దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 19:1-19
19 తర్వాత అమ్మోనీయుల రాజైన నాహాషు చనిపోయాడు, అతని స్థానంలో అతని కుమారుడు రాజయ్యాడు.+
2 అప్పుడు దావీదు, “నాహాషు నా మీద విశ్వసనీయ ప్రేమ చూపించాడు కాబట్టి, నేను అతని కుమారుడైన హానూను మీద విశ్వసనీయ ప్రేమ చూపిస్తాను” అన్నాడు.+ తండ్రిని కోల్పోయిన హానూనును ఓదార్చడానికి దావీదు సందేశకుల్ని పంపించాడు. దావీదు సేవకులు హానూనును ఓదార్చడానికి అమ్మోనీయుల+ దేశానికి వచ్చినప్పుడు,
3 అమ్మోనీయుల అధిపతులు హానూనుతో, “దావీదు నిన్ను ఓదార్చడానికి మనుషుల్ని పంపించి నీ తండ్రి మీద గౌరవం చూపిస్తున్నాడని అనుకుంటున్నావా? అతని సేవకులు నీ దగ్గరికి వచ్చింది అంతా పరిశీలించి, నిన్ను పడగొట్టడానికి, దేశాన్ని వేగుచూడడానికి కాదా?” అని అన్నారు.
4 దాంతో హానూను దావీదు సేవకుల్ని పట్టుకొని వాళ్ల గడ్డాలు గీయించి,+ వాళ్ల బట్టల్ని పిరుదుల వరకు కోయించి పంపించాడు.
5 వాళ్లు ఘోరంగా అవమానించబడ్డారు కాబట్టి దావీదుకు వాళ్ల గురించి తెలియగానే, వాళ్లను కలవడానికి వేరే మనుషుల్ని పంపించాడు; దావీదు రాజు వాళ్లకు ఈ సందేశం పంపించాడు: “మీ గడ్డాలు పెరిగే వరకు యెరికోలోనే+ ఉండి, ఆ తర్వాత రండి.”
6 కొంతకాలానికి, తాము దావీదు దృష్టిలో అసహ్యులమయ్యామని అమ్మోనీయులకు అర్థమైంది. దాంతో హానూను, అమ్మోనీయులు 1,000 తలాంతుల* వెండి ఇచ్చి మెసొపొతమియ* నుండి, అరాము-మయకా నుండి, సోబా నుండి రథాల్ని, గుర్రపురౌతుల్ని కిరాయికి తెచ్చుకున్నారు.+
7 అలా వాళ్లు 32,000 రథాల్ని, మయకా రాజును, అతని ప్రజల్ని కిరాయికి తెచ్చుకున్నారు. తర్వాత వాళ్లు వచ్చి మేదెబా+ ఎదుట మకాం వేశారు. అమ్మోనీయులు తమ నగరాల నుండి పోగై యుద్ధం చేయడానికి వచ్చారు.
8 దావీదు దాని గురించి విన్నప్పుడు యోవాబును,+ అత్యంత బలవంతులైన తన శూరుల్ని, వాళ్లతోపాటు సైన్యాన్నంతటినీ పంపించాడు.+
9 అప్పుడు అమ్మోనీయులు వచ్చి, నగర ప్రవేశ ద్వారం దగ్గర యుద్ధ పంక్తులు తీరారు. అక్కడికి వచ్చిన రాజులు వేరుగా మైదానంలో ఉన్నారు.
10 ముందు నుండి, వెనక నుండి సైన్యాలు తనమీదికి దూసుకురావడం యోవాబు చూశాడు. దాంతో అతను సిరియన్లను ఎదుర్కోవడానికి ఇశ్రాయేలులో శ్రేష్ఠులైన కొంతమంది సైనికుల్ని ఎంచుకొని వాళ్లను యుద్ధ పంక్తులు తీర్చాడు.+
11 అతను మిగతావాళ్లను తన సహోదరుడైన అబీషై+ కింద ఉంచాడు. వాళ్లు యుద్ధ పంక్తులు తీరి అమ్మోనీయుల్ని ఎదుర్కోవడానికి అతను అలా చేశాడు.
12 తర్వాత అతను ఇలా అన్నాడు: “సిరియన్లను+ ఎదుర్కోవడం నాకు కష్టంగా ఉంటే, నువ్వు వచ్చి సహాయం చేయి; అమ్మోనీయుల్ని ఎదుర్కోవడం నీకు కష్టంగా ఉంటే, నేను వచ్చి సహాయం చేస్తాను.
13 మన ప్రజల కోసం, మన దేవుని నగరాల కోసం మనం నిబ్బరంగా, ధైర్యంగా ఉండాలి,+ అప్పుడు యెహోవా తన దృష్టికి ఏది మంచిదో అది చేస్తాడు.”
14 తర్వాత యోవాబు, అతని మనుషులు సిరియన్లతో యుద్ధం చేయడానికి ముందుకెళ్లారు, సిరియన్లు అతని ఎదుట నుండి పారిపోయారు.+
15 సిరియన్లు పారిపోవడం చూసి అమ్మోనీయులు కూడా అబీషై ఎదుట నుండి పారిపోయి, నగరంలోకి వెళ్లారు. తర్వాత యోవాబు యెరూషలేముకు తిరిగొచ్చాడు.
16 తాము ఇశ్రాయేలు చేతిలో ఓడిపోయామని గమనించిన సిరియన్లు సందేశకుల్ని పంపించి, నది* ప్రాంతంలోని+ సిరియన్లను పిలిపించారు. హదదెజరు సైన్యాధిపతైన షోపకు వాళ్లకు నాయకునిగా ఉన్నాడు.+
17 దావీదుకు ఆ విషయం తెలియగానే ఇశ్రాయేలీయులందర్నీ సమకూర్చి యొర్దాను నదిని దాటి, వాళ్లకు ఎదురుగా తన సైన్యాన్ని యుద్ధ పంక్తులు తీర్చాడు. దావీదు సిరియన్లను ఎదుర్కోవడానికి యుద్ధ పంక్తులు తీర్చినప్పుడు, వాళ్లు అతనితో యుద్ధం చేశారు.+
18 కానీ వాళ్లు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోయారు; దావీదు సిరియన్లకు చెందిన 7,000 మంది రథసారథుల్ని, 40,000 మంది సైనికుల్ని చంపాడు. వాళ్ల సైన్యాధిపతైన షోపకును కూడా చంపాడు.
19 ఇశ్రాయేలు చేతిలో ఓడిపోయామని+ హదదెజరు సేవకులు గమనించినప్పుడు, వాళ్లు వెంటనే దావీదుతో సంధి చేసుకొని అతనికి సేవకులయ్యారు;+ అప్పటినుండి సిరియన్లు అమ్మోనీయులకు సహాయం చేయడానికి ఇష్టపడలేదు.
అధస్సూచీలు
^ అప్పట్లో ఒక తలాంతు 34.2 కిలోలతో సమానం. అనుబంధం B14 చూడండి.
^ అక్ష., “అరామ్నహరాయిము.”
^ అంటే, యూఫ్రటీసు.