దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 13:1-14
13 దావీదు సహస్రాధిపతులతో,* శతాధిపతులతో,* ఇతర నాయకులందరితో మాట్లాడాడు.+
2 తర్వాత దావీదు ఇశ్రాయేలు సమాజమంతటితో ఇలా అన్నాడు: “మీ దృష్టికి మంచిదనిపిస్తే, మన దేవుడైన యెహోవాకు అంగీకారమైతే, వచ్చి మనతో కలవమని ఇశ్రాయేలు ప్రాంతాలన్నిట్లో ఉన్న మన మిగతా సహోదరులకు, పచ్చికబయళ్లు గల తమ నగరాల్లో నివసిస్తున్న యాజకులకు, లేవీయులకు+ కబురు పంపిద్దాం.
3 మన దేవుని మందసాన్ని వెనక్కి తీసుకొద్దాం.”+ వాళ్లు సౌలు రోజుల్లో దాన్ని నిర్లక్ష్యం చేశారు.+
4 ఆ మాట ప్రజలందరికీ సరైనదిగా అనిపించింది కాబట్టి సమాజమంతా అలా చేయడానికి ఒప్పుకుంది.
5 కాబట్టి దావీదు కిర్యత్యారీము నుండి సత్యదేవుని మందసాన్ని తీసుకురావడానికి, ఐగుప్తు* నది నుండి* లెబో-హమాతు*+ వరకు ఉన్న ఇశ్రాయేలీయులందర్నీ సమావేశపర్చాడు.+
6 కెరూబుల పైన* సింహాసనంలో కూర్చున్న+ సత్యదేవుని మందసాన్ని తీసుకురావడానికి దావీదు, ఇశ్రాయేలీయులందరూ యూదాకు చెందిన బాలాకు,+ అంటే కిర్యత్యారీముకు వెళ్లారు. ఆ మందసం దగ్గర ప్రజలు యెహోవా పేరున ప్రార్థించేవాళ్లు.
7 అయితే వాళ్లు సత్యదేవుని మందసాన్ని ఒక కొత్త బండిమీద పెట్టి+ అబీనాదాబు ఇంటి నుండి తీసుకొచ్చారు; ఉజ్జా, అహ్యో ఆ బండి ముందు నడుస్తున్నారు.+
8 దావీదు, ఇశ్రాయేలీయులందరూ పాటలు పాడుతూ, వీణలూ* ఇతర తంతివాద్యాలూ కంజీరలూ*+ తాళాలూ వాయిస్తూ,+ బాకాలు ఊదుతూ+ తమ పూర్తి శక్తితో సత్యదేవుని ఎదుట వేడుక జరుపుకుంటున్నారు.
9 అయితే వాళ్లు కీదోను కళ్లం* దగ్గరికి వచ్చేసరికి, బండిని లాగుతున్న ఎద్దులు మందసాన్ని దాదాపు పడేయబోయాయి. అప్పుడు ఉజ్జా తన చెయ్యి చాపి మందసాన్ని పట్టుకున్నాడు.
10 మందసం వైపు చెయ్యి చాపినందుకు యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకుంది. ఆయన ఉజ్జాను చంపాడు,+ అతను అక్కడే దేవుని ఎదుట చనిపోయాడు.+
11 యెహోవా ఆగ్రహం ఉజ్జా మీద రగులుకుంది కాబట్టి దావీదుకు కోపం వచ్చింది;* అందుకే ఈ రోజు వరకు ఆ స్థలాన్ని పెరెజ్-ఉజ్జా* అని పిలుస్తున్నారు.
12 ఆ రోజు దావీదు సత్యదేవునికి భయపడి, “సత్యదేవుని మందసాన్ని నా దగ్గరికి ఎలా తీసుకురావాలి?” అన్నాడు.+
13 కాబట్టి దావీదు, మందసాన్ని దావీదు నగరంలో తాను ఉన్న చోటికి తీసుకురాకుండా గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటికి తీసుకెళ్లే ఏర్పాటు చేశాడు.
14 సత్యదేవుని మందసం ఓబేదెదోము ఇంటివాళ్ల దగ్గర ఉంది; అది మూడు నెలలు అతని ఇంట్లో ఉంది. దానివల్ల యెహోవా ఓబేదెదోము ఇంటివాళ్లను, అతనికి ఉన్నవాటన్నిటినీ దీవిస్తూ వచ్చాడు.+
అధస్సూచీలు
^ అంటే, 1,000 మంది మీద అధిపతులు.
^ అంటే, 100 మంది మీద అధిపతులు.
^ లేదా “ఈజిప్టు.”
^ లేదా “షీహోరు నుండి.”
^ లేదా “హమాతు ప్రవేశ ద్వారం.”
^ లేదా “మధ్య” అయ్యుంటుంది.
^ ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.
^ అంటే, గిలకల తప్పెట.
^ లేదా “దావీదు బాధపడ్డాడు.”
^ “ఉజ్జా మీద కోపం కట్టలు తెంచుకోవడం” అని అర్థం.