దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 20:1-8

  • రబ్బాను స్వాధీనం చేసుకోవడం (1-3)

  • ఫిలిష్తీయుల భారీకాయుల్ని చంపడం (4-8)

20  సంవత్సరం ఆరంభంలో,* రాజులు యుద్ధాలకు వెళ్లే కాలంలో, యోవాబు+ ఒక సైన్యాన్ని తీసుకెళ్లి అమ్మోనీయుల దేశాన్ని నాశనం చేశాడు; అతను వెళ్లి, రబ్బాను+ ముట్టడించాడు. ఆ సమయంలో దావీదు యెరూషలేములోనే ఉన్నాడు.+ యోవాబు రబ్బా మీద దాడిచేసి దాన్ని పడగొట్టాడు.+  తర్వాత, దావీదు మల్కాము* తలమీద ఉన్న కిరీటాన్ని తీసుకున్నాడు. ఆ బంగారు కిరీటం బరువు ఒక తలాంతు.* ఆ కిరీటంలో రత్నాలు పొదిగివున్నాయి; ఆ కిరీటాన్ని దావీదు తలమీద పెట్టారు. అతను ఆ నగరం నుండి పెద్ద మొత్తంలో దోపుడుసొమ్ము కూడా తీసుకున్నాడు.+  దావీదు అక్కడి ప్రజల్ని తీసుకొచ్చి, వాళ్లచేత రంపాలతో రాళ్లను కోయించాడు, పదునైన ఇనుప పనిముట్లతో, గొడ్డళ్లతో పని చేయించాడు.+ అమ్మోనీయుల నగరాలన్నిటికీ దావీదు అలాగే చేశాడు. చివరికి దావీదు, అతని సైన్యమంతా యెరూషలేముకు తిరిగొచ్చారు.  తర్వాత గెజెరు దగ్గర ఇశ్రాయేలీయులకు, ఫిలిష్తీయులకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో హూషాతీయుడైన సిబ్బెకై+ రెఫాయీము+ వంశస్థుడైన సిప్పయిని చంపాడు, దాంతో ఫిలిష్తీయులు లొంగిపోయారు.  ఆ తర్వాత ఫిలిష్తీయులతో మరోసారి యుద్ధం జరిగింది, ఆ యుద్ధంలో యాయీరు కుమారుడైన ఎల్హానా గిత్తీయుడైన గొల్యాతు+ సహోదరుడైన లహ్మీని చంపాడు. అతని ఈటెకు ఉన్న కర్ర, నేత నేసేవాళ్ల కర్రంత పెద్దది.+  గాతులో+ మళ్లీ యుద్ధం జరిగింది, అక్కడ చాలా ఎత్తుగా ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు.+ అతని ఒక్కో చేతికి, ఒక్కో పాదానికి ఆరేసి వేళ్ల చొప్పున మొత్తం 24 వేళ్లు ఉన్నాయి; అతను కూడా రెఫాయీము వంశస్థుడే.+  అతను ఇశ్రాయేలీయుల్ని సవాలుచేస్తూ* ఉన్నాడు.+ అప్పుడు దావీదు సహోదరుడైన షిమ్యా+ కుమారుడు యోనాతాను అతన్ని చంపాడు.  వీళ్లు గాతులో+ ఉన్న రెఫాయీము+ వంశస్థులు; వీళ్లు దావీదు చేతిలో, అతని సేవకుల చేతిలో చనిపోయారు.

అధస్సూచీలు

అంటే, వసంతకాలంలో.
2 సమూయేలు 12:30 అధస్సూచి చూడండి.
దాదాపు 34.2 కిలోలు. అనుబంధం B14 చూడండి.
లేదా “నిందిస్తూ; హేళనచేస్తూ.”