దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 15:1-29

  • లేవీయులు మందసాన్ని యెరూషలేముకు మోసుకురావడం (1-29)

    • మీకాలు దావీదును నీచంగా చూడడం (29)

15  దావీదు తన కోసం దావీదు నగరంలో ఇళ్లు కట్టించుకుంటూ ఉన్నాడు; అలాగే అతను సత్యదేవుని మందసం కోసం ఒక స్థలాన్ని సిద్ధం చేసి, దానికోసం ఒక డేరా వేయించాడు.+  అప్పుడు దావీదు ఇలా చెప్పాడు: “సత్యదేవుని మందసాన్ని లేవీయులు తప్ప ఎవ్వరూ మోయకూడదు; యెహోవా మందసాన్ని మోయడానికి, ఎల్లప్పుడూ తనకు సేవచేయడానికి యెహోవా లేవీయుల్ని ఎంచుకున్నాడు.”+  తర్వాత, దావీదు తాను సిద్ధం చేసిన స్థలానికి యెహోవా మందసాన్ని తీసుకురావడానికి ఇశ్రాయేలీయులందర్నీ యెరూషలేములో సమావేశపర్చాడు.+  అతను అహరోను వంశస్థుల్ని,+ లేవి వంశస్థుల్ని+ సమకూర్చాడు; వాళ్లు ఎవరంటే:  కహాతీయుల నుండి అధిపతైన ఊరియేలు, అతని సహోదరులు 120 మంది;  మెరారీయుల నుండి అధిపతైన అశాయా,+ అతని సహోదరులు 220 మంది;  గెర్షోమీయుల నుండి అధిపతైన యోవేలు,+ అతని సహోదరులు 130 మంది;  ఎలీషాపాను+ వంశస్థుల నుండి అధిపతైన షెమయా, అతని సహోదరులు 200 మంది;  హెబ్రోను వంశస్థుల నుండి అధిపతైన ఎలీయేలు, అతని సహోదరులు 80 మంది; 10  ఉజ్జీయేలు+ వంశస్థుల నుండి అధిపతైన అమ్మీనాదాబు, అతని సహోదరులు 112 మంది. 11  అంతేకాదు, అతను యాజకులైన సాదోకును,+ అబ్యాతారును;+ లేవీయులైన ఊరియేలును, అశాయాను, యోవేలును, షెమయాను, ఎలీయేలును, అమ్మీనాదాబును పిలిపించి, 12  వాళ్లకు ఇలా చెప్పాడు: “మీరు లేవీయుల పూర్వీకుల కుటుంబాల పెద్దలు. మీరూ, మీ సహోదరులూ మిమ్మల్ని మీరు పవిత్రపర్చుకొని, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసాన్ని నేను సిద్ధం చేసిన స్థలానికి తీసుకురండి. 13  మొదటిసారి మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు మీరు దాన్ని మోయలేదు,+ మనం సరైన పద్ధతి+ ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు; అందుకే మన దేవుడైన యెహోవా కోపం మనమీద రగులుకొంది.”+ 14  కాబట్టి యాజకులు, లేవీయులు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసాన్ని తీసుకురావడానికి తమను తాము పవిత్రపర్చుకున్నారు. 15  అప్పుడు లేవీయులు, యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్టు, సత్యదేవుని మందసాన్ని కర్రలతో+ భుజాల మీద పెట్టుకొని మోశారు. 16  తర్వాత దావీదు, సంగీత వాద్యాలతో అంటే తంతివాద్యాలతో, వీణలతో,*+ తాళాలతో+ సంతోషంగా పాటలు పాడడానికి గాయకులైన తమ సహోదరుల్ని నియమించమని లేవీయుల అధిపతులకు చెప్పాడు. 17  కాబట్టి లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును,+ అతని సహోదరుల్లో నుండి బెరెక్యా కుమారుడైన ఆసాపును,+ తమ సహోదరులైన మెరారీయుల్లో నుండి కూషాయాహు కుమారుడైన ఏతానును+ నియమించారు. 18  వాళ్లతోపాటు రెండో విభాగానికి+ చెందిన వాళ్ల సహోదరులైన జెకర్యా, బేను, యహజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, బెనాయా, మయశేయా, మత్తిత్యా, ఎలీపెలేహు, మిక్నేయాహు అలాగే ద్వారపాలకులైన ఓబేదెదోము, యెహీయేలు ఉన్నారు. 19  గాయకులైన హేమాను,+ ఆసాపు,+ ఏతాను రాగి తాళాలు+ వాయించాలి; 20  జెకర్యా, అజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, మయశేయా, బెనాయా అలమోతు* స్వరంలో+ తంతివాద్యాలు వాయించారు. 21  మత్తిత్యా,+ ఎలీపెలేహు, మిక్నేయాహు, ఓబేదెదోము, యెహీయేలు, అజజ్యా షెమినీతు* స్వరంలో+ వీణలు వాయిస్తూ సంగీత నిర్దేశకులుగా పని చేశారు. 22  లేవీయుల అధిపతైన కెనన్యా+ సామాన్లు మోసే పనిని చూసుకునేవాడు, ఎందుకంటే అతను నిపుణుడు. 23  బెరెక్యా, ఎల్కానా మందసానికి కాపలాదారులు. 24  యాజకులైన షెబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమాశై, జెకర్యా, బెనాయా, ఎలీయెజెరు సత్యదేవుని మందసం ముందు పెద్దగా బాకాలు ఊదారు;+ ఓబేదెదోము, యెహీయా మందసానికి కాపలాదారులుగా కూడా సేవ చేశారు. 25  అప్పుడు దావీదు, ఇశ్రాయేలు పెద్దలు, సహస్రాధిపతులు* ఓబేదెదోము+ ఇంటి నుండి యెహోవా ఒప్పంద మందసాన్ని తీసుకురావడానికి సంతోషంగా వెళ్లారు.+ 26  యెహోవా ఒప్పంద మందసాన్ని మోస్తున్న లేవీయులకు సత్యదేవుడు సహాయం చేశాడు కాబట్టి వాళ్లు ఏడు కోడెదూడల్ని, ఏడు పొట్టేళ్లను బలి అర్పించారు.+ 27  మందసాన్ని మోస్తున్న లేవీయులందరి లాగే, గాయకుల్లాగే, సామాన్లు మోస్తున్న గాయకుల మీద అధికారైన కెనన్యాలాగే దావీదు నాణ్యమైన వస్త్రంతో చేయబడిన చేతుల్లేని నిలువుటంగీని వేసుకున్నాడు; అలాగే నార ఏఫోదును కూడా వేసుకున్నాడు.+ 28  ఇశ్రాయేలీయులందరూ సంతోషంగా కేకలు వేస్తూ,+ బూరలూ* బాకాలూ ఊదుతూ,+ తాళాల్ని వాయిస్తూ, తంతివాద్యాల్నీ వీణల్నీ బిగ్గరగా వాయిస్తూ+ యెహోవా ఒప్పంద మందసాన్ని తీసుకొచ్చారు. 29  అయితే యెహోవా ఒప్పంద మందసం దావీదు నగరానికి వచ్చినప్పుడు,+ సౌలు కూతురైన మీకాలు+ కిటికీలో నుండి కిందికి చూసింది. దావీదు రాజు గంతులు వేస్తూ, సంబరాలు చేసుకుంటూ ఉండడం ఆమెకు కనిపించింది; దాంతో ఆమె తన హృదయంలో అతన్ని నీచంగా చూసింది.+

అధస్సూచీలు

ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
అంటే, 1,000 మంది మీద అధిపతులు.
అక్ష., “కొమ్ములూ.”