.+
5 మీరు దేవుడు తెలియని ప్రజల్లా+ అత్యాశతో కూడిన లైంగిక వాంఛతో+ రగిలిపోకూడదు.
6 ఈ విషయంలో ఎవ్వరూ హద్దులు దాటి తోటి సహోదరుని హక్కులకు భంగం కలిగించకూడదు. ఎందుకంటే వీటన్నిటి విషయంలో యెహోవా* తగిన శిక్ష విధిస్తాడు. దీని గురించి మేము ఇంతకుముందు కూడా చెప్పాం, గట్టిగా హెచ్చరించాం.
7 ఎందుకంటే దేవుడు మనల్ని పిలిచింది అపవిత్రంగా జీవించడానికి కాదు, పవిత్రంగా జీవించడానికి.+
8 కాబట్టి ఎవరైనా ఈ విషయాన్ని లెక్కచేయకపోతే, అతను మనిషిని కాదుగానీ మీకు తన పవిత్రశక్తినిచ్చే దేవుణ్ణే+ లెక్కచేయట్లేదు.+
9 ఇక సహోదర ప్రేమ విషయానికొస్తే,+ దాని గురించి మేము మీకు రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుడే మీకు నేర్పిస్తున్నాడు.+
10 నిజానికి, మీరు మాసిదోనియ అంతటా ఉన్న సహోదరులందరి మీద ప్రేమ చూపిస్తున్నారు. అయితే సహోదరులారా, ఇంకా పూర్తిస్థాయిలో అలా ప్రేమ చూపిస్తూ ఉండమని మిమ్మల్ని బ్రతిమాలుతున్నాం.
11 మేము మీకు నిర్దేశాలు ఇచ్చినట్టే, మీరు ప్రశాంతంగా జీవించాలని,+ ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదని,+ మీ చేతులతో కష్టపడి పనిచేయాలని+ గట్టిగా తీర్మానించుకోండి.
12 అప్పుడు మీరు గౌరవప్రదంగా నడుచుకుంటున్నారని బయటివాళ్లు గమనిస్తారు,+ మీకు ఏ లోటూ ఉండదు.
13 అంతేకాదు సహోదరులారా, చనిపోయినవాళ్ల*+ భవిష్యత్తు గురించి మీకు తెలియకుండా ఉండడం, మీరు నిరీక్షణలేని ప్రజల్లా దుఃఖంలో మునిగిపోవడం+ నాకు ఇష్టంలేదు.
14 యేసు చనిపోయి బ్రతికించబడ్డాడని మనం విశ్వసిస్తే,+ యేసు శిష్యులుగా చనిపోయినవాళ్లను కూడా దేవుడు యేసుతోపాటు ఉండడానికి బ్రతికిస్తాడని విశ్వసిస్తాం.+
15 యెహోవా* వాక్యం ఆధారంగా మేము మీకు చెప్పేదేమిటంటే, మనలో ఎవరైతే ప్రభువు ప్రత్యక్షత కాలం వరకు బ్రతికుంటారో వాళ్లు ఇప్పటికే చనిపోయినవాళ్ల* కన్నా ఏ విధంగానూ ముందుగా బ్రతికించబడరు;
16 ఎందుకంటే, స్వయంగా ప్రభువే అధికార స్వరంతో, ప్రధానదూత+ స్వరంతో, దేవుని బాకా శబ్దంతో పరలోకం నుండి దిగివస్తాడు; క్రీస్తు శిష్యులుగా చనిపోయినవాళ్లు ముందుగా బ్రతికించబడతారు.+
17 ఆ తర్వాత, బ్రతికున్న మనం వాళ్లతోపాటు ఉండడానికి, పైనున్న ప్రభువును కలవడానికి మేఘాల మీద వెళ్తాం;+ అలా మనం ఎప్పుడూ ప్రభువుతోనే ఉంటాం.+
18 ఈ మాటలతో ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఉండండి.
అధస్సూచీలు
^ లేదా “ఆదేశాలేమిటో.”
^ అనుబంధం A5 చూడండి.
^ అక్ష., “మరణంలో నిద్రిస్తున్నవాళ్ల.”
^ అనుబంధం A5 చూడండి.
^ అక్ష., “మరణంలో నిద్రిస్తున్నవాళ్ల.”