దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 10:1-14
-
సౌలు, అతని కుమారులు చనిపోవడం (1-14)
10 ఒకసారి ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేస్తున్నారు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట నుండి పారిపోయారు; వాళ్లలో చాలామంది గిల్బోవ పర్వతం మీద చంపబడ్డారు.+
2 ఫిలిష్తీయులు సౌలును, అతని కుమారుల్ని తరుముతూ వాళ్ల దగ్గరికి వచ్చి, సౌలు కుమారులైన యోనాతానును, అబీనాదాబును, మెల్కీషూవను+ చంపారు.
3 ఫిలిష్తీయులు సౌలుతో తీవ్రంగా పోరాడుతున్నారు, బాణాలు వేసేవాళ్లు అతన్ని చూసి అతన్ని గాయపర్చారు.+
4 అప్పుడు సౌలు తన ఆయుధాలు మోసే వ్యక్తితో, “నువ్వు నీ కత్తి దూసి నన్ను పొడువు, లేకపోతే సున్నతిలేని ఈ మనుషులు నాతో క్రూరంగా* వ్యవహరించి నన్ను చంపుతారు”+ అన్నాడు. కానీ అతను చాలా భయపడిపోయి అలా చేయడానికి ఒప్పుకోలేదు. దాంతో సౌలు తన కత్తిని తీసుకొని దాని మీద పడ్డాడు.+
5 సౌలు చనిపోయాడని అతని ఆయుధాలు మోసేవాడు చూసినప్పుడు, అతను కూడా తన కత్తి మీద పడి చనిపోయాడు.
6 ఆ విధంగా సౌలు, అతని ముగ్గురు కుమారులు చనిపోయారు; అతని ఇంటివాళ్లందరూ అతనితోపాటు చనిపోయారు.+
7 సైన్యం పారిపోవడం, సౌలు, అతని కుమారులు చనిపోవడం లోయలో ఉన్న ఇశ్రాయేలీయులందరూ చూసినప్పుడు, వాళ్లు తమ నగరాల్ని విడిచిపెట్టి పారిపోయారు; అప్పుడు ఫిలిష్తీయులు వచ్చి వాటిని ఆక్రమించుకున్నారు.
8 తర్వాతి రోజు, చనిపోయినవాళ్ల వస్తువుల్ని దోచుకోవడానికి ఫిలిష్తీయులు వచ్చారు; సౌలు, అతని కుమారులు గిల్బోవ పర్వతం మీద పడివుండడం వాళ్లు చూశారు.+
9 వాళ్లు అతన్ని దోచుకొని, అతని తల నరికి, అతని యుద్ధ కవచాన్ని తీసుకెళ్లారు; ఆ వార్తను తమ విగ్రహాల గుళ్లలో,+ ప్రజల మధ్య చాటించమని ఫిలిష్తీయుల దేశమంతటికీ కబురు పంపించారు.
10 తర్వాత వాళ్లు సౌలు కవచాన్ని తమ దేవుని గుడిలో పెట్టి, అతని తలను దాగోను గుడిలో వేలాడదీశారు.+
11 ఫిలిష్తీయులు సౌలుకు చేసినదంతా గిలాదులోని యాబేషువాళ్లందరూ+ విన్నప్పుడు,+
12 వాళ్లలో యోధులందరూ లేచి సౌలు, అతని కుమారుల శవాల్ని తెచ్చారు. వాటిని యాబేషుకు తీసుకొచ్చి, వాళ్ల ఎముకల్ని యాబేషులోని ఒక వృక్షం కింద పాతిపెట్టారు.+ వాళ్లు ఏడురోజులు ఉపవాసం ఉన్నారు.
13 అలా, సౌలు యెహోవాకు నమ్మకద్రోహం చేశాడు కాబట్టి చనిపోయాడు. అతను యెహోవా మాటకు లోబడలేదు,+ అంతేకాదు అతను చనిపోయినవాళ్లను సంప్రదించే స్త్రీ దగ్గరికి వెళ్లాడు;+
14 అతను యెహోవా దగ్గర విచారణ చేసే బదులు అలా చేశాడు. అందుకే ఆయన సౌలును చంపి, యెష్షయి కుమారుడైన దావీదుకు రాజరికాన్ని అప్పగించాడు.+
అధస్సూచీలు
^ లేదా “అవమానకరంగా.”